Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> నా దృక్కోణంలో...!

naa drukkonam lO

తొమ్మిదికల్లా టిఫన్ ముగించుకున్న నేను ప్రతి రోజు వెళ్ళినట్టు ఈ రోజుకూడా ప్రక్క వీధిలో వున్న నా స్నేహితుని ఇంటికి బయలుదేరి వెళ్ళాను.వాడి ఇంటి కాలింగ్ బెల్లు నొక్కాను.నన్ను ముందే యెదురు చూస్తున్న వాడు 'లోనికి రారా!'అన్నాడు.

లోనికెళ్ళి సోఫాలో కూర్చొని వాణ్ణి గమనించాను. అప్పటికే బోలెడు బొమ్మలను ముందేసుకొని  మనవరాళ్ళు,మనవడితో కబుర్లు చెపుకొంటూ ఆడుకొంటున్నాడు.ఆ సమయంలో వాడి ముఖంలో చెప్పుకోలేనంత సంతోషం.

"పిల్లలూ! ఈ బొమ్మల్ను తీసుకొని వెళ్ళి బయట వరాండాలో ఆడుకొండి. నేనూ తాతయ్య మాట్లాడుకోవాలి"అని ముగ్గుర్ని పంపించేసి

"ఆఁ...చెప్పరా!నీ శ్రీమతి ఆపరేషన్ సంగతిని గూర్చి ఏమనుకొంటున్నావ్ ?"అడిగాడు వాడు.

"ఇంకా పిల్లలతో మాట్లాడలేదురా!ఇవాళ మాట్లాడి....!" అని అంటుండగా వాడి చిన్న కోడలు వాడికి టిఫన్ తెచ్చి టేబుల్ మీద పెట్టింది

"త్వరగా టిఫన్ చేసి బిళ్ళలు వేసుకొండి మామయ్యగారూ"అంటూ.

ఆమె అటు వంట గదిలోకి వెళుతూనే క్రింది పోర్షన్ లో వుంటున్న పెద్ద కోడలు కూడా వాడికి టీఫన్ తీసుకొని పైకొచ్చి "మీకిష్టమని ఇవాళ పూరీ ఆలు కూర చేశాను మామయ్యగారూ!త్వరగా తినండి" అంటూ పళ్ళేన్ని టీపాయి మీదుంచి క్రిందికి వెళ్ళి పోయింది.

వాడేం మాట్లాడలేదు. టిఫన్ల మీదున్న మూతలు తీసి చూసి ఇడ్లీ వున్న పళ్ళేన్ని నా చేతికిచ్చి "తినరా" అంటూ వాడు పూరీని విరిచి నోట్లో పెట్టుకున్నాడు.నేను ఇంటివద్ద టిఫన్ చేశానని చెప్పినా వాడు వినడు. కనుక నేనూ తిన్ను ప్రారంభించాను.నిజానికి వాడు ఏది చెప్పినా అది చేస్తానే తప్ప ఎదురు మాట్లాడను. టీఫన్ తిని పళ్ళేల్లోనే చేతులు కడుకున్నాం.అంతలో క్రింది నుంచి వాడి పెద్ద కొడుకు పైకి వచ్చాడు.ఆపిల్ పళ్ళున్న సంచిని టీపాయిమీద పెట్టి 'నాన్నా!భోజనాంతరం తినండి.ఇవి నిండుకుంటే చెప్పండి. మళ్ళీ తెస్తాను" అంటూ బరబర మెట్లు దిగి తన బైకులో ఆఫీసుకు  వెళ్ళి పోయాడు.ఇద్దరం ఓ అయిదు నిముషాలు మాట్లాడుకున్నామో లేదో  వాడి చిన్న కొడుకు వచ్చాడు 

"నాన్నా!ఇదిగో మీరు కోరుకున్న స్మార్టు ఫోన్. జాగ్రత్తగా వాడుకొండి"అంటూ బాక్సును వాడి ముందుంచి వెళ్ళి పోయాడు.అంతటితో ఆగలేదు వాడికి వాళ్ళు చేస్తున్న సేవలు. "ఇవిగోనండి ఈ పూటకు మీరు వేసుకోవలసిన బిళ్ళలు."అంటూ బిళ్ళలను చేతికిచ్చి నీళ్ళ గ్లాసును అందించి"మీకు కాఫీ తెమ్మంటారా అన్నయ్యగారూ?"అని నన్నడిగింది వాడి శ్రీమతి.

"వద్దమ్మా!ఇప్పటికే రెండుసార్లు తాగాను" అన్నాను.

"వదినమ్మగారి ఆపరేషన్ కు ప్లాన్ చేశారా?" మళ్ళీ అడిగింది అక్కడున్న ఎంగిలి గిన్నెలను తీస్తూ.

"ఆఁ...అయినా ఆవిడ ఆపరేషన్ కు ముందే ఇండియాకు రమ్మని పిల్లలనోమాట అడగాలిగా" అంటుండగా "ఏమిటోరా!ఈ విషయంలో నేనెంతో అదృష్టవంతుణ్ణి.నా పిల్లలూ,వాళ్ళ భార్యాపిల్లలంటూ అందరూ నా చుట్టే వున్నారు.తిన్నా తినక పోయినా వాళ్ళు నా చుట్టూ వుంటూ ఇల్లు కలకలలాడ్డం దేవుడు నాకిచ్చిన గొప్ప వరంలా భావిస్తున్నాను.ఏమంటావ్ లక్క్మీ?"నన్ను దెప్పేస్తున్నట్టు అన్నాడు వాడు.

"మీరూరుకొండి! అన్నయ్య వదినమ్మలు ఏంచేయగలరు.పిల్లల చదువులకు తగ్గట్టు వాళ్ళ అదృష్టం కొద్ది వుద్యోగాలు ఫారిన్ లో దొరికాయి.అన్నయ్యగారూ!వదినమ్మకు ఆపరేషన్ తేది నిర్ణయిస్తూనే మాకు కబురు పెట్టండి.వదినమ్మను దగ్గరుండి  నేను చూసుకొంటాను" నాకు ధైర్యాన్నిచ్చింది వాడి శ్రీమతి.

"అది నిజమేలే!వాడి పిల్లలతో మన పిల్లలు ఎందులోనూ సమం కాదుగా!సరేలే...అలాగే చెయ్యరా" అన్నాడు వాడు.

కాస్సేపు నేను మౌనంగా వుండిపోయాను.వాడి శ్రీమతి వంటగదిలోకి వెళ్ళిపోయింది.వాడు ఏదో పుస్తకం అందుకొంటూ నన్ను చూసి"ఏంట్రా ఏదో ఆలోచనల్లో పడ్డట్టున్నావ్ !"అడిగాడు.

"నువ్వంటున్నది నిజమేరా!నీ పిల్లలు,కోడళ్ళు,మనవలు మనవరాళ్ళను నీ చుట్టూ వుంచుకున్నావ్. అది నీ అదృష్టమే!బహుశా నీలా అందరికీ కుదరదేమో!వస్తాను"అంటూ పైకి లేచాను.మెట్లు దిగుతుండగా వాడూ నా వెంట గేటు వరకూ వచ్చాడు. వాడి ఇంటినుంచి మా ఇంటికి అర కిలో మీటరు దూరం వుంటుంది.నడుస్తున్నాను.కాని నా మనసేమో వాడన్న మాటల చుట్టూ తిరుగుతోంది.వాడు నన్ను దెప్పేస్తున్నాడా...లేక నిజం చెప్పాడా?నిజమే చెప్పాడను కొంటున్నాను.అవును.వాడన్నట్టు పది సంవత్సరాలకు ముందు  ఎం.ఎస్., చదవాలని అమెరికాకు వెళ్ళిన మా పెద్దాడు అక్కడే చదివి,వుద్యోగంలో చేరి తల్లిదండ్రులం మాకు ఎరుక లేకుండా ఒకమ్మాయిని పెళ్ళి చేసుకొని ఇద్దరు పాపలకు తండ్రయ్యాడు. వాళ్ళిప్పుడు అయిదు,మాడవ తరగతులు చదువు తున్నారు.ఇప్పటికి వాడిలో భార్య పిల్లలతో ఇండియాకు రావాలి, అమ్మానాన్నలను చూడాలి అన్న వుద్యేశ్యం  కలిగినట్టు లేదు. తరచూ వీడియో కాల్సుతో సరిపెట్టుకొంటున్నాడు. మరది నిజం కదా!

