Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue242/661/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి)...  భర్త,  కొడుకు వెళ్ళిన దగ్గర నుంచి అన్నపూర్ణ గుమ్మాన్ని అంటి పెట్టుకుని అలాగే కూర్చుంది.
ఆవిడ కళ్ళు మాటి, మాటికి గేటు వైపు, గోడకున్న వెంకటేశ్వర స్వామి పటం వైపు చూస్తున్నాయి.

“స్వామి! నా కూతురు క్షేమంగా ఇంటికి వచ్చేయాలి నాయనా .. నీ గుడికి వచ్చి నూట ఎనిమిది ప్రదిక్షణలు చేస్తాను తండ్రీ ...  నా కూతురు క్షేమంగా రావాలి తండ్రి ... నా కూతురు క్షేమంగా రావాలి.. నా కూతురుకి ఏ ఆపద రాకుండా చూడు ఆపద మొక్కుల వాడా” ఆవిడ కన్నీళ్ళతో ఏడుకొండల వాడికి పదే పదే మొక్కసాగింది.

సమయం గడిచి పోతోంది.. ఎనిమిది ఇరవై అయింది.. కార్తికేయ కాని, కోటేశ్వరరావు కాని ఇంకా రాలేదు.. గాయత్రి జాడ లేదు..
ఇప్పుడు కూతురు క్షేమంతో పాటు భర్త, కొడుకు ఏమయారో అన్న ఆందోళన అదనంగా చేరి ఆవిడ మనసంతా గందరగోళం అయింది. ఒక దగ్గర కూర్చోలేక పోయింది.. మానసిక వేదనతో శరీరంలో కూడా అకస్మాత్తుగా నీరసం చేరి నిస్సత్తువగా అయింది.. అయినా కాలు నిలవక ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉంది..క్షణం, క్షణం ముగ్గురి క్షేమం కోసం ఏడుకొండల వాడిని అవిరామంగా ప్రార్దిస్తూనే ఉంది.

కళ్ళు తిరుగుతున్నట్టు అయింది. గేటు దగ్గర నిలబడి వీధిలోకి చూస్తున్న అన్నపూర్ణ లోపలికి వచ్చి మంచి నీళ్ళు తాగుతుండగా గేటు చప్పుడైంది. సగం తాగి గ్లాసు వంట గది గట్టు మీద పెట్టి వేగంగా హాల్లోకి వచ్చింది.

గంగరాజు లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే నీరసం ముంచుకొచ్చింది. ఎందుకోచ్చాడో.. ఈయనతో పనుండి వచ్చుంటాడు. ఇప్పుడు ఆయన ఏరి అంటే ఏం చెప్పాలి? మా అమ్మాయి ఇంకా కాలేజ్ నుంచి ఇంటికి రాలేదు ... మా ఆయన కొడుకు వెతకడానికి వెళ్ళారని చెప్పాలా... ఈ విషయం ఇతనికి తెలిసిందంటే క్షణాల మీద ఆ కాలనీలో అందరికి తెలుస్తుంది. అసలే అక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది  దిగువ తరగతి వాళ్ళు.. చదువు, సంధ్యలు అంతగా లేనివాళ్ళు.. అద్దె తక్కువ అని, పిల్లలిద్దరికి కాలేజిలు దగ్గరని అక్కడ ఇల్లు తీసుకున్నారు. గాయత్రి ఎనిమిది దాటినా కాలేజ్ నుంచి రాలేదని తెలిసిందంటే చిలవలు, పలవలుగా  కధలు, కధలుగా ఏవేవో చెప్పుకుంటారు.. పరువు పోయినట్టే..

“అమ్మగారూ అయ్యగారున్నారా” ... గంగరాజు చాలా వినయంగా అడిగాడు. అతని మొహంలో విచారం కనిపిస్తోంది.. ఏదో అపరాధ భావనతో చూపులు ఆవిడ మీద స్థిరంగా నిలవడం లేదు.

“లేరు గంగరాజు... బయటికి వెళ్ళారు...” అతి కష్టం మీద గొంతు పెగుల్చుకుని చెప్పింది.

“ఎక్కడికి పోయిన్రమ్మ “.... మళ్ళి అడిగాడు..గంగరాజు కోటేశ్వరరావు కుటుంబీకులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా , మర్యాదగా మాట్లాడతాడు.. తన భాష పట్ల జాగ్రత్తగా ఉంటాడు.

ఆవిడ తడబడింది.. “అది... ఏదో పనుంది” అని వెళ్ళారు...

