Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue272/722/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)...  అనుకోకుండా సోల్ ఫోన్ కేసి చూసుకుంది. పది గంటలకు దగ్గరవుతోంది సమయం. ఇక అక్కడ ఉండ కూడదు. మరి, ఎక్కడికెళ్లాలి?’’ ఆలోచిస్తూ నిలబడింది.

ఆర్టీసీ బస్సు స్టాండ్ కో...రైల్వే స్టేషన్ కో వెళ్లడమే తనకి మేలు. ప్రయాణీకుల మధ్య తెల్లవార్లూ గడిపెయ్యొచ్చు.’’ అలా అనుకుంటూనే గబాలున లేచి నిలబడింది ఆమె.

బీచ్ రోడ్ లో ఉన్న బస్సు స్టాండ్ కేసి చూసింది. నలుగురైదుగురు నిలబడి బస్సు కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. గబగబా నడుచుకుంటూ వారి దగ్గరకు వెళ్లాలని ఇసుకలో కాలు తీసి కాలు బలంగా వేస్తూ నడుస్తోంది ఆమె.

కొద్ది దూరంలో ఒక ఆగంతకుడు నిలబడి అరగంట నుండి ఆమెనే తదేకంగా గమనిస్తూ నిలబడ్డాడు.

ఇసుకలో నడవ లేక నడుస్తున్న ఆమె తల ఎత్తి బస్సు స్టాప్ కేసి చూస్తూ అనుకోకుండా ఆ ఆగంతకుని కేసి చూసింది.

అదే సమయంలో అతను కూడా ఆమెనే చూస్తూ నిటారుగా కరెంటు స్తంభంలా నిలబడి ఉన్నాడు.

అతనలా చూడగానే ఆమె గుండె దడ దడ లాడిరది. ఆరడుగుల అజానుబాహుడు...అతని రూపం...వాలకం...బాగా ఎరుగున్న వ్యక్తి లానే కనిపించాడు. కానీ ఎక్కడ చూసిందో... ఆ క్షణం గుర్తుకు రాలేదు.

అయినా, తానీ ఊర్లో...ఈ మహా నగరంలో ఉన్నానన్న విషయం ఎవరికీ తెలీదు కాక తెలీదు. కాబట్టి అతను తెలిసిన వాడు కాక పోవచ్చు. తనే అలా భ్రమ పడి పోతోందేమో!

తల దించుకు నడుస్తూ ఓర కంట అతన్నే గమనిస్తూ రోడ్డు మీదకు చేరుకుంది ఆమె.

అదే సమయంలో సిటీ బస్సు వచ్చి స్టాప్ లో ఆగింది.

బస్సును చూస్తూనే పరుగున వెళ్ళి బస్సు ఎక్కింది ఆమె....పరుగెడుతున్న బస్సుని చూస్తూనే అతను కూడా కరెంటు స్తంభంలా నిలబడ్డవాడు ఛటుక్కున బస్సు కోసం వెంట పడ్డాడు.

అప్పటికే బస్సు విమానంలా దూసుకు పోయి పాండు రంగ స్వామి గుడి దగ్గర మలుపు తిరిగి కనుమరుగై పోయింది.

ఆ అగంతకుడు ఉసూరుమని ఆయాస పడుతూ నిలబడి జేబులోనుండి సెల్ తీసాడు.

‘‘అన్నా! అది మళ్లీ మిస్సయ్యిందే!....ఛస్! వదలను అన్నా దాన్ని వదలను. అదెక్కడికెళ్లినా వేట కుక్కలా వెంట పడతా! దాన్ని చంపాకే నీ దగ్గరకొస్తా.’’ అంటూ అరిచాడు ఆగంతకుడు.

రోడ్డు మీద పోయేవాళ్లు, బీచ్ లో మిగిలి వున్న జనం వింటారని కూడా అతను భయ పడ లేదు.....వింటే ప్రమాదమని కూడా భయ పడకుండా రాక్షసుడిలా పళ్ళు పట పటా కొరుకుతూ అరిచాడు.

**********

రాత్రి పది దాటి పోయింది.

ఇద్దరు పోలీసులు సివిల్ డ్రస్ లో రాముని తీసుకుని కె. జి. హెచ్ దగ్గరకు వచ్చారు. నేరుగా ఎమర్జెన్సీ వార్డులో ఉన్న సోము దగ్గరకు తీసుకు వెళ్లారు. సోమూని అలా చూస్తూనే రాము భోరున ఏడుస్తూ కుప్ప కూలి పోయాడు.

‘‘ఒరేయ్ బడుద్దాయ్! ఇక్కడ ఏడవ కూడదు. లే! లేచి బయటకురా మిగతా పేషెంట్లు లేస్తారు.’’ అంటూ రామూని లేవనెత్తి వార్డు బయటకు లాక్కు వచ్చారు ఇద్దరు కానిస్టేబుళ్ళు.

