Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> ఆత్మప్రబోధం

atmaprabhodham

నా శరీరం నుంచి నా ఆత్మ, రాకెట్ నుంచి ఉపగ్రహం విడివడినట్లుగా బయటపడుతున్నకొద్దీ, తెలియని కొత్త ఆకారం రూపుదాల్చడమైంది. ఏదో తెలియని బాధ వెంటాడుతున్నట్లే ఉంది. నా ఈ కొత్త ఆకారంతో ఉన్న ఆత్మకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ పని చేయకుండా ఉండాల్సింది అని. కాని నా ప్రమేయం లేకుండానే నా ఆత్మను పట్టి లాక్కువెళ్ళుతున్నట్లు అనిపించి చూసా. నిజంగానే ఓ ఆజానుబాహుడు లాంటి వ్యక్తి నా ఆత్మను లాక్కుని తీసుకొనివెళుతున్నాడు.

ఏయ్! ఎవరునువ్వు? ఎక్కడికి నన్నులాక్కెళుతున్నావు? ప్రశ్నించా.

“నేనా, విచారలోకాధిపతిని.నిన్ను విచారలోకానికి తీసుకెళుతున్నా” సమాధానమిచ్చాడు

“స్వర్గలోకం గురించి విన్నా, నరకలోకం గురించి విన్నా కాని ఈ విచారలోకం గురించి ఎప్పుడూ వినలేదే అన్నా”    “నీలాంటి  పనిచేసే వాళ్ళందరిని ఈ లోకానికే తీసుకెళతాం”

“నాలాంటి పని అంటే” తిరిగి ప్రశ్నించా.

“ అదే నీలా ఆత్మహత్యలు చేసుకొన్నవాళ్ళందరిని ఈ లోకానికే తీసుకెళాతాం” అని చెప్పేసరికల్లా, ఆ లోకానికి చేరుకొన్నాం

“వివిధ పేర్లతో అనేక గదులు కన్పిస్తున్నాయి. పరికించి చూసా. “ప్రేమవైఫల్య ఆత్మహత్యల గది” అని రాసి ఉన్న గది కనిపించింది. ఆ ఆజానబాహుడు ఆ గది లోకి నన్ను బలవంతాన నెట్టాడు. ఆ గదిలో వేలాది మంది ఆత్మలు ఉన్నాయి. అన్నీ తలవంచుకొని కిందకు చూస్తున్నాయి. వేటి మొఖాలలో ఆనందపుఛాయలు లేవు. పైపెచ్చు దిగులుగా, విచారంగా ఉన్నాయి. నాకు అప్పటికే విచార ఛాయలొచ్చేసాయి.

“అదేంటి, బాధలు,విచారాలనుంచి బయటపడదామనే కదా ఆత్మహత్య చేసుకొంది.” నాలో నేనే అనుకొన్నా. కాని నేనేమనుకున్నానో ఆ ఆజానుబాహునికి తెలిసినట్లుగానే అతనంటున్నాడు.

“ ఇక నీకు ఎల్లకాలం విచారమే. నీ లోకంలో నీకు సంబంధముండే ప్రతి ఒక్కరిని చూడటమైతే చూడగలుగుతావు కాని  అక్కడ జరిగే ప్రతి సంఘటన నీకు బాధ కలిగించేదయితే ఎలాగూ నీవు విచారంలో మునిగిపోతావు. పోనీ సంతోషం కలిగించేదయితే అది నీవు ఎలాగూ అనుభవించలేవు కనుక మరల నీకు విచారమే. మొత్తంగా ఇక నీకు ఎల్లపుడూ విచారమే.” అలా అనే లోపలే తల కిందికి వాలిపోయింది.కింద భూలోకంలో జరుగుతున్నతంతు అంతా స్పష్టంగా కన్పిస్తుంది. నన్నుఅప్పుడే పేరుపెట్టి పిలవడమే మానివేసారు. ఇంక శవాన్ని ఎక్కువసేపు ఉంచితే వాసన వచ్చేస్తుంది అంటున్నారు. నన్ను విడిచి ఒక్క క్షణం ఉండని నా ప్రాణస్నేహితురాల్లే నా దగ్గర ఉండటానికి జంకుతూ తప్పించుకొని తిరుగుతున్నారు. నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన నా ప్రియుడు ఆ దరిదాపుల్లోనే లేడు. “వాళ్ళ అమ్మానాన్నఒప్పుకోవటం లేదని,అందుకే ఇద్దరం చనిపోదామని చెప్పి”,  తీరా నేను చనిపోయిన తరువాత అక్కడనుంచి మెల్లగా జారుకొన్నాడు. విపరీతమైన కోపం,బాధ,పగ,ఉక్రోషం,విచారం వస్తున్నాయి కాని ఏం చేయలేని నిస్సహయత మరింత దు:ఖం ముంచుకువచ్చేలా చేసింది. ఈలోపు మా అమ్మ,నాన్నలు వచ్చారు.కంటికి,మింటికి ఏకధారగా ఏడుస్తున్నారు.నాకూ ఏడుపు ఆగటం లేదు. ఇప్పుడు అన్పిస్తుంది చచ్చి ఏం సాధించాను అని? నా ప్రియుడిపై కక్ష తీర్చుకొనే అవకాశమైనాలేదు పోనీ అమ్మానాన్నలనైనా ఓదార్చాలని ఉంది,కానీ బతికుంటేగా.

