సంబంధం వచ్చిన ప్రతి సారీ పెళ్లికి తొందర లేదంటున్న బంగారంకి... తల్లి లలితమ్మ కన్నీళ్ళు, దమయంతి గారి యక్ష ప్రశ్నలు ఎదురయ్యాయి. సమాధానం ఇవ్వలేక సతమతమయింది బంగారం..
‘ఎవరినైనా ప్రేమించావా?’ అని సోఫియా అడిగినప్పుడు కూడా జవాబు చెప్ప లేక పోయింది. మనసా, వాచా సాగర్ బాబుని ఆరాధిస్తున్నానని చెప్ప లేక తల్లడిల్లి పోయింది. అతన్ని అనుసరిస్తూ, అతని ఆలోచనలతో మమేకమౌతూ జీవించడం లోనే తనకి ఆనందం ఉందని, తనకి పెళ్లిపై ఆసక్తి లేదని వాళ్ళతో వాదించ లేక పోయింది..
సాగర్ బాబుతో ఇప్పటిలా ఒకింత సాన్నిహిత్యం, ఒకింత స్నేహం, ఒకింత ఆప్యాయత, ఒకింత మక్కువ ఉంటే చాలని భావించింది. శారీరక వాంఛలకి, ప్రయోజనాలకి తన ప్రేమ అతీతమైనదని ఆమె నమ్మింది. అలాగే తన ప్రేమ ఫలించేది కాదని కూడా బంగారం నమ్మింది. దాంతో వయసుకి మించిన అవగహన, నిగ్రహం ఏర్పడ్డాయి ఆమెలో.
**
ఓ రోజు బంగారం తో పాటు దేవుడి గది శుబ్రం చేయ సాగింది దమయంతీ గారు. ఆ అమ్మాయి వేసిన ముగ్గుకి రంగులద్దుతూ, “చూడు బంగారం... సాగర్ పట్ల నీకు ఎనలేని అభిమానం, ఆరాధన ఉన్నాయని గ్రహించాను. అయితే అవి నీ భవిష్యత్తుకి ఆటంకాలు కారాదు. కాబట్టి, చదువు పూర్తయ్యేప్పటికైనా నీకు నచ్చిన సంబంధానికి ‘ఓకే’ చెప్పు. పెళ్లి చేసుకుని స్థిర పడు..తెలిసిందా? అన్నారామె రవ్వంత హెచ్చరింపుగా....
పెళ్లి వ్యతిరేక వాదనలు అపార్దాలకి దారి తీయ గలవని గ్రహించిన బంగారం, దేవుని పైనే భారం వేసింది.
పెద్ద వాళ్ళ వరాన్వేషణలో మరో రెండేళ్ళు గడిచాయి...
**
బంగారం మెడిసిన్ మూడో సంవత్సరంలో ఉండగా హైదరాబాదుకి సాగర్ ఒక్కడే వచ్చాడు. అదేమని ఆదుర్దాగా అడిగిన కుటుంబానికి... సోఫియా తల్లి కాబోతుందన్న శుభ వార్త చెప్పాడు. తాను తిరిగి వెళ్ళేప్పుడు తల్లితండ్రులని తన వెంట అమెరికా రమ్మని కోరాడు. వాళ్ళు దానికి సంతోషంగా ఒప్పుకున్నారు కూడా...
ఆసుపత్రి పనులే కాక, రాబోయే వారసుడి కబుర్లతో ఇంటిల్లిపాదికీ సరదాగా గడిచి పోతుంది...
అదే సమయంలో మంచి సంబంధం అంటూ.. బంగారంకి, రాహుల్ వర్మతో పెళ్లి ఖరారు చేసారు పెద్దవాళ్ళు. సికింద్రాబాదులో పేరున్న కంప్యూటర్ సంస్థ అధినేత అతను. సాగర్ కూడా ఆమోదించడంతో మనసు రాయి చేసుకుని అందరి అభీష్టానికి తలొగ్గి, మరో నాలుగు వారాలకి రాహుల్ ని పెళ్ళాడింది బంగారం. సాగర్ అమెరికా వెళ్ళే లోగానే బంగారం కాపురానికి వెళ్ళి పోయింది.
రఘురాం, దమయంతీ గార్లకి దగ్గరలో ఉండాలని బంగారం కోరడంతో... శాంతి నివాస్ దగ్గర లోనే తమ కొత్త కాపురానికి నివాసం ఏర్పరిచాడు ఆమె భర్త రాహుల్.
**
కాల గమనంలో నాలుగేళ్ళు గడిచాయి.....