ఇంతలో వార్డు బోయ్ పరుగున వచ్చాడు. అంత వరకూ వార్డు బయటే కాపలా ఉన్న వార్డు బోయ్ భవనగర్ వార్డులో తన తోటి ఉద్యోగిని కలవడానికి వెళ్లాడు. స్వీపర్ శివంగిని కాపలా పెట్టి మరీ వెళ్లాడు.

వస్తూనే కోపంగా అరిచాడు వార్డుబోయ్.

‘‘ఎవరండీ మీరు? లోపకు ఎలా వెళ్లారు? ఇది విజిటింగ్ అవర్ కాదని తెలుసా?’’ వార్డు బయటకు వచ్చి నడవాలో ఉన్న కర్ర బెంచీ మీద కూర్చున్న రాము, రాము ప్రక్కనే నిలబడ్డ కానిస్టేబుల్స్ మీద కసురుకున్నాడు వార్డు బోయ్.

కానిస్టేబుల్స్ కి ఒళ్ళు మండి పోయింది. డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లమని చెప్పాలనుకున్నారు. కానీ, చెప్ప లేక పళ్ళు పట పట కొరుకుతూ నిలబడి పోయారు.

‘‘రామూ భయం భయంగా వార్డు బోయ్ కేసి చూస్తూండి పోయాడు.

‘‘రామూ! రా! చూసావుగా! పద పోదాం.’’ రాముని ఇక అక్కడ వదిలెయ్య లేక అన్నారు కానిస్టేబుళ్ళు ఇద్దరూ.

‘‘సార్! నేనిక్కడే ఉంటాను. మా సోము కళ్ళు తెరిచే వరకూ ఇక్కడే ఉంటాను. మీరెళ్లండి సార్!’’ ప్రాధేయ పూర్వకంగా అన్నాడు రాము.
వాళ్ల సంభాషణ వింటూనే వార్డుబోయ్ మౌనంగా వార్డు బయట తలుపు దగ్గర ఉన్న బల్ల మీద కూర్చున్నాడు.

రాము రాననే సరికి వాళ్లిద్దరికీ ఏం చేయాలో పాలు పోలేదు. రాముని క్లోజ్ గా వాచ్ చెయ్యమని ఎస్సై అక్బర్ ఖాన్ ఆర్డర్. ‘ఇప్పుడెలా?!’ అనుకున్నారు మఫ్టిలో ఉన్న పోలీసులిద్దరు.

రాము ప్రక్కనే ఉంటే దోషి దొరకదు. రామూని ఒంటరిగా వదిలేస్తేనే ఎస్సై గారి పథకం ఫలిస్తుంది. అనుకుంటూ ఇద్దరూ ఒకర్నొకరు కళ్ల తోనే సంభోదించుకుంటూ సైగలు చేసుకున్నారు.

‘‘రామూ! జాగ్రత్త! ఇక్కడే ఉండు. నీకేం భయం లేదు.’’ అంటూనే వార్డు బోయ్ కేసి చూసారిద్దరూ.

అప్పటికే వార్డుబోయ్ పరిస్థితుల్ని అర్థం చేసుకున్నాడు.

‘‘మీరెళ్లండి సార్! ఆ కుర్రాడ్ని పేషెంటుకి తోడుగా ఉండనివ్వండి. నేనున్నాగా చూసుకుంటాను.’’ నమ్రతగా అన్నాడు వార్డు బోయ్.

‘‘సరే! జాగ్రత్త! మేము ఉదయాన్నే వస్తాము.’’ అంటూ రామూకి చెప్పి ఇద్దరూ అక్కడ నుండి బయట పడ్డారు.

‘‘ఇంత రాత్రి ఎందుకొస్తుంది రా! మనం ఇళ్లకి పోయి ఉదయాన్నే వచ్చేద్దాం.’’ అన్నాడు ఒకడు.

‘‘నేనూ అదే అనుకుంటున్నాను. పద పోదాం.’’ అన్నాడు రెండో వాడు. కానిస్టేబుళ్ళు ఇద్దరూ వెళ్లిన దిక్కే చూస్తూండి పోయారు రాము, వార్డు బోయ్.

‘ఎమర్జెన్సీ వార్డులో ఉన్న కుర్ర పేషెంటు కోసం వచ్చిన కుర్రాడే అయి వుంటుంది. మేడమ్ గారు చెప్పిన రాము ఈడే!’ అనుకుంటాను. వాళ్ళిద్దరు ఎవరో దగ్గరుండి దించి వెళ్తున్నారు. మనసులో అనుకుంటూ మౌనంగా కూర్చున్నాడు వార్డు బోయ్.

