Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarikottavekuva

ఈ సంచికలో >> కథలు >> ధర్మో రక్షతి రక్షితః

dharmorakshati rakshita:

వెండిగిన్నె లో పెరుగు అన్నం కలుపుకుని అందులో స్పూన్ వేసి మంచినీళ్ళ గ్లాసు తో నాన్నగారి గదిలోకి వచ్చాను.

నా అలికిడికి కాబోలు ఆయన తన గాజుకళ్ళ చూపును నావైపు తిప్పారు...టీ.వీ.లో ఎదో దృశ్యం చూస్తున్న ఆయన ఎండిన కట్టె లాంటి తనచేతిని ఆదృశ్యం నేను చూడాలన్నట్టుగా అంత నిస్సత్తువ లోనూ చూపించారు.

చేతిలో గిన్నె, నీళ్ళ గ్లాసు టీపాయి మీద పెట్టి ఆయన పక్కన కూర్చుంటూ నేను అటువైపు చూపు మరల్చాను.ఒక తండ్రి 10 సంవత్సరాల వయసున్న తన కొడుకును ఎక్కడ తగులుతోందో తెలియకుండా చేతిలో బెల్ట్ తో గొడ్డును బాదినట్టు బాదేస్తున్నాడు.న్యూస్ రీడర్ ఆ దృశ్యాన్ని వర్ణిస్తూ నేటి సమాజంలో ఓర్పు లేని తల్లితండ్రుల పెంపకం గురించి  చెబుతోంది. నాన్నగారు “కొట్టద్దు”  అన్నట్టు  చేయి ఊపుతున్నారు.

నేను ఆ రాక్షసత్వాన్ని చూడలేక “ కట్టేయమంటారా” అని అడిగాను.

ఆయన కళ్ళ నిండా నీళ్ళు నిండి అవి కను కొలుకులనుండి జారిపోతున్నాయి.నేను ఇక ఆలోచించకుండా టీ.వీ. కట్టేసాను. దిండు పక్క నున్న తెల్లని కాటన్ తువ్వాలుతో ఆయన కన్నీళ్ళు మెత్తగా తుడిచాను.

మెల్లగా చెంచాతో ఆయన నోట్లో పెరుగు అన్నం చిన్న చిన్న ముద్దలుగా పెట్టసాగాను. మళ్ళీ బడికి వెళ్ళే  టైమ్ అయిపోతోందన్న కంగారులో ఆయన నోటివైపే దృష్టి సారించాను. రోజూ పేరుగన్నం ఆబగా తినే ఆయన ఆగు అన్నట్టు చేయి ఊపారు.గొంతు దిగడం కష్టంగా ఉందేమో అనే ఉద్దేశంతో మంచినీళ్ళు నెమ్మదిగా పట్టించాను.అప్పుడు చూసాను...ఆయన కళ్ళు కన్నీటి  చెలమల్లా  నీళ్ళు స్రవిస్తూనే ఉన్నాయని.ఆయన మౌనంగా రోదిస్తున్నారని. “టీ.వీ. కట్టేసానుగా...ఇక బాధపడకండి నాన్నా..” అన్నాను.

అలంటి హృదయవిదారక దృశ్యాలు చూసినప్పుడు వృద్ధాప్యంలో సహజంగా వద్దనుకున్నా పొంగి పొర్లి వచ్చే కన్నీళ్ళవి అని నా భావన.

ఆ భావాన్ని ఛేదిస్తూ “నన్ను ...నన్ను క్షమించు  నాన్న.నిన్ను ..నీ కాలేజీ రోజుల్లో  నీ తప్పు లేకుండా  దారుణంగా కొట్టాను.అయినా నువ్  నాకు అన్నం పెడుతున్నావ్ .నువ్ నా కొడుకుగా పుట్టడం నా అదృష్టం నాన్నా. ” అన్నారాయన.

నేను ఉలిక్కి పడ్డాను.దాదాపు 30 సంవత్సరాల సంఘటన ఆయన గుర్తు తెచ్చుకున్నందుకు.

“ముందు భోజనం చేయండి...ఎప్పుడో జరిగిన దానికి ఇపుడు మీరు కన్నీళ్లు పెట్టుకోవడం ఏమీ బాగాలేదు. నేను   స్కూల్ కి వెళ్ళాలి.” మళ్ళీ ఆయన కన్నీళ్లు తుడిచి  అన్నాను.

“అయినా నువ్ నాకు అన్నం పెడుతున్నావ్.”అన్నారాయన దుఃఖం దిగమింగుకుంటూ..

