Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
betala prashna

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు / విహారయాత్రలు - కర్రానాగలక్ష్మి

తమిళనాడు తీర్థయాత్రలు / విహారయాత్రలు

చెన్నై కి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో వున్న మొసళ్ల పార్క్ గురించి తెలుసుకుందాం . దీనిని మొసళ్ల బ్యాంకు అని కూడా అంటారు . సుమారు 8.5 యెకరాలలో నిర్మించేరు . 

దీనిని 1976 లో మొదలు పెట్టేరు , పేరుకి మొసళ్ల బ్యాంకయినా యిందులో ఉభయచరాలకు సంబంధించిన రీసెర్చ్ సెంటరు నిర్మించేరు . ఆసియా లోని మొట్ట మొదటి తాబేళ్ల బ్రీడింగ్ సెంటరు కూడా యిది . సుమారు 28 రకాల మంచినీటి తాబేళ్లకు ఆశ్రయం కల్పిస్తోంది . 

చెన్నై యెండలో తిరగడం అంటే మాటలు కాదు ఏదో పిల్లల కోసమని అంత ధైర్యం చేసేం . ప్రవేశ రుసుము చెల్లించి లోపలికి ప్రవేశించగానే యేదో పార్కు లోకి అడుగు పెట్టిన అనుభూతి కలిగింది . లోపలంతా చాలా నీడగా చల్లగా గాలివేస్తూ వుండడం వల్ల మాకు తెలియకుండానే ఉత్సాహం వచ్చింది . నీడనిస్తున్న  పెద్ద పెద్ద వృక్షాలు వుండడం వల్ల చాలా చల్లగా వుంది .

మొసళ్లను చూడాలనే కుతూహలంతో వెళ్లిన మేం అక్కడ చిన్నా పెద్ద , అతి పెద్ద మొసళ్లను చూసి చాలా సంతోషించేం .

మొసళ్లే కాకుండా యిక్కడ తాబేళ్లు అరచేతిలో పట్టేంత చిన్న తాబేలు నుంచి సముద్రాలలో వుండే అతి పెద్ద తాబేళ్ల వరకు వున్నాయి , అందులో చాలా రకాలు లుప్తమౌతున్నవట , అన్నిటి వివరాలు చక్కగా రాసిన బోర్డులు ప్రతీ చోటా పెట్టేరు .

ఏదో జ్యూని చూసినట్లు కాక ఉభచరాలను గురించిన క్లాసుకు వచ్చినట్లుగా అని పిస్తుంది . ప్రతీ చోట ఆ జీవికి సంబంధించిన వివరాలు అవి యెక్కడ యెక్కువగ వుంటాయి , వాటి ఆహారపు అలవాట్లు , అవి పెరిగిన తరువాత వాటి అత్యధిక బరువు పొడుగు ల గురించి వివరంగా రాసిన బోర్డుల మనలోని సందేహాలను తీరుస్తూ వుంటాయి .

దీనిని మొసళ్లు , బల్లి జాతులకు చెందిన ప్రాణుల సంరక్షణ కోసం మొదలు పెట్టినా తరువాత తరువాత దీనిని ఉభయచరాలు , పాకే ప్రాణుల సంరక్షణ కేంద్రంగా మార్చేరు .

ప్రతీ రెండు గంటలకి ఓ పదిహేను నిముషాల షో ఒకటి జరుగుతూ వుంటుంది , అందులో జంతువులకు దగ్గరగా వెళ్లి వాటికి ఆహారం అందిస్తూ వాటి అలవాట్లను మనకి వివరిస్తూ వుంటారు . ఆ మాటలు పర్యాటకులకు ఆయా జంతువుల గురించి యెన్నో సంగతులు తెలుసుకొనే అవకాశం యిస్తుంది .

మనకి మొసళ్లు అంటే వెడల్పు మూతి గలవి , సన్నగా పొడుగ్గా వుండే మూతివి కాని యింగ్లీషులో క్రొకొడెల్ , ఎలిగేటర్ అని వేరే వేరే పేర్లు వున్నాయి .

ప్రాకే ప్రాణుల అధ్యయన కేంద్రాలలో యిది ముఖ్యమైనది . ఇక్కడ నీటి పక్షుల ఆవాసాలు కూడా వున్నాయి . పాముల సంరక్షణా కేంద్రం కూడా యీ కోపరేటివ్ సంస్థ ద్వారా నడపబడుతోంది. మన దేశంలో అధికారికంగా పాము విషం తీసే కేంద్రం యిది , పాము విషం అమ్మకాలవల్ల యీ సంస్థ యేడాదికి సుమారు $30,000 ఆదాయం వస్తోంది .

ప్రతీ రెండుగంటలకి ఓ పదిహేను నిముషాల పాముల షో నిర్వహిస్తున్నారు . పాములగురించి మన్లో వున్న మూఢ నమ్మకాలని పోగొట్టే ప్రయత్నం చేస్తూవుంటారు . ఆ షో చూస్తూ వుంటే పాముల గురించి మనలో తరతరాలుగ పేరుకుపోయిన మూఢనమ్మకాలు తొలగిపోవడం ఖాయం . అలాగే విషపాములను యెలా పోల్చుకోడం , పాము కాటుకు గురైన వారికి చెయ్యవలసిన ప్రధమ చికిత్స నుంచి పూర్తి చికిత్సవరకు యేమేం చెయ్యాలో , అలాగే పాముకుడితే ఆకుట్టినది విషపామా ? కాదా అనేది కాటును బట్టి యెలా తెలుసుకోవాలి , పాము కాటు లోపల నరాలకు తాకిందీ లేనిదీ తెలుసుకొనే విధానం , చికిత్స విధానం తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా చక్కగా వివరించేరు . విషం నరాలలోని పాకినపుడు రోగి లో కనిపించే మార్పులు మొదలయినవి చాలా చక్కగా వివరించేరు . మామూలుగ పిల్లలని బీచ్ లకో పార్కులకో కాకుండా యిలాంటి చోటికి తీసుకువెడితే పిల్లలు యెన్నో విషయాలు నేర్చుకుంటారని అనిపించింది . పాము కోరలలోంచి విషం తియ్యడం కూడా చూపిస్తారు .

ఈ సంస్థ కొన్ని అరుదైన ప్రాణులను తమ ఎక్సేంజ్ ప్రోగ్రామ్ ద్వారా యిక్కడకు తెప్పించి మన దేశస్థులకు అలాంటి అరుదైన ప్రాణులను చూసే అవకాశం కలిగించేరు . అలాంటి మార్పిడిలోనే మొసళ్లకు  బదులుగ డెన్మార్క్ దేశం నుంచి నాలుగు ఆకు పచ్చని అనకొండలను తెచ్చేరు . వీటిని యిక్కడ జాలీల గదులలో  వుంచేరు . అలాగే ‘ బ్రోక్స్ జ్యూ ‘  న్యూయార్క్ నుంచి మూడు మగ ‘ కొమొడో డ్రాగన్స్ ‘ ఒక ఆడ  ‘ కొమొడో డ్రాగన్ ‘ ను తీసుకొచ్చేరు .

ఇలాంటి సెంటరు మన దేశంలో యిదొక్కటే అనడం లో యెటువంటి సందేహం లేదు . నా ఉద్దేశ్యం ప్రకారం అందరూ ఒకసారైన చూడాలి యిలాంటి పార్కులను .

మొసళ్ల వుద్యానవనం తరువాత మహాబలిపురం తిరిగొద్దాం .

చెన్నై అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ‘ మహాబలిపురం ‘ , స్థానికులు దీనిని యిప్పటికీ కూడా ‘ మామళ్లపురం ‘ అని అంటూ వుంటారు . దేశవిదేశాల నుంచి చెన్నై వచ్చే పర్యాటకులు మహా బలిపురం వెళ్లాలని కుతూహల పడుతూ వుంటారు . బంగాళాఖాతం దగ్గర వున్న కోరమాండల కోష్టులో వుందీ బీచ్ , చెన్నై యెండలలో యీ బీచ్ లో యిసుకలో తిరగడం చాలా కష్టమైన పని అయినా పర్యాటకులు యిక్కడిక రావడానికి యిష్టపడతారు యెందుకంటే యిక్కడ వున్న పాండవుల రధాలు , శిల్పాల కారణం . ఆ రథాలను గురించిన వివరాలు తెలుసుకుందాం .

చెన్నై నుంచి సుమారు 60 కిమీ.. దూరంలో వుంది ‘ మహా బలిపురం . మా చిన్నప్పుడు వచ్చిన ‘ బాలరాజు ‘ అనే సినిమాలో హీరో మహాబలిపురం లో గైడుగా వుంటాడు , పర్యాటకులకు మహాబలిపురం గురించిన వివరాలు పాట ద్వారా తెలియజేస్తూ వుంటాడు . ఆ పాటలో గేయ రచయిత మొత్తం మహాబలిపురం గురించిన చరిత్ర అంతా చెప్పాడు . అప్పట్లో ఆపాట చాలా హిట్  అయింది .