ఎంతకాలమిలాగా? అని నాలో నేనే అనుకుంటుంటే జీవితకాలం అని సమాధానమొచ్చింది ఆ ఆజానుబాహుని నోటి వెంట.

“జీవితకాలమంటే తిరిగి ప్రశ్నించా?”

“అక్కడ నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా ఉండినట్లైతే నీ జీవితకాలమెంత అయితే అంతకాలం అని జవాబువచ్చింది.”

“అంతకాలం ఇలా విచారంతో గడపవలసిందేనా” ప్రశ్నించా

“ఖచ్చితంగా గడపవలసిందే ”

“ ఆత్మహత్య చేసుకోకుండా అక్కడే ఉండి ఉంటే వాడికి బుద్ది చెప్పటమే కాకుండా తర్వాత ఆనందంగా జీవితాన్నిగడిపేదానిని కదా”

“ ఆ బుద్ధి ఆత్మహత్య చేసుకోకముందు ఏడాలి”

“ఇక జీవితాంతం ఇలాగే విచారిస్తూ కూర్చోవాలా”అడిగా

“వారంవారం వేరేవేరే  కారణాలతో  ఆత్మహత్యలు చేసుకొన్నవారి గది కెళ్ళి వారు ఎందుకు ఆత్మహత్యచేసుకొన్నారో తెలుసుకొని వారి విచారంలో పాలుపంచుకోవచ్చు”చెప్పాడు

ఈ వారం నువ్వు “వివిధ రోగాలబారిన పడి ఆత్మహత్యలు చేసుకొన్నవారి గది”కి వెళ్ళు అన్నాడు విచారాధిపతి.

ఆ గదికి వెళ్ళా .ముందుగా “మశూచి తో ఉన్న ఆత్మ కనిపించింది” ఆశ్చర్యంగా “ భూలోకంలో చాలాఏళ్ళక్రితమే మసూచి వ్యాధి అంతరించిపోయింది కదా అని నాలో నేనే అనుకొన్నా”.

“అంతరించిపోవడానికి కొన్ని రోజులముందే వీడు ఆ రోగానికి జడిసి ఆత్మహత్య చేసుకొన్నాడు.వీడి జీవితకాలం తొంభై అయిదేళ్ళు. అందుకే వీడి జీవితకాలమంతా ఆ రోగంతో విచారిస్తూ గడపాల్సిందే”అని వినిపించింది.అలా భూలోకంలో ఎపుడో అంతరించిపోయిన అనేక రోగాలతో ఉన్నవారు ఇంకా ఈ గదిలో విచార వదనంతో కనిపించారు.అపుడు అనిపించింది కాస్త సహనంతో, భూలోకంలో వీళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా ఉండివుంటే ఖచ్చితంగా వీరంతా ఆ రోగాలబారినుండి బయట పడేవారేనన్నమాట.

“మరి నువ్వు మాత్రం చేసిందేమిటేంటి?”నా ఆత్మలో ఆత్మ తిరిగి ప్రశ్నించింది. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకొని జీవితకాలం విచారంతో గడపవలసి వస్తున్నదని తెలిసి విషాదవదనంతో వెనుదిరిగా.

ఈ సారి “భర్తల ఆరళ్ళతో ఆత్మహత్యల గది” కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఒక   తోటి ఆడ ఆత్మ తన బాధను ఇలా వ్రెళ్ళగక్కింది “కట్నం ఎక్కువగా తేలేదని, నా భర్త తాగి వచ్చి నన్ను పెట్టే నానా బాధలు భరించలేక నా భర్తను చచ్చిసాధిద్దామని ఆత్మహత్య చేసుకొన్నా,వాడిని సాధించడం మాట అటుంచి వాడు  ఇపుడు ఇంకో అమ్మాయిని  పెళ్ళి చేసుకొని హాయిగా కాపురం చేసుకుంటున్నాడు.పుండు మీద కారం చల్లినట్లుగా ఉంది నా పరిస్థితి , ఇక జీవితాంతం సుఖ సంతోషాలు లేకుండా విచారంతో నే గడపాలి”

ఈ సారి వంతు చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొన్న వాళ్ళ గదికి వెళ్ళాల్సివచ్చింది. అక్కడి పరిస్థితి ఇంకా భీభత్సంగా ఉంది. ఎందుకంటే అక్కడి ఆత్మలన్నీ నా కన్నా చిన్న వయస్సు గల ఆత్మలే.వాళ్ళు నా కన్నా ఎక్కువ కాలం ఈ విచారకూపంలో పడి విచారిస్తూ కూర్చోవలసి వస్తుందే అని తెలిసే సరికి ఇంకాస్త బాధ ముంచుకొచ్చింది.

ఇలా ఒక్కో వారం ఒక్కో కారణంతో ఆత్మహత్యలు చేసుకొన్న వాళ్ళ గదులుకి పంపించేవాడు. భార్యలు పెట్టే హింస భరాయించలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన భర్తలు కొందరైతే, అత్తల ఆరళ్ళు భరించలేక ఆత్మహత్యలు చేసుకొన్న కోడళ్ళు, కోడళ్ళ సతాయింపు కష్టమై ఆత్మహత్యలు చేసుకొన్న అత్తలు కొంతమంది, ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొన్నవారు కొంతమంది, నమ్మించి నట్టేటముంచినవాళ్ళ నమ్మకద్రోహాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొన్నవారు మరికొంతమంది. చచ్చి సాధిద్దామని ఏ కారణం తో ఆత్మహత్య చేసుకొన్నప్పటికి ఏ ఒక్కరూ ఆనందంగా లేరు నా తో సహ.

ఇలా అనేక ఏళ్ళు గడిచిపోయాయి. ఇక విసుగొచ్చి ఒక రోజు అడిగా విచారాధిపతిని “ఇలా ఇంకా ఎన్ని రోజులని?”

“నీకు విడుదలయ్యే రోజు దగ్గరి పడింది. అందుకే నీ వద్దనుంచి ఈ ప్రశ్న వచ్చింది అని చెప్పి ఇదుగో ఈ దృశ్యాలను తిలకించు అని ఒక వింత అయిన పరికరాన్ని నా ముందుంచాడు.

దానిలో ఆత్మహత్యకు ప్రయత్నించి చివరి క్షణంలో విరమించుకొని తదుపరి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన ప్రముఖుల ఉదంతాలు కళ్ళకు కట్టినట్టు కన్పిస్తున్నాయి. వాటిలో అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ మొదలుకొని హారిపోటర్ నవలారచయిత జె.కె.రోలింగ్ వరకు ఎందరో  ప్రముఖులు కన్పించేసరికి మొట్టమొదటిసారిగా నా ఆత్మకు ఆనందమొచ్చింది. ఇప్పుడు పూర్తిగా తెలిసొచ్చింది నిజంగా ఆత్మహత్య చేసుకొని ఎంత పొరపాటు చేసానో అని.

ఈ లోపే విచారాధిపతి ఈ లోకంలో నీ ఆయువు తీరింది తిరిగి భూలోకంలో జన్మిస్తున్నావు,ఇకనైనా జాగ్రత్తగా మసులుకో అంటున్నాడు.
అంతే  గట్టిగా అన్నా “ ఆత్మహత్యలు ఎవ్వరూ చేసుకోకండి,చేసుకున్నా మీరు సాధించేది ఏమీలేదు ఎప్పటికీ, అని మా భూలోకంలో అందరికి ప్రచారం చేస్తా,ప్రచారంచేస్తా”

***

“ఎంత శుక్రవారం నీకు సెలవు రోజు  అయితే మాత్రం బారెడు పొద్దెక్కినా లేవకుండా పైగా ఏంటమ్మా అందరికి ఈ రోజు ప్రచారం చేసేది? “ అమ్మ తట్టిలేపింది. ఒక్కసారిగా కల(త)నిద్రంతా వదిలిపోయింది.కలలోని అన్నివిషయాలు ఒక్కటీ పొల్లుపోకుండా గుర్తున్నాయి.ఈ మధ్యకాలంలో రోజు రోజుకి పెరిగిపోతున్న ఆత్మహత్యలు పేపర్ లో చూస్తున్న ప్రభావమో,లేదా ఈ మధ్యనే  ప్రేమ విఫలమై  ఆత్మహత్య చేసుకొని చనిపోయిన నా స్నేహితురాలి గురించిన ఆలోచనలతో పడుకున్నప్రభావమో,ఈ ఆత్మహత్యల పరంపరకు అడ్డుకట్ట ఎలా,ఎలా అని ఆలోచిస్తూ పడుకోవటమో తెలియదు గాని తను ఏ కారణంతో అయితే ఆత్మహత్య చేసుకుందో అదే కారణంతో  కలలో నేను ఆత్మహత్య చేసుకున్నట్లు రావటమేకాకుండా  మెళుకువ వచ్చిన వెంటనే అమ్మ అన్న “శుక్రవారం,ప్రచారం” అనే మాటలు వెంటనే నాకు కర్తవ్యాన్ని స్ఫురింపచేసాయి. అంతే  శుక్రవారం  తెలుగిళ్ళ లోగిళ్ళలో ప్రతి నెట్టింట ప్రత్యక్షమయ్యే గోతెలుగు.కామ్ కి  రాయటానికి ఉపక్రమించి పూర్తిచేసా. ఇది చదివి అయినా ఆత్మహత్యాపరంపరకు ముగింపు పలుకుతారు అనే గంపెడాశ ను గుండెలనిండా నింపుకొని.

మరిన్ని కథలు
artajana rakshaka kutumbam