Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

నాన్నకు ప్రేమతో.. - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

మా నాన్నగారు కష్టజీవి అని పోయినవారం చెప్పాను కదండి. ఆయనంటే ఎందుకో నాకు చాలా జాలి అని కూడా చెప్పాను కదా! ఇప్పుడంటే యువతరం స్కూళ్లకి, కాలేజీలకీ బైక్ ల మీద వెళుతున్నారు కాని, మా చిన్నప్పుడు  ప్రతి ఇంటికీ సైకిల్ ఓ గొప్ప వాహనం. మా నాన్నగారికీ ఒక పాత సైకిల్ ఉండేది. అది వాళ్ల నాన్నగారిదని మా అమ్మ అంటుండేది (బహుశా వేళాకోలానికేమో తెలియదు). ఆయన ఎక్కడికెళ్లినా దానిమీదే! నాకు ఊహ తెలిసినప్పటినుంచి దాని సీటుకి ముందుండే కడ్డీ నాకు సీట్. మొదట్లో ఆ కడ్డీకి గుడ్డలు కట్టి మెత్తగా చేసి నన్ను కూర్చో బెట్టేవాడు. తర్వాత్తర్వాత దానికి ఎర్రటి సీటు బిగించాడు. దాని మీద నన్ను కూర్చోబెట్టుకుని ఆయన సైకిల్ తొక్కుకుంటూ నన్ను ఎక్కడికైనా తీసుకెళుతుంటే అంబారీ ఎక్కి ఊరంతా ఊరేగుతున్నట్టనిపించేది. ఇప్పుడంటే పెన్షన్ డబ్బు బ్యాంకులో జమ అవుతోంది గాని, అప్పట్లో మా నాన్నగారు నన్ను ముందు కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కుకుంటూ సిక్ విలేజ్ కెళ్ళి (మా ఇంటి దగ్గరి నుంచి సుమారు ఏడు కిలోమీటర్లు) నెలకోసారి పెన్షన్ తీసుకునేవారు. అలాగే ఇప్పుడంటే వీధి వీధికీ కూరల షాపులు, వారపు సంతలు వచ్చేసాయిగాని, అప్పట్లో వారానికి సరిపడ కూరలు, సరుకులూ తెచ్చుకోడానికి, తక్కువ ధరలో వస్తాయి గనక నాలుగు డబ్బులు వెనకేసుకోడానికి సికింద్రాబాదు మోండా మార్కెట్టుకూ (మా ఇంటి దగ్గరి నుంచి సుమారు పన్నెండు కిలోమీటర్లు) నన్ను సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లేవాడు. నెలలో వచ్చే ఆయా రోజుల కోసం నేను ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురుచూసేవాణ్ని. వెనక సైకిల్ హాంగర్ మీద బరువైన సరుకుల మూటలు, ముందు నేను. (అంత బరువేసుకుని రోడ్డు ఎత్తులను, ఎదురు గాలులను ఎలా ఎదురుకుంటూ తొక్కేవాడో పాపం. ఇప్పుడు తలచుకుంటే మనసు ద్రవించి, కళ్ళు మసకబారతాయి).

నేను చిన్నప్పట్నుంచి నాన్నకిష్టమైన సైకిల్ కాబట్టి ఒక డబ్బాలో కాస్త కిరోసిన్, మరి కాస్త కొబ్బరి నూనె కలిపి గుడ్డతో తళ తళ్లాడేలా తుడుచేవాణ్ని. ముఖ్యంగా రెండు చక్రాల రిమ్ములు. నేను తుడిచాక, కాస్త వెలుగు వాటి మీద పడితే అవి ధగ ధగలాడేవి. దాన్ని చూసి మా నాన్న మీసాల చాటునుంచి చిన్నగా నవ్వితే నాకెంత సంతోషం కలిగేదో!

