గత సంచిక లోని నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue247/672/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/
(గత సంచిక తరువాయి)... కీర్తన కామ్ గా లోపలికి వెళ్ళి పోయింది. కాసేపు మామూలు కబుర్లు అయ్యాక.....
‘‘నేను కీర్తనతో కాసేపు మాట్లాడాలి’’ ఆకాష్ అన్నాడు.
ప్రణీత్ ఏదో అనే లోపే...
‘‘నాకు ఎవరి తోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు’’ లోపలి గది లోంచే గట్టిగా అంది కీర్తన.
ఆకాష్ దవడలు బిగించి రోషాన్ని ఆపుకున్నాడు.
‘‘మీరు మాట్లాడుతుండండి. నేనలా మా ఫ్రెండ్స్ ని మీటయి వస్తాను’’ ప్రణీత్ డ్రస్ ఛేంజ్ చేసుకుని వెళ్ళి పోయాడు.
‘‘కీర్తనా....!’’ పిలిచాడు ఆకాష్.
‘‘....’’
‘‘బైటకిరా!.....’’
‘‘నువ్వు రాకపోతే నేనే బెడ్రూంకి వస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్ప లేను’’ చిలిపిగా అన్నాడు.
‘‘.......’’
‘‘సరే నీ కోరిక అదే అయితే, నేను చేయ గలిగింది ఏముంది?’’ లేచి నిలబడి అన్నాడు. గబ గబా బయటకి వచ్చి...‘‘ఏంటి?’’ విసుగ్గా అంది. ఆమెని చూసి ఆశ్చర్య పోయాడు. దానికి కారణం ఆమె చీర కట్టుకోవడమే!
‘‘కూర్చో!’’ చెప్పాడు.
‘‘నాకు నిల్చోవడం బాగానే వుంది. చెప్పండి.’’
‘‘సరే....! నువ్వు చీర కట్టుకున్నావు....చీర కట్టుకుని నీ అందం నిలువునా చూపించాలని ముచ్చట పడి నిల్చున్నావు, సరే చూడటానికి నాకు బాధేమిటి? ఓ.కె’’ నవ్వుని అదిమి పెట్టి అన్నాడు. గబుక్కున సోఫాలో కూర్చుండి పోయి కాళ్ళు పైకి పెట్టుకుని ముడుచుకుని కూర్చుండి పోయింది.
‘‘దట్స్ గుడ్!....చెప్పిన మాట వినాలి.’’
‘‘చెప్పండి.’’
‘‘చెపుతానులే! కంగారు పడకు. ఇంతకీ కిస్ ఇస్తావా? కిల్ చేస్తావా?’’ అడిగాడు.
‘‘కిల్ చేయడమా?’’ అయోమయంగా అంది.
‘‘అదే.....బుజ్జీ!....మొన్నొక సారి అదుగో ఆ బెడ్ రూంలో నన్ను కిల్ చేయ బోయావు కదా....అదీ!’’ నవ్వు దాచుకుంటూ అన్నాడు.
‘‘యూ!...నాతో ఇంకా అలాంటి మాటలేంటి?’’
‘‘చిరాగ్గా!....’’ ఆమె వూత పదాన్ని అందించాడు.
ఏంటో పిచ్చి మనసుకి అంత ద్వేషంలోనూ నవ్వు వచ్చేయ బోయింది.
అమ్మో! నవ్వితే యింకేమయినా వుందా? అయినా యిన్ని అబద్దాలాడి యింత నటన చేసే మనిషితో తనకేంటీ....? అనుకోగానే మళ్ళీ కోపం యధాస్థాయికి చేరింది.
‘‘యిదేనా చెప్పాలనుకున్నారు?’’ కోపంగా అంది.
‘‘కాదు.’’
‘‘మరి?’’
‘‘మన పెళ్ళి గురించి’’ గంభీరంగా అన్నాడు.
‘‘మన పెళ్ళా?’’ అపనమ్మకంగా అంది.
‘‘అవును నీ గేమ్స్ కాగానే ముహూర్తం పెట్టించాలనుకుంటున్నాను, ఇంక భరించే శక్తి నాకు లేదు. నువ్వు ఎవరో ఇంట్లో వుండటం, మన మధ్య ఇంకెవరో గొడవలు సృష్టించడం...నువ్వు అవన్నీ నమ్మి మాట మాటికీ నా మీద చిరాకు పడటం, ఇవన్నీ భరించే ఓపిక నాకు లేదు.’’
‘‘జరగని వాటి గురించి మర్చిపొండి.’’
‘‘ఏంటి జరగనివి?’’
‘‘మన పెళ్ళి జరగదు.’’
‘‘ఏం?’’ తెల్లబోయి అడిగాడు.
‘‘మీ లాగా అబద్దాలాడి ఆడ వాళ్ళ హృదయాన్నిగెల్చుకోవానుకునే వాళ్ళు నాకు నచ్చరు’’ ఖచ్చితంగా అంది.
‘‘మరెవరు నచ్చుతారు?’’ మామూలుగా అడిగాడు.
‘‘ఆ...!’’
‘‘నీ కోసం చేతులూ, కాళ్ళు విరగ్గొట్టుకునే వాళ్ళు నచ్చుతారా?’’ వ్యంగ్యంగా అన్నాడు. అతని మాట పూర్తయిందో లేదో సివంగిలా అతని మీదకి దూకి షర్ట్ గుప్పిళ్ళతో పట్టుకుని ఊపేసింది.
‘‘ఇంకా ఎంత బాధ పెడ్తారు? ఇప్పటికి హింసించింది చాలదా....? ఇప్పటికున్న సుగుణాలకు తోడు ఈ అనుమానం ఒకటా? అసలు మిమ్మల్ని ఎలా ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి? ఈ రోజుతో మనసు మూలలో వున్న కొంచెం ఇష్టం కూడా పోయింది....ప్లీజ్! దయ చేసి నన్ను హింసించకుండా వెళ్ళి పోండి. ఇదే మీరు నాకు చేసే మేలు....’’ ఎన్నాళ్ళ నుంచో బిగ బట్టుకున్న ఏడుపు వుధృతంగా తోసుకుని వచ్చేసింది.
‘‘అయాం సారీ!’’ పశ్చాత్తాపంగా అన్నాడు.
‘‘ఏం వద్దు’’ అతని చేతిని తోసేసింది.
‘‘పొరపాటుగా నిన్నేడిపించాలని అన్నాను.’’
‘‘ఏడిపిస్తారు....అందరికీ నన్ను చూస్తేనే ఏడిపించాలనిపిస్తుంది. ఎందుకో....?’’ ఏడుస్తూనే ఉక్రోషంగా అంది.
‘‘ఏడిస్తే నువ్వు చాలా బావుంటావని కాబోలు....’’ మళ్ళీ స్వింగ్ లోకి వచ్చి అన్నాడు. మింగేసేలా చూసింది. కాసేపు అతను డల్ గా వుండి పోయాడు. తర్వాత ‘‘నీకో విషయం చెప్పాలని వచ్చాను.’’పట్టించుకోనట్లు అటెటో చూస్తూ కూర్చుంది. కానీ మనసు అతను చెప్ప బోయే మాటల మీదే కేంద్రీకరించింది.
‘‘నీ గేమ్స్ అయ్యే లోపు నిన్ను కలవను. ఏ విధం గానూ డిస్టర్బ్ చేయను. మణి బిందు నిన్నేడిపిస్తున్న సంగతి ఇంత ఇష్యూ అయ్యే వరకూ నాకు తెలీదు. ఇక తను నీజోలికి రాదు. నేను ఆ విషయం చూసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా ఆడు.’’
‘‘చాలా సంతోషం....’’ అతను ఆపగానే టక్కున అంది కీర్తన.నవ్వాడు ఆకాష్...
‘‘అమ్మో! ఫర్లేదు, మా కీర్తనకీ మాటలు వచ్చేస్తున్నాయే! వెరీ గుడ్....’’ మెచ్చుకుంటుంటే బిక్క మొహం వేసుకుని చూసింది.
తర్వాత అతను బైటకి వెళ్ళి కార్లోంచి రెండు పిల్లోలు తెచ్చి ఆమె బెడ్ మీద వేసి...
‘‘ఇవి నీకోసం’’ అన్నాడు.
‘‘నాకెందుకు?’’ కోపంగా అంది.
‘రాత్రిళ్ళు నువ్వు ప్రశాంతంగా పడుకోవాలంటే నేనో, బామ్మో వుండాలి. నువ్వా బామ్మ దగ్గరకు వెళ్ళవు, నన్నా రానివ్వవు. అందుకే ఈ రెండు పిల్లోలు. ఒకటి బామ్మ, రెండు నేను. అటొ కరం, ఇటొ కరం వుంటాం కాబట్టి అటూ ఇటూ తిరిగినప్పుడల్లా స్వేచ్ఛగా మా మీద కాళ్ళూ, చేతులూ పడేసుకోవచ్చు’’ కొంటెగా అన్నాడు. మూతి ముడిచింది.
‘‘నేను బయలుదేరుతాను’’ లేచి నిలబడి అన్నాడు. తనూ లేచి నిల్చుంది. దగ్గరగా వచ్చి " టానిక్ ఏం వద్దా?’’ అడిగాడు.
‘‘ఏం టానిక్?’’
(సశేషం) |