Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
papam krishnamurty

ఈ సంచికలో >> కథలు >> మాతృమూర్తికి వందనం.

matrumoortiki vandanam

 “అమ్మా!మన కుటుంబ వ్యవస్థలో పెద్దలపట్ల గౌరవం..శ్రద్ధ అనేవి ప్రధానమైన అంశాలు. కాని యివ్వాళ వయస్సు మళ్ళిన తలిదండ్రుల్ని అనాధ ఆశ్రమాల వంటి శరణాలయాల్లో వదిలి పెడుతున్న పుత్రుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.కారణం ప్రపంచీకరణ మూలంగా   విదేశాలలో ఉద్యోగాలు..కుటుంబాలలో సరైన వసతులు లేకపోవడం కావచ్చు.అయినా అది తప్పే. యిప్పుడు మేము చేస్తున్నది కూడా అదే తప్పు.కన్నవారిని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి అనుక్షణం ఆరాట పడవలసిన మేము మాతృదినంనాడు కూడా  పలకరించ.. లేకపోతున్నాము.

యెంత ద్రోహమో తెలుసు..కానీ యేమీ చేయలేని దుస్తితి..దౌర్భాగ్యం.” వస్తున్న దుఖాన్ని దిగమింగు కుంటూ తల్లి యశోదాదేవి వంక దీనంగా చూసాడు యశోరావ్.అమెరికా నుండి వచ్చిన యిద్దరు కుమారుల్ని..కుమార్తె అవంతికని మురిపెంగా చూసుకుంటు మరో లోకంలో విహరిస్తున్న యశోదాదేవి పెద్దకుమారుడు యశోరావు మాటలతో ఈలోకం లోకి వచ్చింది.

“అమ్మా !అన్నయ్య చెప్పింది..అక్షర సత్యం.యిద్దరు కొడుకుల తల్లివి.ఒంటరిగా వుంటున్నావ్. ఆరోగ్యంగా ఉన్నంతవరకు బెంగలేదు..తర్వాత? రెండో   కుమారుడు ఆదిత్య మాటలు విని చిన్నగా నవ్వి..

“నాన్నా!మనం కావాలని దూరం కాలేదు.మనుషులం దూరంగా వుంటున్నామే తప్ప మనసులు మమతలు దూరం కాలేదు.ఇది జీవితం..గమ్యం మన చేతిలో వుండదు.ఎప్పటికైనా మీరిద్దరూ అనుకుంటే  రాగలరు.కానీ మీరు రారు. అయినా యింటిని చూశారుగా ? లంకంత.

ప్రకృతి ప్రసాదించిన యిద్దరు తమ్ముళ్ళు ..వంటకో కూతురు....నన్ను చూసుకొనే  మనమరాలు....అనుక్షణం యోగక్షేమాలు విచారించే ఇరుగు పొరుగు.నాకేం తక్కువ?”

“అవును ..అప్పుడు అన్నయ్య యశో మొదటిసారి అమెరికా నుండి వస్తున్నాడని నాన్నగారు..అన్ని వసతులతో పదిగదుల ఇల్లు  కట్టించారు.చుట్టూ అందమైన తోట..మధ్యలో బంగళా ..స్వర్గమంటే యిదే .”

అవంతిక అమ్మను అల్లుకుపోతూ తన్మయత్వం తో అంది.

“అందుకే ఈయిల్లు వదిలిపెట్టి అమ్మ స్వర్గానికి కూడా రాదు.”

యశోరావు..తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

“మీరంతా  వుంటున్నది ..స్వర్గంలో అనుకుంటున్నారు.అదే తృప్తితో వుండండి.మిమ్మల్ని మీస్వర్గాన్ని వదిలి రమ్మని నేను కోరుకోను.మీరు మీపిల్లలు..భార్యలతో సంతోషంగా వున్నారు.ఈ ఇల్లేనా స్వర్గం.ఉంటున్న స్వర్గాని  వదిలి మరో తెలియని స్వర్గం లోకి రాలేను.”  

“అమ్మా!నాన్నగారు చనిపోయి  నప్పటినుండి యిదే మాట చెప్తున్నావు.పనివాళ్ళు..పనివాళ్ళేకాని అవసరానికి..ఆదుకోనేవాళ్ళు  కాదు.”

యశో!నీమాటలు తప్పు..యెవరూ పనివాళ్ళు కాదు.వీళ్ళంతా నాతోబాటు..మన ఔట్ హౌస్ లో  నావాళ్ళ లాగే వుంటున్నారు. అమ్మా!అని వాళ్ళు పిలిచే పిలుపులో మీరే కనిపిస్తారు.ఇంటిని, వంటను చూసుకునే  లక్ష్మి యిద్దరు బిడ్డల తల్లి.భర్త లేడు.నా అనేవాళ్ళు లేని అనాధ.  నన్ను చూసుకుంటున్న వసంత మరో అనాధ.నాకు సాయంగా వుంటూ చదువు కుంటూ..నాకు అవంతిక లేని లోటు తీరుస్తోంది.వసంత చెల్లెళ్ళు అమ్మమ్మ అంటూ ..చుట్టుకు పోతారు.

