Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఆచారి అమెరికా యాత్ర చిత్రసమీక్ష

movie review

చిత్రం: ఆచారి అమెరికా యాత్ర 
తారాగణం: మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్‌, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ప్రభాస్‌ శ్రీను, పోసాని కృష్ణమురళి, ప్రదీప్‌ రావత్‌, పృధ్వీ, సత్య కృష్ణన్‌ తదితరులు 
సంగీతం: ఎస్‌ఎస్‌ థమన్‌ 
సినిమాటోగ్రఫీ: సిద్దార్ధ్‌ రామస్వామి 
కథ: మల్లాది వెంకట కృష్ణమూర్తి 
దర్శకత్వం: జి.నాగేశ్వర్‌రెడ్డి 
నిర్మాతలు: కీర్తి చౌదరి, కిట్టు 
నిర్మాణం: పద్మజ పిక్చర్స్‌ 
విడుదల తేదీ: 27 ఏప్రిల్‌ 2018 
క్లుప్తంగా చెప్పాలంటే 
కృష్ణమాచారి (మంచు విష్ణు), ఓ పెద్దాయన (కోట శ్రీనివాసరావు) ఇంట్లో హోమం చేయించడానికి వెళతాడు తన అర్చక బృందంతో. ఆ అర్చక బృందంలో కృష్ణమాచారి గురువు (అప్పలాచారి) కూడా ఉంటారు. ఆ హోమం చేస్తున్న సమయంలోనే అమెరికా నుంచి వచ్చిన ఓ అమ్మాయి రేణుక (ప్రగ్యా జైస్వాల్‌) కృష్ణమాచారి కంట్లో పడుతుంది. ఆమెను అతను ప్రేమిస్తాడు. అయితే, హోమం జరుగుతుండగా, ఓ అనుకోని ఘటన చోటు చేసుకుంటుంది. అంతే, హోమం జరిపించిన బృందం భయంతో పారిపోతుంది. ఇక్కడే వుంటే ప్రాణాలు తోడేస్తారనే భయంతో కృష్ణమాచారి, తన గురువు అప్పలాచారిని తీసుకుని, ప్రత్యేక పూజలున్నాయంటూ అమెరికా పయనమవుతాడు. అక్కడ నిజంగానే కృష్ణమాచారి, అప్పలాచారి ప్రత్యేక పూజలు జరిపించారా? రేణుకతో కృష్ణమాచారి ప్రేమ ఏమయ్యింది? అన్న విషయాలు సినిమా చూస్తేనే తెలుస్తాయి. 
మొత్తంగా చెప్పాలంటే 
ఆల్రెడీ గతంలో పంతులు పాత్రలో కన్పించడంతో ఈ సినిమాలోని పాత్ర హీరో విష్ణుకి కొట్టిన పిండిలానే తయారయ్యింది. తన పని తాను చకచకా చేసుకుపోయాడు. కామెడీ టైమింగ్‌ విషయంలో తన ప్రతిభను చాటుకునేందుకు ప్రయత్నించాడు. డాన్సులేశాడు, తనవంతుగా ఏం చేయాలో అంతా చేశాడు. 

హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ అందంగా కన్పించింది. అవసరమైనంత గ్లామర్‌ కూడా పండించింది. నటన పరంగానూ బాగానే చేసింది. హీరో, హీరోయిన్‌ తర్వాత చెప్పుకోవాల్సింది బ్రహ్మానందం పాత్ర గురించే. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండి. మంచి ఈజ్‌తో చేసుకుపోయారాయన. అయితే, వాడుకోవాల్సిన స్థాయిలో బ్రహ్మానందాన్ని దర్శకుడు వాడుకోలేదేమో అన్పిస్తుంది. మిగతా పాత్రధారులంతా 'మమ' అన్పించేశాయి. 

కథ ఓకే, కథనం పరంగా జాగ్రత్తలు తీసుకుని వుండాల్సింది. డైలాగ్స్‌ ఫర్వాలేదన్పిస్తాయి. కామెడీ పంచ్‌ల కోసం ప్రయత్నించడం వరకూ బాగానే వున్నా, కొన్ని చోట్ల అవి విసుగు తెప్పిస్తాయి. పాటలు ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. సినిమాటోఫ్రీ ఓకే. నిర్మాణపు విలువల విషయానికొస్తే, ఎక్కడా రాజీ పడకుండా సినిమాని రిచ్‌గా తెరకెక్కించారు. ఎడిటింగ్‌ చాలా చోట్ల సరిగా లేదనిపిస్తుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓకే. 

కామెడీ నేపథ్యంలో సినిమా అనుకున్నప్పుడు, కాస్తంత కథ, పేస్‌తో కూడిన కథనం కూడా అవసరమే. అవేవీ లేకుండా కామెడీతోనే నెట్టుకొచ్చేయాలంటే అన్ని సందర్భాల్లోనూ కుదరదు. ఔట్‌ డేటెడ్‌ కథ, కథనాలనే ఫీలింగ్‌ సినిమా చూస్తున్నంతసేపూ అన్పించడం దర్శకుడి వైఫల్యమే. కామెడీని కూడా ముతకగా అన్పించడం, గతంలో చూసిన సినిమాల్లోని సన్నివేశాల్లానే అన్పించడం పెద్ద మైనస్‌గా చెప్పుకోవచ్చు. కామెడీపై దర్శకుడికి ఎంత పట్టు వున్నా, ఆ పట్టు ప్రదర్శించలేకపోతే ఫలితం అంత సానుకూలంగా వుండదనడానికి ఈ సినిమానే నిదర్శనం. 
ఒక్క మాటలో చెప్పాలంటే 
అమెరికా యాత్ర ఏమంత గొప్పగా లేదు 
అంకెల్లో చెప్పాలంటే: 2/5.

ఆచారి అమెరికా యాత్ర  చిత్ర విశేషాలు....ఆసక్తికరమైన కథనాల కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.....

http://www.ratingdada.com/1037/achari-america-yatra-movie-review-rating

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka