Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.....http://www.gotelugu.com/issue256/689/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి)... శరణ్య వి ఆర్ ఓ గా ట్రైనింగ్ పూర్తీ అయింది.  నందిగామలో  పోస్టింగ్ ఇచ్చారు. విలేజ్ డెవలెప్ మెంట్ ఆఫీసర్ ట్రైనింగ్ లో  పొందిన అనుభవాలతో అవడానికి డిప్యుటి తహసిల్దార్ అయినా , ఇప్పటికిప్పుడు కలెక్టర్ ని చేసినా సునాయాసంగా బాధ్యతలు నిర్వహించగలను అన్నంత ఆత్మ విశ్వాసం వచ్చేసింది శరణ్యకి.

ఆదాయ వ్యవహారాలు,  స్కూల్ తనిఖీలు, ల్యాండ్ తగాదాలు,  రాజకీయ నాయకులతో ఉండే సమస్యలు, తహసిల్దార్తో, కలెక్టర్ తో మెసులుకోవాల్సిన విధానం ఒకటేమిటి బుర్ర తిరిగిపోయింది..

మొదట్లో భయం వేసింది .. క్రమంగా ఒక అవగాహనకి వచ్చేసరికి ఛాలెంజ్ జాబ్ అనిపించింది.

తను న్యాయం చేయగలదా ? హాయిగా ఏ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గానో సెటిల్ అయిపోయి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది .. కాని ఆమె మొదటి నుంచి జీవితాన్ని సవాల్ గా తీసుకునే మనస్తత్వంతో ఉండడం వలన ఇప్పుడు వెనక్కి తగ్గి నేను చేయలేను అనుకోడం ఫూలిష్ నెస్ అనుకుంది.

విజయవాడలో ఒక ఫ్లాట్ తీసుకుంది.

ప్రభుత్వ వాహనం అలాట్ చేసారు ఆమెకి. దాదాపు చుట్టు  పక్కల గ్రామాల్లో ఉన్న స్కూల్స్ , అంగన్ వాడి కేంద్రాలు పర్యవేక్షించడానికి వెళ్ళడం, మీటింగ్స్ కి అటెండ్ అవడం, ఎక్కడన్నా ల్యాండ్ సమస్యలు ఉంటే స్వయంగా వెళ్లి పర్యవేక్షించడం స్టాఫ్ మీద ఆజమాయిషీ ...ఉదయం తొమ్మిదికే ఆవిడ ఆఫీస్ పని ప్రారంభం అవుతుంది. సాయంత్రం పోద్దుపోయినా తను కూర్చోడమే కాక తన కింది ఉద్యోగులను కూడా కూర్చోబెట్టడంతో, ఇంతవరకు తమ మాట వినే  ఆఫీసర్స్ తప్ప, ఇలాంటి ఆఫీసర్ ని చూడని వాళ్లకి ఆమె ఒక కొరకరాని కొయ్య అయింది. ఆఫీస్ పని చేయడం అంటే  అడవిలో కట్టెలు కొట్టడం అంత కష్టంగా భావించే వాళ్లకి ఆవిడ వచ్చాక పని ఒత్తిడి విపరీతంగా పెరిగింది. దాంతో ఈవిడ ఎక్కడ దొరికిందిరా బాబు అనుకుంటున్నారు అందరు.

శరణ్యకి ప్రభుత్వ పాటశాలలు, అంగన్వాడి కేంద్రాలు మొదటిసారి చూసినప్పుడు మనసు బాధతో మూలిగింది. అరకొర వసతులు, పాతబడిపోయి కూలిపోడానికి సిద్ధంగా ఉన్న గోడలు, వర్షం పడితే మొత్తం వరద వచ్చినట్టు కురిసే పై కప్పులు,  మరుగుదొడ్లు లేవు.. వంటగది పేరుకి కానీ ఓ మూల పెద్ద స్టవ్, మరోమూల ఒక ప్లాస్టిక్ డబ్బాలో బియ్యం, గచ్చు మీద మట్టిలో దొర్లుతున్న టమాటాలు, ఉల్లిపాయలు, కొన్ని సరుకులు పోట్లాలలో  కింద పడి ఉన్నాయి.

ఆయాలు చాలా నిర్లక్ష్యంగా నిద్రపోతూనో, కబుర్లు చేప్పుకుంటునో    కనిపించారు.. పిల్లలు మట్టికొట్టుకు పోయిన బట్టలతో నీరసంగా ఆడుకుంటూ ... హృదయం ద్రవించింది. పసివాళ్ళు, నోరులేని వాళ్ళు, తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేరు అనే కదా ఈ నిర్లక్ష్యం..

