Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
naa drukkonam lO

ఈ సంచికలో >> కథలు >> ఏకులా వచ్చి

ekulaa vacchi

ఫోన్ రింగ్ విన్న లలిత , పరుగు లాంటి నడకతో వంటింట్లోంచి పరుగున వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి " అమ్మా.." అంది. ఆమె తన తల్లితో మాట్లాడి చాలా రోజులైంది. గత పది రోజులుగా తండ్రి మూర్తితో తప్ప తల్లితో ఓ మాటా మంతీ లేదు. ' అమ్మ ఎక్కడ ' అని అడిగితే, వంట పనిలో ఉందనో, ఇంటి పనిలో ఉందనో చెప్పే వారు మూర్తి గారు.

లలిత పిలుపు విన్న తల్లి, " ఆ.. లలితా ఎలా వున్నావమ్మా. అల్లుడు గారు ఎలా ఉన్నారు. " అడిగింది లక్ష్మ్మమ్మ.

అంతా బాగానే ఉన్నారమ్మా .కానీ నాకు చేదోడు వాదోడుగా ఉంటాడని నువ్వు పంపిన అబ్బిగాడే కాలిన బొబ్బలా ఇబ్బందిగా తయారయ్యాడు.

ఏమైంది. వాడు మంద బుద్ది గల వాడే కానీ ఏ పని చెప్పినా అల్లుకు పోతాడు కదా.

కరెక్టే. కానీ ఎంత నన్ను అక్కా అని పిలిచినా, వాడిది పసి హృదయమే అయినా, అన్ని పనుల్లోనూ నాకు సహాయంగా ఉన్నా కూడా కొన్ని విషయాల్లో కొంత ఇబ్బందిగా అనిపిస్తోంది.

" ఇబ్బందులా, ఏమిటి??"

బయటి కెళ్లడానికో లేక పేరంటానికైనా గబుక్కున చీర మార్చుకోవాలనుకున్నపుడు సింగల్ బెడ్రూం ఇల్లు కదా. అబ్బి గాడ్ని బయటికి వెళ్లమనాల్సి వస్తోంది. లేదా నేనే బెడ్రూంలోకి వెళ్ళి మార్చుకుని రావాల్సి వస్తోంది. అలాగే పక్కింటి పిన్నిగారో, ఎదురింటి వదిన గారో ఇంటికొస్, పర్సనెల్ విషయాలు, పడగ్గది విషయాలు మాట్లాడుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళని మాటకి బెడ్రూం కి తీసుకెళ్ళాల్సి వస్తోంది. ఇలాంటివే మరి కొన్ని. నిట్టూర్చిందామె.

" సరేలే. వాడ్ని ఇక్కడికి పంపేయి. ఉన్నది మీ ఇద్దరేగా. మీ మావగారు ఇంకో నెలలో రిటైర్ అయి మీ వద్దనే ఉంటారన్నవుగా. కావాలంటే అప్పుడు చూద్దాంలే. " చెప్పారు లక్ష్మమ్మ గారు.

సరేనమ్మా. ఇదేదో బావుంది. అనడంతో అబ్బిగాడ్ని వాళ్ళమ్మ గారింటికి పంపేసింది లలిత. తర్వాత నెల  గడిచింది. మావగారైన సుబ్బారావు గారు, రిటైర్ అయ్యి కొడుకు దగ్గరకి వచ్చేశారు. అత్త గారు లేక పోవడం కలిసొచ్చినా మావ గారి టీ తాగే అలవాటు, ఉదయం టిఫిన్ తో పాటు అంబలి తాగే అలవాటు, దానితో పాటు చక్కెర వ్యాది ఉండటంతో రాత్రి చపాతీలూ తీసుకుంటారు. దాంతో, అప్పటి వరకూ అబ్బిగాడిపై ఆధారపడి, ఒక్క సారే ఈ పనులు చేయడంతో చాలా చాలా కష్టమనిపించేసింది లలితకి. దాంతో మళ్ళీ తల్లికి ఫోన్ చేసి అబ్బి గాడిని పంపమంది.

