Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope june 1st to june 7th

ఈ సంచికలో >> శీర్షికలు >>

థాయిలాండు విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

thailand

(అయోథియ)

ఇండొనీషియ  , థాయిలాండు , కంబోడియ దేశాలు హిందూ దేశాలు కాకపోయినా మన రామాయణ మహాభారతాలు ప్రచారంలో వున్నాయి . ఇండోనీషియాలో ప్రతీ యింటా ఓ అర్జునుడో భీముడో వుండి తీరుతారు . వారి థియేటర్లలో రోజూ మహాభారతం నాటకరూపంలో ప్రదర్శనలు జరుగుతాయి , అలాగే రోజూ టీవీలో  ‘ మహాభారత్ ‘ సీరియల్ వస్తూవుంటుంది . అలాగే కంబోడియ , థాయి ప్రజలు రామ భక్తులు , రామాయణం నాట్య , నాటక రూపాలలో ప్రతీరోజూ ప్రదర్శిస్తూవుంటారు . రామాయణ షోలు హౌస్ ఫుల కలెక్షన్స్ ఆర్జించడం నిత్యం జరుగుతూ వుంటుంది . పట్టాభిషిక్తుడైన రాజుకి ‘ రామ ‘ అనే పేరును కలుపుతారు , ప్రస్తుతపు థాయిరాజు రామ-10 . ప్రతీ కూడలిలోనూ రామాయణానికి చెందిన పాత్రల విగ్రహాలు వుంటాయి . రాజభవనం గోడలమీద రామాయణ ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి అని యీ వ్యాసం మొదట్లో మీకు తెలియజేసేను .

థాయిలాండ్లో చూడవలసిన ప్రదేశాలగురించి మా టాక్సీ ఆపరేటర్ ని అడిగినప్పుడు మాకు రామజన్మభూమి ‘ అయోథియ ‘ చూడరా ? మీరు హిందువులుకదా ? అన్నాడు . అయోధ్య యిండియాలో వుందికదా ? అంటే కాదు థాయ్లాండ్లో వుంది అన్నాడు . అతని సమాధానం వినగానే మా తల తిరిగినట్లయింది . బాబ్రీమసీదు , రామజన్మభూమ అని మనం తగువులాడుకుంటున్నాం అసలు అయోధ్య థాయిలాండ్ లో వుందా ?  , అయితే బ్రేకింగ్ న్యూసు మాదగ్గరేవుంటుంది అని బయలుదేరేం .

దేశరాజధాని బేంకాంక్ కి సుమారు 90 కిలోమీటర్లదూరంలో వుంది ‘ అయోథియ ‘ అని లేక ‘అయుథియ ‘ అని పిలువబడే నగరం . దశరథుడు పరిపాలించిన అయోధ్య యిదే అనేది స్థానికుల నమ్మకం . నిజమో కాదో యిక్కడ అవశేషాలు చూసి తేల్చుకోవాలన్నదే మా కుతూహలం , ఆ ఉత్సాహంలో మాకంటే ముందు యెందరో చరిత్ర కారులు సందర్శించే వుంటారు , యేపాటి సత్యం వున్నావారి దృష్టి నుంచి తప్పించుకోలేదు , అలాంటిదేమైనా వుంటే యీపాటికి ప్రపంచానికి తెలిసిపోయివుండేది అనే విషయం గుర్తురాలేదు .    ఓ శనివారం ప్రొద్దటే మా భోజనాలు పేక్ చేసుకొన ఆరు కల్లా బయలుదేరేం అయోథియ నగరానికి .

1300 ప్రాంతాలలో థాయిలాండ్ దేశంలో చికెన్ పాక్స్ వ్యాధి చాలా వుదృతంగా వుండేదట , దాని బారినుంచి తప్పించుకునేందుకు రాజు కొంతమంది ఆరోగ్యవంతులతో కలిసి యీ ప్రాంతాలలో  దాక్కొన ఆ వ్యాధి భారిన పడకుండా తప్పించుకున్నాడట , తరువాత యిక్కడే నగరాన్ని నిర్మించుకొని పరిపాలన సాగించేడు . ఈ నగర నిర్మాణం 1326 ప్రాంతాలలో జరిగింది .

