Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi?

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి... http://www.gotelugu.com/issue265/708/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)... ‘‘మీరే రండమ్మా! మేమిద్దరం ప్రక్కనే ఉంటాంగా! ఎలా తియ్యాలో నేర్పిస్తాం.’’ అన్నాడు రాము.
‘‘లేదు....నేను రాను. మీలో ఎవరో ఒకరు ఇదిగో ఈ ఏ టి ఎమ్‌ కార్డు పట్టుకెళ్లి ఇరవై అయిదు వేలు పట్రండి!’’ అంటూ రామూ చేతికి బ్యాంకు ఏ టి ఎమ్‌ కార్డు ఇచ్చింది ఆమె.

ఆమె చేతిలో కార్డు తీసుకుంటూ సోమూ కేసి చూసాడు రాము. ‘‘నేను అమ్మ గారికి తోడుగా ఉంటాను. నువ్వెళ్ళు’’ అన్నాడు సోము. ఆమె కూడా రామూ భుజం మీద చెయ్యేసి వెళ్ళన్నట్టు తోసి సైగ చేసి చెప్పడంతో రాము కూడా అలాగే అన్నట్టు తల వూపాడు.

‘‘మేము మెట్ల దగ్గరకెళ్లి కూర్చుంటాము. నువ్వు అక్కడికి వచ్చెయ్యి.’’ అంది ఆమె వెనుదిరిగి.

‘‘చలిగా వుంది కదమ్మా! ఒరేయ్‌ సోమూ అమ్మ గార్ని మన బస దగ్గరికి తీసుకు వెళ్ళు. ఈ లోగా నేను డబ్బు పట్టుకొచ్చేస్తాను.’’ అన్నాడు రాము.

‘‘బస!....అదెక్కడుంది?’’ ఆశ్చర్యంగా అడిగింది ఆమె.

‘‘కొండ కెళ్ళే దారుంది కదమ్మా! అదే తొలి పావంచా దగ్గర కొబ్బరి కాయలు కొడతారు కదా! ఆ ప్రక్క నుండి దారుంది. రండి చూపిస్తాను’’ అంటూనే ఆమెని దగ్గరుండి తొలి పావంచా దగ్గరకు తీసుకు వెళ్ళాడు సోము.

దాని ప్రక్కనే కాలి బాట లాంటి సందు లో నుండి తీసుకు వెళ్లాడు.

అది పాడు బడ్డ పెద్ద భవంతి. రాజుల కాలం నాటి పురాతన భవనం. మెట్ల దారిలోనున్న  లైట్ల వెలుగు కొసరి కొసరి అంత వరకూ ప్రసరిస్తోంది. ఆ లేలేత వెలుగులో ఆ భవంతి లోపలకు ఆమెని చెయ్యి పట్టి తీసుకు వెళ్లాడు సోము.

చుట్టూ చీకటిగా వుంది. ఏదీ కాన రావటం లేదు. ఉన్నట్టుండి సోము ఆమె చెయ్యిని వది లేసి ముందుకు నడిచాడు. అలవాటైన ప్రదేశం కావడంతో చీకట్లోనే తడుముకోకుండా ముందుకు నడిచాడు సోము.

సోము చెయ్యి వదిలే సరికి ఒక్క సారే భయంతో బిగుసుకు పోయిందామె. భుజాన బరువుగా ఉన్న బ్యాగ్‌ రెండో భుజానికి మార్చుకుని ఎక్కడున్నదక్కడే కొయ్యబారి పోయి నిలబడి పోయింది.

‘‘బాబూ....ఎక్కడున్నావమ్మా!’’ నెమ్మదిగా గొంతు పెగ్ల్చుకుని సోమూని పిలిచింది ఆమె.

‘‘భయపడకండమ్మా! నేను మీ ప్రక్కనే ఉన్నాను.’’ అంటూ టక్కున అగ్గిపుల్ల వెలిగించాడు సోము. ఆ వెలుగులో దెయ్యంలా కనిపించిన సోమును చూసి ఒక్క సారే ఒళ్ళు జదరించింది ఆమెకు. ఆ మరుక్షణం తేరుకుని ధైర్యం తెచ్చుకుంది.