తల్లి ఓ క్షణం ఆలోచించి, " అదేంటమ్మా అలా అంటావు. తండ్రి లాంటి మావ గారికి చేసిపెట్టే అదృష్టం వచ్చింది. మనస్ఫూర్తిగా చేయి. ఆ నాలుగు పనులకే గనులు తవ్వుతున్నట్టు బేర్ మంటే ఎలాగూ. ఇలాంటి చిన్న చిన్న వాటికి వంక పెట్టి పెట్టీ పెద్ద తల నెప్పేదో తెచ్చుకునెలా ఉన్నావు. వెనుకటికి, నీలాంటిదే సందులో సిగ్గేసి, సంతలో చీర మార్చుకుందట. అలా ఉంది నీ వరస." అంది.

" అదేంటమ్మా అలా అంటావు. నాకు మాత్రం సీరియల్స్ చూడాలని ఉండదా. బ్యూటీ పార్లర్ కెళ్లాలని ఉండదా. అప్పుడప్పుడూ స్నేహితులని కలవాలనీ, బయట కెళ్లాలనీ ఉండదా. ఇంకా పాత కాలం దానిలా మాట్లాడకు."

" సరేలే నే చెప్పిన మాట ఎప్పుడు విన్నావనీ. ఇక నువ్వు అడిగినట్టు అబ్బిగాడ్ని పంపడం అవ్వదు. వాడికి పెళ్ళయి పోయింది. వాడు వాళ్ళావిడతో ఇల్లరికం పోయాడు. కావాలంటే ఇంటి ఎదురుగా రమణి అని ఓ అమ్మాయి అదేనే చుక్కమ్మ కూతురు. మొగుడు లేడుగా. రోజూ మనింటికి వచ్చి పనివ్వండమ్మా అని అడుగుతోంది. కావాలంటే చెప్పు పంపుతాను."

" అమ్మో, వద్దు, వద్దు. అది బొద్దుగా మరీ చూడ చక్కగా టేకు చెక్కలా బావుంటుంది. మా ఆయన దాంతో మాట్లాడినా, నా గుండె గుబేలు మంటుంది." చెప్పింది లలిత తత్తర పడి పోతూ.

సరే, సరే ఇక నలిగి పోకు. వాళ్ళమ్మ, అదే చుక్కమ్మని పంపుతాన్లే. కానీ మరో సారి ఆలోచించుకో. ఎవరి పని వారు చేసుకుంటేనే అందం, ఆరోగ్యం. అయినా వాషింగ్ మెషిన్ నుండి ఓవెన్ వరకూ అన్నీ ఉన్నా ఇలా అంటున్నావ్. సరే కానీ..." నిట్టూర్చింది లక్ష్మమ్మ.

" అబ్బా.. అమ్మా, మళ్ళీనా."

" సరి, సరేలే. చుక్కమ్మని పంపుతాను. ఉంటాను. " చెప్పి ఫోన్ పెట్టేసింది తల్లి. ఓ వారం తర్వాత మళ్ళీ లలిత లక్ష్మమ్మ గారికి ఫోన్ చేసి, " అమ్మా చుక్కమ్మ నా కొంప ముంచిందే. " ఏడ్వసాగింది లలిత.

" అయ్యో, అయ్యో. ఎలాగే తల్లీ. అంత వయసున్న ఆవిడతో అల్లుడు గారు. అవ్వ."