“ ఇందులో నేను చేస్తున్నదేదీ లేదు నాన్నగారు.నాధర్మం నేను నేరవేరుస్తున్నా నంతే.మీరు భోజనం చేసి .ప్రశాంతంగా పడుకోండి.” ఇక ఆయనను మాట్లాడనివ్వకుండా అన్నం తినిపించి మంచినీళ్ళు తాగించి మూతి తుడిచి...ఫ్యాన్ వేసి....గది తలుపు దగ్గరగా వేసి వచ్చేసాను.

“ తిన్నారా..” అడిగింది శ్రీమతి. “పొద్దుటినుంచి ఆ టీవీ చూస్తూ ఒకటే ఏడుపు.ఎం వస్తోంది అందులో?”

“అదీ సంగతి.చూపించిందే వంద సార్లు చూపిస్తారుగా..ఆయనకేదో గుర్తొచ్చి బాధపడ్డారు.  సరే...నాకు అన్నం పెట్టు.” అన్నాను చేతులు కడుగుకుంటూ......

నేను  బడికి వచ్చేసరికి మొదటి పీరియడ్ ప్రారంభమై...ప్రశాంతంగా ఉంది వాతావరణం.

హాజరు పట్టీలో సంతకం పెట్టి కుర్చీలో కూలబడ్డాను. నాన్నగారు నన్ను ఆఖరుసారి కొట్టిన రోజు గుర్తుకు వచ్చింది.

అన్నదమ్ములు చిన్నప్పుడు కలిసిఉండి పెద్దయ్యాక విదిపోతారంటారు.కానీ తమ్ముడికి నాకు చిన్నప్పటినుంచి పోటీయే. వాడు తప్పు చెయ్యడం నామీదకు నేట్టేయడం వాడికి బాగా అలవాటు.నేను వాడిమీద నేరం చెప్పబోతే ” చిన్నపిల్లాడు .తప్పు చేసాడ నుకో.పెద్దవాడివి నీ బుద్ధి ఏమైంది” అని అమ్మ నాన్నగారు నన్నే తిట్టేవారు. ఆరోజూ అంతే.నాన్నగారు కాళ్ళు కడుగుకు వచ్చి భోజనానికి కూర్చున్నారు. ఆయనకుతంముడు అమ్మ పక్కన కూర్చున్నాడు...అప్పటికి వాడు 9 వ తరగతి చదువుతున్నాడు. సహజంగా ఆయన భోజనం అయ్యాకనే అమ్మ మాకు భోజనం పెట్టేది.నాకు పరీక్షలు జరుగుతున్నాయి.నా స్నేహితుడు రమణ చదువుకోవడానికి మా ఇంటికి వచ్చాడు  “ఆతను వచ్చాడుగా.

నువ్వు ఆ పక్కగా కూర్చుని తినేసి వెళ్ళిపో “ అంది అమ్మ కిరోసిన్ స్టవ్ మీద పకోడీలు వేస్తూ..

అన్నం తింటున్నప్పుడు అప్పుడే వాయి తీసిన  వేడి వేడి పకోడీలు అన్నంలో అద్దుకు తినడం నాన్నగారికి చాలా ఇష్టం. మొదటి వాయి తీసిన పకోడీలు సగం నాన్నగారికి వేసి మిగతావి నాకు వేసింది అమ్మ. “అదిగో..నీకు వాడు అంటే నే ఇష్టం.అందుకే నాకు పెట్టకుండా వాడికి పెట్టావ్.”అన్నాడు తమ్ముడు.

నేను గర్వంగా వాడికేసి చూసాను.

“వాడికి పరీక్షలు జరుగుతున్నాయిరా...ఓపక్క రమణ అన్నయ్య వచ్చి కూర్చున్నాడు.నస పెట్టకు.వేగుతున్నాయిగా.నీకూ పెడతాను.” అంది అమ్మ.

“ వాడికీ ఓ రెండు పడేయచ్చుగా..నువ్ మరీను శాంతీ.” అన్నారు నాన్నగారు ప్రశాంతంగా.

“ఎపుడు నన్ను పడి ఏడుస్తావెందుకురా..?” అన్నాను నేను ఒళ్ళు మండి.

“నువ్వు మాట్లాడకుండా అన్నం తిను “ అన్నారు నాన్నగారు సేరియస్ గా.

“ఎపుడూ మీరు నన్నే తిడతారు.వాడేనని తప్పులు చేసినా తిట్టరు.”అన్నాను.

అంతే. నాన్నగారు ఒక్క ఉదుటున పీట మీదనుంచి లేచిపోయారు. నా దగ్గరగా వచ్చి “ అన్నం తినమన్నానా?” అన్నారు.

నాకు 2౦ సంవత్సరాలు. డిగ్రీ పైనలియర్ చదువుతున్నాను.ఉడుకురక్తం.