లక్ష్మి పిల్లలు అమ్మమ్మ గారూ!అంటూ మీపిల్లలను గుర్తుచేస్తుంటారు.నాకేం తక్కువ?

మీ నాన్న గారు నాకు వదిలి వెళ్ళిన పొలం మాకు తిండి పెడుతోంది..కట్టించిన  ఇల్లు నీడనిస్తోంది.మీరు దగ్గర లేరన్న బెంగ తప్ప..నేను  సంతోషంగానే వున్నాను.”

వీరి సంభాషణను డిస్టర్బ్ చేస్తూ స్కూల్ యూనిఫాంలో వచ్చిన వసంత అందరికి నమస్కారం చెప్పి

“నా పేరు వసంత..మీరు వచ్చే సమయానికి నేను స్కూల్లో వున్నాను.తొమ్మిదో తరగతి చదువుతున్నాను.

అమ్మగారిని “అమ్మని”  పిలుస్తాను.మిమ్మల్ని అన్నయ్యా!అక్కా అని పిలవొచ్చా?”

యశోదాదేవి పాదాల దగ్గర కుర్చుంటు అడిగింది..వసంత.

“నిరభ్యంతరంగా..పిలవొచ్చు..అంతకంటే ముందు నువ్వు వచ్చి అక్కదగ్గర కూర్చో వచ్చు.”

వసంతను దగ్గరకు తీసుకుంటూ నవ్వుతూ చెప్పింది అవంతిక.

“థాంక్స్ అక్కా!”

అక్కను అల్లుకుపోయింది వసంత.

“వసంత అమ్మానాన్నలు మన పొలం ప్రక్క పొలంలో పని చేస్తూ..కరెంట్ షాక్ తో మరణించారు. వలస వచ్చిన కౌలు దారులు.భూయజమాని లంచ   మిచ్చి కేసులేకుండా చేసుకున్నాడు.వసంతతో బాటు మరోముగ్గురు పిల్లలు  అనాధలై పోయారు.చుట్టాలెవరూ తొంగి చూడలేదు. అందరు నాతోనే వుంటున్నారు.మనమరాళ్ళు లేని లోటు తీరుస్తున్నారు.”

ట్రే లో కాఫీ కప్పుల్తో వచ్చిన లక్ష్మి అందరికి కప్పులు అందించింది.

“ఇందాక చెప్పానే.. లక్ష్మిఅని..తనే..చదువుకుంది.ఒకనాడు యిద్దరు పిల్లలతో వచ్చి అమ్మా!అన్నం పెట్టండి ..అని అడిగింది.యిప్పుడు తనే నాకు అన్నం పెడుతోంది.రుణానుబంధాలు అంటే ఇవే.”

“అమ్మా!మీరన్నట్లు మనుషుల మధ్య  బంధాలు మరిచిపోలేని మమతానురాగాల అందాలు.తల్లి అనే పదానికి ఎన్ని పర్యాయ పదాలు వున్నాయో చెప్పలేము.స్త్రీ అనే పదానికి రెండువందల ఇరవై పర్యాయ పదాలున్నట్లు తెలుసు.అమ్మన్నా ..స్త్రీ అన్నా ఒకటే వ్యక్తిత్వం ..ఒకటే రూపం.మేమందరం మీ వ్యక్తిత్వానికి ప్రతిరూపులం.

మావంటి అనాధలకు ఆశ్రయం తో బాటు జీవితాల్ని ప్రసాదిస్తున్న మీరే మాకు కన్న తల్లి ” మాటలు రానట్లు మధ్యలో ఆగిపోయింది లక్ష్మి..
“లక్ష్మి !పొగడ్తలాపి వసంతకు పాలు యివ్వు.పిల్లలందరూ పాలు తాగారా? అన్నట్లు మర్చిపోయాను ..యింకో యిద్దరిని పరిచయం చేయాలి.వసంతా !నువ్వెళ్ళి రాంసింగ్ ని..మల్లేష్ నిపిల్చుకొచ్చి పాలుతాగు.”