శరణ్య సరుకులు నాణ్యత చూసింది.. పురుగులు పట్టిన కందిపప్పు, దొడ్డు బియ్యం, కుళ్ళిన టమాటాలు, కుళ్ళిన ఉల్లిపాయలు, అపరిశుబ్రంగా ఉంది వంట గది.

పిల్లలు హాయిగా కూర్చుని కడుపు నిండా తిండి తినేందుకు సరైన తిండి లేదు, సరైన స్థలమూ లేదు.

ఆయాని సూపర్ వైజర్ గురించి అడిగింది. ఇంతకు ముందు ఉన్న ఆయన బదిలీ అయి వెళ్లిపోయాడని, కొత్త వాళ్ళని ఇవ్వలేదని చెప్పింది. టీచర్లు ఇద్దరున్నారు. వాళ్ళని అక్కడి పరిస్థితి, ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాల వివరాలు తెలుసుకుంది. పిల్లలకు పౌష్టికాహారం అయిన గుడ్లు, పాలు, ఇస్తున్నారా అని అడిగింది. దానికి ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు.

అలాగే  నాలుగైదు సార్లు విజిట్ చేసి అక్కడి పరిస్థితులు అవగాహన చేసుకుని,  ఒకరోజు పై అధికారులకు తను గమనించిన విషయాలు వివరిస్తూ,  వెంటనే సూపర్ వైజర్ పోస్ట్ ఫిలప్ చేయాల్సిందిగా లెటర్ రాసింది.

అంతే కాదు, అక్కడ టీచర్లుగా ఉన్నవారిలో ఎవరికీ కనీస విద్యార్హత లేదు అని అనిపిస్తున్నది.. వాళ్ళ రికార్డ్స్ పరిశీలించాలి.. కాని అవేవి దొరకలేదు ... కాబట్టి వారిని వెంటనే తీసేసి కనీస విద్యార్హతలు ఉన్నా వాళ్ళని నియమించాల్సిందిగా కోరుతున్నాను అని ముగించింది.
అదేరోజు రాత్రి తేజ ఫోన్ చేస్తే అదే విషయం చెప్పి అంది.

“ఇదేంటి తేజా పసి పిల్లలకు దక్కవలసిన ఆహారంలో కూడా ఇంత అరాచకమా... దారుణం కదూ ... నాకు అప్పటికప్పుడు  కేంద్రాల నిర్వహణాధికారుల మీద కేసు పెట్టాలనిపించింది.”

తేజ ఓదార్పు స్వరంతో అన్నాడు. “నువ్వు ఈ రకమైన వాతావరణానికి కొత్త. ఆవేశపడి స్టార్టింగ్ లోనే సమస్యలు కొని తెచ్చుకోకు. ఇలాంటి వ్యవహారాల్లో పెద్ద, పెద్ద వాళ్ళ చేతులు ఉంటాయి. కొంచెం సంయమనం పాటిస్తూ మెల్లగా సంస్కరణలు చేపట్టు.”

“సిగ్గుండాలి కదా పిల్లల పొట్టలు కొట్టి సంపాదించడానికి ... అలాంటి సంపాదనతో ఏం సుఖపడతారు. ఛి, ఛి అసహ్యం వేస్తోంది” అంది ఆవేశంగా.

“సిగ్గు, లజ్జ, ఆత్మాభిమానం, నీతి , ధర్మం వీటికి సమాజంలో, మనుషుల మనస్సులో, ఆఖరికి డిక్షనరీలో కూడా కనిపించని ఒకానొక రాక్షస యుగంలో బతుకుతున్నాం. నీకు కనీసం వెంటనే కాకున్నా, నెమ్మది మీద ఆ పసివాళ్ళకి సహాయపడే అవకాశం ఇచ్చాడు దేవుడు.. నువ్వు ఒక ప్రభుత్వ అధికారివి ... తలచుకుంటే ఏమైనా చేయచ్చు... బట్ శరణ్యా ... ఆవేశంతో కాదు.. ఆలోచనతో ముందుకు అడుగులు వేయి ... నీ వెంటే నేను ...”

అతని మాటలకి శరణ్య ఉద్వేగంగా అంది “థాంక్స్ తేజా ..”

“అంగన్ వాడి టిచర్స్ కి ప్రత్యేకమైన అర్హతలు నియమించలేదని అందుకే ఎవరికీ కావాల్సిన వాళ్ళని వాళ్ళు ఏర్పాటు చేస్తూ, వాళ్ళ ద్వారా నిధులు కొల్లగొడుతున్నారు కొందరు అని పేపర్ లో చదివాను ... ఇదంతా మారాలి.. సమూలంగా కొన్ని దుష్టశక్తులను తరిమికొట్టాలి. అందుకు నువ్వే సమర్దురాలివి ..”