గంగరాజు ఆవిడ సమాధానం విని తల తిప్పుకుని ఏదో  ఆలోచిస్తూ వీధిలోకి చూడసాగాడు. తనకి తెలిసిన విషయం ఆవిడకి ఎలా చెప్పాలో అతనికి అర్ధం కావడం లేదు..

సాయంత్రం పాండు షాప్ కి వచ్చి “అన్నా ... అన్నా రమేష్ ని ఏడికి తోలించినవ్” అని అడిగాడు..

“నేనేడికి తోలించిన” ఆశ్చర్యంగా అడిగాడు గంగరాజు.

“అరె నేను బాసర బండి దిగి వస్తుంటే ఇస్తేషన్ల కనపడిండు...ఊరికి బోతున్న అన్నడు .. ఏ ఊరికి రా అంటే చెప్పలే... ఉరికిండు..” అన్నాడు పాండు..

గంగరాజు విస్తుబోతూ అడిగాడు..” ఏమిరా .... మంచిగ చూసినవా ఏమన్టున్నావ్...”

పాండు కొంచెం స్వరం తగ్గించి నెమ్మదిగా అన్నాడు...” ఒక పోరి కూడా నెత్తి దాచుకుని వచ్చిందన్నా.. గా పోరిని చూస్తే మన కోటేశ్వరరావు సారు బిడ్డలేక్క కొట్టింది.. గప్పుడే అడుగుదామనుకున్న మస్తు రష్ ఉండే.. గా పోరి పారిపోయింది..” అంటూ చిలవలు, పలవలుగా తన అనుమానం  చెప్పాడు.

గంగరాజు పాండు నిజం చెబుతున్నాడో, అబద్ధం చెబుతున్నాడో అర్ధంకాక నివ్వెరపోయి వినసాగాడు.. పాండు తను చెప్పేది చెప్పేసి వెళ్ళిపోయాడు. గంగరాజు మతిపోయినట్టు అలాగే కూర్చుండి పోయి, మాటలు నమ్మలేక, నమ్మనూ లేక కొంతసేపు తాత్సారం చేసినా ఎనిమిది దాటుతున్నా కొడుకు ఇంటికి రాకపోడం, అతనికి ఫోన్ చేస్తే  ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఏం చేయాలో తెలియక ముందు గాయత్రి వచ్చిందో లేదో కనుక్కుందామని వచ్చాడు.

అన్నపూర్ణ వాలకం, ఇంట్లో కనిపిస్తున్న నిశ్శబ్దం చూసాక గాయత్రి రాలేదన్న విషయం అర్ధమైంది. .. అంటే పాండు చెప్పింది నిజమేనా,... ఎంత ఘోరం జరిగింది... రమేష్ మగపిల్లాడు.. ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తే నాలుగు తన్ని తను ఇంట్లోకి రాని స్తాడు.. కాని సంప్రదాయాలు, ఆచారాలు పాటించే ఈ కుటుంబంలోని అమ్మాయి తన కొడుకుతో ఎటో వెళ్ళడం ఏంటి? అసలు ఎందుకు వెళ్ళింది? వాళ్ళిద్దరికీ పారిపోయేంత దోస్తీ ఎట్లా కుదిరింది... ప్రశ్నలతో గంగరాజు బుర్ర బద్దలు అవుతోంటే   ఈ విషయం ఈవిడకి ఎట్లా చెప్పాలో తెలియక కర్తవ్యం తోచనట్టు నిలబడిపోయాడు.

అతను ఎందుకు వచ్చాడో తెలియని అన్నపూర్ణ ఇతను వెళ్ళిపోతే బాగుండు ఇంక ప్రశ్నలు వేయకుండా అని అసహనంగా చూడసాగింది.
గంగరాజు అకస్మాత్తుగా అడిగాడు  “అమ్మా పాప ఇంట్లో ఉందా..”

అన్నపూర్ణ గుండెల్లో రాయి పడింది... అయిపొయింది.. ఇప్పుడు రాలేదు అంటే ఏమనుకుంటాడో.. వచ్చింది అంటే పిలవామంటాడెమో .... గొంతులో కరక్కాయ అడ్డు పడినట్టు మౌనంగా ఉండిపోయింది.

ఆవిడ సమాధానం కోసం ఎదురుచూస్తూ ఆవిడ మొహంలోకి చూస్తున్న గంగరాజుకి ఈవిడకి విషయం తెలిసిపోయిందేమో అనిపించింది. అతను ఏదో అనబోయేంతలో గేటు చప్పుడు అవడం కోపంతో కందగడ్డ లాంటి మొహంతో కోటేశ్వరరావు , దిగాలు పడిన మొహంతో కార్తికేయ లోపలికి రావడం జరిగింది. అన్నపూర్ణ ఆత్రంగా వాళ్ళ దగ్గరగా వెళ్లి వాళ్ళ మొహాల్లోకి చూసింది.

ఆవిడ వైపు చూడకుండా తన ఇంటి గుమ్మంలో నిలబడ్డ గంగరాజు వైపు ప్రశ్నార్ధకంగా చూసాడు కోటేశ్వరరావు .

గంగరాజు ఆయన వైపు భయంగా, అన్నపూర్ణ , కార్తికేయ వైపు సంశయంగా చూసాడు.

గంగరాజు వేళకాని వేళ తన ఇంటి గుమ్మంలో కనిపించడం, అతని మొహంలో, కళ్ళల్లో కనిపిస్తున్న భయం,  స్తిరంలేని చూపులు, ఆ నిలబడంలో బెరుకు గమనించిన కోటేశ్వరరావు ఏదో జరక్కూడనిది జరిగిందని గ్రహించాడు..అన్నపూర్ణ వైపు చూశాడు. ఆవిడ కళ్ళల్లో చిప్పిల్లుతున్న కన్నీరు... వణుకుతున్న పెదాలు ఆవిడ మనసులోని ఆందోళనని తెలియచేస్తున్నాయి. గంగరాజు వైపు చూసి కుడిచేయి చాచి అతని భుజం మీద చేయి వేసి గేటు వైపు నడుస్తూ  “ఏం గంగరాజు.. ఈ టైం లో ఇలా వచ్చావు” అన్నాడు... అప్పటికే ఇద్దరూ గేటు దాటారు.. వాళ్ళు వెళ్ళిన వైపు కార్తికేయ, అన్నపూర్ణ చ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు.

గంగరాజు, కోటేశ్వరరావు ఇద్దరూ గంగరాజు షాపు దగ్గరకి వచ్చారు.. అప్పటివరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు.. షాపు దగ్గరకి రాగానే గంగరాజు కోటేశ్వరరావు చేతులు పట్టుకుని బేలగా అన్నాడు” సారూ గోరం జరిగిపోయింది సారూ..”

అప్పటిదాకా గాయత్రి ఇంటికి ఎందుకు రాలేదో, ఎటు వెళ్లిందో అనే ఆందోళన, గాయత్రి మీద కోపావేశాలతో ఉన్న కోటేశ్వరరావు గంగరాజు వైపు అనుమానంగా చూసాడు..” ఏం  జరిగింది?”  అన్నాడు నొసలు చిట్లిస్తూ.. గుండెల్లో చెలరేగుతున్న భావాలు బైట పడకుండా జాగ్రత్త పడుతూ ...

గంగరాజు తలవంచుకుని అన్నాడు..” నా కొడుకు , మీ బిడ్డ ....”

గంగరాజు చేతుల మధ్య ఉన్న కోటేశ్వరరావు చేతులు గభాల్న కిందికి జారిపోయాయి.. ఆయన కళ్ళల్లో నిప్పులు చెలరేగాయి. మనిషి నిలువెల్లా వణికిపోసాగాడు.. అప్పటిదాగా నిటారుగా , గంభీరంగా నిలబడ్డ కోటేశ్వరరావు కాళ్ళ కింద భూమి గిర్రున తిరుగుతున్నట్టు అయి పడబోతుంటే సారూ అని అరుస్తూ గంగరాజు గభాల్న పట్టుకున్నాడు.

తన చేతుల్లో తల వేళ్ళాడేస్తున్న కోటేశ్వరరావుని  రెండుచేతుల్లో పొదివి పట్టుకుని గంగరాజు ఒక్కసారి చుట్టుపక్కల పరికించి చూసాడు. దరిదాపుల్లో ఎవరూ కనిపించలేదు. సాధారణంగా ఇళ్ళల్లో ఉన్న ఎవరూ కూడా ఏడు దాటాక బయటికి వెళ్ళరు ... పనుల మీద బయటికి వెళ్ళే మగవాళ్ళు  రాత్రి పది దాటితే కాని ఇళ్ళకు రారు . అందుకే అదృష్టవశాత్తూ అక్కడ ఎవరూ లేరు.. ఇది ఒకందుకు మంచిదే అనుకుంటూ నెమ్మదిగా ఆయనని నడిపించసాగాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్