Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Ramalingadi Telivi

ఈ సంచికలో >> కథలు >> బదిలీ

Badilee Telugu Story

"హలో... హలో... కాస్త ఆగండి!" వెనుకనే పెద్ద పెద్ద అడుగులేస్తూ వెళ్లి సురేష్ ను ఆపాడు గిరి.

ఏమన్నట్లుగా చూసాడు సురేష్.

"ఏముంది పార్టీయే!" నవ్వాడు గిరి.

"పార్టీయా! అసలే ఎలారా భగవంతుడా కొత్తచోటుకు బదిలీ అని నేను గింజుకుంటుంటే!" నుదుటిపై కొట్టుకున్నాడు సురేష్.

"బాగుందోయ్... నీ బదిలీకి కాదు పార్టీ, నీ ప్రమోషన్ కు."

చేతిలోనున్న పూలదండను మరో చేతికి మార్చబోయి,

"సరే కాస్త తలవంచు." అని తను తెచ్చిన దండ గిరి మెడలో వేయబోయాడు.

"ఇదే చెవిలో పువ్వు పెట్టడం అంటే!" అంటూ దండను చేతికందుకుంటూ సురేష్ అన్న మాటలకు దంతధావనం ప్రకటనలా పళ్లన్నీ కనబడేలా నవ్వాడు గిరి.

"ప్రమోషన్ నాకొక్కడికేనా నాతోపాటు ఉన్నాడుగా మన కరుణాకరం." తనపై మాత్రమేనా ఈ దాడి అని కరుణాకరం పేరు గుర్తు చేసాడు.

"అక్కడ ప్రమాణస్వీకారం అయ్యాకే నీ వెంట పరిగెట్టా." పేల్చిన బాంబు ఎలా పేలుతుందా అని చూస్తున్నాడు గిరి.

"సరే ఇక తప్పేదేముంది, రేపు క్యాంటీనులో బిల్లు మాది. నీకొక్కడికే కాదు మన వాళ్ళందరికీ కూడా చెప్పు."

గిరి ఆనందంగా వెనుదిరిగాడు తనకందిన ప్రమాణాలు అందరికి చెప్పాలని.

బయలుదేరాల్సిన రోజు కాస్త దిగులుగా అనిపించినా భార్య సర్దిచ్చిన టమాటో పచ్చడి, ఆవకాయ, అరిసెలు, మురుకులు! చిన్నపిల్లలు హాస్టల్ కు వెళ్లినట్లుంది సురేష్ కు.

చేరాల్సిన ఊరు పల్లెటూరు. ఒకే ఒక హోటల్, అదీ రాత్రి తొమ్మిదయితే షటర్ వేసేస్తారు.

'ఇక్కడెవరు పెట్టారయ్యా ఇంత కంపెనీ మన దుంపతెంచడానికి,' అనుకుంటూనే చిన్నగా కొత్త వాతావరణానికి అలవాటు పడసాగారు.

'బాధ్యతల బరువులు తగ్గినట్లనిపించి కాస్త రిలీఫ్ గా వుందోయ్,' అని చెప్పుకోసాగారు అడపాదడపా. చక్కగా హోటల్ భోజనం, చిన్న గదులున్న ఇంటిలో దిగుల్లేని నిద్ర. హాయిగా ఒకరి కాలేజి కబుర్లు ఒకరితో కలబోసుకోవడం. పనిలో పనిగా ఇంటిగురించి గుర్తు వచ్చినా, 'సగం జీతం పంపాముగా మ్యానేజీ చేసేస్తారులే మనమైతే హమ్మ... హమ్మ... ఎన్ని కోరికలు, ఎన్ని లిస్టులు. మా వాడైతే రోజుకొక టెన్నిస్ ర్యాకెట్ అని చంపేవాడు' అని కరుణాకరం, 'కూరగాయల లిస్టు, మందుల లిస్టు, సరుకులు... సరంజామా ఒకటేమిటి పాలబిల్లు, కరెంటు, నీళ్ళ బిల్లు అన్నీ మనమే, వీళ్లేమో టి.వి లకు మహరాణి పోషకులు.' ఇలా ఇంటి సంగతులు చెప్పుకుని నవ్వుకునేవారు.

'ఇంత స్వేచ్చ అనుభవించి ఎన్నాళ్ళయింది! మళ్ళీ టీనేజి రోజులు వచ్చినట్లుంది.' అని సంబరపడ్డారు.

కాని సంబరానికి ముగింపు మరోలా వుంది మరి. అది కడుపులో గుడగుడతో మొదలయింది ఇద్దరికీ. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అర్ధమయినట్లు తలపంకించాడు సురేష్.

తరుణోపాయం ఆలోచించాడు. అదే స్వయంపాకం.

చిన్న చిన్న షాపులలో కావలసిన సరుకులు వెతకి లిస్టు రాసుకుని, వాళ్లు రాసుకున్నవి కాక షాపువాడు తెలివిగా అంటకట్టినవి వెరసి చాంతాడంత లిస్టుతో సామాను ఇంటికి తెచ్చుకుని సర్దుకోలేక కాసేపు పడకేసారు ఆదివారమే కదా అని.

లేచేసరికి చీమల బారులు. వాటి కసితీరేదాకా మిత్రులిద్దరు కుట్టించుకున్నాక కాని పంచదార స్థావరాన్ని వదిలివెళ్లలేదు... మళ్లీ ఖాళీ డబ్బాలకోసం పరుగు.

బల్లపై ఫైళ్ళు తరగడం లేదు కాని తెచ్చివుంచిన కూరగాయలు పాడవుతాయని తరగడం ఎలా అనే ఆలోచనలెక్కువయాయి. ఇంటి ఓనరు పంపు కట్టేసేలోపు నీళ్లు పట్టుకోవాలి, పాలు కాచాలి, తోడుపెట్టాలి. చల్లారితే తోడుకోవు, వేడిగా తోడేస్తే పెరుగు కాదు విరుగు తయారవుతోంది.

"నిజమే మన వాళ్ళు మనకన్నీ అమరుస్తుంటే తెలియలేదు." విచారంగా అన్నాడు సురేష్.

దొండకాయ వేపుడు ఇష్టమని తెచ్చుకున్న దొండకాయలను, 'ఇవి బండకాయలు ఎన్ని తరిగినా తరగవు' అనుకుంటూ వంగిన వీపును విరుచుకుని నిలబడి దొండకాయలపట్ల విరక్తిగా చూస్తూ, "నిజమే!" అంటూ నిట్టూర్చాడు కరుణాకరం.

"మనకిది ఉద్యోగ బదిలీలా లేదు వంట బదిలీలా వుంది." అని తమపై తామే జోకులేసుకుంటూ, విరామమెప్పుడు దేవుడా అని ఎదురు చూస్తే సంక్రాంతి సెలవులు పలకరించాయి.

ఇంకేముంది? సంక్రాంతి దొరికిన సెలవులకు హాస్టలు కుర్రాళ్ళలా ఇండ్లకు పరుగులు పెట్టారు మిత్రద్వయం.

మరిన్ని కథలు
Mukkupudaka Telugu Story