Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> పాపం కృష్ణమూర్తి!

papam krishnamurty

"హల్లో! కృష్ణమూర్తీ!! నువ్వూ ఇక్కడే, ఈ ఊళ్ళోనే ఉన్నావా! ఎన్ని రోజులైందో రా,  నిన్ను చూసి, ఎలా ఉన్నావు!" రామారావు బజార్లో హఠాత్తుగా కనిపించిన కృష్ణమూర్తిని చూసి ఉద్వేగంగా అన్నాడు. ఉలికిపడి వెనక్కి  తిరిగి చూసిన కృష్ణమూర్తికి తన  చిన్ననాటి స్నేహితుడు రామారావు కనిపించాడు. రామారావుని చూసి కృష్ణమూర్తి సంతోషంతో పొంగిపొయాడు,  ఎందుకంటే వాళ్ళిద్దరూ కలసి దగ్గరదగ్గర అయిదారు ఏళ్ళవుతుంది.

"అవునురా! నేనిప్పుడు ఇక్కడే  ఉన్నాను. నువ్వు విశాఖపట్నంలో కదా ఉండేది, మరి ఇక్కడకెప్పుడు వచ్చావు!"  కృష్ణమూర్తి అన్నాడు.   

"నేను ట్రాన్స్ఫరయి ఈ ఊరికి వచ్చి నెల రోజులు దాటాయి. ఇదిగో మొన్నే ఇంట్లో దిగాము. ఇప్పుడు ఇంట్లోకి సామాన్లు కోసం బజార్లోకి వచ్చేసరికి నువ్వు కనపడ్డావు. "అన్నాడు రామారావు.

"పద! అలా కాఫీ తాగుతూ మట్లాడుకుందాము" అంటూ హూటల్ వైపు దారి తీసాడు కృష్ణమూర్తి. అతని వెనుకే నడిచాడు రామారావు.       కాఫీ తాగుతూ ఇద్దరూ కబుర్లలొ పడ్డారు. చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.

"నా ఎడ్రస్స్ నీకు పంపిస్తాను. నువ్వు ఈ ఆదివారం తప్పకుండా మా ఇంటికి రావాలి. మీ ఆవిడని నీ  కూడా మా ఇంటికి తీసుకురా. ఇద్దరికీ పరిచయాలు ఎర్పడితే వాళ్ళకీ హయిగా ఉంటుంది ఊరు కాని ఊళ్ళో."   అన్నాడు రామారావు.

ఈ మాటలు వింటునే కృష్ణమూర్తి  చిన్నగా నవ్వాడు.

"నాకింకా పెళ్ళి కాలేదురా!" కాస్త సిగ్గుపడుతూ అన్నాడు కృష్ణమూర్తి.  అది వింటూనే ఆశ్చర్యపడుతూ రామారావు కృష్ణమూర్తి వైపు చూసాడు.

"అవునురా! నాకింకా పెళ్ళి కాలేదు. కొన్ని సంబంధాలు నాకు నచ్చక, కొన్ని అమ్మకి నచ్చక, కొన్ని కట్నం దగ్గర పేచి వచ్చి తప్పి పో యాయి.    మా నాన్న సంగతి తెలుసుకదా నీకు!"  అన్నాడు  కృష్ణమూర్తి.

అవును  మరి! అతని తండ్రి గురించి రామారావుకి బాగా తెలుసు. అతనికి కట్నకానుకలు దండిగా కావాలి మరి.  కట్నం దగ్గర చాలా సంబంధాలు తప్పిపొయాయి మరి. కట్నం కోసం దగ్గర సంబంధాలు కూడా  వదులుకున్నారు ఆయన.   కృష్ణమూర్తికి భార్య అందంగా ఉండాలి. అతని తల్లికి ఉద్యోగస్థురాలై, ఇంటి పనుల్లో బాగా సహాయ పడే  కోడలు కావాలి. వీరి గొంతెమ్మ కోరికల వలన ఏ పెళ్ళి సంబంధమూ కుదరలేదు ఇంతవరకూ.

అయితే హఠాత్తుగా ఎదో గుర్తుకు వచ్చి " రెండుమూడేళ్ళ క్రితం నీ పెళ్ళి  కుదిరిందని మన స్నేహితుడు రవి వద్దనుండి విన్నానే!"  అన్నాడు రామారావు ఖాళీ కప్పు కింద పెడుతూ.

