Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది..?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.... http://www.gotelugu.com/issue247/671/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

(గత సంచిక తరువాయి)... ..“చెప్పు ... సీరియస్ గా అడుగుతున్నాను .. మా ఇంట్లో నా పెళ్లి ప్రయత్నాలు సీరియస్ గా  జరుగుతున్నాయి .. వాళ్ళకి నచ్చచేప్పేసరికి నాకు తలప్రాణం తోకకి వస్తోంది..”

“ నీకు తోక కూడా ఉందా ?”  పెదాల మధ్య నవ్వు బిగపట్టి అంది.

“ జోక్స్ తరవాత ... ముందు ఆన్సర్ చేయి” అన్నాడు .

“ఇప్పుడు పెళ్ళేంటి ? నువ్వంటే గోల్డెన్ స్పూన్తో పుట్టావు.. నేనలా కాదు.. మొన్ననేగా గ్రూప్స్ రాసాను.. రిజల్ట్ రావాలి.. నాకు పోస్టింగ్ రావాలి.. నేను సెటిల్ అవాలి ...”

“ అబ్బా అవన్నీ అవుతాయిలే ... ముందు నీ మెళ్ళో మూడు ముళ్ళు వేసి నిన్ను ఆ ఫ్లాట్ నుంచి నా దగ్గరకు తెచ్చుకోవాలి. “

“ అయినా నీకు బోలెడు మంది అభిమానులు ఉన్నారు కదా వాళ్ళల్లో ఎవరినో ఒకళ్ళని  చూసుకో నేనెందుకు” కినుకగా అంది.

“ ఎందుకంటే నీకు నా మీద, నాకు నీ మీద అంతులేని అభిమానం, ప్రేమ ఉన్నాయి కాబట్టి ... మనం ఒకరికి ఒకరు సూట్ అవుతాం కాబట్టి ..”

“ఓహో ఆ విషయం నువ్వెలా చెప్పగలవు ...” రెండు అరచేతుల్లో గడ్డం ఆనించి, మోచేతులు టేబిల్ మీద పెట్టి ఆమె కళ్ళల్లోకి చూస్తూ మెత్తని స్వరంతో మత్తుగా అన్నాడు “ నీ కళ్ళు చెప్తున్నాయి”. శరణ్య కళ్ళు వాలిపోయాయి ... చెక్కిళ్ళ మీద పరచుకున్న ఎరుపు రంగు నది అలల మీదకి ప్రసరిస్తున్నట్టు అనిపించింది తేజకి .

“ ఎందుకు శరణ్యా అంత ప్రేమ ఉంచుకుని అలా గుండెల్లో దాచుకుంటావు” అన్నాడు మార్దవంగా .శరణ్య మాట్లాడలేదు, తల ఎత్తలేదు..

“ఏయ్  నీక్కూడా సిగ్గా” పిజా చేతిలోకి తీసుకుని ఓరగా తలవంచి ఆమె వైపు చూస్తూ అన్నాడు.

శరణ్య తలెత్తింది... చెక్కిళ్ళ మీది ఎరుపు , మెరుపు కళ్ళల్లోకి పాకినట్టు కళ్ళు వెలిగిపోతున్నాయి.  నెమ్మదిగా అంది. “తేజా! నీకన్నా మంచివాడు, సంస్కారవంతుడు, నన్ను ప్రేమించేవాడు నాకు భర్తగా దొరుకుతాడని అనుకోను ..కానీ ఆర్దికంగా మీ స్థాయికి మేము సరిపోము ...  స్నేహానికి అడ్డురాని అంతస్తులు ఖచ్చితంగా పెళ్ళికి వస్తాయి.. మా వాళ్ళని నేను ఒప్పించగలనని నాకు నమ్మకం .... మీ వాళ్ళని ఒప్పించగలననే నమ్మకం నికుందా?”

“మా వాళ్ళు కాదంటే కదా ఒప్పించే అవసరం ... అలాంటి ఇబ్బందులు ఉండవు .. నువ్వు ఓకే అను చాలు మిగతా విషయాలు నేను చూసుకుంటా”. అతని వైపు విస్మయంగా చూసింది “ఎంత నమ్మకం నీ మీద నీకు .. “

“మన మీద మనకి నమ్మకం లేకపోతే జీవితంలో ఎదగడం చాలా కష్టం శరణ్యా .. ఆ నమ్మకం ఒక్కటే చాలు మనిషిని అంతరిక్షానికి చేర్చడానికి.  “

శరణ్యకి మొదటిసారి తేజ మాటల్లో పరిణతి కనిపించింది.. తేజ అల్లరివాడే కాదు.. అన్నీ తెలిసిన వాడు.. మానసికంగా ఎంతో ఎదిగిన వాడు..అల్లరిగా మాట్లాడినా చిల్లర వాడు కాదు. ఇతనికన్నా ఇంక పై నుంచి అమరేంద్రుడు దిగి వచ్చినా తను సుఖంగా ఉండలేదు ..కానీ ....
“ఏంటి ఆలోచిస్తున్నావు ...” అడిగాడు తేజ .

“నీ మీద ప్రేమతో, వాత్సల్యంతో మీ వాళ్ళు ఒప్పుకున్నా పెళ్లి అయాక నన్ను ...”

ఆమె మాటలకి మధ్యలో అడ్డువస్తూ అన్నాడు “టి వి సీరియల్ లో చూపించినట్టు నిన్ను టార్చర్ పెట్టడం , నీ మీద హత్యా ప్రయత్నం చేయడం లాంటివి చేస్తారని భయమా? “ ఫక్కున నవ్వింది శరణ్య ..

“ హమ్మయ్య నవ్వావా ... థాంక్స్ ...ఐస్ క్రీం తెస్తాను లెట్ అజ్  సెలెబ్రేట్” అంటూ లేచి వేగంగా ఐస్ క్రీం పార్లర్ వైపు వెళ్ళాడు.
అతని హుషారు, ఉత్సాహం చూసి కొన్ని అలలు తన హృదయాన్ని స్ప్రుశించినట్టు అనుభూతి చెందింది శరణ్య. ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ఆడపిల్ల తను ... కోటిశ్వరుడి ఏకైక కుమారుడు తేజ. అంతే కాదు అతనికి మీడియా అంటే ఇష్టం.  ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నాడు.. కొన్ని రోజుల తరవాత ఈ విజయపరంపర ఇచ్చే ఉత్సాహంతో ఫీచర్ ఫిలిం వైపు ఆకర్షించబడి ఆ వైపు వెళ్తే!  ఆ ప్రపంచమే వేరు.. ప్రాక్టికల్ గా బతికే తనకి, మెరుపుల, తళుకుల ఆ ఫాల్స్ ప్రపంచంతో ఏ మాత్రం పొసగదు. ఇవాళ ఉన్న ప్రేమ, అనురాగం కొంతకాలం తరవాత కూడా ఇలాగే ఉంటాయని నమ్మకం ఏంటి? సినిమా ప్రపంచంలో ఏర్పడే ఆకర్షణలు, ప్రలోభాలకు తేజ కూడా లొంగిపోతే!
“హలో”  తేజ పిలుపుతో ఉలిక్కిపడింది..

“ ఏంటి అప్పుడే డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయావా?” ఐస్ క్రీం టేబుల్ మీద పెట్టి కుర్చీలో కూర్చుంటూ అడిగాడు. నవ్వింది శరణ్య ..

“ నాకూ చెప్పవా ఏం డ్రీమ్స్ ... ప్లీజ్ ....”  మొహం అమాయకంగా పెట్టి అతనలా అడుగుతోంటే ఇప్పటిదాకా తను ఆలోచించిన విషయం చెబితే ఎలా ఫీల్ అవుతాడో కదా అనిపించింది.

“ఏం లేదు” అంది నవ్వి.

“కాదు ఏదో ఆలోచిస్తున్నావు చెప్పు ... “

“చెబితే ఏమి అనుకోవుగా ...”

“చెప్పు తల్లి అనుకోను ...” శరణ్య చూపు తిప్పుకుని అలల మీద పడుతున్న కాంతి కిరణాలు చూస్తూ అంది “నువ్వు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావు ..”

తేజ ఆ ప్రశ్నకి ఆమె వైపు తదేకంగా చూసి సన్నగా నవ్వాడు.. “ గాలికి తిరగాలని అనుకుంటున్నాను.”

“ థాంక్స్ ముందే చెప్పావీమాట... అయితే వెంటనే మన పెళ్లి సంగతి మర్చిపో...”

తేజ కొంచెం ముందుకు వంగి కుడి చేయి చాచి టేబుల్ మీద ఉన్న ఆమె కుడి చేయి పట్టుకున్నాడు.

“ఏయ్ ఏంటి ?” కొంచెం తడబడుతూ అంది..

“ఏమి లేదు కంగారు పడకు ... నీ అనుమాన నివృత్తి చేయడం నా బాధ్యత కదా అని చెప్తున్నా ... నువ్వు ఏం చేయమంటే అది చేస్తా సరేనా” ప్రమాణం చేస్తున్నంత ద్రుడంగా అన్నాడు.

ఆ మాటలు సూటిగా ఆమె హృదయాన్ని తాకినట్టుగా అయి అతని చేయి అప్రయత్నంగానే గట్టిగా నొక్కింది. అలా నోక్కడంలో తన అంగీకారం మనస్ఫూర్తిగా తెలియచేసినట్టు అనిపించింది తేజకి. అలాగే ఆమెకి కూడా తేజ అలా చేతి మీద చేయి వేసి చెబుతుంటే మనసా, వాచా, కర్మణా తనని అప్పటికప్పుడు విశాలంగా పరుచుకున్న ఆ నది సాక్షిగా, నది మధ్య అభయం ఇస్తున్నట్టు నిలబడిన బుద్ధుడి సాక్షిగా, పైన తారలతో తళతళలాడుతున్న నింగి  సాక్షిగా అతని జీవితంలోకి నడిపిస్తున్నట్టు అనిపించింది. స్పూన్ తో తన నోటి దగ్గరకు తెచ్చిన అతని చేతిలోని ఐస్ క్రీం పెదాలతో సున్నితంగా అందుకుంది.

అప్పటివరకూ ఎక్కడ  దాక్కున్నాడో దశమి చంద్రుడు నిండుగా నవ్వుతూ దర్శనమిచ్చాడు.

“ఇప్పటివరకూ ఎక్కడ ఉండి మన మాటలు విన్నాడో” ఈయన అన్నాడు తేజ. ఐస్ క్రీం తినడం పూర్తీ చేసి బాగు తీసుకుని లేస్తూ “పద ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడో ఆనవాళ్ళు వెతుకుకుదాం” అంది..

“మనం వెతకడం దీనికి ఏ తారని అడిగినా చెప్తుంది” అన్నాడు తేజ. నవ్వి “ రా అలా ఈ రోడ్డు చివరివరకు అలా నడుచుకుంటూ వెళ్దాం. చాలా హాయిగా ఉంది అంది.

“పద రోడ్డు చివరివరకేం ఖర్మ ఈ ప్రపంచం అంచుల దాకా రమ్మన్నా వస్తాను” అన్నాడు.. అతని చేతి మీద గిల్లింది. 

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్