Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
love is injurious to life

ఈ సంచికలో >> కథలు >> సాహసం షాయకురా ఢింబకా..

sahasam shaayakuraa dimbakaa

ఇప్పుడు నేను వెళ్లబోతున్న చోటు ఎవ్వరికీ తెలియదు.

విచిత్రమేమిటంటే దీని వివరాలు గూగుల్ మ్యాప్ తో సహా ఎక్కడా దొరకవు. నాకు తెలిసి సర్వే ఆఫ్ ఇండియాకి కూడా తెలిసుండదు.
దీని గురించి నా స్నేహితుడు శ్రీకర్ చెప్పాడు. నాకే ఎందుకు చెప్పాడంటే..

కొందరికి పర్యాటక ప్రదేశాలు చూడ్డం, బంగీ జంపులు చేయడం, నదుల్లో.. సముద్రాల్లో ఈదడంలాంటి అభిరుచులెలా ఉంటాయో, అలాగే నాకు సాహసాలు చేయడం ఇష్టం. జీవితం మూణ్నాళ్ళ ముచ్చట ఒకే రకమైన మూస జీవితం కాకుండా కాస్త కొత్తగా థ్రిల్ పొందుతూ జీవించాలని నా కోరిక. బ్యాచిలర్ని. నాన్నావాళ్లకి ఊళ్ళో పొలాలున్నాయి. మాది కలిగిన కుటుంబం. నేను కష్టపడి సంపాదించి ఆదుకోవాల్సిన అవసరం లేదు. ఏ బాదరబందీ లేనివాణ్ని కాబట్టి జీతంగా అందుకున్న డబ్బు ఎవ్వరూ వెళ్లడానికి సాహసించని ప్రదేశాలకు వెళ్లి ఆ ఆనందాన్ని నా సెల్ కెమెరాలో బంధించుకుంటా. నా సంగతి తెలిసిన శ్రీకర్ ఈ ప్రాంతం గురించి చెప్పాడు.

సాయంత్రం నాలుగుకు రైలు స్టేషన్ లో దిగి అక్కడి నుంచి బస్సెక్కి హై వే రోడ్డు లో దిగేసరికి రాత్రి ఏడున్నర అయింది. అక్కడికి చేరాలంటే రోడ్డు పక్కగా లోపలికంటా ఉన్న కాలినడక దారిలో వెళ్ళాలని ఎవరో శ్రీకర్ కు చెప్పారట. ఎంత దూరమన్నది చెప్పలేదు. నేను ఎంత ప్రయత్నించినా తెలియలేదు. అలాంటి ప్రదేశాలంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. అందుకే శ్రీకర్ కు కూడా చెప్పకుండా ‘అర్జెంట్ పనిమీద ఊరెళుతున్నానని’ ఆఫీసులో చెప్పి లీవ్ పెట్టి బయల్దేరాను.

కృష్ణపక్షం. తెల్లారితే అమావాస్య. భలే ముహూర్తాన బయల్దేరాను. నాకు సెంటిమెంట్లు లేవు అయినా నాకొచ్చిన ఆలోచనకి నవ్వొచ్చింది.  మొక్కలు, పిచ్చి చెట్లతో ఉండే దారిలో ప్రయాణించడానికి అనువుగా తెచ్చుకున్న రబ్బరు బూట్లు పెద్ద బ్యాగ్ లోంచి తీసి వేసుకున్నాను. కొద్దిగా బిస్కట్లు తిని, మంచి నీళ్లు తాగాను (ఎక్కడైనా తప్పిపోతే ఆహారం ఎక్కువ రోజులు కావలసి ఉంటుంది కాబట్టి మితంగా తినడం అలవాటు చేసుకున్నాను). వాతావరణానికి బహిర్గతమైన అవయవాలకి దోమలు కుట్టకుండా ఓడోమాస్ పూసుకున్నాను. టార్చ్ లైట్ తీసి వెలిగించి ముందుకు నడక సాగించాను.