నేను కూర్చున్న చోటే పైకి లేచి నిలబడి అన్నాను.” తినను. నా తప్పులేకుండా మీరు నన్ను కోప్పడుతున్నారు.” అన్నాను ధైర్యంగా..

“తింటావా తినవా...”నాన్నగారు అరిచిన అరుపుకు గది నాలుగు గోడలు ప్రతిద్వ్హనించాయి. తమ్ముడు వెంటనే ఆ గదిలోంచి జారుకున్నాడు.

“ఖచ్చితంగా తినను.” ఏం జరిగితే అది జరిగుతుందని అలాగే నిలబడ్డాను.

నాన్నగారు పెరట్లోకి వెళ్లి వెంటనే చెయ్యి కడిగేసుకున్నారు. విసవిసా తన గదిలోకి వెళ్లి ఫాంట్ కు ఉన్న బెల్ట్ తీసుకువచ్చారు.

ఆయన కళ్ళు ఎర్రని చింత  నిప్పుల్లా  ఉన్నాయి. అంటే...ఆయనకు పూర్తీ స్థాయి కోపం వచ్చిదన్నమాట.

“అన్నం తిను” అన్నారు
 

నేను మాట్లాడలేదు.ఇంతలోనే అమ్మ స్టవ్ కట్టేయడం గబగబా నాకు అడ్డుగా నిలబడటం జరిగిపోయింది. “లం..కొడకా.తండ్రి మాటకు ఎదురు చెబుతావా.” అంటూ బెల్ట్ తో ఎక్కడ తగులుతోందో కూడా చూడకుండా కొట్టసాగారు. “ ఏమండీ ..ప్లీజ్ ,,వయసొచ్చిన పిల్లాడిని కొట్టడం తప్పండి.” అంది నాముందు రెండు చెతుఓ చాపి నాకు రక్షణగా నిలబడుతూ..

.”మావయ్యగారు..ప్లీజ్ కృష్ణ ని కొట్టకండి..” రమణ కూడా అడ్డు రాబోయి నాన్నగారు చూసిన చూపుకు ఆగిపోయాడు..భయపడుతూ..

ఆయన ఆవేశం లో అమ్మకూడా నాలుగైదు  దెబ్బలు తింది. “ నువ్వు అడ్డు లే శాంతి .నాకు ఎదురు చెబుతాడా వీడు..?’ అంటూ అమ్మను ఆవేశంగా పక్కకు తోసేసి..ఒక 50 దెబ్బలు తక్కువకాకుండా కొట్టి బెల్ట్ నా ముఖాన విసిరేసి  “ చీ. నా కడుపున చెడపుట్టావ్ కదరా వెధవా..నీ బతుకు తగలడ.” అనేసి  చొక్కా వేసుకుని అన్నం తినకుండానే వీదిలోకి వెళ్ళిపోయారు.

నాకు మొదటి దెబ్బ చురుక్కు మన్నా...తరువాత దెబ్బలకు శరీరం బండబారిపోయింది. అయితే ఆయన తీవ్ర ఆవేశం మాత్రం బెల్ట్ వాతలుగా ప్రతిబింబిస్తూ ఉండగానే నేను కదలబోయాను..చెయ్యి కడుక్కోవడానికి. “ తప్పు నాన్నా.అల అన్నం తినడం మధ్యలో మానేసి వెళ్ళకూడదు.నువ్ తినకపోతే నామీద వొట్టే..” అంది కళ్ళ నీళ్ళు తిరుగుతుండగా...

నేను అమ్మకేసి జాలిగా చూసి పెరట్లోకి వచ్చి చెయ్యి కడిగేసుకున్నాను.

ఆ రాత్రి ఇంట్లో మేము ముగ్గురం భోజనం చెయ్యలేదు. తమ్ముడు మాత్రం వేసిన పకోడీలన్ని అన్నం లో తిని మరీ పడుకున్నాడు.

నా స్టడీ రూమ్ లోకి నా వెనుకే వచ్చిన రమణ నన్ను కౌగలించుకుని ఏడ్చేసాడు..అపుడు వచ్చింది నాకు ఏడుపు అంతరాంతరాల్లోంచి .యద్దనపూడి నవలల్లో చదివాను హీరోయిన్ కళ్ళు ఏడ్చి ఏడ్చి వాచిపోయాయని. అది నాకు అనుభవమైంది.ఒళ్ళు, కళ్ళు, మనసు అన్నీ  మంటే...రమణ నా వాత లకు అమ్మ ఇచ్చిన కొబ్బరి నూనె రాసాడు.ఏమీ చదువుకోకుండానే నిద్రపోయాడు.ఆ రాత్రంతా నాకు ఎక్కిళ్ళు తగ్గలేదు.తెల్లవారుఝామున నిద్రపట్టబోతుంటే... నేను పదుకున్నాననుకున్నారేమో..

నాన్నగారు నాచెవిలో గుసగుసగా అన్నారు

” నన్ను క్షమించు నాన్నా..నిజంగానే నీ తప్పు లేకుండా కొట్టాను.నాకు ఎదురు చెప్పావన్న అహంకారంతో కొట్టాను.నన్ను మన్నించు.” అని నా బుగ్గన ముద్దాడి నెమ్మదిగా వెళ్ళిపోయారు.అంట చీకటిలోనూ ఆయన కళ్ళు తుడుచుకోవడం నాకు స్పష్టం గా కనిపించింది.అంతే..”నాన్నగారికి ఎదురు చెప్పి ఎంత తప్పు పని చేసాను?అంత పెద్దాయన చేత క్షమించమని అడిగిన్చుకున్నాను.నిజంగా నాది వెధవ బతుకే..ఆ ఆలోచన రాగానే నా కళ్ళు మళ్ళీ కాసారాలయ్యాయి.

అప్పటినుంచి అలవాటు చేసుకున్నాను. నాన్నగారితో ఎం చెప్పాలన్నా నా భావాన్ని సరళమైన భాషలో కాగితం మీద రాసి ఆయన టేబుల్ మీద పెట్టడం.  ఆయన చదువుకునేవారో లేదో గాని మళ్ళీ జీవితంలో నన్ను ఏనాడు కొట్టలేదు..తిట్టలేదు.

ఎందుకో ఆ సంఘటన మళ్ళీ  తలచుకోగానే నా కళ్ళు చెమర్చాయి.

అమ్మ పోయాక పక్షవాతం వచ్చిన నాన్నగారిని నా దగ్గరే ఉంచుకుని ఆయనకు సేవ చేసుకుంటున్నాను.ఈ విషయం లో నా భార్య కూడా సహకారం అందిచడం నా అదృష్టం.

చాలా కాలం తర్వాత ఆయనతో మళ్ళీ నా  మనసు  పంచుకోవాలని అనిపించింది.

కాగితం పెన్ను తీసుకుని ఇలా రాసాను.

“వేదమూర్తులైన నాన్నగారికి,

ఏ కన్న తండ్రినీ కొడుకు క్షమించే దౌర్భాగ్యపు క్షణం ఏ కొడుకుకూ రాకూడదు నాన్నగారు. తండ్రి బిడ్డను క్షమించమని అడిగితె అది వాడికి ఆయుక్షీణం.తండ్రిగా మీరు అపుడు మీ ధర్మాన్ని నిర్వర్తించారు.మీకు ఎదురు చెప్పడం నిజం గా నేను చేసిన తప్పు.అందుకే శిక్ష అనుభవించాను. పెద్దల పట్ల వినయవిధేయతలు, గౌరవ మర్యాదలు  కలిగి ఉండాలన్న గొప్ప సత్యం నేను గుర్తెరిగేలా పెంచిన మీ పెంపకం గొప్పదనం వల్లనే నేను కొడుకుగా ఈనాడు నాధర్మాన్ని నేరవేరుస్తున్నాను. ఈ సమాజం లో ఎవరి ధర్మం వారు సక్రమంగా నిర్వర్తించడం జరిగినపుడే భావితరాలు మనగలుగుతాయి.ఈ సత్యాన్ని గుర్తించలేని మనిషి పశువుతో సమానం.ఈ మౌలిక మానవతా విలువలను మీరు పెంచిన పెంపకం వల్లనే ఈనాడు ఉపాధ్యాయునిగా..పది మంది పిల్లలకు చెప్పగలుగుతున్నాను.ఈ జీవితం మీరు పెట్టిన బిక్ష.నా వృద్ధాప్యంలో మీ మనుమలు మమ్మల్ని కూడా ఇలాగే చూడాలనే ఆకాంక్ష.సదా మీ ఆశీస్సులు మాకేపుడూ కావాలి.మీరు ఇంకొకసారి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే నామీద వొట్టే...మీరు ప్రశాంతంగా జీవించడమే నాకు పరమధర్మం.

నమస్కారాలతో

కృష్ణ,

ఇంటికి వెళ్ళాకా నాన్నగారికి ఇవ్వవలసిన ఆ ఉత్తరాన్ని సంతృప్తిగా చదువుకున్న అనంతరం చొక్కా చేబులో పెట్టుకుని పనిలో పడ్డాను.

మరిన్ని కథలు