ఇక చిన్నాడి మాటకొస్తే ...వాడు కూడా మొన్నటి వరకూ ఇండియాలో వుండి వాడికీ,వాడి భార్యకూ, దుబాయ్ లో వుద్యోగాలు రావటంతో వెళ్ళిపోయాడు.ఇప్పటికి నాలుగేళ్ళు.ఇండియా వేపు తిరిగైనా చూడలేదు. ఫారిన్ లో వుంటున్న నా పిల్లలను తలచుకొంటూ నిత్యం బాధ పడే నాతో... తన చుట్టే భార్య పిల్లలని ,మనవలను,మనవరాళ్ళని వుంచుకొని సుఖ సంతోషాలతో ఆనందిస్తున్న వాడితో పోల్చుకో లేనుగా! అది వాడి అదృష్టమనుకోవాలి. అందుకే కనీసం వాళ్ళమ్మకు జరిగే ఆపరేషన్ కైనా  ఇద్దర్ని రమ్మని బ్రతిమాలుతున్నాను.మరి వస్తారో రారో!అనుకొంటూ ఇంట్లోకి కాలు పెట్టాను.నా సెల్ ఫోన్ రింగైయ్యింది. జేబులోనుంచి తీసుకొని సోఫాలో కూర్చొంటూ నంబర్ను చూశాను.అది మా పెద్దాడు చక్రవర్తి ఫోన్ నంబరు.నేను ఎదురుచూస్తున్నదే! నా ఆనందానికి అవధుల్లేవు.కారణం మా పెద్దాడి నుంచి  ఫోనొచ్చి దాదాపు రెండు నెల్లు. అయినా ఈ వేళప్పుడు ఫోనా!?.అమెరికా కాలమానం ప్రకారం వాళ్ళకిప్పుడు రాత్రి ఏ పన్నేండో ఒంటి గంటో వుంటుంది.కాస్త ఆదుర్దాతోనే ఫోన్ బట్టన్ నొక్కి "హల్లో ! నాన్నను మాట్లాడు తున్నానురా !ఈ వేళప్పుడు ఫోనేంటి? పోనీ... ఎలావున్నావ్ ? కోడలు పిల్ల .మనవరాళ్ళు క్షేమమేనా?" అడిగాను ఆశగా ఆత్రుతను కనుబరుస్తూ.

"బాగున్నారు నాన్నా! మీరెలా వున్నారు?అమ్మ ఆరోగ్యం పర్వాలేదా?"అడిగాడు పెద్దాడు ప్రేమగా.

"బాగానే వున్నాం.అయితే మీ అమ్మకు  ఆంజియోగ్రామ్ చేసిన డాక్టర్లు ఆమెకు హార్టుకు వెళ్ళే ఓ వాల్వులో బ్లాకేజి వుందని త్వరగా ఆపరేషన్ చేయాలన్నారు.ఈ విషయం నీకు ముందే చెప్పాను. గుర్తుందా! డబ్బును గూర్చి నేనాలోచించటంలేదురా!నా సెటిల్ మెంటు,పెన్షన్ డబ్బు చాలా వుంది. ఎంతైనా భరించ గలను. కాని...ఆ సమయంలో మాకు మోరల్ సపోర్టుగా నువ్వో లేక తమ్ముడో ఇక్కడుంటే  బాగుండని పిస్తుంది"నా మనసులో వున్న మాటను బయట పెట్టాను.

" కుదరదు నాన్నా!మీకు విషయాన్ని చెప్పలేదు.దాదాపు ఓ మూడునెల్లు నాకు వుద్యోగం లేక కాస్త ఇబ్బంది పడ్డాను. ఫ్యామిలీ గడవటానికి ఫ్రెండ్సు వద్ద అప్పులు కూడా చేశాను.భగవంతుడు కళ్ళు తెరవడంతో ఇప్పుడు  మరో కొత్త కంపెనీలో జాయినయ్యాను.నేనిప్పుడు వుద్యోగం చేస్తోంది మేము వుంటున్న హ్యూస్టల్లో కాదు.ప్లోరిడాలో!  జీతం ఎక్కువే.కాకపోతే నెలకోసారే ఇంటికి  వెళ్ళ గలుగు తున్నాను. సెలవులు కూడా ఇవ్వరు నాన్నా!"అన్నాడు.

పెద్దాడి జవాబుతో వొణికి పోయాను నేను. అంటే వాడు మూడునెల్లు వుద్యోగం లేకుండా  భార్య పిల్లలతో కష్ట పడ్డాడన్నమాట ."పోనీ...ఇప్పుడెక్కడినుంచి మాట్లాడుతున్నావురా?" బాధతో అడిగాను.

"ప్లోరిడానుంచేనన్నానుగా! నువ్వూ,అమ్మ గుర్తుకొచ్చారు.ఇప్పుడే పిల్లలతో మాట్లాడి మళ్ళీ మీతో  మాట్లాడుతున్నాను".

"ఏమిటోరా!అక్కడ పిల్లలతో నువ్వెలా వున్నావో మాకు తెలియదాయె!అమెరికా ఏమన్నా మనకు ప్రక్కూరా వెంటనే బయలుదేరి రావటానికి.ఎక్కడో దాదాపు పదిహేను వేల కిలోమీటర్లకావల వుందాయె! ఎటూ మేము రాలేము, పోనీ మీరైనా వస్తారా అంటే పదేళ్ళనుంచి మీకు కుదరలేదు. ఏమో... నిన్ను,నీ భార్య పిల్లలను కూడా చూడకుండా పోయే పరిస్థితి వుందేమో మాకు!"దుఃఖం పెల్లుబకడంతో నా నోటి వెంట ఆ మాటలొచ్చాయి .

"నాన్నా ఎందుకలా అంటారు!వీలైనంత త్వరలో నాకున్న ఇబ్బందులను సరి చేసుకొని  నెలనాళ్ళు ఇండియాలో వుండేలా వస్తాము.సరేనా?" 

"ఏమిటో ఇలాగే ఎన్నో ఏళ్ళ నుంచి అంటున్నావ్ !ఇదిగో కనీసం మీ అమ్మకు జరిగే ఈ అపరేషనుకైనా ఇండియాకు రండి. తను సంతోషిస్తుంది"పెద్దాడి మీద ఏదో ఎక్కడో నాలో వున్న కొద్దిపాటి నమ్మకంతో బ్రతిమాలాను.

"ప్రయత్నిస్తాను నాన్నా!అమ్మనీ ప్రక్కనే వుందా?"

"లేదు.అవతలి గదిలో పడుకొని వుంది.పిలవమంటావా?"

"వద్దులే!మరోసారి  మాట్లాడుతాను"

"ఒరేయ్ పెద్దాడా !ఇక్కడ నాకున్న స్నేహితులతో నన్ను పోల్చుకుంటే బాధగా వుందిరా! అవును. ఉధాహరణకు మన పక్క వీధిలో నా స్నేహితుడు రామారావున్నాడే... నువ్వు కూడా వాణ్ణి అంకులని పిలుస్తుండేవాడివి.వాడెంతటి సుఖ సంతోషాలను అనుభవిస్తున్నాడో!వాడి ఇద్దరు కొడుకులను,కోడళ్ళను, మనవలు, మనవరాళ్ళను తన చుట్టే వుంచుకొని హాయిని,ఆనందాన్ని అనుభవిస్తున్నాడురా ! మాకాభాగ్యం లేదుగా!"నా కళ్ళవెంట కన్నీళ్ళు చోటు చేసుకోగా బాధతో అన్నాను.

"మీ బాధను నేను అర్థం చేసుకోగలను నాన్నా!ఇక్కడి నా పరిస్థితులను మీకు ముఖాముఖిగా వివరిస్తేనే నన్ను మీరు అర్థం చేసుకొంటారు.అమ్మకు ఆపరేషను సక్సస్ కావాలని వేడుకొంటాను.త్వరలో ఇండియాకు  వస్తానులే. ఫోన్ పెట్టేస్తున్నా"అని ఫోన్ పెట్టేశాడు. వాడు అన్న ఆ మాటలకు నా మనసు ఇంకాస్త బాధకు లోనై  తప్పని సరిగా గతంలోకి వెళ్ళి పోయింది.

అవి నాకు చాలా గడ్డు రోజులు.పెద్దాడు చక్రవర్తి ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.అయితే వెంటనే చిన్నాడు  రాజశేఖరానికి ఇంజినీరింగ్ సీటు రాగా దాదాపు  మూడు లక్షలతో ఓ కార్చోరేటు కాలేజీలో చేర్పించాను పెద్దాడు ఏదేని కంపెనీలో పనికి వెళతాడన్న నమ్మకంతో! కాని వాడు అమెరికాలో ఎం.ఎస్ చదివించమని భీష్మించుకు కూర్చొన్నాడు.ఇక తప్పదన్నట్టు నా తాహతుకు మించి బోలెడు అప్పు చేసి వాడ్ని అమెరికా పంపించాను. వాడి చదువు పూర్తయి వుద్యోగంలో చేరితే అప్పును తీర్చుకో గలననుకొన్నాను.  కాని నా పధకం అందుకు భిన్నంగా మారి పోయింది. ఎం.ఎస్ .  పూర్తి చేసుకొని వస్తాడను కొన్న పెద్దాడు తిరిగి రాలేదు సరిగదా అక్కడే  ఓ పెద్ద కంపెనీలో వుద్యోగంలో  చేరాడు. 'లక్షల్లో డబ్బు పంపుతాను నాన్నా అప్పులన్నీ తీర్చేయ్ !' అన్నాడు..నేనూ వాణ్ణి ' నువ్వు రెండేళ్ళు వుండి సంపాయించుకొని ఇండియాకు వచ్చేయ్ రా !'అన్నాను. ఆరునెల్లు నేను అనుకున్నట్టే జరిగింది.కాని ఆ తరువాత జరిగిందేమిటంటే... వాడు అక్కడే ఓ అమ్మాయిని ప్రేమిచాడని, పరిస్థితుల ప్రభావాలవల్ల పదిమంది ఫ్రెండ్సు మధ్య, కొందరి ప్రోద్బలంతో వాళ్ళకు పెళ్ళి జరిగిందని ఫోన్ చేశాడు.

ఆ విషయం తెలుసుకున్న మేము తల్లిదండ్రులుగా బాధపడ్డం తప్పితే ఏమీ చేయలేక పోయాం.కాకపోతే  వాడు చేసుకొన్న అమ్మాయి మన తెలుగమ్మాయని కాస్త తృప్తి పడ్డాం. సంవత్సరం తిరక్కముందే వాడు తండ్రయ్యాడనిచెప్పాడు . సంతోషించామే తప్ప అక్కడికి వెళ్ళి వాడికి పుట్టిన పాపను చూసి రావటానికి మాకు ఆర్ఠిక ఇబ్బందులు అడ్డొచ్చాయి.అమెరికాకు వెళ్ళడమంటే అది బోలెడు ఖర్చుతో కూడికొన్న పని కనుక వాడి పాపను భార్యను వీడియోలో  చూసి ఆనందించాం. అంతే!

