Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi?

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి...http://www.gotelugu.com/issue255/688/telugu-serials/anveshana/anveshana/ ఆమె పిచ్చి చేష్టలు  ఓర కంట కనిపెడుతున్న వర్తకులు ఒక్క సారే ఆశ్చర్యంగా చూసారు. గంగ ధార్ర లో స్నానాలు చేసి వచ్చిన భక్తులు దర్శనానికి వెళ్తూ ఒక్క సారే ఫక్కున నవ్విన నవ్వుకి ఉలిక్కి పడి తలలు త్రిప్పి ఆమె కేసి చూసారు.

సరిగ్గా అదే సమయానికి కేశ ఖండన శాలలో నుండి వస్తున్న ఒక ఆజాను బాహుడైన వ్యక్తి టక్కున ఆగి పిచ్చిగా  నవ్వుతున్న ఆమె కేసి పరీక్షగా చూసాడు. నవ్వుతూ... నవ్వుతూ ఉన్నట్టుండి తల బాదుకొని ఏడుస్తున్న ఆమెని చూసి అదిరి పడ్డాడు.

ఉదయం నుండి ఆమె కోసమే వెదుకుతున్న అతను గబుక్కున జేబులో నుండి పర్సు తీసి అందులో ఉన్న ఫోటో తీసి ఎవరూ చూడకుండా అర చేతిలో దాచుకుని మరో సారి ఆమెని ఆ ఫొటోని పదే పదే పరిశీలనగా చూసుకున్నాడు. ఉన్నట్టుండి ఏడుపు ఆపేసి పక పకా నవ్వుతూ...నవ్వుతూ ఒక్క సారే అందరూ తననే గమనిస్తున్నారని అనుకుందో...ఏమో....టక్కున నవ్వు ఆపేసి భుజాన ఉన్న బ్యాగ్‌ రెండో భుజానికి మార్చుకుని అక్కడ నుండి చక చకా దేవాలయం కేసి నడక సాగించింది.

ఆమె అలా కదలగానే అతను గాబరాగా మెట్లు దిగి ఆమె వెళ్లి పోతున్న దిక్కు చూసాడు. భక్తుల సందోహంలో ఆమె కలిసి పోయి ముందుకు సాగి పోతుంటే ఆమెనే గమనిస్తూ అతను భక్తులను తోసుకుంటూ  గబ గబా అనుసరించాడు. కను చూపు మేరలో ఆమెనే అనుసరిస్తూ అడ్డొస్తున్న భక్తుల్ని నెట్టుకుంటూ నడుస్తున్నాడు.

ఆమె దేవాలయం ముందరున్న గాలి గోపురం దగ్గరకు వెళ్ళి నిలబడి రెండు చేతు జోడించి లోన గర్భాలయంలో కొలువై ఉన్న సింహాద్రి నాధునికి నమస్కారం చేసింది. దూరంగా నిలబడి ఆమె ప్రతి కదలికను గమనిస్తూ  జేబులోనుండి సెల్‌ ఫోన్‌ తీసాడు అతను
చక చకా ఫోన్‌లో నెంబర్లు నొక్కాడు. సెల్‌ ఫోన్‌ చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఎలాంటి శబ్దమూ లేదు. సెల్‌ ఫోన్‌కి సిగ్నల్స్‌ అందటం లేదు. విసుగ్గా పదే పదే సెల్‌ చెవి దగ్గర పెట్టుకుని మనసులోనే తిట్టుకున్నాడు అతను.

‘‘సార్‌! గుడి దగ్గరలో సెల్‌ఫోన్‌లు పని చెయ్యవు. కొండ బస్సు స్టాండ్‌ దగ్గరకు వెళ్తే గాని సిగ్నల్స్‌ రావు. ఇక్కడ ‘జామర్‌’ ఏర్పాటు చేసారు.’’ అతని అవస్థ చూసి దారిన పోతున్న దేవస్థానం ఉద్యోగి అతని భుజం తట్టి మరీ చెప్పాడు.

‘‘ఓహో! అలాగా సార్‌!’’ అంటూనే అతను సెల్‌ జేబులో పెట్టుకుని తనింత వరకూ అనుసరించి వచ్చిన ఆమె కోసం కళ్ల తోనే వెదుకుతూ గాలి గోపురం కేసి చూసాడు.