బాబు పుట్టాక కూడా మూడేళ్ళగా ప్రతి యేడూ హైదరాబాదుకి వస్తూనే ఉన్నారు సాగర్, సోఫియాలు. నెల రోజుల పాటైనా ఉంటారు. వారితో తన సంబంధ బాంధవ్యాలని ఎప్పటిలా కొనసాగిస్తూ హౌజ్-సర్జన్సీ కూడా పూర్తి చేసి ఇంటి దగ్గరలోని కాన్సర్ ఆసుపత్రి లోనే ఉద్యోగంలో చేరింది బంగారం.
**
పొద్దుటే సాగర్ వాళ్ళు హైదరాబాదు వచ్చారన్న కబురందుకుని నాలుగేళ్ళ వాళ్ళ బాబు కృష్ణ కోసం కొత్త బట్టలు, బొమ్మలు తీసుకుని శాంతి-నివాస్ లో అడుగు పెట్టింది బంగారం. అందరినీ పలకరించి కృష్ణ వద్ద చేరింది... కథలు కబుర్లు చెబుతూ వాడితో ఆటల్లో మునిగి పోయింది. ఆ పసి వాడితో ప్రత్యేకమైన అనుబంధం ఆమెది..
కాస్త ఎడంగా కూర్చుని, గోళ్ళకి రంగు వేసుకుంటూ వాళ్ళని గమనిస్తుంది సోఫియా.
“కాస్త మాపై కూడా దృష్టి సారించు బంగారం” అంది నవ్వుతూ. “పిల్లలంటే నీకెంత ఇష్టమో తెలుస్తూనే ఉంది. నీ మారేజ్ అయి నాలుగేళ్ళవుతుంది కదా! నీవెప్పుడు బేబీని కంటావు?” అడిగింది సోఫియా..
“నిజమే బంగారం. యేడాదికి మూడు నెలలు మా కృష్ణయ్యకి యశోదమ్మవి కదా! నీవు కూడా త్వరలో ఓ బిడ్డని కనాలమ్మా. సాయానికి ఇక్కడ మేమున్నాముగా” కల్పించుకున్నారు దమయంతీ గారు.
చిరునవ్వే జవాబుగా మౌనంగా ఉండి పోయింది బంగారం...భర్త గురించి, తన కాపురం గురించి గుంభనంగా ఉంటుంది ఆమె.
“నెల రోజుల్లో వాళ్ళ పెళ్లిరోజు కూడా. ఆనవాయితీగా రాహుల్, బంగారం మనింటికి భోజనానికి వస్తారు. మాకు ఓ మనవడ్ని త్వరలో ఇవ్వమని ఆయిన్నే అడిగేస్తాను” నవ్వుతూ అన్నారామె సోఫియాతో...
**
సాగర్ కుటుంబం తిరిగి అమెరికా వెళ్ళిన వారానికి... దమయంతీ గారి ఆహ్వానం అందుకుని, తమ పెళ్ళిరోజు విందుకి కాస్త ముందుగానే శాంతి నివాస్ చేరారు బంగారం, రాహుల్. పెద్ద వాళ్ళతో ఏకాంతంగా మాట్లాడాలని కోరి, రఘురాం దంపతులతో వారి ఆఫీసు రూము లోకి నడిచాడు రాహుల్...
బయట హాల్లోనే ఉండి పోయిన బంగారంకి మాత్రం ఆదుర్దాగా ఉంది. తమ విషయం పెద్ద వారితో ప్రస్తావించాల్సిన అవసరం లేదని కొద్ది రోజులుగా రాహుల్ తో వాదిస్తూనే ఉంది.
రాహుల్ గురించిన ఆలోచనతో ఆమె మనసులో ఘర్షణ చెలరేగింది. తనలో తానే మాట్లాడుతూ ఎదురుగా లేని భర్తతో మనసులోనే మొరపెట్టుకుంది.. ‘...సజావుగా సాగిపోతున్న జీవితాలని ఇలా ఎందుకు తల కిందులు చేయాలని నిశ్చయించుకున్నావు రాహుల్? మన వైవాహిక జీవితం గురించి ఇప్పుడు ప్రస్తావించే అవసరం ఏముంది...తప్పు చేస్తున్నావు రాహుల్.... ఓ భార్యగా నీనుండి నేనేమీ ఆశించను అని తెలుసు కదా! నీ రహస్యాన్ని, నీ జీవనాన్ని ఏనాడు ప్రశ్నించ లేదు. నిన్ను ఆరడి పెట్టనూ లేదు. నీ బలహీనతలని అవకాశంగా మలుచుకోనూ లేదు... నిన్ను గౌరవించాను...నిజానికి నీకు సంసారం అన్నా, స్త్రీ సాంగత్యం అన్నా ఆసక్తి లేదని తెలిసి నేను కృంగి పోలేదు. అదీ మంచికే అని భావించాను. నా మనసుతో సంబంధం లేకుండా నీతో జరిగిన వివాహానికి ఓ పరిష్కార మార్గంగా స్వీకరించి...సాగి పోతున్నాను..అల్లాంటిది నా వాళ్లకి ఇప్పుడు ఈ నిజం తెలిసాక, ఇక పైన ఏమి కానున్నదో...’ అని మదన పడ సాగింది..-..
