Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి...http://www.gotelugu.com/issue265/707/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/


(గత సంచిక తరువాయి).... గాయత్రి శరణ్య ఇచ్చిన డబ్బులతో కొద్ది స్టీల్ సామాను, కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు, ఇంటికి కావలసిన సరుకులు కొన్ని కొంది. ఆమెకి ఇల్లు అద్దెకి ఇచ్చిన సుశీల గుంటూరు జిల్లా పెద నంది పాడు లోని జిల్లా పరిషత్ స్కూల్లో సైన్సు టీచర్ గా పని చేస్తోంది. ఆవిడ భర్త రమణ  శరణ్య ఆఫీస్ లో హెడ్ క్లర్క్ ..శరణ్య డిప్యూటీ ఎం ఆర్ వో గా రాగానే సుశీల ఆవిడని కలిసి తనని తను పరిచయం చేసుకుంది. నందిగామ లో వాళ్ళకి పెద్ద ఇల్లు, ఆస్తులు ఉన్నాయి. సుశీల పెద నంది పాడులో పుట్టింటి వారి దగ్గర ఉంటూ వారానికి మూడు రోజులు నందిగామ వస్తుంటుంది.

వాళ్ళకి పిల్లలు లేరు.. ఇద్దరికీ రెండు మూడేళ్ళు తేడాగా యాభై ఏళ్ళు ఉంటాయి కాబట్టి ఇంకా పిల్లలు  పుట్టే అవకాశం కూడా లేదు. శరణ్య పట్ల  భార్యా భర్తలిద్దరూ కూడా మర్యాదగా, అభిమానంగా ఉంటారు. గాయత్రికి అంగన్ వాడి కార్యకర్తగా ఉద్యోగం వేయించ గానే ఆఫీసులో చెల రేగిన విమర్శల వెల్లువ కళ్ళారా చూసిన  రమణ ఆ విషయం భార్యకి చెప్పాడు. సుశీల శరణ్య ని సమర్ధించి “ఒక అమ్మాయికి ఏదో తన చేతిలో ఉన్న సాయం చేసినందుకు ఇలా మాట్లాడతారా” అంటూ భర్త మీద విరుచుకు పడింది. “మీరు మాత్రం వాళ్లతో చేరకండి.. చిన్న వయసులో ఇంత పెద్ద పోస్ట్ లో ఉంది... జనాలు కుళ్ళి చచ్చే వాళ్ళు చస్తూనే ఉంటారు.. అవన్నీ లక్ష్య పెట్టద్దు అని నేను ఆవిడకి ఫోన్ చేసి చెప్తాను” అంటూ అప్పటికప్పుడు శరణ్యకి ఫోన్ చేసి ధైర్యం చెప్పింది.

ఆవిడ సంస్కారానికి శరణ్య చలించి పోయింది. వయసులో పెద్దదైన సుశీల ఆ క్షణంలో ఒక అక్కలా అనిపించింది.  ఆ సందర్భంలోనే గాయత్రి గురించి క్లుప్తంగా చెప్పి ఆ అమ్మాయికి ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తే తన భుజాల మీద బరువు దిగుతుందని  చెప్పింది. సుశీల దంపతులకి నంది గామలో ఉన్న ఇల్లు సుమారు నాలుగు వందల గజాల స్థలం ... మూడు వందలకి కొంచెం తక్కువ స్థలంలో ఇల్లు కట్టుకుని మిగతాది ఖాళీగా వదిలేశారు. వెనక పెరడు.. ఆ పెరట్లో  సరదాకి నాటిన కొన్ని చెట్లు తప్ప మొక్కలు పెంచుకునే సమయం వాళ్ళకి లేదు. ఆ ఇల్లు కూడా ఒక ప్లాన్ ప్రకారం ఉండదు. పెద్ద హాలు, హాలుకి కుడి వైపు, ఎడమ వైపు ఒక్కో గది, హాలు దాటి లోపలికి వెళ్తే కుడి వైపు పెద్ద పడక గది, కొంచెం వసారాలా వదిలి కుడి వైపు వంట గది, ఎడమ వైపు విశాలంగా ఉన్న భోజనాల గది లోనే ఒక వైపు పూజ గది, వెనకాల పెద్ద ఖాళి స్థలం, క్రమ పద్ధతిలో లేని కొన్ని పూల మొక్కలు, ఒక మామిడి చెట్టు, ఒక సపోటా, ఒక జామ చెట్లు.. ఈశాన్య మూల బావి, వాయవ్యంలో బాత్రూం, లావెట్రీ ..

హాలుకి ఎడం పక్క ఉన్న గదికి ఆనుకుని ఉన్న స్థలంలో చిన్న వంట గది వేసి, బట్టలుతుక్కోడానికి, అంట్లు తోముకోడానికి పంపు, పంపు చుట్టూ  సిమెంట్ తో చదును చేసి గట్టులా కట్టారు. ఎప్పటి నుంచో ఆ పోర్షన్ ఎవరి కన్నా కాస్త మంచి వాళ్ళకి, తోడుగా ఉండే వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నారు కానీ కుదర లేదు. ఇప్పుడు శరణ్య మీద గౌరవంతో, గాయత్రి మీద సానుభూతితో గాయత్రికి ఆ పోర్షన్ ఇవ్వడానికి అంగీకరించింది సుశీల.

ఆవిడకి డబ్బు కన్నా ఒక మంచి మనిషి తోడు అవసరం. తను ఊళ్ళో ఉండనప్పుడు కాస్త మొక్కలని, ఇంటిని చూసుకునే మనిషి కావాలి. గాయత్రి ఆవిడకి నచ్చింది. ఆవిడ కోరుకున్నట్టే ఉదయం హడావుడిగా వెళ్ళి పోయినా స్కూల్ నుంచి రాగానే వాకిలి, పెరడు ఊడ్చి, మొక్కలకి నీళ్ళు పోసి, పురుగు వచ్చిన మొక్కలకి చీమల మందు చల్లి కాపాడడం కాక,  మరి కొన్ని గులాబీలు, కనకాంబరాలు నాటింది గాయత్రి.   అది చూసిన సుశీల గాయత్రి పనితనానికి, నెమ్మది స్వభావానికి ముగ్దురాలైంది. తను కోరుకున్నట్టే మంచి అమ్మాయి ఆ పోర్షన్ లోకి వచ్చిందని సంతోష పడింది.

సుశీల ఈ మధ్య గురు వారం సాయంత్రాని కల్లా నందిగామ వచ్చేస్తోంది. ఇంట్లో ఉన్నప్పుడు గాయత్రి, సుశీల కబుర్లు చెప్పుకుంటూ, బాబుతో ఆడుకుంటూ గడిపేస్తారు. క్రమంగా సుశీల, గాయత్రిల అనుబంధం బల పడ సాగింది. ఇంకా ఒక్క సంవత్సరం కష్ట పడితే వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకో వచ్చునని, అప్పుడైతే పెన్షన్ వస్తుందని చెప్పింది సుశీల.

రమణ గాయత్రితో ఎక్కువగా మాట్లాడడు.  అతను ఇంట్లో ఉన్నప్పుడు గాయత్రి సుశీలతో కూడా మాట్లాడదు. ఆవిడ వారంలో మూడు రోజులు ఇంట్లో ఉండి రక, రకాల వంటలు చేస్తుంది. అవి గాయత్రికి ఇస్తుంది. ఇద్దరూ పెరట్లో కలుసుకుని మొక్కలు చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటారు. పూసిన పూలు, కాసిన కాయలు ఇద్దరూ సమానంగా పంచుకుంటారు. బాబుని తన ఇంటికి తీసుకు వెళ్ళి భార్యా భర్తలిద్దరూ వాడితో ఆడుకుంటారు. సుశీల గుంటూరు నుంచి వాడికి మంచి డ్రెస్ లు, బొమ్మలు కొని తెస్తుంటుంది.