వసంత ఒక్కసారిగా పరుగులు తీసింది. నిరాశతో తిరిగి వచ్చింది. “అమ్మా!రాంసింగ్ అంకుల్ మల్లేష్ అంకుల్ యింకా పొలంలోనే వున్నారట.” “సరే .. ఒకరి  పేరు రాంసింగ్ మొదటి తమ్ముడు..మాజీ సైనికుడు..ప్రభుత్వం యిచ్చిన అయిదెకరాల భూమిని లాక్కొని..రోడ్లపాలు చేసాడు స్థానిక ఎంఎల్యే..దేశసరిహద్దులో శత్రువులతో పోరాడి ఒక చేతిని త్యాగం చేసిన వీరుడు..భార్య పిల్లలతో రోడ్డున పడ్డాడు.నాన్న గారి చిన్ననాటి స్నేహితుడు..మన యింటిని ఇరవై ఎకరాల  తోటను  రక్షించే  సైనికుడయ్యాడు.రాగానే పరిచయం చేస్తాను.

రెండో తమ్ముడి పేరు మల్లేష్ ...మహబూబ్ నగర్ కరువు ప్రాంతం నుండి వలస  వచ్చాడు.నిలువనీడ లేదు..తినడానికి తిండి లేదు.ఇంటికొచ్చి పని చూపించమని ప్రాధేయ పడ్డాడు.భార్య ..యిద్దరమ్మాయిల దీన స్థితికి చలించిపోయాను.లంకంత ఇల్లు..ఖాళీగా వున్న గదులు.మల్లేష్ భార్య సుగుణ లక్ష్మికి తోడుగా వుంటుందని..మన యింట్లో వుండమనిచెప్పాను.మన పొలంలో బంగారం పండిస్తున్నాడు.యిప్పుడు నాకుటుంబ   సభ్యులు..మీరు గాక పదిహేను మంది.” అవంతిక ఆనందంతో చప్పట్లు కొట్టింది.

“అమ్మా!నాన్నగారు వరల్డ్ ఫేమిలీ అనేవారు.నువ్వు దానిని నిజం చేసి చూపించావ్.”

“అవంతికా !నీ పరీక్షలు ఎప్పుడు అయిపోతాయి?”

“అమ్మా !నెక్స్ట్ మంత్ లో నీముందు వుంటాను.”

“ఇప్పుడు ..కన్నవారు లేని  వసుధైక కుటుంబం  నాది..సరే నాబాధలు నావి.మీకు ఇబ్బందిగా  వుంటే చెప్పండి.హోటల్లో...”

“అమ్మా !మేము పుట్టింది పెరిగింది యిక్కడే.మాకు ఇబ్బంది ఏమిటి?”

“కాదనను..కాని అలవాటు పడిపోయారు..పైగా రాక రాక వచ్చారు. నాతోబాటు నాలుగు కుటుంబాలు..పిల్లలు.ఈ మధ్య అమెరికాలో కొంతకాలం వుండి తిరిగొచ్చిన  కొందరు కన్న దేశాన్ని డర్టీ   అంటున్నారని విన్నాను.కన్నతల్లిని కూడా అనరని గ్యారెంటి లేదు.   అందుకే అడిగాను.కోడళ్ళు మనవళ్ళు.. కూడా వచ్చుంటే బాగుండేది.”

“అమ్మా!అనుకున్నాము ..పిల్లలకు  లీవ్ దొరకలేదు.”ఆదిత్య  తల్లి మాటలకు సమాధానం చెప్పాడు.

  “పోన్లే..వసంత పుణ్యమాని ఫోనుల్లో చూస్తున్నాను.. అదే పదివేలు.వసంతా !పాలుతాగి నా  గది  సర్దించు....అక్కా అన్నయ్యలకు ఆగది  సరిపోతుంది. నువ్వు నా ప్రక్క గదిలో..

అన్నయ్యలకు..అక్కకు ఏమేమి కావాలో నువ్వే చూసుకోవాలి.”  

“అమ్మా నేను  రాత్రిళ్ళు మీ మంచం ప్రక్కనే  పడుకుంటాను.వాళ్లకు యేది కావాలన్నా నేను చూసుకుంటాను. మిమ్మల్ని వదిలి నేను ఉండలేను.నాకు రేపు పరీక్ష వుంది.రాత్రంతా మెలకువగానే  వుంటాను.మీ గదిలోనే పడుకుంటాను.”   దాదాపు మారాం చేసినట్లు మనసును వ్యక్తం చేసింది వసంత.

“నువ్వు వినవని తెలుసు.మారాం ఎక్కువయ్యింది ..మాటవినడం తక్కువయ్యింది.ముద్దుల మనమరాలివి.

నువ్వు చెప్పిందే వినాలి.”

  సంతోషం వ్యక్త పరిచింది యశోదాదేవి.

“అమ్మా!తమరు చెప్పిందేగా ..వినదగు ఎవ్వరు చెప్పిన ...అని.” నవ్వుకుంటు..పారిపోయింది..వసంత.

*******

“అమ్మా!అప్పుడే లేచావ్..నన్నుకూడా లేపొచ్చుగా?”అవంతిక ప్రశ్నకు..చిన్నగా నవ్వి  ..