కొవ్వొత్తి వెలిగించి ఒక దగ్గర పెట్టాడు సోము. అప్పుడు చూసింది. గదిలా ఉంది. ఓమూల గోనె పట్టాలు, సినిమా పోస్టర్లు ప్లాస్టిక్‌ వి క్రింద పరిచి వున్నాయి.

‘‘రండమ్మా! ఇక్కడ కూర్చోండి!’’ అంటూ శుభ్రంగా పరిచిన చోటు చూపించాడు సోము.

ఆ పాడు బడ్డ భవనంలో తనీ రాత్రి తల దాచుకోవడానికి ‘భద్రం’గా వుంటుందనుకుంది ఆమె.

కొవ్వొత్తి వెలుగులో ఓ మూల కూర్చుంది ఆమె. కూర్చుంటూనే బ్యాగ్‌ తాళం తీసి దుప్పటి తీసుకుంది.  మరో చీర తీసి క్రింద పరుచుకుంది. బ్యాగ్‌ లోనే ఓ మూల వున్న వస్తువు చేతికి తగిలే సరికి ఉలిక్కి పడింది.

బయలు దేరినప్పుడే బట్టలతో పాటు ఎందుకైనా మంచిదని తన ఆత్మ రక్షణకు ఉపయోగ పడతాయనుకున్న వస్తువులన్నీ బ్యాగ్‌లో సర్దుకుంది. బొడ్లో దోపుకున్న చుర కత్తి తీసి ఒక మూల చీర క్రింద దాచింది.

బ్యాగ్‌ మూసేయ బోతూ బరువుగా తగిలిన వస్తువు బయటకు తీసింది ఆమె.

కొవ్వొత్తి వెలుగులో ఆమెనే తదేకంగా చూస్తూ కూర్చున్న సోము ఆమె బ్యాగ్‌లో నుండి తీసి అటూ ఇటూ తిప్పి చూసిన వస్తువులను చూస్తూనే ఆశ్చర్యంగా అన్నాడు.

‘‘అమ్మా! అది తుపాకీ కదా! ఆ బొమ్మ తుపాకీ మీకెందుకమ్మా! మీ బాబు కోసం కొన్నారా?’’ ఆనందంగా అన్నాడు.

ఆమె చిన్నగా నవ్వి పిస్టల్‌ ని చీర క్రింద దాచి అలసటగా మేను వాల్చింది.

సోము దగ్గరుండి ఆమెని తీసుకుని తొలి పావంచా దగ్గరకు రావడం మెట్ల ప్రక్కనే కూర్చున్న ఒక వ్యక్తి గమనించాడు. సోముతో ఆమె పాటుబడ్డ పురాతన బంగ్లాలోకి వెళ్లడం వారి వెనుకే వెంబడించి మరీ గమనించాడు అతను.

ఇద్దరూ బంగ్లా లోకి వెళ్ళగానే అతను పరుగు పరుగున వెనక్కి వెళ్లి పోయాడు.

************

దిగువ బస్సు స్టాండ్‌లో బస్సు కోసం అసహనంగా ఎదురు చూస్తూ నిలబడ్డాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. కొండ పై నుండి వస్తూ ముగ్గురు యువకు బైక్‌ తో సహా లోయలో పడి పోయారని వార్త విన గానే పోలీస్‌ స్టేషన్‌ కి మెసేజ్‌ పాస్‌ చేసాడు. పావు గంటలో ట్రాఫిక్‌ పోలీసు జీపులో రావడం...ఘాట్‌ రోడ్‌లో ప్రమాద స్థలానికి వెళ్ళడం అంతా గమనిస్తూనే ఉన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

ఇంతలో కొండ బస్సు అర కొర జనాలతో దిగువ బస్సు స్టాండ్‌లో కొచ్చి ఆగింది.

బస్సును చూస్తూనే వెనుకే వస్తున్న కానిస్టేబుల్‌, ఇద్దరు యువకు కోసం వెదికాడు ఎస్సై.