**
కాసేపటికి ఆఫీసు గది తలుపులు తెరుచుకుని రాహుల్ తో ముందుగా రఘురాం గారు బయటకి వచ్చారు. ‘కాసేపట్లో వస్తామంటూ’ వారిద్దరూ కార్లో బయటికి వెళ్ళి పోయారు..
తరువాత కొద్ది క్షణాలకి దమయంతీ గారు బంగారం వద్దకు వచ్చి, పక్కనే సోఫాలో చతికిల బడ్డారు. నీరు నిండిన కళ్ళతో ఆమె వంక చూస్తూ “ఏమిటమ్మా ఇదంతా? ఇన్నాళ్ళు నీవింతటి క్షోభననుభవించావా?” అంటూ వాపోయిందా పెద్దామె..
ఇక ఉండబట్టలేక ఆమె వొడిలో తల పెట్టుకుని బావురుమంది బంగారం. ప్రేమగా తలపై చేయి వేసారు దమయంతి గారు. “ఆ అబ్బాయి కూడా, ఇన్నాళ్ళకి ఇక నీకు తనతో భవిష్యత్తు లేదని నిర్దారణయ్యాక మా వద్ద విషయం బయట పెట్టాడు. అయినా సంసార జీవితానికి అర్హత లేనివాడు ఇలా అమ్మ బలవంతం చేసిందనో... సమాజం కోసమనో, ఇంత దారుణంగా ఓ ఆడపిల్ల గొంతు కోస్తాడా? నాలుగేళ్ళగా వైద్యుల సహకారంతో కూడా సమస్య తీరలేదంటే... నా దృష్టిలో అది మనిషిలోని లోపం.. ఓ మానసిక రుగ్మత. కళ కళ లాడ వలసిన నీజీవితాన్ని మంచు తాకిన వనంలా మోడు వారనిచ్చావంటే నమ్మ లేక పోతున్నాను. ఇంత పిచ్చి పిల్లవని అనుకో లేదు”... అందామె బంగారం తల నిమురుతూ..
“కనీసం ఇప్పటికైనా నీకు విముక్తి లభించింది. ఇక ఈ క్షణం నుండి ఇక్కడే మన ఇంటనే ఉండిపో. అక్కడకి వెళ్ళాల్సిన పని లేదు. రేపెల్లుండి... అన్నీ సర్దుకుని సామాను తెచ్చేసుకోవచ్చు. నింపాదిగా మీ అమ్మా వాళ్ళని కూడా పిలిపిస్తాను. ఇక న్యాయ పరంగా రాహుల్ తో జరగవలసిన తతంగమంతా మీ బాబాయ్ చూసుకుంటారు” అన్నారామె....
విముక్తి దొరికినట్టుగా ఎగిసింది బంగారం మనసు. రాహుల్ పట్ల సానుభూతి తప్ప కోపం అసలే లేదామెకి. తిరిగి ఆమె మనసులో సాగర్ బాబు పట్ల ప్రేమ భావం తొణికిస లాడింది. వైద్య రంగంలో సాగర్ కి చేదోడు వాదోడుగా ఉంటూ అతని ఆశయ సిద్దికి పాటు పడాలని నిశ్చయించుకుంది.
**
క్లినిక్ పని ముగించుకుని ఇల్లు చేరిన బంగారంకి వాకిట్లోనే రఘురాం గారు ఎదురు పడ్డారు. ఆందోళనగా కనబడ్డారు. ఆయన్ని అనుసరిస్తూ మానేజర్ వాసుతో పాటు చేతిలో సూట్కేసుతో పని వాడు. హడావిడిగా ప్రయాణమయ్యారని తెలుస్తూనే ఉంది. ఇంటి ముందు హాల్లో తెలిసిన వారు, చుట్టాలు ఉన్నారు.
సంశయిస్తూ నోరు తెరిచేలోగా, ఆమె రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నారు ఎదురుగా నిలిచిన రఘురాం గారు.... “ఇది భరించలేని దుఃఖం బంగారం. మీ పిన్ని అపస్మారక స్థితిలో ఉంది.. ఆమెని నీ చేతుల్లో పెట్టి వెళుతున్నాను. త్వరగానే తిరిగి వచ్చేస్తాము” అంటూ నీరు నిండిన కళ్ళతో ఆదరా బాదరాగా అక్కడి నుండి కదిలి వెళ్ళారు.