అప్పటి వరకూ గాలి గోపురం దగ్గర నిలబడి గర్భాలయంలో ఉన్న సింహాద్రి నాధుడికి నమస్కరించుకున్న ఆమె అక్కడ కనిపించక పోయే సరికి అతను అదిరి పడ్డాడు.

గబ గబా జనాల్ని చీల్చుకుంటూ గాలి గోపురం దగ్గరకు చేరుకున్నాడు. గుడిలో దర్శనం చేసుకుని వెళ్ళి పోతున్న వాళ్ళు నేరుగా క్రిందకు దిగి కొండ బస్సు స్టాండ్‌కు చేరుకుంటున్నారు. గాలి గోపురం ముందరే నిలబడి ఆమె కోసం గుంపులు గుంపులుగా నడిచి వెళ్లి పోతున్న భక్తుల కేసి చూసాడు అతను.

ఆమె జనాల్లో కలిసి పోయింది. కను చూపు మేర ఎక్కడా ఆమె జాడ లేదు. గుంపులు గుంపులుగా భక్తులే తరలి వెళ్ళి పోతున్నారు.
ఒక్క సారే ఆందోళనగా ఆమెని వెతుక్కుంటూ గాబరాగా భక్తులను తోసుకుంటూ దేవాలయం దగ్గర నుండి కొండ బస్సు స్టాండ్‌కు చేరుకున్నాడు. ఆమె కోసమే తానిన్నాళ్ళూ వెదుకుతూ తిరుగుతున్నాడు. కనిపించినంత లోనే కనుమరుగయ్యింది. ఇంతలో వింతగా ఎలా మాయమై పోయిందో? అనుకుంటూ ఆతృతగా వెతుకుతూ తిరుగుతున్నాడు.

బస్సు స్టాండ్‌కు చేరువలోనే దేవాలయం అన్నదాన సత్రం ఉంది. దేవుడి దర్శనాలు చేసుకున్న భక్తులు అన్న దానంలో భోజనానికి క్యూలో నిలబడుతున్నారు.

కొండ బస్సు స్టాండ్‌ లో నిలబడి చుట్టూ పరికించి చూసాడు అతను. భక్తుల సందోహంలో ‘ఆమె’ ఎటు వెళ్లిందో కనుక్కో లేక పోతున్నాడు. ఆతృతగా అన్న దానం క్యూ లైన్ల లో వెదికాడు.

భక్తులు కొందరు కొండ మెట్లంబట నడుచుకుంటూ క్రిందకు దిగి వెళ్లి పోతున్నారు. మరి కొందరు బస్సు స్టాండ్‌లో బస్సు ఎక్కడానికి నిరీక్షిస్తున్నారు. కొందరు అన్నదాన సత్రం దగ్గర క్యూలో ఉన్నారు. ఎక్కువ మంది కొండ బస్సు స్టాండ్‌లో ఉన్న ఫేన్సీ దుకాణాల్లో....ఫొటో దుకాణాల్లో...శనగలు, ఖర్జూరాలు అమ్మే దుకాణాల్లో పోగయి ఉన్నారు.

‘ఆమె కోసం ఎక్కడని వెతకను? చిక్కినట్టే చిక్కి చేజారిన ఆమెని కని పెట్టి మట్టు పెట్టడమే తన విధి. ఎలా? ఎటు వెళ్లింది?!’ మనసులోనే తర్జన భర్జన పడ్డాడు అతను.

ఇంతలో అతని జేబులో సెల్‌ రింగయింది.సెల్‌ రింగ్‌ వినగానే ఉలిక్కి పడ్డాడు. భయం భయం గానే సెల్‌ తీసాడు. తనే ముందు ఫోన్‌ చేసి ఉండాల్సింది. అనుకుంటూనే ఫోన్‌ చెవి దగ్గర పెట్టుకున్నాడు.

‘‘హలో’’ లో గొంతులో అన్నాడు.

‘‘కనిపించిందా?’’ అట్నుండి కటువుగా విన్పించింది.

