Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.....http://www.gotelugu.com/issue243/663/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

 

(గత సంచిక తరువాయి)...‘‘మైగాడ్! ప్రణీత్!’’ అతని చేతిని పట్టుకో బోయింది. ఆ మాత్రానికే బాధగా అరిచేశాడు. చూస్తుండ గానే చెయ్యి మణికట్టు దగ్గర బుస్సున పొంగి పోయింది.

వాలీ బాల్ కి చెయ్యి అడ్డు పెడితేనే యిలా జరుగుతుందా? అయోమయంగా బాల్ కోసం చూసింది. అదక్కడ లేదు. మణి బిందు ఏమీ ఎరగనట్లు అమాయకంగా చూస్తోంది.

కీర్తన కోపంగా ఆమె దగ్గరకి వెళ్ళి...‘‘ఏదీ ఇందాకటి బాల్?’’ కఠినంగా అంది.

‘‘ఇదుగో!’’ అంటూ ఒక బాల్ యిచ్చింది. అది పట్టుకుని ప్రణీత్ దగ్గరకి వచ్చింది.

ప్రణీత్ ని చూడగానే తెలిసింది. ఆ బాల్ కాదు తను ఎదుర్కొన్నది అది వేరే బాల్ అని.

‘‘వదిలెయ్ కీర్తనా!’’అంటూ మణి బిందు వైపు చూసి చిన్నగా నవ్వాడు.

బిత్తర పోయింది మణిబిందు. మిగతా వాళ్ళలో హాస్పిటల్ కి వెళ్ళడానికి ఎవరో ఆటో తీసుకుని వచ్చారు.

కీర్తన గబ గబా ప్రణీత్ చెయ్యి పట్టుకుని ఆటో ఎక్కించింది. మిగతా వాళ్ళు వెనకా ఆటోలో వస్తామంటే వారించాడు. ప్రాక్టీస్ చెయ్యమని హెచ్చరించాడు.

ఆటోలో కూర్చున్నాక స్తబ్దంగా మారి పోయింది కీర్తన మనసు. ఈ సంఘటనకీ, ఆకాష్ కీ సంబంధం వుందా? తనూ ఆకాష్ డిన్నర్ కి వెళ్ళినట్లు మణి బిందుకి చెప్పాడా? లేక పోతే ఎలా తెలుస్తుంది?

అసలు ప్రణీత్ కి ఏమయింది?

‘‘ఆ బాల్.....’’ అడగ లేక భయ పడుతూ అంది.

‘‘ఇనుముతో చేసింది. పైన కవరింగ్ కోసం పల్చని లెదర్ వాడారు. కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ లో అర చేతుల్ని రాటు దేల్చడం కోసం ఆడతారు.’’
ఊపిరి పీల్చడం మర్చి పోయి వింది. అలాంటి బాల్ ని, యముని మహిషపు లోహ గంటలా దూసుకొచ్చిన ఆ బాల్ ని, తను తన చేత్తో ఎదుర్కోవాలనుకుంది.

అప నమ్మకంగా బొటన వేళ్ళ వంక చూసుకుంది. గుండెలు దడ దడ లాడాయి.

ఎంతలో ఎంత ప్రమాదం తప్పింది? ప్రమాదం తప్పిందా? ఊహూ ఆ ప్రమాదం బదిలీ అయింది. అదీ తన ఆత్మీయుడికి.

‘‘ప్రణీత్!’’ అతని ఎడమ చేతిని పట్టుకుంది.

ఆమె కంట్లో సన్నటి పొర.

‘‘ఎందుకూ? అంతా మన మంచికే! ఎందుకో నాకు డౌట్ వచ్చింది. అందుకే అడ్డం వచ్చాను. ఏం ఫర్లేదు. తగ్గి పోతుంది’’ తనే ధైర్యం చెప్పాడు. కానీ అతనెంత బాధని అనుభవిస్తున్నాడో అతని ముఖ కవళికలు చూస్తే తెలుస్తోంది.

బాధ, భయం, అనుమానంతో గజ గజ వణికి పోతోంది కీర్తన.

ఆకాష్....! ఇదంతా ఆకాష్ చేయించి వుంటాడా? అతనికి తన మీద ఇంత కక్ష వుందా? తుఫాను గాలికి చిక్కుకున్న లతలా మనసు అల్లాడి పోతోంది.

హాస్పిటల్ కి వెళ్ళగానే డాక్టర్ త్వరగా రెస్పాండ్ అయ్యాడు. ఎక్సరే తీయించాడు. మణి కట్టు దగ్గర ఎముక ఫ్రాక్చరయింది. సిమెంటు కట్టు వేశారు.

అప్పటికే రాత్రి ఎనిమిది అయింది. రెండు రోజులు హాస్పిటల్ లోనే వుండాలన్నారు.

దిగాలుగా అయి పోయింది కీర్తన.

‘‘మీరు ఇంటికి వెళ్ళండి.....వెళ్ళ గలరా?’’ అసహాయంగా అన్నాడు ప్రణీత్.

‘‘ఇక్కడ మీరొక్కరూ...’’

‘‘ఏం ఫర్లేదు, ఇక్కడ మిమ్మల్ని వుండనివ్వరు. కాంపౌండర్, అందరూ వున్నారు. మీరు రాత్రికి ఇంట్లో ఒక్కళ్ళు వుండ గలరు కదా!’’ సందేహంగా అన్నాడు.

‘‘ఉంటాను, నాకేం భయం లేదు. రేపుదయం టిఫిన్ తీసుకుని వస్తాను’’ వెళ్ళ లేక వెళ్ళ లేక లేచింది.

ఆమె గుమ్మం వరకూ వెళ్ళాక అతను తటపటాయిస్తూనే ‘‘కీర్తనా!’’ పిలిచాడు.

వెనక్కి తిరిగి చూసింది.

‘‘ఒక్క అరగంట వుండ గలవా? నీతో మాట్లాడాలి’’ మొహమాటంగా అన్నాడు.

చప్పున అతని దగ్గరకి వచ్చి పక్కన వున్న స్టూల్ మీద కూర్చుంది.

తదేకంగా ఆమె మొహం వంకే చూస్తుంటే, చిత్రంగా అనిపించింది. ఏంటన్నట్లు చూసింది.

‘‘జాగ్రత్తగా వుంటారు కదూ?!’’ అతని స్వరం బేలగా వినిపించింది. తలూపింది.

‘‘మీరు చాలా సార్లు....నా గురించి, నా గేమ్ గురించి అడిగారు. ఎప్పుడూ చెప్ప లేదు. కాని ఇప్పుడు ఆ టైం వచ్చినట్లుగా వుంది.’’

‘‘చెప్పండి’’ ఆసక్తిగా అంది.

‘‘నేను స్కూల్ డేస్ నుంచీ వాలీబాల్ లో బెస్ట్ ప్లేయర్ ని. అంచెలంచెలుగా డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ లెవల్ కి ఎదిగాను. ఎంత ఉధృతంగా తారా జువ్వలా పైకి లేచానో, అంతే వేగంగా కిందికి అధః పాతాళానికి పడి పోయాను. ఇందుకు కారణం ఏంటో తెలుసా? ప్రేమ......

ఎస్.....ప్రేమే....! నేను నీకు మొదటి సారిగా కనిపించడానికి సంవత్సరం ముందు, నేను స్టేట్ లోనే గొప్ప ప్లేయర్ ని. అంతే! నేషనల్ గేమ్స్ కి సెలెక్టయిన ఆంధ్రా జట్టు కెప్టెన్ ని. టైటిల్ ఫేవరెట్ మా జట్టేననీ, మా దరి దాపుల్లో ఎవరూ లేరనీ అందరూ అనే వారు. అది నిజం కూడా.
అలాంటి సమయంలో పరిచయం అయింది ఒక అమ్మాయి. వాలీ బాల్ తప్ప వేరే లోకం తెలీకుండా బతుకుతున్న నాకు ఒక కొత్త లోకాన్ని చూపించింది.

ఆ లోకమంతా ప్రేమ మయం. ఆమెతో కలిసి జీవితం పంచుకోవడంలో ఎంతో మధురిమ కనిపించేది నాకు. అంతే కాక ఆమె నన్ను గేమ్స్ విషయంలో ఎంతో ప్రోత్సహించేది.

రెండేళ్ళాగి పెళ్ళి చేసుకుందామని కూడా డిసైడయ్యాం. ఎంత ప్రేమలో పడ్డా, నేను వాలీబాల్ ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయ్య లేదు.
నేషనల్ గేమ్స్ దగ్గర పడ్డాయి. యిద్దరం కలిసి వెళ్ళాలని డిసైడయ్యాం.

మా టీమ్ తో పాటు తనకీ టికెట్స్ బుక్ అయ్యాయి.

అనుకున్న రోజు రానే వచ్చింది. అన్ని రౌండ్స్ లోనూ ప్రత్యర్ధును ఓడించి ఫైనల్స్ కి చేరుకున్నాం.

ఆ రోజు మ్యాచ్ ఉదయం పదింటికి మ్యాచ్. ఎనిమిదిన్నరకి మేం గ్రౌండ్ కి బయల్దేరుతుండగా వచ్చింది ఆ ఫోన్ కాల్.

నేను ప్రేమించిన అమ్మాయే చేసింది. బెస్టాఫ్ లక్ చెపుతూ కాదు.

హృదయ విదారకంగా ఏడుస్తూ...ఆమెని ఎవరో కిడ్నాప్ చేశారు. రక్షించమని కోరుతోంది. ఆమె ఏదో ఏరియా పేరు చెపుతుండగా కెవ్వుమన్న ధ్వని, ఫోను పెట్టేసిన చప్పుడు వినిపించాయి.

ఒక్క నిమిషం కర్తవ్య విముఖునిలా నిల్చుండి పోయాను. బయల్దేరమని కోచ్ తొందర పెట్టడంతో అయోమయం అయి పోయాను.
నన్ను ప్రేమించిన అమ్మాయి అమాయకమైన మొహం కళ్ళ ముందు మెదిలింది.

పాపం...నన్ను నమ్ముకొని, నా కోసం వచ్చిన ఆ అమ్మాయిని యిలా వదిలేయడమేనా? చివరికి ఒక నిశ్చయానికి వచ్చాను. ఆ అమ్మాయి చెప్పిన ఏరియా గుర్తొచ్చింది. కోచ్ దగ్గరికి వచ్చి...

‘‘పద...అందరూ వెళ్ళారు....’’ అన్నాడు.

‘‘నేను డ్రాపయ్యాను సర్!’’ తలొంచుకుని చెప్పాను. భయంతో కాదు.

ఇన్నేళ్ళ శ్రమ వృధా అవుతున్నందుకు మనసు ద్రవించి వస్తున్న కన్నీరు కనిపించకుండా వుండటానికి....

‘‘ఏం...?’’ విస్మయంగా అన్నాడు.

‘‘చెప్ప లేను సర్!’’ అంటూ చివాలున బయటికి వచ్చి, టాక్సీ వేసుకొని రోడ్లన్నీ పిచ్చి వాడిలా గాలించాను. తను చెప్పిన ఏరియా అంతా వెతికాను. పోలీస్ రిపోర్టిచ్చి నిస్త్రాణగా స్టేడియం కి బయల్దేరాను.

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
premiste emavutundi?