కీచురాళ్ల చప్పుడు, నక్కల ఊలలు, వివిధ జంతువుల చిత్ర విచిత్ర అరుపుల ధ్వనులు మొత్తానికి ఎన్నో అడవి ప్రదేశాలు చూసిన నాకే  క్షణంపాటు భీతావహంగా అన్పించింది. తర్వాత నవ్వొచ్చింది ’నేను కావాలనుకున్నది ఇదే కదా’ అనుకుని. నడుస్తున్నాను.. నడుస్తున్నాను...  నడుస్తున్నాను. స్టేషన్లో ఉన్నప్పుడే బ్యాగ్ లో తెచ్చుకున్న ఎనర్జీ డ్రింక్ తాగడం వల్ల అలుపు అనిపించడం లేదు, కాని ఏదో ఒకలాంటి చెప్పలేని అశక్తత శరీరాన్ని ఆవహిస్తోంది. టార్చ్ నోటితో పట్టుకుని బ్యాగ్ తెరచి నీళ్ళ సీసా తీసి, టార్చ్ ను రెండు మోకాళ్ల మధ్యనా ఉంచి, కొన్ని నీళ్లు ముఖం మీద చిలకరించుకుని, కాసిని తాగి చేతికున్న వాచ్ లో టైం చూశాను.

పావు తక్కువ పన్నెండు.

మళ్ళీ నడక సాగించాను. కాలికేదో తగిలింది రాయనుకున్నాను..కాని అది కాస్త పెద్దదిగా ఉండడం, అంత బరువనిపించకపోవడంతో టార్చ్ అటువైపు వేసి చూస్తే ఒళ్లు జలదరించింది. అది పుఱ్ఱె. దానికి అక్కడక్కడ చర్మం, బయటకి పొడుచుకొచ్చిన కనుగుడ్డుంది. ఈ స్థలమే ఎవరికీ తెలియదన్నారు. ఇప్పటిదాకా ఎక్కడా మానవ సంచారం కనిపించలేదు. అలాంటిది ఇక్కడో మానవ పుఱ్ఱే ఉందంటే..కొంపదీసి నరమాంస భక్షకులు లేరుకదా? వాళ్లు ఒకరినొకరు పొట్లాటలతో చంపుకోలేదు కదా!

ఆలోచిస్తూ ముందుకు నడుస్తున్న నాకు అక్కడొకటి ఇక్కడొకటిగా పుఱ్ఱెలు కాలికి తగుల్తూనే ఉన్నాయి. కొంతదూరం నడిచాక కొండ కనిపించింది. మరీ ఎత్తుగా లేదు కాని, ఓ మోస్తారు ఎత్తుగా ఉంది. నేను దాని దాపులకు వెళ్లి పరీక్షగా చూడసాగాను. కొండకున్న ఒక నెర్రెలోంచి కాస్త మంట కనిపించింది. అంటే లోపల ఎవరో ఉన్నారన్నమాట. వాళ్ళే నరమాంస భక్షకులు అయివుంటారు! ఏమో చూడాలి.
అన్ని వైపులా పరీక్షిస్తూ ముందుకు నడుస్తుంటే ఒక చోట కొండలోపలి గుహలోకి వెళ్ళే మార్గం కనిపించింది. నా అదృష్టం ఇంత అద్భుతంగా ఉందని నాకు తెలియదు. ‘లోపలికెళ్లి అక్కడెవరున్నా ఉంటే ఫోటో తీసి భద్రపరచుకుంటే..’అప్పటిదాకా కాస్త భయపెట్టిన వాతావరణం ఇప్పుడు నాలో ఉత్సాహం రేపింది.

నేను లోపలికి అడుగెట్టగానే, ప్రవేశించిన ద్వారం ఎవరో పెద్ద బండ రాయితో మూసినట్టు మూసుకుపోయింది.

నా పై ప్రాణాలు పైకే పోయాయి. హడావుడిగా ముందుకు నడిచాను.

కొద్దిదూరం పోయాక పెరిగిన జుత్తు, గడ్డాలతో, శరీరంపైన ఆచ్చాదన సైతం లేకుండా ఓ అగ్నికుండం చుట్టూ కూర్చుని ఏవో మంత్రాలు నిశ్శబ్దంగా ఉచ్ఛరిస్తున్నారు. ఒంటి నిండా పూసుకున్నట్టున్న విబూది. బహుశా వాళ్లు అఘోరాలేమో?

నాకు భయంతో మిడిగుడ్లు పడిపోయాయి. నోరు పిడచకట్టుకు పోతోంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో ఇద్దరు దిగంబరులు బలిష్ఠంగా ఉన్నారు. నన్ను పెడరెక్కలు విరిచి పట్టుకుని అక్కడికి కొద్ది దూరంలో ఉన్న ఓ రాటకి నేను పెనుగులాడుతున్నా బలవంతంగా మఱ్ఱి ఊడలతో కట్టేశారు.

ఒకాయన ఏడడుగులు ఉంటాడు. నా దగ్గరగా వచ్చాడు. శవ దహనానంతరం పూసుకున్న విబూదనుకుంటా వాసన గుప్పుమంది. నా వంక తీక్షణంగా చూసి, కొన్ని క్షణాల తర్వాత  చూపుల్లో కారుణ్యం ఒలకబోస్తూ ’అయ్యా, మేము త్రిశంకు వంశస్థులం. ఆయన కోసం విశ్వామిత్రుడు పైలోకంలో త్రిశంకు స్వర్గం నిర్మించి, ఆయన్ని అక్కడికి బొందితో పంపాడన్న కథ మీకు తెలుసు. మేము విశ్వమిత్రుడు తపస్సు చేసిన ప్రదేశాలు కనుక్కుని ఎంతో కష్టపడి ఆ రహస్య తాళపత్రాలు సంపాదించాం. కొన్ని వందల ఏళ్లుగా ఇలా హోమం చేస్తున్నాం. తనంతట తానుగా అమావాస్య రోజుల్లో ఇక్కడికి వచ్చే వ్యక్తిని అగ్నికి ఆహుతి చేస్తే మేమూ త్రిశంకుడు ఉండే స్వర్గానికి వెళ్లి అక్కడ ఆయణ్ను కలవచ్చు, అమర సుఖాలు అందొచ్చు. ఇప్పటిదాకా ఎంతో మందిని ఆహుతిచ్చాం. ఎందుకో స్వర్గానికి చేరలేకపోయాం. ఇప్పుడు వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైంది. ఇలాంటిది ఎన్నో సంవత్సరాలకు గాని రాదు. ఈసారన్నా మాకు స్వర్గానికి చేరే అవకాశం రావాలి. లేకపోతే అగ్ని మమ్మల్ని దహించేస్తుంది. ఇన్నాళ్ల మా శ్రమ బూడిదవుతుంది. అందుకే ఎంతో నిష్ఠగా కార్యం చేశాం. నీ అంతట నీవే ఎవరో పంపినట్టు ఇక్కడికి వచ్చావు. ఇది మాకు శుభ సూచకం. రాబోయే రాత్రి కటిక అమవాస్య చీకట్లో నువ్వు అగ్ని వెలుగులో అంతర్ధానమవుతావు. మేము స్వర్గస్థులమవుతాము’ అని అగ్ని దగ్గర మంత్రాలు చదువుతున్న వాళ్ల దగ్గరకు వెళ్లి ఏదో చెప్పాడు. వాళ్లు ఆనందంగా లేచారు. అందరూ ఒక్క సారిగా మాయమయిపోయారు. లిప్తపాటు కాలంలో ఎక్కడికెళ్ళారో? అసలిలాంటి వాళ్లున్నారంటే ఎవ్వరూ నమ్మరు. అభూత కల్పన అని కొట్టిపారేస్తారు. అయినా చెప్పడానికి నేను బతికుంటే కదా!

నా కాళ్ళూ చేతులూ మఱ్ఱి ఊడల రాపిడికి ఒరుసుకుపోయి మంటగా ఉన్నాయి. రేపటి రాత్రిని తల్చుకుంటే వెన్ను జలదరిస్తోంది. ఎక్కడ పుట్టాను. ఎక్కడ పెరిగాను. చివరికి నా అభిరుచి తెచ్చిన మృత్యువుతో ఇక్కడి నిర్మాణుష్య ప్రదేశంలో ప్రాణం కోల్పోతున్నాను.
అమ్మా నాన్నలకే కాదు ఎవ్వరికీ నేనిక్కడ అనాధలా మరణిస్తున్న సంగతి తెలీదు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.
తెల్లవారినట్టుంది. కాస్త వెలుగు కనిపించింది. ఎవరైనా వచ్చి రక్షిస్తే బాగుండును. ఎలా వస్తారు? మానవ మాత్రుడికి తెలియని ప్రదేశం ఇది. అలాంటిదనేగా ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయింది. దాహం వేస్తోంది. అన్నట్టు బ్యాగేది? నన్ను ఈడ్చుకొచ్చిన వాళ్లు ఎక్కడో విసిరేసి ఉంటారు. ప్చ్..

‘రేపుదయానికి నేనుండను’ అన్నది మనసులో మెదిలే సరికి ఒంట్లోని రక్తం ఎవరో పీల్చినట్టుగా నిస్త్రాణగా అయిపోయాను.
ఎంత సేపయిందో తెలీదు..నాకు యుగాలు గడుస్తున్నట్టుంది. సమయం గడుస్తున్నకొద్దీ నేను అగ్ని కుండానికి దగ్గరవుతున్నట్టనిపిస్తోంది.
కొండ పైన హెలికాప్టర్ వెళుతున్న శబ్దాలు వినిపించాయి. నేను ప్రాణం మీద ఆశతో గొంతు చించుకుని గట్టిగా అరిచాను "రక్షించండీ..రక్షించండీ"అని. నా పిచ్చి కాని ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న వాళ్లకి ఆ హెలికాప్టర్ శబ్దంలో నా అరుపు వినిపిస్తుందా? అందులో ఉన్నవాళ్లు ఊహించను కూడా ఊహించరు ఇక్కడ కొండ గుహలో ఒకడు మృత్యువుకు దగ్గరవుతున్నాడని.
చాలా సేపు గడిచిపోయింది.

కొండకి దగ్గర్లో హెలికాప్టర్లు ఆగాయి.

భగవంతుడా.. వాళ్లు ఎందుకొచ్చారో తెలియదు..కానీ ఇక్కడికొచ్చి నన్ను రక్షించేలా చేయి..

మరికొంత సేపటికి కొండరాళ్ల మీద బూట్ల శబ్దం వినిపిస్తోంది. నా గుండె కొట్టుకోవడం కూడా మరింత వేగమైంది. నేను గట్టిగా..పిచ్చిగా అరవడం..కేకలేయడం మొదలెట్టాను. అందరూ నా దగ్గరకు గన్లతో వచ్చి నన్ను చుట్టు ముట్టి నాకు గురిపెట్టారు. నేను కట్టేసి ఉన్నానని తెలుసుకుని నా కట్లు విప్పి ‘ఇక్కడికి ఎలా వచ్చావు. నిన్ను ఎవరు కట్టేసార’ని అడిగారు. నా ప్రాణాలు దక్కాయన్న ఆనందం నాది. కళ్ళ నుంచి నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. వాళ్ల కాళ్ళు పట్టేసుకున్నాను. గట్టిగా కౌగిలించేసుకున్నాను. ఏం చేస్తున్నానో కూడా తెలియడం లేదు. నేను పొందుతున్న ఆనందం అంతా ఇంతా కాదు. మృత్యు ముఖానికి వెళ్లి తిరిగొచ్చేశాను. నాకిది పునర్జన్మ. నా అంత అదృష్టవంతుడు మరొకడుండడు.

నన్ను వాళ్లు హెలికాప్టర్ లో తీసుకెళుతుంటే, అసంకల్పితంగా కిందకు చూసిన నాకు ప్రతి చెట్టు చాటునా ఒక్కో సాధువు కనిపించాడు..అందరి ముఖాల్లో ఒకే ని..రా..శ..

ఆ ప్రాంతంలో నక్సలైట్లు ఉండి ఉండొచ్చని అనుమానం రావడంతో జల్లెడ పట్టడానికి స్పెషల్ టాస్క్ మీద అక్కడికి వచ్చార్ట..వాళ్లు చెప్పారు. నన్నెవరు కట్టేశారని పదే పదే అడిగారు. నేను నోరు విప్పలేదు. కారణం అది వాళ్లు నమ్మరు. వాళ్లు మాత్రం నన్ను నక్సలైట్లు కిడ్నాప్ చేసి అక్కడ కట్టేశారనుకుంటున్నారు. రక రకాల ప్రశ్నలు వేస్తున్నారు. నా మనసులోని ఆందోళన ఇంకా తగ్గుముఖం పట్టలేదు. గుండె కొట్టుకునే వేగం సాధారణ స్థాయికి రాలేదు.

*****

ఆ తర్వాత మా ఊరికి వెళ్లాలన్నా నేను ఎవరో ఒకరు తోడు లేకుండా వెళ్లడం లేదు. నిజం.

*****

మరిన్ని కథలు