“నీకు  రాత్రి నిద్ర పట్టిందా?నేను లేచి చూస్తే నాప్రక్కనున్న మంచం మీద నువ్వు కనిపించావు. ఎప్పుడొచ్చి పడుకున్నావ్?” ఉదయం పదకొండు గంటలకు కాఫీ తాగుతున్న కూతుర్ని ప్రశ్నించింది..యశోదాదేవి.

“జెట్ లాగ్ ఉంటుంది కదమ్మా? అర్ధరాత్రి వరకు నిద్ర పట్టకపోతే ..క్రిందకొచ్చి నీ రూములో పడుకున్నాను.

“మరి నన్ను లేపితే కబుర్లు చెప్పుకునే వాళ్ళం కదా?”

“వసంత నన్ను చూసి అక్కా! అమ్మ యిపుడే పడుకున్నారు..అంటే నిన్ను డిస్టర్బ్ చేయడం  ఇష్టం లేక ప్రక్కనున్న యింకో బెడ్ మీద నిద్రపోయాను.”

“వసంతకు చదువంటే పిచ్చి..రాత్రిళ్ళు నిద్రపోదు.నాకు కాపలా అన్నట్లు నా గదిముందే కూర్చుంటుంది.

యింటికి యేమికావాలో..ఎవరికి యేది అవసరమో..తోటలో లెక్కలతో సహా ..తనే చూసుకుంటుంది.బ్యాంకు  వ్యవహారమంతా తనకు..కొట్టినపిండి. 

తన వయసు పద్నాలుగు..టైం ప్రకారం మందులిస్తుంది..కాళ్ళు పిసుకుతుంది..కన్నతల్లిలా చూసుకుంటుంది.   రాత్రి పూట ఫోనులోస్తాయని..నేను డిస్టర్బ్ అవుతానని నా ఫోన్ తనతోనే వుంచుకొని ..మీరు ఎవరైనా  చేస్తేనే నాకు యిస్తుంది.దానిని నీ అంత చదివిస్తాను.”

“తనని అడిగావా?ఏమి చదువుతావని?”

“అడిగాను..నోరెళ్ళబెట్టాను..”  

“అంత షాక్ యిచ్చిందా?”

“ఇచ్చింది..డాక్టర్నిఅవుతానని..అదీ నాకోసమే నని.”

“అమ్మా!తను చదువుకో గలిగితే మెడిసిన్ చదివించు.నేనెలాగూ డాక్టర్ని కాలేక పోయాను.”

“నీకేం తక్కువ?ఇంజినీర్ వయ్యావ్..ఎంఎస్  చేస్తున్నావ్.”

“నిజమే .అది సరే..అన్నయ్యలు యింకా లేవలేదా?”

“లేచే వుంటారు ..యిక్కడి విషయాలన్నీ నీవదినలకు ప్రసారం చేస్తూ బిజీ గా వుండి వుంటారు.అవునూ నీతో  వదినలు ఎలావుంటారు?ఫోన్లోనే..”

“వద్దులే అమ్మా..నీమనసు పాడు చేయడం నాకు యిష్టం లేదు.సంపాదన డాలర్లలో రావాలి.ఖర్చు రూపాయల్లో వుండాలి..బ్రతికేది అమెరికాలో అయినా ఆలోచనలు ఇండియా లోనే.ఎలా సాధ్యం? సంపాదన చాలడం లేదని..ఎప్పుడు ఫోన్ చేసినా యేడుస్తూనే వుంటారు.పైగా కోట్లాది ఆస్తులున్న అమ్మ బిడ్డవి..నీకేం?అంటు దెప్పుతుంటారు.తలకు మించిన ఆడంబరాలు.అదీ అమెరికాలో .” చెప్పలేక ముఖం తిప్పు కుంది అవంతిక.

“కలిసిపోయి కలివిడిగా ఉంటారని కట్నాలకు ఆశపడకుండా..పెళ్ళిళ్ళు చేసాను.చివరకు యిలా   తయారు   అయ్యారన్నమాట.”
  బాధ పడిపోయింది యశోదాదేవి.

“అక్కా!వేడినీళ్ళు రెడీ..నీకు..సున్నుపిండితో నలుగు  పెట్టి..కుంకుళ్ళ రసంతో తలంటు స్నానం చేయించాలని..లక్ష్మి ఆంటి ..సుగుణా ఆంటి..రాంసింగ్ అంకుల్ వాళ్ళ ఆంటి..ప్లాన్ వేసుకున్నారు.మీ పర్మిషన్ కోసం నన్ను రాయబారిగా పంపించి..అదుగో అక్కడినుండి..నా సిగ్నల్ కోసం యెదురుచూస్తున్నారు.

మీకు యిష్టం లేదంటే ..షాంపూ రెడీ.”