ఆయన అలా సైకిల్ తొక్కి ఆఫీసుకెళుతూ, వస్తూ యాభై ఏళ్ల వయసుకు చేరాడు. అప్పటికి నేను యువకుణ్ని. ఆ వయసులో మా నాన్న ఆయాసపడుతూ సైకిల్ తొక్కడం నాకెందుకో బాధ అనిపించింది. స్కూటర్ కొనుక్కోవాల్సిందేనని పోరాను. మా అమ్మ నాకు వంత పాడింది. మాది మధ్యతరగతి కుటుంబం కాబట్టి బాధ్యతలకు దడిసో, అంత డబ్బు స్కూటర్ కి పెట్టడం ఎందుకనో వాయిదా వేస్తూ వచ్చాడు. కొంతకాలం తర్వాత మేము మరింత గట్టిగా పట్టుపట్టాం. ఎయిర్ ఫోర్స్ లో పనిజేస్తూ, హకీం పేటలో ఉండే ఒకాయన తన స్కూటర్ అమ్ముతున్నాడని తెలిసి వెళ్ళి అది కొనుక్కొచ్చారు. మా ఇంటిల్లిపాదీ ఆనందించిన సందర్బం అది. లాంబ్రెట్టా స్కూటర్ అది. మీరు నమ్మరు కాని ఈ చివరి నుంచి ఆ చివరిదాకా వెడల్పుగా ఉండేది. మా ఫ్యామిలీ అంతా ( మా అమ్మానాన్నలు, నేను, తమ్ముడు) దాని మీద ఎక్కడికైనా వెళ్లేవాళ్లం.

సెకెండ్ హాండ్ వెహికిల్ కాబట్టీ, సర్వీసింగ్ కి ఎక్కువ కర్చయ్యేది. ఇంటి దగ్గర దానికో సర్దార్జీ ఫ్యామిలీ మెకానిక్ గా ఉండేవాడు. ఆయన బాగా రిపెయిర్ చేసేవాడు కానీ ఒకటైతే మరొకటి రెడీగా ఉండేది. అలా మా నాన్న జేబుకి ఆ స్కూటర్ పెద్ద చిల్లే పెట్టేది. ఇది ఒక ఎత్తయితే దాన్ని పొద్దున్నే స్టార్ట్ చెయ్యడం మరో ఎత్తు. మా నాన్న పొద్దుటి పూట ఆఫీసుకెళ్లడానికి దాదాపు అరగంట దాకా ఆయాస పడుతూ దాన్ని స్టార్ట్ చేయడానికి తిప్పలు పడేవాడు. నేను మొదట్లో పట్టించుకోలేదు కాని, తర్వాత దాన్ని స్టార్ట్ చేసే బాధ్యతను నేను తీసుకుని స్టార్ట్ అవ్వంగానే మా నాన్నకి ఇచ్చేవాణ్ని. ఇలా కొంతకాలం జరిగాక నాకో ఆలోచన వచ్చింది, అదేంటంటే- పొద్దుటి పూట నేను స్టార్ట్ చేసి ఇస్తున్నాను బాగానే ఉంది. కాని, సాయంత్రం అక్కడ కూడా ఇది ఆయణ్ని ఇబ్బంది పెడుతుందిగా, మరప్పుడు? అదే విషయం అడిగాను. ఆయన నవ్వుతూ ‘పార్కింగ్ లో ఓ కుర్రాడు ఉంటాడు. అతను సహాయం చేస్తాడు" అన్నాడు. "ఓహ్! అలాగా, మరి అతను లేకపోతే.."అన్నాను.

కొద్దిసేపు మౌనం వహించి ‘ఏం చేస్తాను. నేనే స్టార్ట్ చేసుకుంటాను’ అన్నాడు. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. మళ్లీ పట్టుబట్టి వారం రోజుల్లో దాన్ని అమ్మించేసి, బేగంపేటలోని సాబూ షోరూం లో మరో కొత్త స్కూటర్ కొనిపించాను.

మళ్లీ మా ఫ్యామిలీకి కొత్త వాహనం అమరింది. ముఖ్యంగా మా నాన్నగారు హాయిగా, ఆనందంగా ఆఫీసుకు వెళ్లొస్తున్నారు. ఆయన ఒకింత సంతోషం నాకు పదింతలు కాబట్టి, ఆ సన్నివేశాన్ని మీరే ఊహించుకోండి.

మరిన్ని శీర్షికలు
weekly horoscope may 18th to may 24th