" ఛ, ఛ అలా కాదు. ఆమె మా మావ గారితో మొదట్లో సన్నిహితంగా ఉంటే ఏదోలే అనుకున్నాను. తర్వాత్తర్వత ఆమె మావగార్ని కావాలని ముగ్గులోకి దింపింది. దాంతో రాను రాను,వారి మధ్య బంధం బలిసి బలపడింది. దాంతో దాని బలుపు మరో మలుపు తీసుకుని ఇంటి పనులు చేయడం బంద్ చేసింది. తప్పక నేనే అన్ని పనులూ చేసుకుంటున్నాను. ఆమేమో ఠీవిగా టి.వి చూస్తూ మావ గారితో కబుర్లు చెబుతోంది. దాన్నేమైనా అంటే, మా మావ గారు అడ్డు పడి పోయి, పోన్లెమ్మా అంటారు. ఇక ఆయనికి చెబితే సర్లేవే అని తేలికగా తీసి పడేస్తున్నారు. ఇపుడు అదే నాకు మా ఇంట్లో అత్త గారిలా తయారై ఆర్డర్లేస్తోంది. మావ గారు, త్వరలో ఆమెని పెళ్లి చేసుకుంటారేమోనండీ అని ఆయనతో అంటే పోన్లేవే , ఆయన అలా చేస్తే నాకూ సంతోషమే అంటూ ఆయన మురిసి పోతున్నారు. చుట్టు ప్రక్కల వాళ్ళు ఏవేవో చెవులు కొరుక్కుంటున్నారు. మొన్న మాయింటి కొచ్చిన కూరగాయలోడు మీ అత్త గారా అని అడిగాడు. ఆ మాటలు ఆమె ఖండించక పోగా సిగ్గు పడుతూ లోని కెళ్లి పోయింది. కొంప దీసి మావ గారు దాన్ని పెళ్లాడితే, ఆస్తి రెండు ముక్కలౌతుంది. ఇప్పుడు దానిని మానిపించాలన్నా కుదరట్లేదురా దేవుడో. చెప్పిందామె ముక్కు చీది మరీ

ఇప్పుడేడ్చి ముక్కు చీదితే  ఏం లాభం.నే చెప్తే విన్నావూ? అఘోరించు. అక్కడ నీకు పని మనుషులు దొరక్క పోతే పోయారు, ఇప్పుడు మళ్ళీ వేరే పని మనిషిని చూడమని మాత్రం నన్నడగకు. పని మనిషిని పెట్టుకోవడం తప్పు కాదు. ఇంట్లో ఆమె తీరుని పట్టించుకోకుండా ఇల్లునే ఆమెకి వదిలేస్తే ఇలానే ఉంటుంది మరి. మీ ఇంటి గుట్టు కనిపెట్టింది.దాంతో ఇపుడు నీ జుత్తు ఆమె చేతికొచ్చింది.కనుక ఇంటి పనులని మాత్రమే ఆమెకి వదిలేయలి. ఇంటిని కాదు.ఎందుకంటే కొందరు ఇలా కూడా ఉంటారు మరి. ఏకుల్లా వచ్చి మేకులై , యజమానుల ఇంట్లోనే దొంగతనాలు చేయడం, కుట్రలు, కుతంత్రాలకి తెర లేపడం చేస్తున్నారని అప్పుడప్పుడూ టి‌వి లలో మొత్తుకుంటున్నా నీలాంటి వాళ్ళు ఇంకా మత్తులోనే జోగుతున్నారు. ఎప్పుడూ మన జాగ్రత్తలో మనం ఉండొడ్డూ. నీ అతి చూశావా ఎంతకి దారి తీసిందో.

అవునమ్మా. నేను బ్యూటీ పార్లర్ కి తక్కువ సార్లు వెళ్ళి, భర్త, ఇల్లు ,సంసారం,నా భాధ్యతలు అని ఇంటిని ఓ కంట కనిపెట్టుకునుంటే  నాకీ తంటా వచ్చేదీ కాదూ, ఇలా ఆ చుక్కమ్మ ఏకులా వచ్చి మేకు అయ్యేది కాదు. కొండ నాలుక్కి మందేయబోతే ఉన్న నాలుక ఊడినట్టు, కొన్ని పనులు తప్పించుకోవడానికి పని మనిషిని పెట్టుకుంటే, అది కాస్తా ఇంటిమనిషై కూర్చుంది. ఇప్పుడు అన్ని పనులూ నేనే చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిరా దేవుడో. అంది లలిత మళ్ళీ ఆరున్నర శ్రుతిలో.                                                     

మరిన్ని కథలు