అర్ధం కాక తడబడుతూ దమయంతి గారి గది లోకి నడిచింది బంగారం. ఆవిడ మంచం మీద పడుకునున్నారు. ఎడంగా కూర్చున్న ఆమె బంధువు వైదేహి లేచి వచ్చి... బంగారంని పక్కనే ఉన్న మరో గది లోనికి తీసుకు వెళ్ళింది.
జరిగిన విషయం చెప్ప సాగింది...
సాగర్, సోఫియాలు ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలియ రావడంతో రఘురాం గారు అమెరికా కి బయలు దేరారంది వైదేహి. తీవ్ర గాయాలకి గురయిన సాగర్ ప్రాణాలతో హాస్పిటల్లో ఉన్నాడని, సోఫియా పరిస్థితి విషమంగా ఉందని కూడా తెలిసిందని వివరించిందామె. ఈ ఘోరం జరిగిన సమయంలో చిన్న వాడు కృష్ణ మాత్రం ఇంట్లోనే ఆయమ్మ వద్ద ఉన్నాడని తెలుసుకుని, వాడితో రఘురాం గారు మాట్లాడారని కూడా చెప్పిందామె. వీలైనంత త్వరలో వారిని హైదరాబాదుకి తీసుకొని రావాలని ఆయన ప్రయ్యాణమయ్యారట..
విషయం విన్న బంగారం చేష్టలుడిగి ఉన్న చోటనే కుప్ప కూలింది. దుఃఖాన మునిగి పోయింది...వైదేహి చెబుతున్న ఓదార్పు మాటలు అలికేసినట్టుగా ఉన్నాయి...అచేతనంగా కూర్చుండి పోయింది..
కాసేపటికి దమయంతి గారు స్పృహ లోకి వచ్చి నర్సు చేత కబురు పెట్టడంతో, పరుగున ఆమె వద్దకి చేరింది బంగారం. బంగారంని హత్తుకుని బావురుమంది ఆమె.
“నీవు అభిమానిస్తూ ఆరాధించే సాగర్ బాబుకి ఎటువంటి దుస్థితి కలిగిందో చూడు బంగారం. బిడ్డని, భర్తని వదిలేసి సోఫియా పర లోకానికి వెళ్ళి పోయినట్టే అంటున్నారు.. ఈ పరిస్థితి తట్టుకోలేను బంగారం” అంటూ దుఃఖంతో ఆయాస పడ సాగారు దమయంతి గారు...
“కాస్త ఓపిక పట్టండి పిన్ని గారు.. వాళ్ళ కోసమైనా మీరు ధైర్యం తెచ్చుకొండమ్మా. మీకు తోడుగా నేనున్నానుగా! మనం తిరిగి వారిని ఆరోగ్యవంతులుగా చేయగలం. నా మాట నమ్మండి” అంటున్న బంగారం వంక అసహనంగా చూసారామె.
“నా ప్రాణాలు పోతాయేమో బంగారం... వాళ్ళు మన వద్దకు వచ్చే వరకు ఉంటానో లేదో. నేనున్నా లేకున్నా సాగర్ తో పాటు ఆ పసివాడి బాధ్యత కూడా నీదే తల్లీ” అంటూ మళ్ళీ అపస్మారక స్థిత్జిలోకి వెళ్ళిపోయారామె.
దమయంతి గారిని ఓదారుస్తూ రేయింబవళ్ళు విషాద భరితమైన పరిస్థితిలో జీవించ సాగింది బంగారం.
**
మళ్ళీ వారానికి అమెరికా నుండి బాబాయి గారు ఫోను చేసి సాగర్ పరిస్థితి వివరించినప్పుడు బంగారం క్రుంగి పోయింది. తీవ్రంగా గాయపడ్డ అతడు మామూలుగా నడిచే అవకాశం...త్వరలో అయితే లేక పోవచ్చని, సర్జరీతో కూడా పరిమితమైన కదిలిక మాత్రమే ఉండ గలదని నిర్ధారించారట వైద్యులు.
**
డాక్టర్ల సలహా మేరకు... సాగర్ కాళ్ళకి సర్జరీ అయిన ఆరు వారాలకి కృష్ణని, సాగర్ ని వెంట బెట్టుకుని అమెరికా నుండి హైదరాబాదు చేరారు రఘురాం గారు.
వీల్-చైర్ లో ఇల్లు చేరిన సాగర్ ని చూసి బంగారం తల్లడిల్లి పోయింది. దమయంతి గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆసరాకి పక్కనే ఉన్న బంగారం భుజం మీద చేయి వేసారు.
“నీ ప్రేమ, ఆరాధనే సాగర్ జీవితంలో సరికొత్త వేకువ కావాలితల్లీ” అన్నారామె ఆర్ధతగా.
*************
|