ఈ విషయాలన్నీ తెలుసుకున్న శరణ్యకి  గాయత్రిని ఒక మంచి మనిషి సంరక్షణలో వదిలానని తృప్తి కలిగింది.

అయితే ఆఫీస్ లో శరణ్యకి మరో దెబ్బ తగిలింది.

సనత కుమార్ ఆమెకి ఫేవర్ చేస్తున్నాడని ఇద్దరికీ మధ్య ఏదో ఉందని పుకార్లు బయలు దేరి నెమ్మదిగా శరణ్య చెవిని చేరాయి. నిర్ఘాంత పోయింది. ఎంతో మంచివాడు, సంస్కారవంతుడు అయిన ఆఫీసర్, సీనియర్, తన పై అధికారి వృత్తికి సంబంధించి తరచుగా అతన్ని కలుసుకోడం, అతనితో కలిసి ఇన్స్ పెక్షన్స్ కి, మీటింగ్ లకి వెళ్ళడం తప్పా.. అలా అయితే తను ఈ ఉద్యోగం ఎలా చేయ గలదు. ఇవాళ సనత కుమార్ , రేపు ఇంకొకళ్ళు ఆ స్థానంలో ఎవరున్నా తను ఇలాగే ఉండాలి.. వాళ్ళు అలాగే ఉండాలి. అంత మాత్రాన సంబంధాలు అంట గట్టడం ఎంత నీచం!  అది తెలిసిన రోజు మూడ్ ఆఫ్ అయి పోయింది. ఆఫీస్ లో ఉండాలని అనిపించ లేదు.  మీటింగ్ కూడా కాన్సిల్ చేసి మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళి పోయింది.

వెళ్ళ గానే తేజకి ఫోన్ చేసి విషయం చెప్పి బాధ పడింది.

రుద్ధమైన స్వరంతో  “ఏం మనుషులు తేజా! కొంచెం కూడా సంస్కారం లేని మనుషులు.. ఛి ఛి  నేను ఈ ఉద్యోగం చేయ లేను... రిజైన్ చేస్తాను” అంది.

తేజ ఓదారుస్తూ అన్నాడు “ అందరూ నీలా , నాలా ఆలోచిస్తారనుకుంటున్నావా! ఈ సమాజంలో ఎనభై శాతం అలాగే ఉంటారు.. చూసీ చూడనట్టు వెళ్లి పోవాలి.  నువ్వు వాళ్ళ బాస్ వి కదా... వాళ్ళు నీ గురించి ఏమనుకుంటే ఏం .. నీ పై అధికారులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది నీకు ఇంపార్టెంట్.  అయినా ఇంకెంత మేటర్ ఆఫ్ హర్డ్లీ వన్ మంత్. మన పెళ్లి అయి పోతుంది... నేను నీతో ఉంటాను.. ఎవడన్నా ఏదన్నా వాగాడంటే నా చేతులో చచ్చాడన్న మాటే..”

అతను అన్న తీరుకి నవ్వొచ్చింది శరణ్యకి. “ ఏం సినిమాల్లో లాగా ఎడా-పెడా కొట్టేస్తావా ఏం” అంది.

“మరి కాక ముద్దు పెట్టుకుంటానా ...కాళ్ళు, కీళ్ళు విరగ్గోట్టేస్తా.”