బస్సు ఆగీ ఆగగానే లోపల ఉన్న కొద్ది మంది ప్రయాణీకులు ఒక్కరొక్కరుగా దిగి పోతున్నారు. దిగుతున్న ప్రతి ఒక్కర్ని పరీక్షగా చూసాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

అందులో ఎవరూ అనుమానించ దగ్గ వ్యక్తి కనిపించ లేదు. 

‘వెధవ కానిస్టేబుల్‌ ఏమయ్యాడు?’ అనుకుంటూనే జేబులో సెల్‌ ఫోన్‌ తీసి రింగ్‌ చేసాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. 

రింగ్‌ వెళ్తోంది గాని ఎవరూ యెత్తటం లేదు. రెండు మూడు సార్లు రింగ్‌ చేసి విసుగ్గా బండ బూతులు తిట్టుకున్నాడు మనసులోనే. వెంటనే రెండో కానిస్టేబుల్‌ సెల్‌ కి కాల్‌ చేసాడు ఎస్సై.

‘‘సార్‌! నమస్తే!’’ అట్నుండి కొండ పైన వున్న కానిస్టేబుల్‌ వినయంగా అన్నాడు.

‘‘ఏడయ్యా! టూ నాట్‌ టూ గాడు పత్తా లేదు. ఆ కుర్రాళ్లని తీసుకుని కొండ దిగాడా? లేదా?’’ కోపంగా అరిచాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘దిగారు సార్‌. కొండ బస్సుని ఫాలో చేస్తూ అర గంట క్రితమే కొండ దిగేసారు.’’ అన్నాడు కానిస్టేబుల్‌.

అప్పటికే కొండ పైకి కూడా బైక్‌ ఏక్సిడెంట్‌ విషయం గాలి వార్తలా చేరి పోయింది. ‘ఒక వేళ ఈ ముగ్గురే ఏక్సిడెంట్‌కు గురి కాలేదు కదా!’ మనసు లోనే ఆందోళన పడ్డాడు.

‘‘ఫోన్‌ చేస్తూంటే ఎత్తటం లేదయ్యా! కొండ బస్సు దిగువకు చేరుకుని అయిదు నిమిషాలయింది. బస్సు కూడా ఖాళీగా వచ్చింది. పది మంది కూడా పాసింజర్లు లేరు. వాళ్లలో నాకు అనుమానించ దగ్గ స్త్రీ కనిపించ లేదు.’’ చెప్పాడు ఎస్సై.

‘‘అదేంటి సార్‌! బస్సు అంతా కిక్కిరిసి పోయింది కదా సార్‌. జనంతో కిట కిట లాడుతూ ఇక్కడ నుండి బయలు దేరింది.’’ చెప్పాడు కానిస్టేబుల్‌.

కానిస్టేబుల్‌ చెప్పింది వినే సరికి ఎస్సై అక్బర్‌ ఖాన్‌కి మతి పోయింది. వెంటనే కొండ బస్సు డ్రైవర్‌ దగ్గరకు వెళ్ళి అడిగాడు ఎస్సై.

‘‘అవును సార్‌! కొండ మీద నుండి కిక్కిరిసిన ప్రయాణీకులతోనే దిగాను. దారిలో బైక్‌ ఏక్సిడెంట్‌ దగ్గర బస్సు ఆగింది. చాలా మంది అక్కడే దిగి లోయలో పడ్డ బైక్‌ని, బైక్‌తో పాటు లోయలో పడ్డ యువకుల్ని చూడడానికి దిగి పోయారు’’ చెప్పాడు డ్రైవర్‌. ఉలిక్కి పడ్డాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘కొంప దీసి ఏక్సిడెంట్‌కి గురైంది కానిస్టేబుల్‌ తో పాటు ఆ యువకులు కాదు కదా! ఆమె కూడా అక్కడే దిగి పోయి వుంటుంది.’  అనుకుంటూనే మళ్లీ సెల్‌ తీసి యువకులతో కొండ దిగిన కానిస్టేబుల్‌కి రింగ్‌ చేసాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

రింగ్‌ అవుతోంది గాని సెల్‌ రిసీవ్‌ చేసుకోవటం లేదు. ‘ఎస్‌! కానిస్టేబుల్‌ తో సహా ఆ యువకులే ఏక్సిడెంట్‌ కి గురై ఉంటారు.’’ అనుకుంటూనే ఆతృతగా బుల్లెట్‌ మీద కూర్చుని స్టార్ట్‌ చేసాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

*************

ఆమె తో పాటు సోము తొలి పావంచా కేసి నడిచి వెళ్తుంటే  క్షణం సేపు చూస్తూ నిలబడి పోయాడు రాము.

వాళ్లిద్దరూ తొలి పావంచా దగ్గరకు వెళ్ళే సరికి ఆమె ఇచ్చిన ఏ.టి.ఎమ్‌. కార్డు చేత్తో పట్టుకుని హుషారుగా ముందుకు కదిలాడు రాము.
ఇంతలో రోజూ గస్తీ తిరిగే పోలీస్‌ రక్షక్‌ వాహనం నేరుగా బస్సు స్టాండ్‌లో నుండి వచ్చి ఏ.టి.ఎమ్‌. సెంటర్‌ ముందు ఆగింది.

పోలీస్‌ జీపుని చూడగానే టక్కున ఆగి పోయాడు రాము. కొండ దిగి వస్తున్న యాత్రీకుల పురూరవ బిల్డింగ్‌లో ఆ చివర  ఒకటి  ఈ చివర ఒకటి ఉన్న దేవస్థానం కేంటీన్‌ కేసి నడిచి వెళ్తున్నారు.

ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్లి పోయిన వాళ్ళు నేరుగా ఎవరి ప్రాంతాలకు వాళ్ళు తరలి వెళ్లి పోతున్నారు.

పోలీసు కళ్ళు గప్పి ఏ.టి.ఎమ్‌లోకి వెళ్లాల్సిన పని తనకేమిటి? తానేమీ దొంగ కాడు కదా! అనుకుంటూ దర్జాగా రక్షక వాహనం ప్రక్క నుండే ఏ.టి.ఎమ్‌ సెంటర్‌ లోకి వెళ్లడానికి మెట్లెక్కాడు రాము.

చిరిగిన చొక్కా, ఒక కాలుకి ఫుల్‌గానూ, మరో కాలుకి సగమే వున్న అటూ ఇటూ కాని నిక్కరు వేసుకున్న రాముని చూసిన కానిస్టేబుల్‌ ఒకడు ఉలిక్కి పడ్డాడు. రక్షక వాహనంలో ఎదర కూర్చున్న హెడ్‌ కానిస్టేబుల్‌ని తట్టి రాముని చూపించాడు.

ఏ.టి.ఎమ్‌ సెంటర్‌లోకి అడుగు పెట్టిన రామూనే ఇద్దరూ తదేక దృష్టితో చూస్తూ కూర్చున్నారు.

ఏ.టి.ఎమ్‌ లో పాతిక వేల రూపాయలు డ్రా చేసి గుప్పెట్లో మడిచి పట్టుకున్న రాముని చూసి పోలీసులిద్దరూ ఆశ్చర్య పోయారు. ఛటుక్కున రక్షక వాహనం మీద నుండి గెంతి మెట్లు దిగుతున్న రాముకి ఎదురుగా నిలబడ్డారు పోలీసులు. పోలీసులిద్దర్నీ చూస్తూనే భయ పడ్డాడు రాము. ‘అయినా తను దొంగతనం చెయ్య లేదుగా. ఈ డబ్బు అమ్మ గారిది. అడిగితే అదే చెప్తాను.’ మనసు లోనే స్థిరంగా అనుకున్నాడు రాము.

***********

‘‘అమ్మ గారూ! ఒంట్లో బాగా లేదా?’’ బ్యాగ్‌ తల క్రింద పెట్టుకుని మేను వాల్చిన ఆమె కేసి చూస్తూ అడిగాడు సోము.

(ఏటీఎం దగ్గర పోలీసుల కంటపడిన రాము పరిస్థితి ఏమిటి? అతదీ నుంచి పోలీసులు రాబట్టిన విషయాలేమిటి?? ఇప్పుడైనా పోలీసులకు చిక్కక తప్పదా??? సస్పెన్స్ వీడాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా ఆగాల్సిందే...)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్