Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.....http://www.gotelugu.com/issue242/662/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/ 

(గత సంచిక తరువాయి)...

‘‘మీరేం చేస్తుంటారు?’’ ఆకాష్ అడిగాడు.

చెప్పాడు ప్రణీత్.

కాసేపు ఆకాష్ తన బిజినెస్ గురించి చెప్పాడు.

కీర్తన లోపలికి వెళ్ళిపోయింది.

పావుగంట గడిచాక ఆకాష్....

‘‘కీర్తనా!’’ అని పిలిచాడు.

అడుగులో అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ వచ్చింది.

‘‘డిన్నర్ బయట తీసుకుందాం రెడీ అవ్వు’’ చెప్పి ప్రణీత్ వైపు తిరిగి ‘‘మీరూ మాతో జాయినవ్వండి’’ ఇన్వయిట్ చేశాడు.

‘‘నో...థాంక్యూ! మీరు వెళ్ళండి’’ చెప్పాడు ప్రణీత్.

కీర్తనకి ప్రణీత్ మొహం చూడాంటే యిబ్బందిగా వుంది. నిన్నటి వరకూ సొంత అన్నయ్యనీ, ప్రేమించిన వాడినీ నిందించి, ఇప్పుడు అతను వచ్చి పిలవగానే డిన్నర్ కి వెళ్ళిపోతుంటే  ప్రణీత్  ఏమనుకుంటాడు? బెరుగ్గా అతని వైపు చూసింది.

చిన్నగా నవ్వి తలూపాడు.

కాస్తంత ధైర్యం వచ్చింది. గబగబా లోపలికి వెళుతుంటే, వెనక నుంచి ఆకాష్...

‘‘చీర కట్టుకో....!’’ అధికార పూర్వకంగా అన్నాడు. కావాలనే.... ఆమె మీద తనకి ఎంత చనువు వుందో ప్రణీత్ కి తెలియాలనే అన్నాడతను.
నషాళానికి అంటింది కీర్తనకి. వెనక్కి తిరిగి..

‘‘మనిద్దరి జీవితాలూ దెబ్బలాడుకోవడంతోనే సరిపోతున్నాయి. చీరలు కొనిపెట్టే తీరిక మీకూ, కట్టుకునే ఓపిక నాకూ లేవు’’ విసురుగా అని వెళ్ళిపోతుంటే...

ముసిముసిగా నవ్వుతున్న ఆకాష్ నే తదేకంగా చూశాడు ప్రణీత్.

ఇద్దరూ బయటకొచ్చి కారెక్కుతుంటే, ఆ రోడ్డులోనే మరో కారులో వెళుతున్న ఒక వ్యక్తి, వాళ్ళను పరిశీలనగా చూడటం వాళ్ళిద్దరూ గమనించలేదు.

**************

నాలుగురోజులు  ప్రశాంతంగా గడిచిపోయాయి కీర్తనకి.

ఆ రోజు ఆకాష్ ఇంటికి రావటం గురించి ప్రణీత్ మామూలుగానే వున్నాడు. ఏమీ అడగలేదు!

ఇక ఆకాష్!

పందెం గురించి గానీ, వాలీబాల్ గురించి గానీ ఏమీ మాట్లాడలేదు. తనతో మాట్లాడటం కోసం, తనని చూడటం కోసం ఎంత తపించిపోతున్నాడో చిలిపిగా వర్ణిస్తూ వుంటాడు.

ఇది వరకు జరిగిన గొడవలు , ఆకాష్ పట్ల తన డౌట్స్ అన్నీ మనసులో మేకుల్లా తొలుస్తూ వున్నా, బాలెన్స్ గా వుండటం నేర్చుకుంది కీర్తన.

అతని ప్రభావం తన గేమ్ మీద పడకుండా చూసుకుంటోంది. మైండ్ ని పూర్తిగా విభజించేసి, ఈ సెంటిమెంట్లన్నిటినీ ఓ అరలో సర్దేసింది. అందుమూలం గా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ లేదు.

ఆ రోజు గ్రౌండ్ కి ప్రాక్టీస్ కి ప్రణీత్ తో కలిసి ఎప్పటిలాగే వెళ్ళింది.

అప్పటికే మణిబిందు తన టీంతో కలిసి ప్రాక్టీస్ చేస్తోంది.

పక్క కోర్టులోకి వెళ్ళి వీళ్ళూ ప్రాక్టీస్ ప్రారంభించారు.

ఆకాష్ నాలుగు రోజులుగా కీర్తనతో మాట్లాడుతుండటం, ఇప్పుడు మణిబిందు యిక్కడ వుండటం చూసి అతని మనసు కీడు శంకించింది.
అందుకే దూరంగా వెళ్ళకుండా ఆ పక్కనే వున్న ఛెయిర్లో కూర్చున్నాడు.

ఎప్పటిలాగే మాట యుద్ధం ప్రారంభించింది మణిబిందు.

‘‘ఏయ్ ప్రతిమా! జాగ్రత్తగా విను. ఆకాష్ నా ఉడ్బీ. అతనితో కార్లెక్కి షికారు చేసేవాళ్ళు కేవలం గాళ్ ఫ్రెండ్స్....అంతే!’’ పకపకా నవ్వుతూ అంది.

ఆడుతున్నదల్లా సర్పద్రష్టలా ఆగిపోయింది కీర్తన. మణిబిందు ఇలా మాట్లాడుతుందేంటి?

తను ఆకాష్ తో హోటల్ కి  వెళ్ళినట్లు ఈ అమ్మాయికి ఎలా తెలుసు? అపనమ్మకంగా చూస్తోంది.

ప్రణీత్ కీర్తననే చూస్తున్నాడు. అతనికి మణిబిందు మాటలు వినబడటం లేదు. కానీ యిద్దరి ఫిలింగ్స్ తెలుస్తున్నాయి.
మణిబిందు ఏదో టీజ్ చేస్తున్నట్లుంది.

కీర్తన ముఖం వడలిపోయి వుంది. అతనికి తన ప్రయత్నం అంతా వృధా అయిపోతున్నట్లు అనిపించింది. కొంచెం కోపం కూడా వచ్చింది.
‘‘కీర్తనా! గేమ్ లో ఫేస్ టూ ఫేస్ నిన్ను ఓడించే వాళ్ళెవరూ లేరు. ప్రాక్టీస్ చెయ్యి’’ గట్టిగా అరిచి చెప్పాడు.

ఈలోగా తెలిసిన వాళ్ళెవరో వచ్చేసరికి అతను కాస్తంత దూరంగా వెళ్ళి అతనితో మాట్లాడుతూ, మధ్యమధ్యలో ఇటు చూడసాగాడు.
ప్రణీత్ మాటలు వినగానే మణిబిందు మొహంలో అదోలాంటి నవ్వు ప్రత్యక్షమయింది. అవతలి నుంచే హేళనగా నవ్వి...

‘‘ఓ...అంత టాలెంటెడా? అందుకే కాబోలు స్టేట్ లెవల్లో ఓడిపోయింది’’ అంది.

పళ్ళు బిగించి, ఆవేశాన్ని ఆపుకుని తన గేమ్ ఆడుకోసాగింది కీర్తన.

అయినా వదల్లేదు మణిబిందు.

‘‘నిజంగా అంత గొప్ప ప్లేయరైతే నేను విసిరిన బంతిని లిఫ్ట్ చేయగలిగితే చాలు....’’ వెటకారంగా అంది.

‘‘ఏం.......అదేమన్నా గొప్ప విషయమా?’’ కీర్తన ఫ్రెండ్ కోపంగా అంది.

‘‘గొప్పే! ఇవిగో ఈ బాల్స్ చూడండి. ఇవన్నీ చాలా హార్ట్....ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తయారుచేసినవి. వీటితో ఆడాలి. మీ ఫ్రెండ్ వల్ల కాదనిచెప్పి తన తరపున మీరు సారీ చెప్పుకోండి వదిలేస్తాం....’’ వ్యంగ్యంగా అంది.

అందరూ మొహమొహాలు చూసుకున్నారు. అవమానంతో వాళ్ళ ముఖాలు ఎర్రబడ్డాయి.

కీర్తన పట్టించుకోలేదు. తన ప్రాక్టీస్ తను చేసుకుంటోంది.

ఓడిపోయినట్లుగా గేలిచేస్తూ, అసభ్యమైన సంజ్ఞతో వెక్కిరించింది మణిబిందు. అరుపులూ , కేకలూ మిన్నంటాయి.
కీర్తన టీమ్ అంతా కామయిపోయింది.

తన అస్త్రం పారనందుకు అసహనంగా ఫీలయింది మణిబిందు. అందుకే మరికాస్త శృతి పెంచాలనుకుంది.

‘‘ఏయ్! మీ కెప్టెన్సీ చూసి మీరంతా షేమ్ ఫీలవ్వాలి. ఏ ఛాలెంజ్ నీ తను టేకప్ చేయలేదు. ఆఖరికి మీరు సెలెక్షన్స్ లోనే ఇంటి ముఖం పడతారు. కృష్ణా టీమే గెలుస్తుంది.’’ రగిలిపోయింది కీర్తన మనసు. భావోద్వేగాన్ని అణచుకుంటుందనడానికి చిహ్నంగా కళ్ళు, ముక్కు, చెంపలు ఎర్రబడ్డాయి.

‘‘కెప్టెన్ ధైర్యాన్నిబట్టే మిగతా వాళ్ళూ...మీ కెప్టెనే ఇలా వుంటే మీరేం గెలుస్తారు?’’