“ థాంక్స్ ... అవన్నీ చేయక పోయినా నన్ను అర్ధం చేసుకున్నావు చాలు తేజా.. నీలాంటి భర్తలున్న ఏ ఆడదైనా చాలా అదృష్టవంతురాలు... మిలియన్ డాలర్ల ఆస్తికన్నా కష్టంలో, సుఖంలో నీకు నేనున్నాను అంటూ హృదయ పూర్వకంగా భరోసా ఇచ్చే ఓ ఆత్మీయుడు భర్త కావడం ఎంతో సెక్యూరిటీ ని ఇస్తుంది”  మనస్ఫూర్తిగా అంది. తరవాత మరి కాసేపు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు.
తేజ ఇచ్చిన సపోర్ట్ మరింత ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపగా ఎప్పటి కన్నా హుందాగా ఆఫీసుకి వెళ్ళింది.  ఎప్పటి లాగే  మీటింగ్స్ కి సనత కుమార్ తోటే కలిసి వెళ్ళడం, తను కండక్ట్ చేయాల్సిన మీటింగ్స్ కండక్ట్ చేయడం,  ఎవరికీ భయ పడకుండా తన సిద్ధాంతాలను అనుసరిస్తూ ముందుకు సాగి పోతోంది.

ఇరు వైపులా పెద్దలను కలిసి దగ్గరుండి పెళ్లి ముహూర్తాలు పెట్టించాడు తేజ.

శరణ్య పెళ్ళికి పది రోజులు లీవ్ పెట్టింది.

సనతకుమార్ ఆమెకి శుభాకాంక్షలు చెప్పి ఆమె లీవ్ అనుమతిస్తున్నట్టుగా రికమెండ్ చేసి కలెక్టర్ ఆఫీస్ కి పంపించాడు.

ఆమెని తీసుకు వెళ్ళడానికి తేజ విజయవాడ వచ్చాడు.

రెండు పడక గదుల ఫ్లాట్ చూసి  “ఇంత చిన్న ఫ్లాట్ తిసుకున్నావేంటి.. వెంటనే మనం త్రీ బెడ్ రూమ్ కి షిఫ్ట్ అవుదాం.. నీ స్టేటస్ కి కాని, నా స్టేటస్ కి కానీ ఇది తగినది కాదు” అంటూ అప్పటికప్పుడు లబ్బి పేటలో తన ఫ్రెండ్ ద్వారా అత్యంత ఆధునికంగా ఉండే ఫ్లాట్ తీసుకున్నాడు.  “ఓనర్స్ దగ్గర రెండు నెలల అడ్వాన్సు ఉంది ... లీవు నుంచి వచ్చాక షిఫ్ట్ అవుదాం” అంది శరణ్య. తేజ సరే అన్నాడు.

రెండు రోజులు విజయవాడ లో ఉండి,  అక్కడ కూడా షాపింగ్ చేసి, కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని మంగళగిరి, అమరావతి కూడా వెళ్లి స్వామి దీవెనలు పొంది ఇద్దరూ హైదరాబాద్ బయలు దేరారు. వెళ్లే ముందు ఒక్క సారి గాయత్రిని చూసి ఎలా ఉందో కనుక్కుందామనుకుంది కానీ కుదర లేదు.

గాయత్రిని తేజకి చూపించాలి అనుకుంది.. తేజ ఆమెని కలుసుకోడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు.. “ఆమెకి ఏ జన్మలోనో మనం ఋణపడి ఉంటాం ... చేతనైంది చేశాం మన పని అయి పోయింది...ఇంక ఆ అమ్మాయితో మనకేం పని” అన్నాడు.

నిజమే కదా అనిపించింది గాయత్రికి. నిజమే ఎవరీ గాయత్రి? ఎందుకు తనకి ఎదురైంది.. ఎందుకు తను ఆమెకి సహాయం చేయాల్సి వచ్చింది.. పోనీ ఆ చేసే సాయం ఏదో తల్లి, పిల్లలను కలిపితే బాగుండేది. అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారి పోయింది.

తేజ గాయత్రిని చూడలేకపోవడం కేవలం యాధృచ్ఛికమేనా......తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా ఆగాల్సిందే....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana