Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi?

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి...http://www.gotelugu.com/issue239/656/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/ 

 

(గత సంచిక తరువాయి)... సంధ్యా సమయం....కోయిల రాగం......ఎగిసే అలలు..... దుమికే జల పాతం.....అమ్మ ప్రేమ....చెలి వెచ్చని ముద్దు ఎవరికి మాత్రం సంతోషాన్ని యివ్వవు? కానీ ప్రస్తుతం ఆకాష్ అవేమీ ఆస్వాదించే స్టేజ్ లో లేడు.
యాంత్రికంగా ఛైర్ లో కూర్చున్నాడే గానీ, మనసు వేరే లోకంలో వుంది. ఎంత వద్దనుకున్నా ఆలోచనలు కీర్తన చుట్టూ తిరుగుతున్నాయి.
పరిస్థితులు ఇలా మారి పోతాయని, తను కీర్తనతో ఛాలెంజ్ చేసే దూరం తమ మధ్య ఏర్పడుతుందని అస్సలు వూహించ లేదు.
తను అనుకున్నది ఒకటి...జరుగుతున్నది వేరొకటి. కీర్తనతో తన జీవితాన్ని ఎంత రసరమ్యంగా వూహించుకున్నాడు? కానీ ఆమె తన జీవిత భాగస్వామి కన్నా వాలీ బాల్ నే ఎక్కువ ప్రేమిస్తోంది. అది ఎవరైనా తట్టుకో గలరా?

లక్ష్యం వుండటమూ, దాని కోసం ప్రయత్నించడమూ గొప్పే. కానీ ఆ క్రమంలో మానవ సంబంధాలను నిర్లక్ష్యం చేస్తే ఏర్పడేది ఒంటరి తనమే.’’ బాధగా నుదురు రాసుకున్నాడు ఆకాష్.

ఆఖరికి అశోక్ తో కూడా అంత తేలిగ్గా అనుబంధాన్ని తెంపేసుకుని వదిలి వెళ్ళి పోయింది. రేపు పెళ్ళయినా చిన్న చిన్న గొడవలకి రిలేషన్  కట్ చేస్తే అదెంత దారుణం?

కానీ చిత్రంగా కీర్తనంటే ఏమాత్రం కోపం రావడం లేదు. ఆమెని మార్చుకుని తన దాన్ని చేసుకోడానికే ఎన్నో అబద్దాలు చెప్పి, నాటకాలాడి ప్రయత్నించాడు.

కానీ అన్నీ విఫలమయ్యాయి. అందులో తనదీ తప్పు వుంది.

అన్ని విషయాలు ముందే చెప్పి వుండాల్సింది. అసలు చెప్పడానికయినా తాను ఆమె అభిమానినని చెబితేనే కదా తనతో మాట్లాడింది. లేక పోతే ఇంత దూరం కూడా వచ్చేది కాదు.

పంతం కొద్దీ ఛాలెంజ్ చేసినా, ఆమె పట్ల తనకి పూర్తి అభిమానం వుంది. కాబట్టి ఆమె గెలుపునే తను కోరుకుంటాడు.

కానీ ఇప్పుడు ఎంత చెప్పినా ఆమె నమ్మదు.

కానీ ఒక సారి ఆమెతో మాట్లాడి చూస్తే...ఏదో ఆశ మనసులో సుడులు తిరిగింది.

చేతిలో పేపర్ వెయిట్ తిప్పుతూ, సాధ్యా సాధ్యాల మీద ఆలోచించటం ప్రారంభించాడు.

అతని నుదురు చిన్నగా ముడుత పడింది. పచ్చని అతని మొహం అశాంతితో వడలి పోయింది.

స్ప్రింగ్ డోర్ చప్పుడుకి తలెత్తి చూశాడు.

‘‘హాయ్ బావా!’’ తుఫాన్ లా దూసుకొచ్చింది మణి బిందు. అతని పెదాల మీద చిన్న దరహాసం.

‘‘కమిన్!’’ ఆహ్వానించాడు.

‘‘ఏంటి డల్ గా వున్నావు? మీ గాళ్ ఫ్రెండ్ గురించా?’’ కినుకగా అంది.

‘‘అవును’’ ఒప్పుకున్నాడు.