“ఐయాం..రెడీ..విత్ కుంకుళ్ళు..ఆంటీలకు చెప్పు.” హుషారుగా లేచింది..అవంతిక. అంతకంటే హుషారుగా పరుగెత్తింది వసంత ..సమీరంలా .

******

గంట తర్వాత ఆయాసంతో పరుగెత్తుకుంటు వచ్చిన వసంత..

“అమ్మా !అన్నయ్యలు పైన లేరు.క్రిందా లేరు.కాఫీ ట్రేతో పైకెళ్ళాను ..అంతావెదికాను.”  ఆందోళనతో చెప్పింది.

“వసంతా !నువ్వేమీ కంగారు పడకు.మార్నింగ్ వాక్కి వెళ్లి వుంటారు.కొంచం సేపు వేచి చూడు.అక్క తలంటు  అయ్యిందేమో చూడు.”
   వసంత వంక చూస్తూ చెప్పింది.

“అమ్మా!అన్నయ్యలకు ఫోన్ చేయనా?” అంటూ ముందుకు రాబోతున్న వసంతను చేత్తో వారించి..“కంగారు పడకు.అన్నయ్యలేమి చిన్నపిల్లలు కాదుగా?దారి తప్పిపోడానికి.పుట్టి పెరిగిన ఊరు. ఊర్నిండా చిన్నప్పటి స్నేహితులే.వస్తార్లే.”

“అమ్మా!రాత్రి మనింట్లో దొంగలు పడి పారిపోతుంటే రాత్రి పొలం నుండి వస్తూ చూసి మా ఆయన మల్లేష్ అన్న పట్టుకొని గదిలో బంధించారు. మీరు తీసుకు రమ్మంటే తీసుకు వస్తారు..లేదా పోలిస్ లకు ..” రాంసింగ్ భార్య భయపడుతూ చెప్పింది. ..గలా?మనయింట్లోనా?రాత్రి ఎందుకు చెప్పలేదు?పోలిస్ విషయం తర్వాత ఆలోచిద్దాము.

రాంసింగ్ ను రమ్మని చెప్పు.నువ్వు వాళ్ళను చూశావా?” ప్రశ్నిచింది ..యశోదాదేవి.

“లేదమ్మా ..రాంసింగ్ అర్ధ రాత్రి దాటాక వచ్చాడు..యిప్పుడే నిద్ర లేచాడు. దొంగలున్నగది తలుపులు  యింకా తెరవలేదు .యిప్పుడే  వెళ్లి చెపుతాను.అయినా మన యింట్లో దొంగలు పడటం ..అర్ధం కావడం   లేదమ్మా..” రాంసింగ్ భార్య మాటలకు

“దీంట్లో అర్ధం కాకపోవడానికి ఏముంది?బీదవాళ్ళో..ఆకలితో అలమటించే వాళ్ళో అయ్యుంటారు..ఏయ్ వసంతా! అక్కను పిల్చుకురా..ముందు మీరంతా జాగ్రత్తగా ఉండండి..అవసరమనుకుంటే పోలీస్ రిపోర్ట్ యిద్దాం.”

“అమ్మా!రమ్మన్నావా?సుగుణా ఆంటి..తలకు సాంబ్రాణి పొగ పెట్టింది.అందుకే లేట్ అయ్యింది.”

“సరే ..రాత్రి మన యింట్లో దొంగలు పడ్డారట.రాంసింగ్ మల్లేష్ అంకుళ్ళు వాళ్ళను గదిలో బంధించారట. నువ్వు అనవసరంగా బయట తిరగకు. ముందు మనం చూసి..తర్వాత ఏంచేయాలో ఆలోచిద్దాం.”

“అమ్మో ..దొంగలంటే భయం..పోలిస్ రిపోర్ట్ యిద్దాం.” అలాగే.. చేద్దాం.. నువ్వెళ్ళి తల ఆరబెట్టుకో.నేను చూస్తాను.”

****

శోకమూర్తిలా యశోదాదేవి..దోషుల్లా యశోరావు ..ఆదిత్యలు..

“యశో ..ఆదిత్యా !నిన్నటివరకు నేను భ్రమల్లో బ్రతికాను..నాన్న గారు కలలుకన్న కలకు ప్రతిరూపంలా వసుధైక కుటుంబానికి ఒక చిన్న నమూనాలా ..కులంతో..మతంతో..ప్రాంతంతో సంబంధం  లేని కుటుంబానికి రూపాన్ని ఇవ్వాలనుకున్నాను.నాతోబాటు నాపిల్లల సహకారం ఉంటుందని భ్రమించాను.