అతని మాటలకి మనసారా అంది “ నువ్వు పక్కనుంటే ప్రపంచాన్ని శాసించగలను అనే ఆత్మ విశ్వాసం కలుగుతోంది. “

“మరైతే వెంటనే ముహూర్తం పెట్టించనా ...” అల్లరిగా అడిగాడు.

సిగ్గుతో కళ్ళు అరమోడ్పులవుతుంటే ఊ  అంది. “ఏయ్ .... నిజమా ... నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావా ...” నమ్మలేనట్టు అడిగాడు.
“ఎన్నిసార్లు చెప్పలేంటి”  అంది మత్తుగా.

“ఏమో ... నేనింకా అప్పుడేనా ప్రొబేషన్ ఇప్పుడేగా మొదలైంది ... ఇది పూర్తీ కావాలి, లివులు పెట్టకూడదు అంటావనుకున్నా .”

“ ట్రైనింగ్ లో పెట్టద్దన్నారు.. ప్రొబేషన్ లో లాంగ్ లివ్ పెట్టకూడదు ..”

“ లాంగ్ లీవ్ ఎందుకు? గంటలో పెళ్లి చేసుకుని ఇద్దరం కలిసి వెళ్ళిపోయి కాపురం పెట్టేద్దాం ... నేను ఇంట్లో ఉండి వంటలు చేస్తా.. నువ్వు ఆఫీస్కి వెళ్ళు “ అన్నాడు.

అవసరం లేదు నీకు నా పి ఏ గా ఉద్యోగం ఇస్తాను చిలిపిగా అంది.

“వావ్”  అంటూ గట్టిగా అరిచి “అంతకన్నా మంచి జాబ్ ఏం  ఉంటుంది?  రేపే చెప్పేస్తాను నీకు మన పెళ్లి ఎప్పుడు, ఎక్కడ? సరేనా” అన్నాడు.

శరణ్యకి తేజ స్వరమే గిలిగింతలు పెట్టినట్టు అయి ఫోన్ డిస్ కనెక్ట్ చేసి వెల్లకిలా మంచం మీద వాలిపోయి తీయటి ఊహల్లో తేలి పోసాగింది.
అన్నట్టే తేజ మరునాడే పెళ్లి ముహూర్తం పెట్టించి ఫోన్ చేసాడు.

అలా చేస్తాడని, తన మాటలు అంత సీరియస్ గా తీసుకుంటాడని ఊహించని శరణ్య ఆశ్చర్యంగా అంది.. “అదేంటి ఇంత తొందరగా .. ఎలా కుదిరింది ముహూర్తం! మీ పేరెంట్స్ నిజంగా ఒప్పుకున్నారా?”

“ఎందుకు ఒప్పుకోరు కాబోయే కలెక్టర్ కోడలు అవుతుంది అంటే ... ఒకే, ఒకే గేట్ రెడీ.. ఒకసారి వీకెండ్ హైదరాబాద్ వచ్చెయ్ ... షాపింగ్ చేయాలి.”

“బాగుంది లేడికి లేచిందే పరుగా .. మా పేరెంట్స్ కి చెప్పద్డా” అంది.

“అవన్నీ వాళ్ళు, వాళ్ళు చూసుకుంటారు నువ్వు ఈ వీకెండ్ వస్తున్నావు దట్స్ ఆల్” అన్నాడు కచ్చితంగా.

“తేజా నీకేం పిచ్చా .. ఎలా కుదురుతుంది.. ఎం ఆర్ వో గారికి చెప్పాలి , పెర్మిషన్ తీసుకుని రావాలి హైదరాబాద్ కి ..”

“తీసుకో ..”

“ఎలా ఇవాళ గురువారం ... నేను ఫోన్ లో అడిగితె బాగుండదు. ఎం ఆర్ వో దగ్గరకు  వెళ్ళాలి. “

“వెళ్ళు “

“అబ్బ తేజా ట్రై టూ అండర్ స్టాండ్ ..”

“సారీ నేను ఏమి వినను ... నువ్వు వస్తున్నావు అంతే” అంటూ ఫోన్ డిస కనెక్ట్ చేసాడు.

ఓ గాడ్ తేజా అనుకుంది శరణ్య ... ఎలా ఇప్పుడు... ఎం ఆర్ వో ఏమంటాడో ... వీకెండ్ అంటే శని,ఆదివారం అవడానికి తను చేస్తున్నది కార్పోరేట్ కంపెనీ నా ... ప్రభుత్వ అధికారి అంటే ఇరవై నాలుగు గంటలు తనది కాదు.. ఎటు కదలాలి అన్నా అధికారుల అనుమతి ఉండాలి..

శరణ్యకి ఏమి పాలు పోలేదు.  చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుని ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా కూర్చున్న చోటు నుంచి లేచింది.

(మిగతా కథ వచ్చే శుక్రవారం .....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana