Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
atmaprabhodham

ఈ సంచికలో >> కథలు >> ఆర్తజన రక్షక కుటుంబం

artajana rakshaka kutumbam

ఎండాకాలం.

ఉదయం పదకొండు గంటలు. ఆఫీసు పని మీద సంగారెడ్డి లోని మారు మూల గ్రామం బస్ స్టాపులో దిగాను. సూర్యుడు నడినెత్తికి ఎక్కనే లేదు.  అయినా అగ్ని గుండంలా మండి పోతున్నాడు. వేడి సెగ తగిలింది. నేను వెళ్లాల్సిన ప్రాంతం కొంచెం లోపలికి ఉంటుందట నడుచు కుంటూనే  వెళ్లాల్సొస్తుందని అక్కడున్నవాళ్లని అడిగితే చెప్పారు. అప్పటిదాకా ఒంటిని వేడి చిట చిటలాడించినా, బస్సు నడుస్తున్నప్పుడు తగిలే చల్లని గాలితో కొంత సేద దీరాను. కానీ ఇప్పుడు చచ్చినట్టు నడవాలి. బస్టాండు బయటకొచ్చి నాలుగడుగులు వేశానో, లేదో ఆ ఎండ తీవ్రతకి చెమటలు కారుతూ, నడవ లేని పరిస్థితికి చేరాను. అక్కడే ఉన్న చెట్టు నీడకి చేరాను. ఎంత సేపని అలా ఉంటాను? తొందరగా తిరిగి వెళ్లాలి. లేక పోతే సాయంత్రం ఆఫీసుకెళ్లి రిపోర్ట్ చేయలేను. అలా చెయ్యక పోతే మా ఆఫీసరు మరుసటి రోజు చచ్చే చీవాట్లు పెడతాడు. చెట్టు కింద నుంచి బయటకొచ్చి మరో నాలుగడుగులు వేశాను. నన్ను చూశాక సూర్యుడికి పంతం పెరిగినట్టుంది, మరింతగా నిప్పుల సెగను గుమ్మరించాడు. అయినా నేను నడక ఆపలేదు, ఇంకో నాలుగడుగులు వేశాను.

‘నేను గమ్యం చేరే లోగా కళ్లు తిరిగి పడి పోవడం ఖాయం. నన్నెవరన్నా పట్టించుకుంటారో? లేదో?’ ఇలా గజిబిజిగా ఏవేవో ఆలోచనలు నా మనసులో సుళ్లు తిరుగుతున్నాయి. ఇహ నడవడం నా వల్ల కాదు, ఏం చేద్దాం అనుకుంటుండగా, గొడుగేసుకున్న ఒక వ్యక్తి నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అహర్నిశం కష్టపడుతూ, ఎంత దూరాల కైనా షేర్ ఆటోలు, బస్సులూ ఎక్కని పల్లెటూరి వాళ్ల రాటు దేరిన శరీరాలను చూసి, వయసును అంచనా వేయడం కష్టం. నాకు మాత్రం అతను నలభై అయిదేళ్ల వ్యక్తిగా కనిపించాడు. బక్క పలచగా, గచ్చ కాయ రంగు చొక్కా, ఎడం భుజంపై ఒక టవలు వేసుకుని, పంచ కట్టుకుని ఉన్నాడు. అతని చేతిలో ఉన్న సంచీలో చాలా గొడుగులున్నాయి.  ‘ఓహో,  అమ్ముకోడానికనుకుంటా’ అనుకున్నాను. నేను కొనను- ఎందుకంటే మా ఆఫీసు వాళ్లు, నేను ఇలా పని మీద బయటకొచ్చినప్పుడు టీ ఏ, డీ ఏ లుగా మూడొందలు ఇస్తారు. దిగువ మధ్య తరగతి అవడం వల్ల, పొదుపుగా డబ్బు కర్చు చేసుకుని కొంత మిగుల్చుకుంటాను. అతను సంచీ లోంచి ఒక నల్లటి గొడుగు తీసి నా చేతికిచ్చి ’ఇంత ఎండలో ఎట్టెల్తారు సారూ, గీ గొడుగు తీసుకపోండ్రి" అని "ఓరి మల్లిగా"అని కొద్ది దూరంలో ఉన్న కుర్రాణ్ని పిలిచాడు.

పన్నెండేళ్ల  పిల్లాడతను. రెండు చేతుల్లోనూ సొరకాయ డిప్పలు, వాటిలో నీళ్లు, ఆ డిప్పని పట్టుకోడానికి రెండు తాళ్లు అమర్చి ఉన్నాయి. నాకొకటి ఇప్పించి ’ గీ నీళ్లల అయిస్ వేసినం సారు, సల్లగా తాగుకుంటా పని సూసుకోండ్రి. జై శ్రీరాం" అంటూ ముందుకురికాడు. అతణ్ని అంతే వేగంగా అనుసరించాడు పిల్లాడు. అతనెవరో దేవుడు పంపినట్టుగా రావడం చూసి. నాకు ఆశ్చర్యంగా ఉంది. కాసిన్ని చల్లని నీళ్లు తాగాక ప్రాణం లేచొచ్చింది, గొడుగు వేసుకున్నాక సూర్యుడు చిన్నబోయాడు. నేను వెళ్లాల్సిన ఇంటికి చేరుకున్నాను. రెండు గదుల చిన్న ఇల్లది. ఆ ఇంటికి రోడ్డే వాకిలి. నేను తలుపుకున్న గొళ్లెం చప్పుడు చేసాను. ఒకాయన బయటకి వచ్చాడు. నేను వచ్చిన పని చెప్పే సరికి కాళ్లు కడుక్కోడానికి నీల్లిచ్చి, ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్లి, కుర్చీలో కూర్చోబెట్టి, ఫ్యాన్ స్పీడ్ పెంచి, మంచి నీళ్లిచ్చాడు. తన భార్యని, ఒక్కగానొక్క నాలుగేళ్ల కొడుకునీ పరిచయం చేశాడు. పని పూర్తి చేసుకున్నాక, వాళ్లింట్లోనే భోజనం చేస్తూ, మంచి నీళ్లు తాగుతుండగా, బస్టాప్ లో గొడుగు, మంచి నీళ్లు ఇచ్చినాయన గుర్తొచ్చి, ఆయన గురించిన వివరాలడిగాను.

"ఓహ్! అతనా, అతని పేరు నర్సింగ్. ఎండాకాలం వచ్చిందంటే వాళ్ల కుటుంబం మొత్తం ఇదే పని మీద ఉంటారు. అతను గొడుకుల కంపెనీ నుంచి చిన్న చిన్న లోపాలున్న గొడుగులు తక్కువ ధరకి తీసుకుని సొంతంగా రిపెయిర్ చేసి అలా ఎండల్లో ఇబ్బంది పడేవాళ్లకి ఇస్తాడు. అలాగే వాళ్లావిడ చెప్పుల కంపేనీల నుంచి తక్కువ ధరకు చెప్పులు తీసుకుని, చెప్పులు లేని వాళ్లకి ఇస్తుంది. ఆమె కూడా అదే బస్టాప్ లోనే ఉంటుంది. మీరు చెప్పు లేసుకుని ఉన్నారు కాబట్టి చూడలేక పోయారు. మీకు మంచి నీళ్లు ఇచ్చాడే..అతను వాళ్లబాయి క్రిష్ణ. ఏడో తరగతి చదువుతున్నాడు. సెలవులు కదా! అలా బాట సారులకి సాయం చేయడంలో వాళ్ల నాన్నకు చేదోడు వాదోడుగా ఉంటాడు. వాళ్లంటే మా ఊళ్లో అందరికీ ఎంతో గౌరవం, అభిమానం. మేమెలాగూ అలా చేయలేం. కనీసం డబ్బిస్తామన్నా తీసుకోడు. పైగా ’డబ్బు మంచిది కాదు సార్! ఇచ్చిన మీకు ‘అది సరిగా కర్చు పెడతాడా, కొద్దిగా పక్కకు పెట్టుకుంటడా’ అన్న అనుమానం ఉంటది. నాకూ..‘నాలుగు పైసలు సూస్తే మనసు మారుద్దేమో’ అన్న బెంగ ఉంటది. అందుకే బగమంతుడు ఇచ్చిన కాడికి గిట్ల సాయం జేస్త’ అంటాడు" అంటూ వివరాలు చెప్పాడు.

పట్నం వచ్చి డబ్బు సంపాదనలో పడి చిన్న చిన్న సహాయాలు చేయడం కూడా మానేశాడు మనిషి. ఏది చేసినా తగిన ప్రతిఫలం తీసుకోవలసిందే! అన్నీ అమ్ముకోవడమే!! సహాయం, ఆదుకోవడం అన్న పదాలు గ్రామాల్లోనే పచ్చగా ఉంటున్నాయి. కోట్లు సంపాదించినా తృప్తి లేని కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీల లాంటి వాళ్లు బ్యాంకులని మోసం చేసి ప్రజా ధనంతో ఉడాయిస్తే, రెక్కాడితే గాని డొక్కాడని నర్సింగ్ లాంటి వాళ్లు మానవ సేవలో ముందుంటున్నారు. ఎందుకో నా కళ్లలో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి.

"అయ్యో ఆ పచ్చడి కారంగా ఉన్నట్టుంది. మంచి నీళ్లు తాగండి"అన్నాడు ఆ వ్యక్తి. నేను నవ్వాను.

సాయత్రం మూడు గంటలు.

ఎండ ఇంకా నిప్పులు చెరుగుతోంది.

సిటీకి వెళ్లిపోడానికి బస్టాప్ చేరాను. నర్సింగ్ కనిపించాడు. అతణ్ని దగ్గరకి పిలిచి పొద్దున్న అతను చేసిన సహాయం గుర్తు చేసి, చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పాను. అతను’ అవునా సార్, యాద్ లేదు"అన్నాడు. చిన్న సాయం చేసి, టీ వీల్లో, పేపర్లలో ప్రచారం చేసుకునే వాతావరణం నుంచి వచ్చినవాణ్ని. అతని వ్యక్తిత్వం అర్థం కావడానికి నాకీ కాస్త సమయం సరిపోదనిపించింది.

జేబు లోంచి వంద తీసి "ఇలాగే గొడుగులు కొని నా తరఫున పంచవా"అన్నాను. "ఊకోండి సారూ, పైసల్తీసుకుంటె అది యాపార మైపాయె!"అంటూ వెళ్లిపోబోయాడు.

"అయితే ఓ పని చేయి, ఇదిగో ఈ గొడుగు, నీళ్లబుర్రా తీసుకో ఎందుకంటే నేను సిటీకి చేరేసరికి సాయంకాలమై ఎండ తగ్గుతుంది. నువ్వు మళ్లొకరికి ఇచ్చుకోవచ్చు" అన్నాను.

అతను నవ్వుతూ అవందుకుని కళ్ల కద్దుకుని సంచీలో వేసుకున్నాడు. నాకు తెలుసు అతను ఆదుకోడానికి ఉచితంగా ఇచ్చినవి, తమ ఇళ్లకు పట్టుకెళ్లి అటకలు ఎక్కిస్తారు తప్ప అలా ఎవరూ ఇవ్వరు. ఈ సారి నేను అతనికి ప్రత్యేకంగా కనిపించాను. నేనెక్కిన బస్ బయల్దేరింది. కిటికీ లోంచి చూశాను అతను ఎవరికో మంచి నీళ్ల బుర్ర ఇప్పిస్తున్నాడు. కనుమరుగయ్యేంత వరకూ అతణ్ని చూస్తూనే ఉన్నాను, ఎందుకంటే అతను ఎంతలా మనసు నిండితే, అంతలా మానవత్వ భావాలు నాలో పెంపొందుతాయి. సిటీలో ఉన్నంత మాత్రా న  మనుషులం, యంత్రాలం కానక్కర్లేదు కదా!

మరిన్ని కథలు