బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'క్వీన్' సినిమాని ఒకేసారి దక్షిణాదిలో నాలుగు భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 'క్వీన్' రీమేక్ జరుగుతోంది. అయితే తెలుగు 'క్వీన్' విషయానికి వస్తే, ఈ సినిమాకి మొదట్నుంచీ ఏదో రకంగా అడ్డంకులే ఏర్పడుతున్నాయి. మొదట ఈ సినిమాకి నీలకంఠ దర్శకత్వం వహించాలి. అయితే పలు కారణాలతో ఈ సినిమా దర్శకత్వం నుండి, నీలకంఠ తప్పుకోవడంతో, చిత్రీకరణ అర్ధాంతరంగా ఆగిపోయింది. తెలుగు 'క్వీన్'గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇకపోతే, నీలకంఠ తప్పుకోవడంతో, 'అ' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు.
ఈయన చేతుల్లోకి వచ్చాక 'క్వీన్' టైటిల్ కూడా మారింది. ఈ సినిమాకి 'దటీజ్ మహాలక్ష్మి' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. తమన్నా నటించిన '100 పర్సెంట్ లవ్' చిత్రంలో తమన్నా పాత్ర పేరు మహాలక్ష్మి. ఆ పేరునే ఈ సినిమాకి టైటిల్‌గా పెట్టడం పట్ల తమన్నా ఆనందం వ్యక్తం చేసింది. ఇకపోతే క్వీన్ తమిళ వెర్షన్‌లో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళంతో పాటు, కన్నడ, మలయాళంలోనూ ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తెలుగులోనే ఇంకా తొలి దశలో ఆగిపోయింది. ప్రశాంత్ వర్మ ఎంట్రీతో ఇకపై తెలుగు క్వీన్ కూడా దూకుడు పెంచనుందనీ తెలుస్తోంది. ప్రస్తుతం మిల్కీబ్యూటీ తమన్నా నటించిన 'నా నువ్వే' చిత్రం త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది.
|