‘‘కనిపించింది....కనిపించి....’’ నసుగుతూ అన్నాడు. అంటూనే చుట్టూ పరికించాడు. ఆమె జాడ కాన రాలేదు. తన జాడ కూడా ఎవరూ పసిగట్టకూడదనుకుంటూ భక్తులు పలుచగా ఉన్న ప్రాంతం కేసి నడుచుకుంటూ వెళ్ళి నిలబడ్డాడు.

‘‘కనిపించి....ఏమైంది?’’ మరింత కటువుగా వినిపించింది అవత్ల్నుండి.

‘‘ఇక్కడే....ఎక్కడో.....జనాల్లో కలిసి పోయింది బాస్‌...కనిపెడతాను...కనిపెట్టి పట్టుకుంటాను.’’ స్థిరంగా అన్నాడతను.

‘‘పట్టుకోవడం కాదు. మట్టు బెట్టాలి. ఈ రాత్రికే పని ముగించాలి. సమ్‌జే.’’ అట్నుండి అంతే స్థిరంగా ఆర్డర్‌ విన్పించింది అతనికి.

‘‘ఎస్‌ బాస్‌.’’ అన్నాడు. అంతే! ఫోన్‌ కట్టయింది. సెల్‌ జేబులో పెట్టుకుంటూ కోపంతో ఒక్క సారే క్రూరంగా మారి పోయాడు అతను.

‘‘ఈ రాత్రికి ఎలాగైనా ‘ఆమె’ని హతమార్చాలి. ఎలాగైనా పని ముగించాలి.’’ కసిగా పళ్ళు పట పటా కొరుక్కుంటూ కోపంతో ఆమె ఆచూకీ కోసం ఆవేశంగా పిచ్చి వాడిలా అటూ ఇటూ పరుగులెడుతూ తిరిగాడు. మనసులో తనని తానే తిట్టుకుంటూ అన్నదానం భవనం కేసి చూస్తూ అయోమయంగా నిస్సత్తువతో నిలబడి పోయాడు అతను.

****************************

సాయంత్రం అవుతోంది.

శీతాకాలం వలన ఆరో గంటకే చీకటి చిక్క బడుతోంది. ఉదయం నుండి ఆలయ పరిసరాల్లో తిరిగి తిరిగి అలసి పోయిన ఆమె అలసటగా మెట్ల దారిలో అన్నదాన భవనం ప్రక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టు చుట్టూ కట్టిన సిమ్మెంటు చప్టా మీద చతికిలబడింది.

భక్తులు దర్శనాలు ముగించుకుని పెక్కుమంది బస్సుల్లోనూ, కొద్ది మంది కాలి నడకన తండోప తండాలుగా కొండ దిగి వెళ్లి పోతున్నారు.
చెట్టు క్రింద కూర్చుందే గాని చలికి తట్టుకో లేక పోతోంది ఆమె. భుజాన ఉన్న బ్యాగ్‌ తీసి తన ప్రక్కనే పెట్టుకుని బ్యాగ్‌కు ఉన్న నెంబర్‌ తాళం తెరవడానికి క్షణం ఆలోచిస్తూ నెంబర్లు తిప్పింది. మూడు నెంబర్లున్న తాళం కోడ్‌ గుర్తు చేసుకుంటూ బ్యాగ్‌ తాళం తెరిచి అందులో ఉన్న శాలువా బయటకు తీసింది.

యథాలాపంగా నెంబర్లు అన్నీ చక చకా మార్చేసి బ్యాగ్‌ తాళం వేసింది ఆమె. భుజాల మీదుగా శాలువా కప్పుకుని చెట్టుకు చేరగిల బడి కూర్చుంది.

చలికి ఒణికి పోతూ కూర్చున్న ఆమె కొద్ది దూరంలో ఒక ముసలమ్మ కాళ్ళు ముడుచుకుని గజ గజా వణికి పోతూ బొంగరంలా పడుకున్న తీరు చూసింది. చివుక్కు మంది ఆమె మనసు.

గబాలున లేచి ఆ ముసలమ్మ దగ్గరకు వెళ్లింది. తను కప్పుకున్న శాలువ తీసి ఆ ముసలమ్మ మీద కప్పింది.