‘‘మై గాడ్? మా ఆకాషేనా? బిజినెస్ అవర్స్ లో ఒకమ్మాయి గురించి ఆలోచించడమా? గ్రేట్!’’ విస్మయంగా అంది.

‘‘నేనూ మనిషినేగా!’’ చిన్నగా అన్నాడు.

‘‘అఫ్ కోర్స్! సరే గానీ మూవీకి వెళ్దామా?’’ గారాబంగా అంది.

తల అడ్డంగా తిప్పి ‘‘ఇప్పటికే నీ మూలంగా నా కాబోయే భార్య నాకు దూరమయింది. ఇంక నీతో షికార్లు కూడా మొదలు పెడితే, యిక నా పని యింతే!’’ తమాషాగా అన్నాడు.

‘‘అలాంటి అనుమానాలున్న అమ్మాయితో ప్రేమేంటీ? అదీ కాక నా రైవల్ తో’’ కోపంగా అది మణిబిందు.

‘‘లేదు! తను చాలా మంచిది. ఎంత అమాయకురాలంటే, నిజంగా అన్ని అబద్దాలు తనతో ఎలా చెప్పానా అనిపిస్తోంది. నాకు తెలిసీ వండర్స్ జరగక పోతే, నేషనల్ గేమ్స్ లో   ఫైనల్స్ కి మీ రెండు టీమ్స్ వస్తాయి. నువ్వు మాత్రం ఫెయిర్ గేమ్ ఆడు. అప్పుడే విజయం నీకు ఆనందాన్నిస్తుంది. అపుడు ఓటమి అయినా కీర్తనని బాధ పెట్టదు. బలమైన ప్రత్యర్థి చేతిలో ఓటమికి ఎవరూ బాధ పడరు’’ అన్నాడు.
ఆకాష్ మాట్లాడుతుంటే బుగ్గన చెయ్యి పెట్టుకొని విచిత్రంగా అతని వంక చూస్తూ వింది మణి బిందు. చివర్లో లేచి నిలబడ్తూ...

‘‘నేను విజయం సాధించడం నాకు ముఖ్యం. అందు కోసం ప్రత్యర్ధు బహీనతల్ని నేను మెట్లుగా వాడుకుంటాను. ప్రొఫెషనల్ థింకింగ్ అనేది ప్రస్తుతం అన్ని క్రీడల్లోనూ పెరుగుతోంది. అది వున్నవాళ్ళే  గెలుస్తారు. సో! నేను గెలుస్తాను. గెలిచి తీరుతాను’’ ఆ అమ్మాయి నవ్వుతూనే చెప్పింది. కానీ ఆకాష్ కి మనసెందుకో దిగులుగా తయారయింది.

పడగెత్తి నిలుచున్న గోధుమ వన్నె త్రాచులా అనిపించింది మణి బిందుని చూస్తుంటే....

అతను ఆలోచనల్లోకి జారుకోవడం చూసి, మణిబిందు బయటకి నడిచింది.

**********

కీర్తన ప్రణీత్ ఇంటికి వచ్చి వారం దాటింది. ప్రణీత్ మదర్  యింకా రాలేదు. చుట్టాలంతా కలిసి షిరిడీ వెళుతుంటే, ఆమె కూడా వాళ్ళతో కలిసి వెళ్ళింది.

ఎవరూ లేకుండా అతనితో కలిసి వుండటం ముందు బెరుకుగా అనిపించినా తర్వాత అలవాటయి పోయింది.

అతనిదంతా తన లాగే నియమబద్ద జీవితం. ఉదయాన్నే లేవడం, జాగింగ్, ఇంటికి వచ్చి కుకింగ్, తర్వాత ఆఫీసుకి వెళ్ళి పోవడం.
హైదరాబాద్ లో పేరు పొందిన కంపెనీలో బిజినెస్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నాడు. మంచి శాలరీ. ఆ ఫీల్డ్ లో పేరు ప్రఖ్యాతులు వున్నాయని తెలుసుకున్న కీర్తన ఆశ్చర్య పోయింది.

వాలీ బాల్ నుండి జీవితాన్ని విడదీసుకుని, అతి తక్కువ కాలం లో వేరే ఫీల్డ్ లో టాప్ పొజిషన్ కి వెళ్ళడం ఎలా సాధ్య పడిందని ఓ రోజు అడిగేసింది.