కలలు కన్నాను.నాది అత్యాశే. డాక్టర్ కొడుకు..నక్సల్స్ లో చేరుతున్నాడు.న్యాయమూర్తి కొడుకు కబ్జాలు చేస్తున్నాడు. పిల్లల్ని కనడం వరకే తలితండ్రుల  బాధ్యత..చేయగల పని.అంతకు మించి  ఆశించడం దురాశే.నేటి సమాజంలో ఆస్తి కోసం..అమ్మానాన్నలను కడతేర్చే తనయులు తయారవుతున్నారు.

ప్రియుని కోసం భర్తని..ప్రేయసికోసం భార్యని హత్య చేస్తున్నారు.మీరు యింకా ఆ స్థాయికి చేరుకో లేదు. కాని అర్ధరాత్రి దొంగల్లా పారిపోయే స్థితికి వచ్చారు.దొరికినప్పుడే రాంసింగ్ మల్లేష్ లు దేహశుద్ధి చేసుంటే  కొంచమైనా బుద్ధి వచ్చుండేది.మీ యింట్లో మీరే దొంగల్లా..ఒకవేళ రాంసింగ్ ఆవేశంలో చితక బాది వుంటే?  నాపరువు. .కాదు మన కుటుంబ పరువు బజారున పడుండేది.ఛి ..నాకడుపున చెడబుట్టారు.” వచ్చే ఏడుపును దిగమింగుకుంటూ..అసహ్యంగా చూసింది. 

హాల్లోకి వచ్చిన అవంతిక దొంగల స్థానం లో తలదించుకొని నేలచూపులు చూస్తున్నఅన్నల్ని..శోకమూర్తిలా వున్న తల్లిని చూసి ..షాకై పోతూ..  

“అన్నయ్యలా దొంగలు?నో  ..నోవే..”  పిచ్చిదాన్లా అరిచేసింది .

హత్య చేసిన హంతకుల్లా తలలు దించుకొని నేలచూపులు చూస్తూ కనీసం చెల్లి ముఖాన్ని కూడా  చూడలేని దిక్కు తోచని స్థితిలో యశోరావు...ఆదిత్య.

“రాత్రి నువ్వు నాదగ్గర నిద్రపోయావు.లేకపోతే నువ్వుకూడా యీ వెధవల్లాగే రాంసింగ్ కు దొరికిపోయే దానివి.”

“అర్ధరాత్రి నేనెందుకు బయటికి వెళ్తాను ?

“ఏమో ?తాజెడ్డకోతి అన్నట్లు ..రాగానే మాతృదినోత్సవం అంటూ నాకు కధలు చెప్పినట్లే నీక్కూడా..చెవుల్లో పూలు  పెట్టి తీసుకు పోయే వాళ్ళేమో ?”

“అసలిదంతా ఏంట్రా అన్నయ్యా ?అమెరికా నుండి వచ్చి అర్ధరాత్రి దొంగల్లా స్వంత యింట్లో.. ఏదో సినిమా చూసినట్లు వుంది కాని నిజమని నమ్మబుద్ధి కావడం లేదు.”అవంతిక అయోమయం గా అడిగింది.

“అమ్మా!క్షమించండి ..అర్ధరాత్రి చీకట్లో  వీపు మీద సంచులతో  దొంగల్లా వెళ్లిపోతుంటే అనుమానమొచ్చి తీసుకొచ్చి గదిలో పడేసాము.అప్పుడైనా మీపేరు చెప్పి వుంటే ఇలా జరిగేదికాదు.”

దాదాపు కాళ్ళమీద పడిపోయారు రాంసింగ్ మల్లేష్ లు.

“అయ్యో ! ..యిందులో మీదేం తప్పులేదు.అయినా దొంగ దొరికి నప్పుడు దేహశుద్ధి చెయ్యాలి గాని చుట్టాల్లా తీసుకొచ్చి గదిలో పడుకో బెడతారా?”

“అమ్మా!రాత్రి అప్పటికే వంటిగంట దాటిపోయింది.మీరంతా నిద్రల్లో వున్నారు.చూడ్డానికి మంచి బట్టల్లో వున్నారు.తెల్లారాక వీళ్ళ సంగతి చూద్దామనుకున్నాము.మాభార్యలకు కూడా రాత్రి ఈ సంగతి చెప్పలేదు.మమ్మల్ని  మన్నించండి అమ్మా!”

“అర్ధరాత్రి సామానుతో పారిపోతూ  దొరికితే నాయింట్లో నేను కూడా దొంగనే.నువ్వేమి బాధపడకు.”

“సరేనమ్మా!తోటలో పనుంది..మీరు ..అనుమతిస్తే..”

“మీ కర్తవ్యం మీరు నెరవేర్చారు.ఈ దొంగల విషయం నేను చూసుకుంటాను.మీరు వెళ్ళoడి .”

“అమ్మా!నాకేం అర్ధం కావడం లేదు.” అవంతిక బిక్క ముఖం పెట్టేసింది.

