Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope fmarch9th to march 15th

ఈ సంచికలో >> శీర్షికలు >>

అర్థంగాని విషయం - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

dont understand

అప్పట్లో నేను ఈ సి ఐ ఎల్ దగ్గరున్న చర్లపల్లిలోని ఒక సంస్థలో పనిచేస్తుండేవాణ్ని. సాయంత్రం 5 గం. లకు ఆఫీసు అయిపోగానే సంస్థ వ్యాన్లో ఉద్యోగులమందరం ఈ సి ఐ ఎల్ చేరేవాళ్లం. అక్కడ నుంచి ఆర్ టీ సీ బస్సులెక్కి ఎవరిళ్లకి వాళ్లం వెళ్లేవాళ్లం. నా అదృష్టంకొద్దీ గం. 5.45 ని. లకు ఈ సి ఐ ఎల్ నుంచి సికింద్రాబాదుకు నాన్ స్టాప్ బస్సొకటి ఉండేది. నేను గనక ఆ బస్ ఎక్కగలిగితే చాలా తొందరగా ఇంటికి చేరుకునే వాణ్ని. అందుచేత వ్యాన్ దిగుతూనే బస్ చూసుకునేవాణ్ని. ఉందా, ధనుస్సు వదిలిన శరంలా రివ్వున దూసుకెళ్లి బస్ లో కూర్చునేవాణ్ని. ఒకనాటి సాయంకాలం అలాగే పరిగెత్తుకు వెళ్లి బస్ లో కూర్చున్నాను. నలుగురైదుగురు ఉన్నారు. నేను వారపత్రిక చదవడం మొదలెట్టాను. బస్ స్టార్ట్ అయి వేగాన్నందుకుంది. నేను పుస్తకం మూసి అలర్ట్ అయ్యాను కారణం-అప్పుడు మేము రామక్రిష్ణాపురంలో ఉండేవాళ్లం. ఇప్పుడంటే రైల్వే గేటు మీద ఫ్లై ఓవర్ కట్టారుగాని, అప్పట్లో గేటు వేశారంటే గంటలే. నా లక్ కొద్దీ గేటూ మూసిలేదు. బస్ వేగాన్ని కొద్దిగా తగ్గించి పట్టాలు దాటుతోంది. నేను అప్పటికే బస్ డోర్ దగ్గరకు వచ్చి నుంచున్నాను కాబట్టి్, బస్ కాస్త స్లో అవంగానే రన్నింగ్ లోనే దిగిపోయాను (రన్నింగ్ బస్లోంచి దిగడం ప్రమాదం. దయచేసి ఎవరూ అలా దిగవద్దు. అప్పట్లో అలాంటి రిస్క్ లు ఎలా తీసుకున్నానో!). దిగంగానే వెనక జేబులోని పర్స్ ని తడిమి చూసుకుంటే, లేదు. గుండె ఆగిపోయింది. దాన్లో నూటయాభై రూపాయలు(అప్పట్లో అది ఎక్కువే), పార్ట్ టైం చదువుతున్నాను కాబట్టి కాలేజ్ ఐడెంటిటీ కార్డ్, ముఖ్యమైన విషయాలు నమోదు చేసిన రెండు, మూడు కాగితాలున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ పర్స్ నాకు సెంటిమెంట్.

వెంటనే నా పక్క నుంచి వెళుతున్న ఓ బైక్ అతనికి ఆందోళనతో క్లుప్తంగా, గబ గబ విషయం చెప్పి ఆ బస్ ను వెంబడించాలని, రిక్వెష్ట్ చేశాను. అతనేమనుకున్నాడో ’ఎక్కండి’ అన్నాడు. నేను థాంక్స్ చెప్పి అతని వెనక కూర్చున్నాను. అతను అమిత వేగంగా బండితో బస్ ను వెంబడించాడు. అదేమో బస్సు, ఇదేమో బైక్. బస్ ను అందుకోవడం చాలా చాలా కష్టమైంది. ఎట్టకేలకు వై ఎమ్ సి ఎ (సికింద్రాబాదుకు కొద్ది దూరం) దగ్గర బస్ ను పట్టుకోగలిగాం. ’సార్! నేను అల్వాల్ వెళ్లాలి. మీకు సహాయం చేద్దామని ఇక్కడిదాకా వచ్చాను’ అన్నాడు. ‘మంచితనం ఇంకా పచ్చగా ఉంది’ మనసులో అనుకుంటూ అతనికి కృతజ్ఞతలు చెప్పి, ఆ బస్ ఎక్కాను. బస్ లో నలుగురు ఉన్నారు. నేనిందాక కూర్చున్న సీట్ దగ్గరకెళ్లి వెతుక్కోసాగాను. అక్కడే కూర్చున్న ఒకతనికి సుమారుగా నలభై ఏళ్ళుంటాయి, మనిషి కాస్త బలంగానే ఉన్నాడు ’ఏంటి వెతుకుతున్నావ్’ అన్నాడు. నేను పర్స్ పోయిన విషయం చెప్పి, వెతుక్కోసాగాను. ‘నేను ఈ సి ఐ ఎల్ నుంచి ఇక్కడే కూర్చున్నాను, నువ్విక్కడ వెతుకుతున్నావేంటి?’ అడిగాడు చిరాగ్గా ముఖం పెట్టి. ’సార్, నేను ఈ సీట్లోనే కూర్చున్నాను. మీరు నా పక్కన కూర్చున్నారేమో నేను గమనించలేదు’ అన్నాను. ’అరే, నేను అప్పటినుంచి ఇక్కడే కూర్చున్నాను, నువ్వు కూర్చున్నానంటావేమిటి?’ కాస్త కటువుగానే అన్నాడు. ’నేను రోజూ ఇదే బస్ లో వెళతాను సార్, ఇక్కడే కూర్చుని’ అన్నాను. ‘చెబితే వినవేంటి? నేనే కూర్చున్నాను అంటే. ఇప్పుడు నీ పర్స్ కనబడకపోతే నేను తీసినట్టా?’ కోపంగా గద్దించాడు. ’అలా అని నేనన్నానా?’ అని పర్స్ వెతుక్కోవడంలో నిమగ్నమయ్యాను.

బస్సు సంగీత్ స్టాప్ లో ఆగింది. అతను దిగడానికి లేచి ’నన్ను చెక్ చేసుకుంటావా?’ అన్నాడు.

అసలే పర్స్ దొరకలేదన్న బెంగతో నేనున్నాను. ‘అవసరం లేదు. పైన భగవంతుడున్నాడు. ఆయన చూసుకుంటాడు.’ అన్నాను.
అతను విసురుగా దిగిపోయాడు.

అప్పటిదాకా పన్నెత్తి మాట్లాడని బస్ లోని వాళ్లు అతను దిగంగానే ‘అతనే తీసుంటాడండి. లేకపోతే మాకెవ్వరికీ లేని ఉలుకు అతనికెందుకు? మీరు అతని దగ్గర వెతికి ఉండాల్సింది. దొరికేది’ అన్నారు.

’జరిగిందేదో జరిగిపోయింది. పోన్లేండి’అన్నాను విచారంగా.

అదే బస్ మళ్లీ ఈ సి ఐ ఎల్ కి వెళుతుందని తెలియడంతో, అలాగే కూర్చుని ఇంటికొచ్చేశాను. మనసు కాస్త నెమ్మదించాక..‘అవునూ, బస్ దిగిన వెంటనే, ఛేజ్ చేసి ఎక్కాను. పర్స్ దొరకలేదు. ఒకవేళ ఆఫీసు నుంచి ఈ సి ఐ ఎల్ దాకా వచ్చిన కంపెనీ వ్యాన్ లో పర్స్ పడి పోయిందేమో’ అన్న ఆలోచన మళ్లీ నాకు ఉత్సాహాన్నిచ్చింది.

గబగబ ఇంటికి వెళ్లి మా నాన్నగారి స్కూటర్ తీసుకుని ఆఫీసుకెళ్లాను. ఆఫీసు గేటుకు కొద్దిదూరంలో పార్క్ చేసున్న వ్యాన్ దగ్గరకెళ్లి, అక్కడే ఉన్న డ్రైవర్ రెడ్డికి విషయం చెప్పి, లాక్ తీయించి లోపల అణువణువూ గాలించాను. ప్చ్. దొరకలేదు. నిరాశగా బయటకొచ్చి నా స్కూటర్ స్టార్ట్ చేయబోతుంటే, ’ఏంటి సార్, ఇక్కడ? డ్యూటీ పూర్తయి వెళ్లిపోయారుగా’ అన్నాడు బిజు, మా క్యూసీ ఇంఛార్జ్!

నేను విషణ్న వదనం పెట్టి క్లుప్తంగా విషయం చెప్పాను.

’అరె, నేను చెప్పడం మరిచా. మీ పర్స్ మీరు కూర్చున్న స్పాట్ దగ్గరే పడిపోయి ఉంటే, మీ స్టాఫ్ పర్సన్ తీసి దాచాడు, రేపు కలెక్ట్ చేసుకోండి’అన్నాడు.

నా ఆనందం అంతా, ఇంతా కాదు. వెంటనే స్కూటర్ స్టార్ట్ చేసి ఇంటిదారి పట్టాను. దారి మధ్యలో ’ఇందాక బస్ లో అతను అంతలా ఎందుకు రియాక్ట్ అయ్యాడు’ అన్న ఆలోచన వచ్చింది.

అప్పుడే కాదు నాకిప్పటికీ అర్థంగాని విషయం అది. ‘అర్థం పర్థం లేని ఇలాంటి సన్నివేశాలే, అప్పుఅప్పుడు చిలికి చిలికి గాలి వానలవుతాయేమో’ అని మాత్రం అనిపించింది.

*****

మరిన్ని శీర్షికలు
Andhra Chicken Fry - Very Easy Method!