నవ్వేసి వూరుకున్నాడు గానీ, సమాధానం చెప్ప లేదు. అతను ఎంత గొప్ప ప్లేయరో ఆమెకి తెలుసు. కానీ నేషనల్ గేమ్స్ లో అతను ఎందుకు పాల్గొన లేదో ఆమెకి అర్ధం కాలేదు. అతని వెనుక ఏదో నిగూఢమయిన గతం వుంది. అతను చెప్పడం లేదు. ఒకప్పుడు బాగా ఆడి, ఇప్పుడు అతను వాలీబాల్ ని త్యజించాడు.

తనకి బాగా గుర్తు. మొట్ట మొదటి సారి అతను తన దగ్గరికి వచ్చి బాల్ని చేతిలోకి తీసుకున్నప్పుడు అతని చేతులు వణికాయి.
అతని కేమీ తెలియదని తనపుడు అనుకుంది. కానీ ఆలోచిస్తుంటే అనిపిస్తోంది. ఏవో కారణాల చేత వదిలి పెట్టిన గేమ్ ని అతను తన కోసమే మళ్ళీ ఆడుతున్నాడు.

అంతే కాదు. ఇన్ని సంవత్సరాలుగా అతను తన ఆటని గమనించి, అవసరమైన మెళకువలన్నీ నేర్పిస్తున్నాడు. ఇంత కన్నా గొప్ప శ్రేయోభిలాషి ఎవరుంటారు? మనసంతా అతని పట్ల కృతజ్ఞతతో నిండి పోయింది.

ఈదురు గాలికి కిటికీ రెక్కలు కొట్టుకోవడంతో వాస్తవం లోకి వచ్చింది కీర్తన. గదిలో నుండి బయటికి వచ్చి చూసింది. ఆకాశం మబ్బు పట్టింది. నలు మూలల నుండీ నల్ల మబ్బులు కమ్ముకుని వస్తున్నాయి. ఎక్కడో వాన పడుతున్నట్లుగా గాలి చల్లగా వీస్తోంది. గాలి తాకిడికి చెట్ల ఆకులు గలగల ఆడుతూ కదులుతున్నాయి.

ఫ్రంట్ డోర్ వేయ బోయి, గేటు చప్పుడు కావడంతో ఆగింది కీర్తన. గేటు బయట ఆగివున్న వైట్ హోండా కారును చూడగానే ఆమె గుండె దడ దడ లాడింది.

కారు లోంచి దిగుతున్న వ్యక్తిని చూడగానే ముఖాన చిరు చెమటలు కమ్ముకున్నాయి. కాళ్ళు నేలకంటుకు పోయాయి.

ఆకాష్ కారు దిగి గేట్ తీసుకుని లోపలకి వస్తున్నాడు. అది చూసిన కీర్తన గబ గబా లోపలికి వెళ్ళి పోయింది.

మనసంతా అస్థిమితంగా మారి పోయింది. ఒళ్ళంతా ఒకటే గాభరా. బెడ్రూం లోకి వెళ్ళ బోయినదల్లా ఆగి హాల్లోనే శిలా ప్రతిమలా నిలుచుండి పోయింది.

ఈ క్షణమో మరుక్షణమో వినిపించ బోయే అతని స్వరం తనను ఎంత ఆందోళనకు గురి చేస్తుందో ఆమె ఆలోచిస్తోంది. ఇంతలో ఆకాష్ లోపలికి రానే వచ్చాడు.

ఆమె తల వాల్చి హాల్లోని కార్పెట్ వంక చూస్తోంది.

‘‘లోపలికి రావచ్చా?’’ గంభీరమైన స్వరం విన్పించి ఉలిక్కి పడింది. తలెత్తి చూసింది. గుమ్మం పొడవునా నిలుచున్న అతన్ని చూసి హృదయం సంచలనానికి లోనైంది. నోట మాట రాలేదు. కొంచెం తల వూపి వూరుకుంది.

ఆకాష్ లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. కీర్తన అలాగే నిలబడింది.

‘‘కూర్చోండి’’ చెప్పాడు ఆకాష్.

విసురుగా తలెత్తి చూసింది కీర్తన.

‘‘మీతో మాట్లాడాలి’’ అభ్యర్ధనగా అన్నాడు ఆకాష్.

‘‘నాకు మీతో మాట్లాడే అవసరం లేదు. ఖచ్చితంగా అంది కీర్తన. చిన్నగా మందహాసం చేశాడు ఆకాష్. అది చూసి చిరాకెత్తుకొచ్చింది కీర్తనకు.

‘‘పందెం ఓడి పోతానని భయమా?’’ కవ్వింపుగా అన్నాడు ఆకాష్.

‘‘లక్ష్యం కోసం రక్త సంబంధాన్నే వదులుకున్నాను.  ఈ పందెం ఒక లెక్కా?’’ రోషంగా అంది కీర్తన.

‘‘జరిగిన దానికి అశోక్ చాలా బాధ పడుతున్నాడు. నీవు ఇంట్లోంచి వచ్చేయటం ఏమాత్రం బాగో లేదు. అయినా నేనుండగా పరాయి వాళ్ళ ఇంట్లో వుండటం నాకిష్టం లేదు. మన పెళ్ళయ్యే వరకూ నీవు మీ ఇంటికే వెళ్ళిపో’’ చెప్పాడు ఆకాష్.

విచిత్రంగా చూసింది కీర్తన.

‘‘అసలు మీకూ నాకూ మధ్యా ఇంకా ఏ సంబంధం మిగులుందని? నా గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారో నాకర్ధం కావటం లేదు. నా మీద ఎంతో ప్రేమతో పందెం వేశారు. ఓ.కె. చూద్దాం. ఈ రేసులో మీరో, నేనో.....తేలిపోయే రోజూ త్వరలోనే వుంది. అంత వరకూ మన అనుబంధాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చెయ్యొద్దు’’ శాంతం గానే చెప్పినా ఆమె స్వరంలో ఒకింత పదును తొంగి చూసింది.ఆమె మాటలనే కళ్ళార్పకుండా చూసి విన్నాడు ఆకాష్.

నిన్న మొన్నటి దాకా ఎంతో అమాయకంగా తను చెప్పిందల్లా నమ్మేసి తనను ఎంతో అభిమానించిన ఆమె అమాయకత్వాన్ని ఆమె మాటల్లోని స్వచ్ఛతను తనే పోగొట్టుకున్నాడు. తనదే తప్పు.

కాని ఇప్పుడు తన మనసులో పందెం గురించిన ఆలోచనలు ఏవీ లేవని ఆమెను మనసా, వాచా అభిమానిస్తున్నానని ఎలా చెప్పటం...? ఇంత జరిగాక తన గత ప్రవర్తన వెనుక కారణాలను చెప్తే ఆమె నమ్ముతుందా? ఎలా నమ్మించడం? కాసేపు మౌనంగా వుండి పోయాడు ఆకాష్.

దిగులుగా వున్న అతని వదనం చూసి ఆమె మనస్సు తెల్లబోయినట్లయింది. అతనెందుకో బాధ పడుతున్నాడు. అది తన గురించేనన్నది కీర్తన వూహించుకోలేని విషయం. ఎందుకంటే, ఇంత కాలం అతను తనని ఒక ఆట వస్తువుగా మారుద్దామని చూశాడు. తను లొంగక పోయే సరికి ఇపుడు మళ్ళీ వేరే పథకం వేస్తున్నాడని ఉక్రోషంగా అనుకుంది కీర్తన.

ఆమె నిలబడే వుండటం చూసి, ‘‘నా ప్రెజెన్స్ నీకు అంత అసహ్యంగా తెలుస్తోందా?’’ మెల్లగా అన్నాడు.

అదో మాదిరిగా ధ్వనించిన అతని స్వరం విని విచలితురాలైంది కీర్తన. చెన్నైలో బీచ్ ఒడ్డున తనకు సన్నిహితంగా వచ్చిన అతని హృదయం దాని తాలూకు మార్దవం చప్పున స్ఫురణ లోకి వచ్చాయి. అంత వరకు గడ్డ కట్టిన దేదో కరిగి పోతున్నట్లుగా కన్నీరు చెంపల మీదగా దూక బోయాయి. గిరుక్కున వెనక్కు తిరిగి ఏదో పనున్నట్లు కిచెన్ లోనికి వెళ్ళింది. చున్నీతో కళ్ళొత్తుకుని ఓ నిముషం మనస్సుని పదిల పర్చుకుని ఫ్రిజ్ లో నుంచి గ్రేప్ జ్యూస్ తీసి గ్లాస్ లో పోసింది.

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్