“తల్లీ!నాకు అర్ధమై చస్తేగా?ఎదురుగా ఉన్నారుగా అన్నయ్యలు..అడుగు..వాళ్ళే చెపుతారు.

“చెప్పండిరా..ఈవిషయం బయటకు పొక్కితే మనపరువు ఇక్కడ గోదారిలో..అక్కడ నయాగరాలో కలిసిపోతుంది.” బాధ పడిపోయింది అవంతిక.

“మమ్మల్ని క్షమించు అమ్మా!”

ఏడుపుతో యశోదాదేవి పాదాలమీద పడిపోయారు యిద్దరూ.

“అసలు ఇదంతా ఏంట్రా? ఎందుకు దొంగల్లా పారిపోయారు? ఏం చేశారు?నోరిప్పండ్రా..” అవంతిక సహనాన్ని కోల్పోయింది.

“అమ్మా !రాత్రి దొరికిన సంచులు .” రాంసింగ్ భార్య రెండు బ్యాగులు  { back pack bags} తెచ్చి యశోదాదేవి ముందు పెట్టింది.
   “అమ్మా!అవంతికా ..నువ్వే చూడు ఏమి దొంగిలించి పారిపోవాలను కున్నారో నీ సోదర దొంగలు.”

“అమ్మా!నగలు..యేవో పేపర్లు.”

“అవి నీనగలు.నీపెళ్ళికోసం దాచిన పాత నగలు.ఇక ఆ పేపర్లు మన ఆస్తి కి సంబంధించినవి.

నీ అన్నలు దొంగతనం చేసే స్థితిలో వుంటారని వూహించలేదు..మరీ అంత నీచమైన బ్రతుకు బ్రతికే కన్నా ..అడుక్కు తిని బ్రతకొచ్చు.”

“ఏంట్రా అన్నయ్యా!ట్రంప్ దెబ్బకు ఉద్యోగాలు వూడి పోయాయా? పోతే అమ్మవుంది..అమ్మలాంటి మాతృ భూమి వుంది. ఏ.. మన దేశం మనకు అన్నం పెట్టదా?మరీ అసహ్యంగా స్వంత యింట్లో దొంగతనమా?

ఆస్తుల కోసం అయితే నాతో ఒక్కమాట చెప్పివుంటే అమ్మతో చెప్పేదాన్ని.మీరు అడిగితే నాకోసం అమ్మ దాచిన నగలు ఆనందంగా యిచ్చే దాన్ని.”దాదాపు ఏడ్చేసింది అవంతిక.

“నాన్న గారి పేరుమీద..ఆశ్రమం స్థాపించి..నాన్న గారి ఆశయాలకు అద్దం పట్టేలా నడుపుదామనుకున్నాను.

కొంతమంది కైనా నీడనిచ్చి అమ్మనవుదామనుకుని కలలుకన్నాను.కలలన్ని నిజమవ్వవు.

మీ చెల్లి పెళ్లి చేసేసాక నాకు ఎలాంటి బాధ్యతా వుండదు. యిప్పుడు ఇక్కడున్న మేమంతా  ఏదైనా అనాధాశ్రమం లో బ్రతికేస్తాం. యిరవై ఎకరాల పొలం ..పండ్లతోటలు  ..దాదాపు అర ఎకరం యింటి స్థలం  మీరే తీసుకోండి.అనుభవించండి.రాత్రి రాంసింగ్  మల్లేష్ లకు  దొరికిపోయి
   అదృష్టవంతులయ్యారు.లేకుంటే పోలిస్ స్టేషన్లో వూచలు లెక్కపెడుతూ..అన్ని టివి చానెళ్ళలో నానిపోయి నాశనం అయిపోయేవాళ్ళు.”
   కొడుకుల ముఖాలు చూడలేక కొంగులో ముఖాన్ని దాచుకుంది యశోదాదేవి.

“అమ్మా !సగం చచ్చిపోయాం.రాత్రి మా భార్యల పోరు పడలేక ఏం చేయాలో అర్ధం గాక అటుఇటు తిరుగుతూ.. బీరువా తెరిచి చూశాం.నగలు ..ఆస్తి దస్తావేజులు..దెయ్యాల్లా మా మనసును ఆవహించాయి.ఆక్షణంలో  పిచ్చి వాళ్ళం అయిపోయాం.”

“ఎంత దూరం పారిపోదామని?నాన్నగారు అమ్మకు రాసిన ఆస్తి పేపర్లవి.అమ్మ సంతకం లేకుండా అవి  చిత్తు కాగితాలే.నా నగలు..మహా అయితే  పది.. పదిహేను లక్షలు.చదువుకున్న వెర్రివాళ్ళలా ప్రవర్తించారు.”  అవంతిక అన్నల్ని అంతకు మించి తిట్టలేక మౌనాన్ని ఆశ్రయించింది.