అయోథియ నగరం సియామ్ రాజులకాలంలో దేశరాజధానిగా వుండేది . ఈ నగరం మూడు నదులచే చుట్టబడివుంది . నదీతీరాన వుండటం వల్ల 1350 నుంచి 1767 వరకు వాణిజ్య పరంగా కూడా పేరుపొందింది . 1737 లో  తరచు జరిగిన బర్మా వారి దాడులవలన యీనగరం నేలమట్టమైంది .

ఆ దాడుల సమయంలోనే థాయిలాండు లోని గోల్డెన్ బుద్ద , యెమరాల్డ్ బుద్ద విగ్రహాలు సున్నపు పూతపూయబడడంతో మిగతా బుద్ద విగ్రహాల అవశేషాలతో కలిసిపోయి వుండిపోయేయి .

నగరంలో శిథిలాలు చూసేం కాని మాకు యెక్కడా యీనగరం దశరథుడు పరిపాలించిన అయోధ్య అనడానికి యే ఆధారాలూ కనబడలేదు . బౌద్దఅవశేషాలుతప్ప రామాయణ కాలం నాటి అవశేషాలులేవు . శిథిలాలు అంటే యే విధమైన భవంతుల అవశేషాలు గాని , మందిరాల అవశేషాలు గాని కావు ఓ పెద్ద రాళ్ల కుప్ప అంతే , అయితే పెద్ద గోడలు కట్టిన పెద్ద ప్రదేశంలో వుంచిన పురాతనమైన కట్టడాలకి వుపయోగించన రాళ్లు అంతే . ఇవి వరల్డ్ హెరిటేజ్ వారి సంరక్షణలో వున్నాయి  .

మేము ఈ చారిత్రాత్మక అవశేషాలు చూడాలని చెప్పడం వల్ల మమ్మల్ని నగరం లోంచి తీసుకువెళ్లకుండా బై పాస్ మీదుగా తీసుకు వెళ్లేరు . దాతో మాకు అయోథియ నగరం చూసే భాగ్యం కలుగలేదు .

ఆ సైటు చూసిన తరువాత ‘ సియామీస్ ‘ కాలంలో ప్రసిధ్ద చెందిన ఓ బౌద్ద మందిరానికి  వెళ్లేం , అంతా చెక్క సున్నంతో కట్టబడింది , చాలా మటికి పాడయిపోగా పురాతన మందిరం చూడ్డానికి కొంతభాగం మిగిలివుంది . వరుసగా చిన్నచిన్న బౌద్ద స్థూపాలు కట్టబడి వున్నాయి . ఏ కాలానికి చెందినవో తెలియలేదు . ప్రభుత్వపువారి చే యెటివంటి బోర్డుల పెట్టబడలేదు . ఇంగ్లీషులో చెప్పగలిగేవారు మాకు తారసపడలేదు .

అలాగే మరో ప్రదేశానికి వెళ్లేం , అక్కడ ‘ అంకోర్ వాట్ ‘ మందిరాన్ని పోలిన మందిరం వుంది . ఇదీ శిధిలావస్థ లోనే వుంది . కాని చాలా పెద్ద మందిరం , ఒకప్పుడు యీ మందిరం చాలా పేరుప్రఖ్యాతులు కలిగివుండేదని అనిపించింది .

మొత్తం మీద యీ నగరంలో యిలాంటి పురాతన మందిరాలు చాలా వున్నాయి .

వాట్ ఫనన్ ఛోయింగ్ —-

వాట్ అంటే మందిరం అని అర్దం . ఈ మందిరం స్థానికులలోనే కాదు తిరుగు పొరుగు దేశాలలో కూడా ప్రాముఖ్యతను సంతరించుకున్న మందిరమో అనిపించింది . ఈ మందిరంలో స్థానికులతోపాటు చైనీయులు యెక్కువగ కనిపించేరు . ఇది కూడా 1300 వేలలోనే నిర్మింపబడింది . అంటే అయోథియ నగర నిర్మాణానికి సుమారు 26 సంవత్సరాలకి ముందే యీ మందిరం నిర్మించ బడిందట .

బర్మా యుద్దాల తరువాత వచ్చిన రాజులు తీసుకున్న శ్రద్ద వల్ల యీ మందిరం లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి .

ఈ మందిరం ఛో ప్రయ నదికి తూర్పున , ఛోప్రయ , పసక్ నదుల సంగమ ప్రాంతానికి ఆగ్నేయం గాను నిర్మింపబడింది . ఈ మందిరంలోని బుద్దుడు నావికులను కాపాడుతూ వుంటాడని నమ్మకం . 1407 లో చైనీస్ ముస్లిమ్ నౌకాధిపతి ఆపత్సమయంలో యీ దేవునికి మొక్కుకోగా అతను సముద్రప్రయాణం యెటువంటి విపత్తులూ లేకుండ ప్రయాణం ముగించుకోగలిగేడుట . ఆ నావికుడు యీ మందిరానికి యెన్నోకానుకలు సమర్పించుకున్నాడు . అతని సంతతి వారు యిప్పటిక యిక్కడకు వస్తూ వుంటారుట . ఈ బుద్దుడు యోగముద్రలో వుంటాడు . స్ధానికులు యీ దేవుని ‘ లాంగ పొ  థొ ‘ అని అంటారు . చైనా శరణార్ధులు ‘ సామ్ పొ కొంగ్ ‘ అని అంటారు . 

ఈ మందిరం గురించిన మరో విచిత్ర సంఘటన గురించి విన్నాం అదేంటంటే 1767 లో బర్మా దండయాత్ర సమయంలో యీ విగ్రహం కళ్లనుండి కన్నీరు విగ్రహం యొక్క నాభి వరకు జారేయట . 1854 లో మంగ్ కూట్ రాజు యీ బుద్దుడికి ‘ ఫ్ర త్రైరతన నాయొక్ ‘ అని నామకరణం చేసేడు . ఇవి యీ మందిరానికి సంబంధించిన కొన్ని వివరాలు యిక మందిరం గురించి తెలుసుకుందాం .

ప్రవేశద్వారం దగ్గర రామ -9 నిలువెత్తు విగ్రహం పర్యాటకులక స్వాగతం పలుకుతూ వుంటుంది . బయటకి పెద్ద హాలులా కనబడుతూ వుంటుంద . మొదటి చూపులో మనకి అదో మందిరం అని అనిపించదు . లోపల చాలా పెద్ద హాలు , గోడలు , స్థంభాలు యెరుపు బంగారు రంగులతో ఆకర్షణీయంగా వుండి కళ్లు తిప్పుకోనివ్వవు . లోపల పెద్ద మోనస్ట్రీ వుంది . ఎందరో బౌద్ద భిక్షులు అటూ యిటూ తిరుగుతూ వుంటారు . లోపల సన్నని వెలుగు తప్ప యిటువంటి విద్యుద్దీపాలూలేవు . అక్కడ పూజకు కావలసిన సామగ్రిని ధర చెల్లిస్తే యిస్తున్నారు . అందులో పసుపు బట్ట కూడా వుంది . మేం  అందరితోబాటు విగ్రహం వున్న గది చేరుకున్నాం , కళ్లు తిప్పుకోలేనంత చక్కగా తయారుచేసిన పెద్ద విగ్రహం . ఈ విగ్రహం యెత్తు సుమారు 19 మీటర్లు కాగా వెడల్పు 14 మీటర్లు . ఇటుకలతో నిర్మించిన యీ విగ్రహానికి బంగారు రంగు పూత పూసేరు . చాలా మంది భక్తులు యీ విగ్రహానికి పచ్చని పట్టు బట్ట తో అలంకరిస్తున్నారు . పైన నిలబడ్డ ఓ బౌద్ద భిక్షువు పై నుంచి బుద్దున మీద యీ బట్టని కప్పుతున్నాడు , మరో భక్తుడు రాగానే యీ బట్ట తీసేసి అతను తెచ్చిన బట్ట కప్పుతున్నారు . ఈ మొక్కు తీర్చుకోడానికి చైనా తైవాన్ నుంచి భక్తులు వస్తూవుంటారు .