సముద్రం వొడ్డున నిర్మించిన పాండవుల రధాలు ఆర్కియాలజీ వారి సర్వే ప్రకారం యివి 6వ శతాబ్దానికి చెందినవి గాని లేక అంతకు పూర్వం కి చెందినవి .

చరిత్ర ప్రకారం పల్లవులకాలం లో నిర్మింపబడ్డాయి , వీటిని మామల్లపురం మందిరాలు అనికూడా అంటారు . పల్లవ వంశానికి చెందిన రాజు రాజా మహేందిరవర్మ శిల్పకళ అంటే యిష్టపడేవాడు . అతని పుతృడైన రాజా నరసింహవర్మ -1 తండ్రిజ్ఞాపకార్ధం యీ మందిరాలను నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తారు . 20 వ శతాబ్దపు ఆర్కియాలజిస్ట్ ల ప్రకారం యీ మందిరాలు మూడు శతాబ్దాలకు చెందినవి , నరసింహవర్మ -1  , మామల్ల , రాజసింహ , నందివర్మల కాలాలలో 610 వ సంవత్సరం నుంచి 900 వ సంవత్సరం వరకు నిర్మింపబడ్డాయని అభిప్రాయపడ్డారు . పల్లవరాజుల కాలంలో నిర్మింపబడ్డ మొదటి రాతి కట్టడాలు యివి .

ఇక యిక్కడ వున్న కట్టడాలను గురించి చెప్పుకుందాం .

క్రిందిభాగం చతురశ్రాకారంలో వుండి గోపురం పిరమిడ్ ఆకారంలో వున్న రథం ధర్మరాజుది , తరువాత వున్నది అర్జునుడి రథం , స్థంభాలపై సింహాల తో వున్న రథాన్ని భీముని రథం అంటారు . పక్కగా వున్న రెండు రథాలు నకుల సహదేవులవి , చివరగా వున్న రథం ద్రౌపతి రథం అని అంటారు . ద్రౌపతి రథం చిన్నకుటీరాన్ని పోలి వుంటుంది .

పక్కగా ఓ పెద్దరాయిమీద గుండ్రంగా వుండే మరోరాయి వుంటుంది దీనిని కృష్ణుని వెన్నముద్ద అని అంటారు .

శిల్పకళతో వున్న రెండు మందిరాలను షోర్ టెంపుల్స్ అని అంటారు .

కొండను దొలిచి కట్టిన రథాలు గావడంతో వీటిని గుహాలయాలు అని కూడా అంటారు .

ఇక్కడ ముఖ్యంగా చూడవలసినవి హరిహర , బ్రహ్మ , స్కంద , అర్ధనారీశ్వరులు , గంగావతరణ , నరసింహవర్మ -1 , ఐరావతాన్ని అధిరోహించిన ఇంద్రుడు , యేక శిలానిర్మితాలైన ఏనుగు , నంది విగ్రహాలు . ఇకపోతే గణేషమండపం , స్థంభాలపై చక్కని శిల్పకళ తో వుండి లోపల వినాయకుడు నిత్య పూజలందుకుంటున్నాడు .

వరాహ మండపం  లో విష్ణుమూర్తి అవతారాలైన వరాహ , నరసింహ మూర్తులను చూడొచ్చు . మహిషాసురమర్ధిని మండపంలో దుర్గాదేవి విగ్రహం కొలువై వుంటుంది .

సుమారుగా 1400 సంవత్సరాలు యెండకి యెండుతూ వానకు తడుస్తూ సముద్రపు ఆటుపోటులను తట్టుకుంట  యివాల్టకి కూడా చెక్కు చెదరకుండా వున్నాయి . ఎటువంటి యంత్రసహాయం లేకుండా నిర్మించిన రాతి శిల్పాలు , యెంతటి వ్యప్రాయాసలతో నిర్మించేరో కదా , సులువుగా రాజుల సొమ్ము రాళ్లపాలు అనెస్తాం కాని వీటిని నిర్మించిన రాజుల పేర్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేయి కదా !        వచ్చేవారం మరికొన్ని వివరాలతో మీ ముందుంటానని మనవి చేస్తూ శలవు .

మరిన్ని శీర్షికలు
sarasadarahasam