వెను దిరిగి చెట్టు దగ్గరకు వచ్చింది. కడుపులో ఆకలి దంచేస్తోంది. బ్యాగ్‌ భుజాన తగిలించుకుని చలికి వణుకుతునే మెట్లెక్కి కొండ బస్సు స్టాండ్‌ దగ్గరకు వెళ్ళింది.

అక్కడ వరుసగా ఉన్న దుకాణాలన్నీ వెతుక్కుంటూ ఓ కిరాణా కొట్టు దగ్గర ఆగి రొట్టె, జామ్‌ కొనుక్కుంది. బ్యాగ్‌ సైడ్‌ జిప్‌లో ఉన్న చిన్న బ్యాగ్‌ తీసి రెండువేల రూపాయల నోటు ఇచ్చింది.

దుకాణం యజమాని ఆమె దిక్కు ఎగాదిగా చూసి... నోటు కేసి పది మార్లు చూసుకుని చిల్లర లేదని తిరిగి ఇచ్చేసాడు. ఇంతలో ప్రక్క షాపులో కూర్చున్న ఇద్దరు యువకులు ఆమెని చూస్తూనే కిరాణా దుకాణం దగ్గరకు వచ్చారు.‘‘నేను చిల్లర ఇస్తానివ్వండి.’’ అంటూ ఆమె చేతిలో నోటు తీసుకుని చిన్నగా ఫోజు కొడుతూ ఆమెకేసి  ఓరగా చూసాడు ఒక యువకుడు.ఆమె ఆ యువకుడి కేసి తలెత్తి కూడా చూడలేదు. రొట్టె, జామ్‌ ప్యాకెట్టు పట్టుకుని నిలబడింది.

‘‘మరో రొట్టె, జామ్‌ ప్యాకెట్టు ఇవ్వండి.’’ అని కిరాణా షాపు యజమానిని అడిగింది ఆమె.

ఆమె కంఠ స్వరం వింటూంటే వీణ మీటినట్లుంది. రెండు వేల రూపాయల నోటుకు ఇరవై వంద నోట్లు ఇస్తూ ఆమె చేతిని కావానే తాకాడు ఆ యువకుడు.

ఆమె చివ్వున తల ఎత్తి చురుగ్గా ఆ యువకుడి కేసి చూసింది. ఆమె అలా చూసే సరికి క్షణం తడబడ్డాడా యువకుడు. కానీ, ఆమె ముగ్ధ మోహన రూపాన్ని చూసి చలించి పోయారు యువకులు ఇద్దరూ.

ఆమె రొట్టెలు రెండు, జామ్‌ ప్యాకెట్లు రెండు పట్టుకుని తిరిగి మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి పోయింది.

యువకులు ఇద్దరూ ఆమె వెంటే వెళ్లారు. ఆమె మర్రి చెట్టు దగ్గరకు వెళ్లడం గమనించి వెనుదిరిగారు.

ఒక రొట్టెను మధ్యలో విరిచి జామ్‌ రాసి కొద్ది దూరంలో పడుకున్న ముసలమ్మ దగ్గరకు వెళ్లింది ఆమె. తాను కప్పిన శాలువా తీసి ఆ ముసలమ్మను తట్టి లేపింది.

‘‘అమ్మా! ఈ రొట్టె తినమ్మా.’’ అంటూ చేతిలో వున్న రొట్టె ఆ ముసలమ్మకి ఇచ్చింది ఆమె.

‘‘ఎందుకు తల్లీ నీకీ శ్రమ.’’ అంటూనే  ముసలమ్మ ఆమె చేతిలో రొట్టె తీసుకుని ఆమె కేసి చూసింది.

‘‘ఇంకా కావాలా అమ్మా?’’ అడిగింది ఆమె. ముసలమ్మ ఆమె కేసి ఆసక్తిగా చూస్తుండి పోయింది.

‘‘అమ్మా! నువ్వేనా అమ్మా! నువ్వే నా తల్లి’’ ఆనందంగా అంది ముసలమ్మ.

ముసలమ్మ ఏమంటోందో ఆమెకి అర్ధం కాలేదు.

(ఈ సస్పెన్స్ వచ్చే శుక్రవారం దాకా........)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్