“అవంతికా !యెంత చెడిపోయినా నాకడుపున బిడ్డలే.రేపే లాయర్ని పిలిపించి..ఆస్తి మొత్తం అన్నయ్యల  పేరుమీద రాయిస్తాను.నా పిల్లలు దొంగ బ్రతుకు  బ్రతక్కూడదు.”  ఆపుకో లేని దుఃఖంతో మూగపోయింది యశోదాదేవి.

“వద్దు ..వద్దు ..వద్దమ్మా..నాన్నగారి పేరుచెడగొట్టే పుత్రుల్లా మిగిలిపోయే కంటే చచ్చిపోవడం మంచిది.   ఆశలకు అంతుండాలి.మా భార్యలకు ఎవరో ఇక్కడనుండి ఫోన్ చేసి మీకు తెలుసా మీ ఆస్తుల విలువ?  అమరావతి ఏర్పడినాక లక్షల్లో వున్నన స్థలాలు కోట్లల్లోకి మారిపోయాయి.మీ అత్తమ్మ ఆస్తి దాదాపు  రెండువందల కోట్లు..అమెరికాలో అంత ఆస్తులు మీజీవితాల్లో సంపాదించలేరు.. అని రెచ్చగొడితే..వాళ్ళు రెచ్చిపోయి   ...రాత్రి ఫోన్ చేసి మమ్మల్ని ఎదవల్ని చేసారు.మమ్మల్ని క్షమించమ్మా.. నాన్న గారిని ..నిన్ను సుఖపెట్టవలసిన మేము చివరకు వ్యక్తిత్వం లేని వెధవల్లా మిగిలిపోయాం.

సూటిగా చెప్పాలంటే భార్యలకు బానిసలమయ్యాము. అమ్మా!నాన్న పేరుతొ నువ్వు చేస్తున్న అమూల్యమైన  సేవకు ..అనాధలకు అమ్మగా నిలుస్తున్నత్యాగానికి.. పేరు కూడా పెట్టలేని  జన్మ మాది.

నీతో బాటు మరో పదిహేను మంది బ్రతుకులకు నీడనిస్తున్నచల్లని తల్లివి.నిన్ను మోసం చేయాలని ఆలోచించిన మాది నికృష్ఠ జన్మ.మా పాపానికి నిష్కృతి లేదు.” యశోరావు..ఆదిత్యలు గట్టిగా యేడ్చేశారు.

“అమ్మా!అనవసరం గా లక్షలకి లక్షలు తగలేసి కన్న దేశాన్ని కాదని..చదువుకోసం అంత దూరం వెళ్ళిన  మరో మూర్ఖు రాలిని నేను.  నాజీవితాన్ని.. కూడా నాన్నగారి ఆశయాలకు అద్భుతమైన రూపాన్ని యిస్తున్న నీకు  తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను.యిక్కడే వుద్యోగం చేస్తూ..  నీతోనే సాయంగా  వుంటాను.”  అవంతికను ఆనందం తో చూస్తూ   తన పాదాలను అశ్రువులతో కడిగేస్తున్నయిద్దరు కొడుకుల్నిలేపి ..గుండెలకు హత్తుకుంది యశోదాదేవి. నాన్నలూ!మీలో యిటువంటి ఆలోచనలు మొలకెత్తడానికి మీ భార్యల స్వార్ధం తో బాటు మా పెంపకం కూడా కారణం కావచ్చు. నాకు ప్రాణమైన మీ నాన్నగారు లేరు.మిగిలింది మీరు .మీరు నాకు రెండు కళ్ళు.ఆ కళ్ళను కూడా పోగొట్టుకొని గుడ్డి బ్రతుకు బ్రతకలేను.జరిగిన సంఘటన్ని మర్చిపొండి.మీ భార్యలతో చెప్పండి.. “మాఅమ్మ ఆస్తిని తనతో బాటు కట్టుకు పోదు.ఆమె తదనంతరం ఆ ఆస్తికి వారసులం మనమేనని.”  తల్లి మాటలకు శరాఘాతం తిన్న పక్షుల్లా వణికి పోయారు.అప్రయత్నంగా యశోదమ్మ పాదాలను మరోసారి చుట్టేశారు..ఆదిత్య..యశోరావులు.

“అమ్మకు ..అమ్మ ప్రేమకు..అమ్మ క్షమా గుణానికి ..అమ్మ త్యాగానికి ..వర్ణించలేని  అమృత మూర్తికి ..అమ్మ తనానికి వందనం.”
   ఆనందంతో చెమర్చిన నయనాలతో వచ్చి ..ముగ్గురిని ముద్దులతో ముంచేసింది అవంతిక.

మరిన్ని కథలు