విగ్రహం వెనుక వైపుగా వెళితే తలుపులు మూసివున్న పెద్దపెద్ద గదులు అవి దాటుకుని వెళితే అక్కడ పెద్ద హాలులో అందరూ వరుసలో కూర్చొని కనిపించేరు . విషయం అడిగితే అక్కడున్న చిన్న యేనుగు విగ్రహం చూపించేరు . మేం కూడా కూర్చొని మా టర్న్ వచ్చేలోపున అక్కడ జరుగుతున్న విషయాలు ఆకళింపు చేసుకోసాగేం . మాకర్దమైనది యేమిటంటే చిన్న యేనుగు బొమ్మ పైనున్న చిన్న కొక్కొంలో కుడి చిటికెన వేలుని దూర్చి బొమ్మని పైకెత్తుతూ మనసులో ఓ కోరిక కోరుకోవాలి , బొమ్మని పైకి యెత్తగలిగితే వారి కోరిక తీరుతుందని లేకపోతే తీరదని , యెత్తలేకపోయినవారికి వెనుక కూర్చున్నవారు మరో ఛాన్స్ యిస్తున్నారు , యీ సారి చూపుడు వ్రేలు గాని మధ్య వ్రేలుగాని పెట్టి ప్రయత్నించవచ్చు .

అలా కూడా సాధ్యం కానివారు కన్నీళ్ల పెట్టుకుంటూ క్యూలో వెనుకగా కూర్చొని మరో ఛాన్స్ కోసం యెదురు చూస్తున్నారు . ఒకరికో యిద్దరికో ఆ యేనుగని యెత్తడం సాధ్యమౌతోంది . అలా వారు యెత్తగానే వరుసలో వున్న అందరూ చప్పట్లతో అభినందిస్తున్నారు . మా వారి టర్న్ రాగానే మావారు యేం కోరుతున్నారో గాని ఆ యేనుగని సులువుగ యెత్తగలిగేరు . వెనుక నున్న నేను నా కోరికల జాబితాని గబగబా పెంచేను . ఏనుగును మా వారు సులువుగ యెత్తగానే చాలా తక్కువ బరువు వుంటుందన అనిపించింది . మనసులో సర్వాభీష్ట సిధ్దిరస్తు అనుకుంటూ  యేనుగని యెత్తేను . యేనుగు యెంత బరువుగా వుందో , వెనుక వాళ్లు వద్దంటున్నా రెండో చెయ్యకూడ పెట్టి బలమంత ప్రయోగించేను . ఊహూ యేనుగు కదలలేదు , మా వెనుకవాళ్లు నాకు మరో ఛాన్స్ యిచ్చేరు , అప్పుడు కోరికల జాబితా తగ్గించి రెండుమూడ కోరికలను మాత్రమే అనుకొని యెత్తితే ఆ యేనుగు యెంత సులువుగా పైకి లేచిందో నాకు చాలా ఆశ్చర్య మనిపించింది . అందరూ చప్పట్లు కొట్టేరు . నా తరువాత చాలా మంది యేనుగని యెత్తలేకపోయేరు . వారిలో వారు మాట్లాడుకొని మా యిద్దరికీ మరొకొక్క ఛాన్సిచ్చేరు .

ఈ సారి కూడా చాలా సులువుగా యేనుగు పైకి వచ్చింది . మళ్లా నన్ను ముందు నేను కోరుతున్న కోరిక కోరుకొని యెత్తమన్నారు . అదే సర్వాభీష్ట సిధ్దిరస్తు అన్న కోరిక , యీ సారికూడా యేనుగు పైకి లేవలే . చాలామంది యెవరైతే యేనుగని యెత్తలేకపోయేరో వారు మా ఆశీస్సులు తీసుకున్నారు , మళ్లాసారి యేనుగని యెత్త గలగాలని . 

           ఇలాంటి విషయాలు యెవరిద్వారా నైనా వింటే మూఢనమ్మకం అని నవ్వే నాకు అందులో యేదో శక్తి వుందనే నమ్మకం కలిగింది . అదే యేనుగు అంత బరువుగా యెందుకు మారుతోందో అర్దమవలేదు .

          మేము సేకరిద్దామనుకున్న రామజన్మభూమి అవశేషాలు దొరకలేదు గాని ‘ అయోథియ ‘ లోని బౌద్ద ఆరామాలు , సియామీస్ కల్చర్ల గురించి తెలుసుకుని వచ్చేం . ఓ అధ్భుతమైన అనుభూతిని మూటకట్టురాగలిగేం .

           వచ్చేవారం మరో దేశ పర్యటన చేద్దాం , యీ వారంతో థాయిలాండ్ పర్యటన ముగుస్తోంది కాబట్టి .

 

 

 

 

 

కర్రా నాగలక్ష్మి

మరిన్ని శీర్షికలు
her short flim