Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

ఇంత వయస్సొచ్చిన తరువాత, వయస్సులో ఉన్నట్టుండమంటే కష్టమే కదూ! ఏదో మరీ మంచం పట్టకుండా, మన పన్లు మనం చేసికుంటూంటే, మనకీ, మన చుట్టుపక్కలవాళ్ళకీ సుఖం. ఏవో చిన్నా చితుకూ వస్తూనే ఉంటాయి. అలాటప్పుడే చిరాకులూ పరాకులూనూ. ఏం చేస్తాం ఏదోలా కాలక్షేపం చేసేయాలి. మనకైతే ఏ కాలినొప్పో, రొంపో, లైట్ గా జ్వరమో వస్తే, దగ్గరలో ఉన్న ఏడాక్టరు దగ్గరకో వెళ్ళడమో, కాదూ కూడదనుకుంటే, ఏవో OTC మందులేసికోవడమే. పనైపోతుంది. కానీ మరీ అలవాటు చేసేసికుంటే, ప్రాణం మీదకొస్తుంది. అప్పుడెలాగూ హాస్పిటలుండనే ఉంది.

కానీ, ఇంట్లో అలవాటైపోయిన వస్తువులున్నాయే, అవి మాత్రం పడకేశాయా, అయిందే మన పని! అవి లేకపోతే రోజెళ్ళదూ, అలాగని వాటిని రిపేరీ షాప్ కి తీసికెళ్ళాలేమూ, ఎవడికో ఫోను చేసి, వాడికి ఖాళీ దొరికి, మన అదృష్టం బాగుండి పాడైన వస్తువు బాగు చేస్తే, మన జీవితం ధన్యమైపోయినట్టే! వచ్చిన గొడవేమిటంటే, ఏదో పగ పట్టిన వాళ్ళలాగ, ఇంట్లో ఉండే ప్రతీ ముఖ్యమైన వస్తువూ, ఒకేసారి Tool down strike చేసేస్తాయి. మన ఖర్మకాలి ఇంట్లో ప్రతీదీ ముఖ్యమైనదే, అలా తగలడ్డాయి మన జీవితాలు! ఏం చేస్తాం? ఏ వస్తువు లేకపోయినా, మన రొటీన్ దెబ్బతినేస్తుంది. ఇదీ అదీ అని లేదు ఇంట్లో కుక్కర్ దగ్గరనుంచి ఇంటావిడ ఫ్లోర్ తుడిచే మాప్ దాకా ప్రతీదీ ముఖ్యమే మరి.

ఇది వరకటి రోజుల్లో కుక్కర్ కి ఉండే safety valve ఏదో పాడైపోయినప్పుడు ఓసారి కొత్తది వేయిస్తే సరిపోయేది. ఇప్పుడలా కాదే, ఏదో technological improvement అని పేరు పెట్టి, దానికి పైన ఓ బుల్లి వాషర్ ఓటి పెట్టాడు. దానిల్లుబంగారం గానూ, అదేమో నిలబడదూ, పైగా కడిగేటప్పుడు ఎక్కడో జారిపోతుంది, ఈ వాషర్ లేకపోతే, ఆ సేఫ్టీ వాల్వు ఉపయోగం లేదూ. దానికేమో జారిపోడం అలవాటూ, మనకి వంటిల్లూ, స్టొవ్ కిందా, వాష్ బేసిన్ లోనూ వెదుక్కోడం అలవాటూ. మన రోజు బాగోపోతే, ఇంటావిడ " ఏమండీ, ఆ వాషర్ ఎక్కడైనా చూశారా.." అంటుంది. చీకట్లో కనిపించి చావదూ. ఇంత హింస పగవాడిక్కూడా వద్దురా బాబూ అనిపిస్తుంది.

అలాగే మా పాత food processor కి లోపల ఓ మేకులాటిదుండేది. ఎందుకనడక్కండి నా ప్రాణం తీయడానికి! ఓ రోజు ఇంటావిడ తీరిగ్గా, చపాతీ పిండీ అదీ చేసికుని చూస్తే, ఆ మేకు కాస్తా మాయం అయిపోయింది. ఇంక సెర్చ్ పార్టీ రెడీ. ఆరోజునే వెన్నోటి చేసింది, వెన్న కాచిన నెయ్యిలో ఉందేమో, లేక ఆవిడ తినే పుల్కాల్లో ఉందేమో, అక్కడా ఇక్కడా అనిలేదు, ఇంతోటి కిచెనూ వెదికేసాము ఫలితం శూన్యం. ఇదికాదని, బయటకు వెళ్ళి మొత్తానికి ఓ కొత్త food processor తెచ్చేశాను. దాన్ని ఎలా ఉపయోగిస్తారో కంపెనీ వాడొచ్చి demo ఇస్తాడా పోనీ అంటే, లేదుట దాంట్లో ఓ సిడి ఇచ్చాడు. పోనీ దాన్నేదో, నాకున్న లిమిటెడ్ పరిజ్ఞానం తో కంప్యూటర్ లో పెట్టి చూద్దామా అంటే, అప్పుడే, దానికీ సుస్తీ చేసింది ! చెప్పాపెట్టకుండా ఆగిపోయింది. మర్నాడు ఏదో ఫోను చేసి, దాన్ని రిపేరీ చేయించి దాని సంగతేదో చూశాను   అన్నీ బావుంటే మజా ఏముందీ? జీవితం లో థ్రిల్ ఉండొద్దూ! పాపం మా ఇంట్లో ఉన్నవి, కొత్తా పాతా తేడా లేకుండా, నన్ను పెట్టవలసిన తిప్పలు పెడుతూంటాయి. అవడం చిన్న చిన్న రిపేరీలే. కానీ వాటిని బాగుచేసే పరిజ్ఞానం లేదే. వాటిని బాగుచేయడానికి ఏ ప్లంబరో కావాలి, వాడేమో దొరకడూ, వాడు దొరికే దాకా పనాగిపోతుంది. అది రిపేరీ అయేదాకా, ఇంటావిడ మొహంలో మొహం పెట్టి చూళ్ళేమూ. పైగా పాడయ్యింది ఏ వాషింగ్ మెషీనో అయిందా, ఇంక మొదలూ.." రేపణ్ణించి, ఈ బట్టలన్నీ సబ్బెట్టి ఉతికే ఓపిక లేదమ్మో...". అదీ నిజమేగా, ఈ వాషింగ్ మెషీన్లొచ్చిన తరువాత ప్రతీదీ దాంట్లోనే, ఓపికుండమంటే ఎక్కడుంటుందీ ? అలవాటా పోయింది, చేయడానికి ఓపికా ఉండదు. పోనీ పాడయ్యింది ఏమైనా మెషీన్ దా అంటే అదీ కాదూ. వాటర్ లైన్ కి పెడతామే ఆ water inlet ఊడి చచ్చింది. ఇల్లంతా నీళ్ళు. పైగా అదికూడా నా నిర్వాకమే. నా అదృష్టం బాగోక వాష్ బేసిన్ దగ్గర ఏదో చెయ్యి కడుక్కుంటుంటే, దాని కిందున్నది కాస్తా ఊడింది. మెయిన్ వాల్వ్ మూసేయాలని తోచింది, కాస్త నయం. వాడికీ వీడికీ ఫోను చేయగా చేయగా మొత్తానికి ఎనిమిదిన్నరకి, వాడు వచ్చి, అదీ ఇదీ తిప్పి, కొద్దిగా టైట్ చేసేసి, ఓ యాభై రూపాయలు పట్టుకు పోయాడు!

అలాగే ఈ మధ్యన అదేదో కొత్తగా మార్కెట్ లోకి Majic Wash అని వచ్చింది. దాంట్లో సదుపాయం ఏమిటంటే, హ్యాండిల్ కి ఉన్న మాప్ ని అదేదో చిన్నబుకెట్ లో పెట్టి తిప్పితే, నీళ్ళు పిండేయొచ్చుట. మొదట్లో బాగానే పనిచేసింది, దానికేం రోగం వచ్చిందో, తిరగడం మానేసింది. పేద్ద కారణం ఏమీ లేదు, దాని వాషర్ పోయింది. దాన్ని బాగుచేయాలంటే, కొట్టుకి తీసుకురమ్మంటాడు వాడూ. ఏమిటో అంతా గందరగోళం.. వస్తే అన్నీ ఒకేవారంలో వచ్చేస్తాయి....

మరిన్ని శీర్షికలు
In 2018 we ...