అనుకొంటుండగానే పదేళ్ళు గడిచి పోయాయి. ఇప్పుడు వాడికి ఇద్దరు పాపలు. పెద్ద పాప అయిదు, చిన్న పాప మూడవ తరగతులు చదువుతున్నారు.ఇప్పటికీ మేము వాళ్లను ముఖాముఖిగా చూసిన పాపాన పోలేదు.ఈ పదేళ్ళనుంచి వాళ్ళతో కేవలం వీడియో కాల్స్  ద్వారా మాట్లాడ్డం, చూసుకోవడమనేది మామూలై పోయింది.బహుశా ఇదేనేమో  మేము బ్రతికుండగానే కొడుగ్గా వాడు మాకు విధిస్తున్న శిక్ష . కాకపోతే నా స్నేహితుడన్నట్టు మా వయస్సు వాళ్ళు  మనవలు,మనవరాళ్ళతో ఆడుకొంటూ,వాళ్ళ బుజ్జీ బుజ్జి మాటలు వింటూ  బుడిబుడి నడకలతో  చేసే విన్యాసాలను చూస్తూ ఎనలేని ఆనందాన్ని పొందుతూ వుంటే అవేమీ లేని పరిస్డితుల్లో మేము గోళ్ళు గిల్లుకొంటూ బ్రతుకుతున్నామన్నది నిజం. అంతవరకూ వాళ్ళమ్మతో మాట్లాడ కుండా ఫోన్ పెట్టేశాడు. లేకుంటే ఆమె మాట్లాడుతూ ఏడుస్తుండడాన్ని చూస్తూ నేను భరించలేను.ఇది మా కర్మనుకోవాలంతే!కళ్ళు తుడుచుకొని జానకి గదిలోకి వెళ్ళాను,

"పెద్దాడు ఏమంటున్నాడండీ!నాకు ఆపరేషను జరక్కముందే ఇండియాకు వస్తాడన్నాడా"పడుకున్నావిడ లేచి కూర్చొని అడిగింది,

"ఆఁ..ప్రయత్నం చేస్తానన్నాడు.వస్తాడులే"అబధ్ధం చెప్పాను.నా అబధ్ధంతో ఆమె తృప్తి పడింది.వెంటనే నేనక్కడ వుండలేక డాబా మీదికి  వెళ్ళాను దుబాయ్ లో వున్నచిన్నాడితో మాట్లాడాలని.

చిన్నాడి నంబరు నొక్కాను.అవతలినుంచి వాడు " హల్లో" అన్నాడు.

"నాన్నను మాట్లాడుతున్నానురా..."

"తెలుస్తుందిలే!విషయమేమిటో చెప్పు.అవతల కుటుంసమేతంగా నేనో పార్టీకి వెళ్ళాలి"కోప్పడట్టు విసుగుతో వాచ్చాయా మాటలు వాడి నోటినుంచి.

"కాదురా!డాక్టర్ల సలహా మేరా మీ అమ్మకు ఈ నెలాఖరులో ఆపరేషన్ చేయించాలనుకొంటున్నాను. కావలసినంత డబ్బును సమకూర్చుకున్నాను.కాకపోతే ఆమెకు ఆపరేషను సమయంలోనూ, ఆ తరువాత ఓ నెలరోజులు ఎవరైనా తోడుండాలి.అంటే...నాదృష్ఠిలో ఆమెకు తోడనేది కొడుకులు, కోడళ్ళు.మనవలు,మనవరాళ్ళన్నదే!అదే మీ అమ్మ కోరిక కూడా!" దీనంగా బ్రతిమాలినట్టు అడిగాను.
"అది కుదరదు నాన్నా!సంపాదన,పిల్లల చదువు,భవిష్యత్తును వదిలిపెట్టి ఇండియాకొచ్చి అమ్మ చుట్టు కూర్చొని ఆమెకు సేవలు చేయలేం.నా భార్యకు అసలు కుదరదు.తరువాత వీలు చూసుకొని వస్తాములే!ఫోన్ పెట్టేస్తున్నా!"నిర్థాక్షీన్యంగా ముఖం మీద అన్నట్టు కఠినంగా అని ఫోన్ కట్ చేశాడు.

చిన్నాడు రాజశేఖరం ఇవాళ అలా మాట్లాడినా మొన్నిటి వరకూ భార్య పిల్లలతో మాతోనే వున్నాడు. అదృష్టం కొద్ది ఇంజినీరుగా వాడికి,  నర్సుగా వాడి భార్యకి దుబాయ్‌ లో వుద్యోగాలు  రావడంతో కుటుంబ సమేతంగా వెళ్ళి పోయాడు.వాడూ వెళ్ళి నాలుగేళ్ళు. కాకపోతే వాడు కుటుంబ సమేతంగా ఇండియాకు వస్తే మేము పిల్లలను చూసినట్టుంటుంది, కోడలుపిల్ల నర్సు కనుక ఆమె సేవలు వాళ్ళ అత్తగారికి ఉపయోగపడతాయని ఆశించాను.కాని వాడలా అన్నాడంటే ఇక చేసేదేముంది?... అనుకొంటుండగా నా శ్రీమతి ' భోజనం వడ్డించాను క్రిందికి రండి' అని పిలిచింది.నేను క్రిందికొచ్చి చేయి కడుక్కొని భోజనం ముందు కూర్చొని పప్పుతో అన్నం కలుపుకొంటున్నాను.

"చిన్నాడు ఏమన్నాడండీ?నాకు ఆపరేషన్ జరిగే ముందే భార్య పిల్లలతో ఇండియాకు వస్తానన్నాడా?"

"నేను వాడితో మాట్లాడింది విన్నావా?"

"అది మాట్లాడ్డం కాదు.కడుపున పుట్టిన బిడ్డను తండ్రిగా మీరు నాకోసం బ్రతిమాలారు.వద్దండి.ఇక వాళ్ళను

ఎదురుచూడకండి.దిక్కులేనివారికి దేవుడే దిక్కన్నట్టు సమయానికి ఎవరో ఒకళ్ళు సహాయపడతారులెండి.అపరేషన్ కు ఏర్పాట్లు చెయ్యండి"అందామె ఎక్కడలేని ధైర్యాన్ని తెచ్చుకొని.

"అలాగే జానకి!"అన్నాను కలిపిన ముద్దను నోట్లో పెట్టుకొంటూ.

అయితే నా మనసులో నాకే తెలియని బాధలో కూడికొన్న సంఘర్షణ మొదలైంది."నా దృక్కోణంలో ఈ వుద్యోగాలు,డబ్బు, పిల్లల భవిప్యత్తంటూ  ఇండియాకు రాలేమని చెబుతున్న నా కొడుకులతో... తన చుట్టే తన భార్యపిల్లలు వుండి తన్నోచక్రవర్తిలా చూసుకొంటున్నారని,అలాంటి  అదృష్టం జగతిలో తనకొక్కడికే వుందని అప్పుడప్పుడు చెప్పుకునే స్నేహితుడు రామారావు మాటలను బేరీజు వేసుకొన్నాను.నా మనసులో వున్న బాధను ప్రక్కన పెట్టి ఒక్కసారి దీర్ఘంగా ఆలోచించాను.మా పిల్లల అండదండలకు, ప్రేమలకు మేము దూరమైనా వాళ్ళు వాళ్ళ పిల్లలతో సుఖంగా బ్రతకటానికి తీసుకొన్న నిర్ణయాలు సరైనవేననుకొన్నాను. నేనూ,నా భార్య వూపిరితో వున్నంత కాలం కొడుకులను, కోడళ్ళను, పిల్లలను ఇబ్బంది పెట్టకుండ వుండాలనుకొన్నాను.మా బాగోగులను మేమే చూసుకొంటూ శేష జీవితాలను కొనసాగించా లనుకొన్నాను.కారణం...నాడు... ముప్పై అయిదేళ్ళకు ముందు నా స్వార్థంతో నా పిల్లల భవిష్యత్తే నాకు ముఖ్యమనుకొని నేను పుట్టిన గ్రామాన్ని,నా తల్లిదండ్రులను వదిలిపెట్టి బ్రతుకుదెరువు కోసం ఈ పట్టణానికొచ్చానే... ఇవాళ నా పిల్లలు కూడా ఆ పనేగా చేశారు.కనుక వాళ్ళ నిర్ణయంతో నేను ఏకీభవించక తప్పదు.ఒకవేళ పరిస్థితులు అనుకూలించి వాళ్ళు వస్తే ఆనందిస్తా ననుకొంటూ భారాన్ని దేవుడిమీద మోపి ఆపరేషనుకు తేది నిర్ణయించమని  డాక్టరుకు ఫోన్ చేశాను.

మరిన్ని కథలు
ekulaa vacchi