అందరికీ గుర్తుండే ఉంటుంది.. ఇదివరకటి రోజుల్లో, సమాచారాన్ని పావురాలద్వారా పంపేవారని చదువుకున్నాము.అదంతా పాతకాలం లో అనుకోండి.. టెక్నాలజీ అభివృధ్ధితో పాటు, వార్తలు అందచేయడం లో కూడా కొత్తకొత్త మార్పులు చోటు చేసుకున్నాయి… అవేవో Morse Code లని వచ్చాయి మొదట్లో. వాటిద్వారానే ఇదివరకటి రోజుల్లో , సముద్రం మీద ప్రయాణాలు చేసేవారు, భూమిమీదకి సందేశాలు పంపేవారుట… Morse Code ద్వారానే, మనదేశంలో Telegram అవీ పంపేవారు. ఎక్కడికైనా సమాచారం urgent గా పంపాల్సొస్తే, ఈ Telugram ద్వారానే, శుభ, అశుభ వార్తలు బంధువులకు , తెలపాలంటే, ఊళ్ళో ఉండే పోస్టాఫీసుకి వెళ్ళి, . ఓ Form తీసికుని, దాంట్లో మనం తెలియచేయాల్సిన సమాచారం రాసి, కిటికీలోపలుండే అతనికి ఇవ్వడం. ఈ Telegrams లో ఓ తమాషా ఉండేది. సందేశం అన్నారుకదా అని, ఏవేవో వ్యాసాల్లా రాసేయకూడదు… వాళ్ళు వసూలు చేసే charges, ఒక్కో word కీ ఇంతా అని. అవసరంలేనివన్నీ రాసుకుంటూ పోతే, మనం ఇవ్వాల్సింది తడిపిమోపెడవుతుంది. ఆ Telegram charges కట్టడం కంటే, ఆ ఊరేదో వెళ్ళిరావడం చవకయేది… అలాగే ఏదైనా ప్రత్యేక సందర్భాలలో, అభినందనలు / శుభాకాంక్షలూ చెప్పడానికి, దానికి సంబంధించిన కోడ్ నెంబరు వేస్తే సరిపోయేది… అందుకనే ప్రతీ సందర్భానికీ, సమాచారానికీ short cut లు, ఆరోజుల్లోనే మొదలయ్యాయి. ఈరోజుల్లో మనందరం పేద్ద గొప్పగా చెప్పుకునే SMS లు, కొత్తగా వచ్చినవేమీ కావు… ఇంగ్లీషు అంత బాగా మాట్టాడలేనివారు, పాపం అతుకుబొతుకల మాటలు చెప్తూంటే, “ ఏమిటీ Telegraphic language వాడుతున్నావేమిటీ.. “ అనే నానుడి ఆరోజుల్లోనే మొదలవుత. Matter అర్ధమవుతే చాలు, దానికి grammar వగైరాలుండేవి కావు. మొత్తానికి వార్త ( శుభ/ అశుభ) సారాంశం తెలిసేది.
ఆ తరవాత టెలిఫోన్లు వచ్చాయి. స్థితిమంతులకీ, ప్రభుత్వకార్యాలయాలకీ, వాటిలోని ఉన్నత అధికార్లకీ , విడివిడిగా టెలిఫోన్లూ, వాటికి ప్రత్యేకంగా నెంబర్లూ ఉండేవి. ఆఫీసంతటికీ మాత్రం ( అంటే అందులో పనిచేసేవారి సౌకర్యార్ధం ) అవేవో Extension Numbers ఉండేవి… మనలాటి బడుగుజీవులకైతే, పోస్టాఫీసుల్లోని టెలిఫోనే గతి.. అర్జెంట్ గా మాట్టాడవలసొస్తే, పోస్టాఫీసుకి వెళ్ళడం, ట్రంక్ కాల్ బుక్ చేసుకుని, ఆ కాల్ ఏదో కలిసేదాకా, పోస్టాఫీసు వరండాలోనే పడిగాపులు కాయడం, మనకి కావాల్సినవాడు వచ్చాక, మాట్టాడ్డం.. అలాగని ఏదో బాతాఖానీ పెట్టుకోవడం కాదు… నిముషనిముషానికీ, వరద మట్టం పెరిగినట్టు, మూడు నిముషాలు దాటగానే, రేటు కూడా పెరుగుతుంది. అందుకోసమని మాట్టాడదలుచుకున్న నాలుగు ముక్కలూ, ఓ కాగితం మీద రాసి తెచ్చుకోడమూ, గడగడా, వాచీ చూసుకుంటూ చదివేయడమూ… పోనీ ఈ గొడవలన్నీ పడలేక , అప్పోసొప్పో చేసి ఇంట్లోనే ఆ టెలిఫోనేదో పెట్టించేసుకుందామా అనుకున్నా, దానికో పెద్దతతంగం, waiting list వగైరాలుండేవి. పైగా బిల్లు కూడా తడిపిమోపెడయేది.
ఆ తరవాత STD Booth ల ధర్మమా అని, ఈ పోస్టాఫీసులకెళ్ళి, ట్రంక్ కాల్స్ గొడవ తప్పింది… అవేవో STD Codes వచ్చాయి , మనంతట మనమే Dial చేసుకునే సదుపాయం.వచ్చేసింది.
కాలక్రమేణా, మనదేశంలో మొబైల్ ఫోన్లొచ్చేసాయి. మొదట్లో, ఒకటో రెండో కంపెనీలు వీటిని జనాలకి సమకూర్చేవారు. .. వాటి ఖరీదూ, call charges కూడా ఎక్కువగానే ఉండేవి..క్రమక్రమంగా కొన్ని దేశ విదేశీ కంపెనీలు రంగం లోకి దిగాయి.. ఈ మొబైల్ ఫోన్లు మొదట్లో , ఎక్కడ పడితే అక్కడే మాట్టాడుకోడానికి తప్ప మరెందుకూ ఉపయోగించేవి కావు… విదేశాలమాట దేవుడెరుగు, ఉన్నరాష్ట్రం కాకుండా, మరో రాష్ట్రానికి ఫోనుచేయాలన్నా, బయట ఉన్నప్పుడు కాల్ receive చేసుకోవాలన్నా, అవేవో Roaming charges అని పడేవి.,, దీనితో ఏమయ్యేదంటే, ఈ roaming లో ఉన్నప్పుడు ఛస్తే ఫోనెత్తేవారు కాదు…
ప్రభుత్వ రంగ సంస్థ, BSNL వారు, ప్రజల సౌకర్యార్ధం, ఏవేవో స్కీమ్ములు మొదలెట్టారు. ఈ మొబైళ్ళ్ ప్రపంచం అంతా Smart Phone ల ఆవిష్కరణతో కొత్త పుంతలు తొక్కింది. దేశవిదేశాలవారితో. ఒకే click తో చూసిమాట్టాడుకునేటంతగా.. మొదట్లో కొంత ఖర్చుతోకూడిన పనిగానే ఉన్నా, ఓ ఏడాది నుండీ, రిలయన్స్ Jio ధర్మమా అని, వాటి charges విపరీతంగా తగ్గిపోయి, మొత్తానికి “ ప్రపంచం మీ గుప్పెట్లో ..” అన్నచందానికి వచ్చేసింది.
సర్వేజనాసుఖినోభవంతూ…
|