" అదో  పెద్ద కథరా! ఆ సంబంధం అందరికీ అన్ని విధాలా  నచ్చింది. అంతే కాకుండా ఆమె  తల్లీ తండ్రీ కూడా మా అమ్మ తరఫు నుంచి దూరపు చుట్టాలు కూడా." సంకోచిస్తూ ఆగాడు కృష్ణమూర్తి.

"ఓహో! అలాగా!! మరెందుకు పెళ్ళి చెసుకోలేదు?"  అడిగాడు  రామారావు.

"అది పొరపాటేరా!! నేనే తప్పు చేసాను. నిశ్చితార్థం అయినాక, నాకు ప్రమోషన్ వచ్చింది, అందుకు మా నాన్న కట్నం కింద అదనంగా మరో ఐదు లక్షలు అడిగారు. వాళ్ల ఆర్ఠిక పరిస్థితి తెల్సి కూడా నేను మా నాన్నకి నచ్చచెప్పలేకపోయాను. పెళ్ళి తప్పిపొయింది. ఆమెకేమో నా కన్న మంచి సంబంధం వచ్చి పెళ్ళి చేసుకుంది ఆ తర్వాత." నిట్టూర్చుతూ అన్నాడు కృష్ణమూర్తి.   

"అసలే ఆడపిల్లల కొరత ఎక్కవగా ఉన్నఈ రోజులలో అంత పట్టింపులు, కొర్కెలు ఉండడం  పనికి రాదురా. ఇకనైనా కట్నాలు, కానుకలు అని కొండ్డెక్కి కూ చోవద్దని మీ అమ్మా నాన్నకి చెప్పు. నువ్వు కూడా కొన్ని విషయాలలొ రాజీ  పడ్డం నేర్చుకో. తప్పకుండా ఏదో ఒక్కటి కుదురుతుంది." అన్నాడు ఓదార్పుగా రామారావు.

"అవునురా! ఇప్పటికి మా పొరపాటు  తెలిసొచ్చింది, అయితే ఈ మధ్యన సంబంధాలేవి సరైనవి రావడం లేదు. మా అమ్మా నాన్నా కూడా ఇప్పుడు రాజీ పడిపొయారు. అయినా అంతే !" దిగులుగా అన్నాడు కృష్ణమూర్తి.

అలా దిగులుగా కూర్చున్న కృష్ణమూర్తిని చూసి రామారావు జాలి పడ్డాడు.

'అవును మరి!  వాళ్ళు పెద్ద పొరపాటే చేసారు. అసలే అమ్మాయిల కొరత ఉన్న ఈ కాలంలో అది పెద్ద తప్పే మరి! ఒకప్పుడు కట్నకానుకలని విర్రవీగే వాళ్ళకి పెళ్ళి కావడం ఇప్పుడు గగనమై పోతోంది.' మనసులో అనుకున్నాడు రామారావు.

అయితే పైకి మాత్రం " పొనీలేరా! ఇకముందు సంబంధాలు చూసేటప్పుడు కనీసం కట్నాల ప్రసక్తి ఉండకుండా చూసుకోoడి." అన్నాడు.

"అదీ అయింది. అయితే ఇప్పుడు చాలా రోజులనుండి మరి సంబంధాలు మరి రావడము లేదు. వచ్చినా ఏదో ఒక లోపం ఉంటున్నది" అన్నాడు కృష్ణమూర్తి పెద్దగా  నిట్టూర్చుతూ.

"అలా కాదు. నువ్వు పాజిటివ్‌గా అలోచించు. అంతా మంచే జరుగుతుంది." అన్నాడు రామారావు  బయటికి దారి తీస్తూ.

ఆ తర్వాత చాలా రోజులవరకూ  ఇద్దరూ కలుసుకోలేదు.   

ఒక రోజు బ్యాంకికి పనిపై వెళ్ళినప్పుడు కృష్ణమూర్తి కనపడ్డాడు రామారావుకి. వెంటనే పలకరించాడు "ఏం రా! ఏమిటి సంగతులు!! ఎలా ఉన్నావు. ఎంతవరకూ వచ్చింది నీ పెళ్ళి చూపుల కార్యక్రమం." మనుసులొ ఏమనుకున్నాడో వెంటనే బదులు ఇవ్వలేదు.