ఇక తట్టుకోలేకపోయింది కీర్తన.

‘‘స్టాపిట్!’’ గట్టిగా అరిచింది.

అందరూ తిరిగి చూశారు.

నెమ్మదిగా నడుచుకుంటూ మణిబిందు దగ్గరకి వెళ్ళింది కీర్తన.

‘‘ఇప్పుడు చెప్పు?’’ సూటిగా చూస్తూ అంది.

‘‘శభాష్! ఇప్పుడు నువ్వు నచ్చావ్. ఈ బాల్స్ చూడు. వీటిలో ఏ బాల్ ని ఎంచుకుంటావో చెప్పు. ఆ బాల్ ని విసురుతాను. నువ్వు లిఫ్ట్ చెయ్యందే ఆ బాల్స్ ని’’ వున్న నాలుగైదు బాల్స్ చూపిస్తూ అంది మణిబిందు.

‘‘ఎంచుకోవాల్సిన అవసరం లేదు’’ కాన్ఫిడెంట్ గా అంది కీర్తన.

కీర్తన మణిబిందు దగ్గరకి వెళ్ళడం గమనించి పక్క వ్యక్తితో మాట్లాడుతూనే ఇటువైపు చూస్తున్నాడు ప్రణీత్. కీర్తన కోర్టులోకి వచ్చింది. మణిబిందు ఒక బంతిని తీసుకుని చేత్తో తడిమింది.

ఆమె మొహంలోని పైశాచికమైన నవ్వుని చూసి ప్రణీత్ భృకుటి ముడిపడింది.

కీర్తన కోర్టులో పొజిషన్ లోకి వచ్చింది. ఎడమ అరచేతిలో కుడిచేతిని వుంచి ఎడమ బొటన వేలి మీద కుడి బొటన వేలిని వుంచింది.
వేగంగా వచ్చే ఆ లెదర్ బంతిని అడ్డుకోడానికి వేళ్ళని ఉక్కు కడ్డీల్లా మార్చింది.

అందరూ ఊపిరి బిగపట్టి ఏం జరగబోతోందా అని చూస్తున్నారు.

ప్రణీత్ కూడా యిటే చూస్తున్నాడు. చూస్తున్నకొద్దీ అతనిలో ఆతృత హెచ్చవుతోంది.

ఏదో జరగబోతోందని సిక్త్ సెన్స్ హెచ్చరిస్తోంది. అతనితో ఉండమని చెప్పి, ఇటువైపు అడుగు వేయటం ప్రారంభించాడు.

మణిబిందు చేతిలో బంతిని అటూ`ఇటూ తిప్పుతోంది తప్ప, నేలకేసి కొట్టి పొజిషన్ లోకి రాలేదు.

ప్రణీత్ కి అనుమానం కలిగింది. అతని పాదాలు మరింత వేగాన్ని పుంజుకున్నాయి.

‘‘రడీ!’’ మణిబిందు కీర్తనకేసి చూసింది. తలూపింది కీర్తన.

ఆమె చేతులు బాల్ చుట్టూ బిగుసుకున్నాయి. ఎంత వేగంగా విసరబోతోందో ఆ బంతిని చుట్టుకున్న చేతులు బిగింపుని బట్టీ అతనికి అర్ధమయింది.

అతని మనసు ఆందోళనకి గురయింది.

కసిగా, క్రోధంగా బంతిని విసిరింది మణిబిందు. బంతి మెలికలు తిరుగుతూ ఆకాశానికి ఎగసింది. అవతలి కోర్టులో వున్న కీర్తన వైపు వాలసాగింది.

బంతి పైకి ఎగిరినపుడు అతనికి ఏమీ డౌట్ రాలేదు కానీ కిందకి దిగుతుండగా తెలిసింది ఏదో తేడా వున్న విషయం. బంతి చాలా వేగంగా, బరువుగా కిందకి జారుతోంది.

కీర్తన దృష్టంతా లిప్టు చేయడం మీదే వుంది. ఆలోచించే సమయం లేదు. ‘‘కీర్తనా! నో’’ అంటూ అరుస్తూ అడ్డంగా వెళ్ళాడు. అప్రయత్నంగా అతని కుడిచెయ్యి బంతికి అడ్డంగా వెళ్ళింది.

అందరూ నిశ్చేష్టితులై చూస్తుండగా బంతి అతని చేతిని తాకి కింద పడింది. ఏమీ జరగలేదనుకున్నారందరూ. కానీ బంతి అతని చేతిని తాకినపుడు ‘ఫట్’మని ఎముక విరిగిన చప్పుడు పక్కనే వున్న కీర్తనకి వినిపించి విస్మయంగా అతని వంక చూసింది.

అప్పటికే అతను విపరీతమైన బాధని ఓర్చుకున్నట్లు దవడలు బిగించాడు.

 

ఇంకా వుంది...

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
premiste emavutundi?