"అఁ చూస్తున్నాము. ఇంకా ఎవీ కుదరలేదు. నీకు తెలిసిన సంబంధాలేవైనా ఉంటే చెప్పు." అన్నాడు కృష్ణమూర్తి.

"అలాగే తప్పకుండా!" అన్నాడు రామారావు. అన్నాడే గాని, చాలా రొజుల వరకూ కలసుకోవడం జరగలేదు, కాని పరస్పరం ఫోనులొ మట్లాడుకుoటూనే  ఉన్నారు. తర్వాత రామారావుకి తెలిసిందేమిటంటే, కృష్ణమూర్తి ఓ మెట్టు దిగాడు. అతనే   కాదు, అతని తల్లితండ్రులు కూడా ఓ మెట్టు దిగారు పరిస్థితుల ప్రభావం వల్ల. కట్నం మాట అటుంచి, పిల్ల ఎలా ఉన్నా పరవాలేదు అన్నంత వరకూ వచ్చారు. ఈ సంగతి చూచాయిగా రామారావుకి తెలిసింది.

కాలగర్భంలొ ఓ రెండేళ్ళు  కలసి పోయాయి. కృష్ణమూర్తికి నలభై దాటాయి. కొద్దిగా బట్టతల కూడా వచ్చింది. జుత్తు నెరవనారంభించింది. తల్లి తండ్రి గతించారు. దగ్గర చుట్టాలు ఎవరూ లేక పోవడంతొ, పట్టించుకొనే  వారే కరువయ్యారు. 

ఈ లోగా కృష్ణమూర్తి చాలా సార్లు రామారావు ఇంటికి వచ్చాడు. రామారావు భార్య సరోజతో కూడా పరిచయం పెంచుకొని తన గోడు వెళ్ళబోసుకున్నాడు. సరోజ తనకి తెలిసిన సంబంధాలు చెప్పింది. ఐనా అవేవి సరైన ఫలితాలు ఇవ్వలేదు. పెద్దగా చదువుకోని, పల్లెటూరి అమ్మాయిలకి కూడా కృష్ణమూర్తి నచ్చలేదు. మరి సామెత ఉరికే ఉందా! బ్రహ్మచారి కానీ, బెండకాయి కానీ, ముదిరితే ఎందుకూ పనికిరావని! సరోజకి కూడా కృష్ణమూర్తిని చూస్తే జాలి వేస్తోంది. ఐతే తను మాత్రం ఏం చేస్తుంది. రకరకాల వివాహ వెదికల్లో వెదికినా ఫలితం శూన్యం. కృష్ణమూర్తి చెయ్యని ప్రయత్నం లేదు.

కృష్ణమూర్తి ఒకొక్క మెట్టు దిగుతున్న కొద్దీ, పెళ్ళి కావలసిన అమ్మాయిలు ఒకొక్క మెట్టు ఎక్కి అందుబాటులో  లేకుండా పోతున్నారు. చివరికి, కృష్ణమూర్తి చివరి మెట్టు కూడా  దిగాడు. విడాకులు తీసుకున్నా, దురదృష్టం కొద్దీ భర్తను పోగొట్టుకున్న వాళ్ళైనా చాలనుకున్నాడు.     

అప్పుడే సరోజకి తన స్నేహితురాలైన సరళ గుర్తుకువచ్చింది. అప్పుడు సరోజ తన భర్త రామారావుకి సరళ గురించి చెప్పింది.

"మీకు సరళ గుర్తుందా! పాపం! పెళ్ళయి మూడేళ్ళు కూడా  నిండకుండానే  ఏక్సిడెంట్‌లో ఆమె  తన భర్తను పోగొట్టుకుంది.  మీ స్నేహితుడు కృష్ణమూర్తి ఆమెని పెళ్ళి చేసుకుంటే  ఆమె జీవితానికి ఓ అసరా దొరుకుతుంది. అంతేకాకుండా  ఇన్నాళ్ళైనా పెళ్ళి కాకుండా ఉన్న అతనికి జీవిత భాగస్వామిని  దొరుకుతుంది."

ఆమె వైపు సాలోచనగా చూసాడు రామారావు.  ఐతే కృష్ణమూర్తితో ఈ విషయమై కదపడానికి కొద్దిగా జంకాడు. 'ఎంతైనా కృష్ణమూర్తి తన చిన్ననాటి స్నేహితుడు. తన నోటితో ఎలా చెప్పగలడు.' మధనపడుతూ సరోజతో ఆ సంగతే చెప్పాడు.

"మీరనుకున్నట్లు ఏమీ ఫీల్ అయ్యే పరిస్థితిలో లేడు అతను. ఓ సారి చెప్పి చూడండి."అందామె.

"అలాగే చూస్తా!" రామారావు అన్నాడే కానీ కృష్ణమూర్తితో ఎలా, ఏ విధంగా  కదపాలో తేల్చుకోలేకపోయాడు.

చివరికి ఎలాగైతేనేమి, ఓ వారం రోజుల తర్వాత మెల్లిగా మాటల్లో పెట్టి కృష్ణమూర్తితో సరళ గురించి చెప్పాడు. మొదట నిరుత్సాహపడ్డా, కొద్దిసేపటికి అతని మొహంలో కళాకాంతులు తిరిగి వచ్చాయి.

"ఆమె నా భార్య సరోజ స్నేహితురాలే.  ఆమె చదువుకొన్నదే కాక ఉద్యోగం కూడా చేస్తోంది. అందంగా కూడా ఉంటుంది. అయితే, చిన్న వయసులోనే భర్తని పొగొట్టుకుందామె. నువ్వామెను పెళ్ళి చేసుకుంటే,  మీ ఇద్దరి జీవితాలూ ఓ ఒడ్డున పడతాయి.   నువ్వు 'ఊ' అంటే చాలు సరోజ మిగతా విషయాలు చూసుకుంటుంది." నచ్చచెప్పాడు రామారావు.

వెంటనే ఏమనలేదు కృష్ణమూర్తి. ఏ విషయం అలోచించి రేపు చెప్తానన్నాడు.  

ఆ రోజంతా అలోచించి కృష్ణమూర్తి ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఆ మర్నాడు, తన ఇంటికి వచ్చిన కృష్ణమూర్తిని చూడగానే అతని నిర్ణయం గ్రహించగలిగాడు రామారావు. అతను తీసుకున్న నిర్ణయాన్ని అభినందించి, సరోజతో ఆ సంగతి చెప్పాడు. సరోజ సంతోషంగా ఈ వార్త తన స్నేహితురాలికి చెప్పి,  ఆమెని ఒప్పించింది. ఆమె తల్లితండ్రులను కూడా ఒప్పించి, వచ్చే ఆదివారంకల్లా వాళ్ళు వచ్చేలా ఏర్పాట్లు చేసింది.    రేపు, ఆదివారమనగా శనివారం రాత్రి కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళాడు రామారావు. తన ఇంటికి వచ్చిన రామారావుని పలకరించాడు కృష్ణమూర్తి.

"ఇదిగో! సరళ ఫొటో నీకు ఇస్తానన్నాను కదా!! సరోజ అల్బంలో ఉంది." అని కృష్ణమూర్తికి అందించాడు రామారావు. అత్రుతగా ఫొటో అందుకొని చూసిన కృష్ణమూర్తి ఒక్కక్షణం  నివ్వెరపోయాడు.  నోట మాట రాక, నిరుత్తరుడైనాడు. అతని చేతులోంచి ఫొటో కిందికి జారిపోయింది.

అంతలోనే ఏం జరిగిందో రామారావుకి అర్థం కాలేదు. కృష్ణమూర్తి వైపు చూసాడు, ఆశ్చర్యపోతూ.

"ఈమెతోనేరా, నా నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్ళి ఆగిపోయింది. ఇక ఏ మొహం పెట్టుకొని రేపు కలసుకుంటాను." మెల్లిగా గొణిగినా, రామారావుకి స్పస్టంగానే వినబడింది. నిట్టూర్చాడు రామారావు, 'వీడి జీవితం ఇక ఇంతే' అనుకున్నాడు మనసులో.

మరిన్ని కథలు
matrumoortiki vandanam