‘‘అన్నా! నేను ఈ బల్ల మీద పడుకోవచ్చా?’’ మౌనంగా తననే చూస్తున్న వార్డు బోయ్ కేసి చూసి అడిగాడు రాము.

‘‘ఓ ఎస్ పడుకో రామూ! జాగ్రత్త! నీ దగ్గరున్న డబ్బు జారి పోకుండా చూసుకో!’’ అన్నాడు వార్డు బోయ్. వార్డు బోయ్ మాట వింటూనే ఉలిక్కి పడ్డాడు రాము.

‘‘వీడెవడండీ బాబు! తన దగ్గర డబ్బుందని వీడికెలా తెలిసింది. తన పేరు పెట్టి కూడా పిలుస్తున్నాడు. సోముకి చూస్తే ఇంకా తెలివి వచ్చినట్టు లేదు. మరి, వీడికి నా పేరెలా తెలిసింది?!’ ఆలోచిస్తూ వార్డు బోయ్ కేసి చూసాడు రాము.

రాము అలా ఆశ్చర్యంగా తన కేసి చూడడం చూసిన వార్డు బోయ్ ఆనందంగా రాము ప్రక్కకు వచ్చి బల్ల మీద కూర్చున్నాడు. ఆప్యాయంగా రాము భుజం మీద చెయ్యేసాడు.

‘‘నీ దగ్గర పాతిక వేన్నాయి. జాగ్రత్తగా దాచుకో’’ అంటూ నెమ్మదిగా చెవిలో గుస గుసగా అన్నాడు వార్డు బోయ్. ‘బాబోయ్! జేబులో పాతికవే రూపాయలున్నట్టు ఎలా కనిపెట్టేసాడో! కొంప దీసి ఈడు మాయలోడు కాదు కదా!’’ అనుకుంటూ అనుమానంగా వార్డు బోయ్ మొహం లోకి చూసాడు రాము.

పోలీస్ స్టేషన్ నుండి వస్తున్నప్పుడు తనతో వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్ళు ఎన్ని తిప్పలు పడ్డారో గుర్తొచ్చింది రాముకి. మనసులోనే నవ్వుకున్నాడు.

‘‘ఏరా! నేను చెప్పింది నిజమేనా?’’ సంశయంగా అడిగాడు వార్డు బోయ్.

‘‘నా దగ్గర అంత డబ్బు ఎందుకుంటుందన్నా! నీకేమైనా పిచ్చా?’’ వార్డు బోయ్ కేసి వెటకారంగా చూస్తూ అన్నాడు రాము.

‘‘అదేంట్రా! నిజంగా నీ దగ్గర అంత డబ్బు లేదా?’’ బేల మొహం వేసాడు వార్డు బోయ్.

‘‘లేవు గాక లేవు. నీ మీద ఒట్టన్నా!’’ నమ్మ బలుకుతూ వార్డు బోయ్ తల మీద చెయ్యి వెయ్య బోతూ అమాయకుడిలా నటిస్తూ అన్నాడు రాము.

‘‘అదేంట్రా! ఆమె అలా చెప్పింది?’’ ఆలోచనలో పడుతూ అన్నాడు వార్డు బోయ్.

‘ఆమె’ అనగానే ఉలిక్కి పడ్డాడు రాము.

‘‘ఆమె....ఆమె ఎవరన్నా?!’’ కుతూహలంగా అడిగాడు రాము.

‘‘ఏమోరా! చీకటి పడుతుండగా మీ పేషెంటుని చూడ్డానికని ఒకామె వచ్చింది. ఆమె నువ్వొస్తావని...నీ దగ్గర పాతిక వేల
రూపాయలున్నాయని...ఇంకా....’’ అంటూ ఆగాడు వార్డు బోయ్.

‘ఈ గుంట ఎదవ నిజం చెప్తున్నాడా? అబద్ధం చెప్తున్నాడా? లేదా ఆవిడే నన్ను బురిడీ కొట్టించిందా?! ఊరికే ఎందుకలా చెప్తుంది. ఇందులో ఏదో మతలబు ఉంది. ఈ గుంటనా కొడుకే నన్ను వెర్రి వెధవని చేద్దామని చూస్తున్నాడేమో!’ మనసు లోనే తర్జన భర్జన పడ్డాడు వార్డు బోయ్.
‘‘అన్నా! చెప్పన్నా....ఆవిడ....ఆ అమ్మ....ఏమందన్నా! అమ్మగారొచ్చారా? నిజంగా....నిజం....’’ ఆనందంతో మరి మాట్లాడ లేక పోయాడు రాము.

రాము మొహంలో ఆనందం....మాటల్లో సంతోషం చూసి ఆశ్చర్య పోయాడు వార్డు బోయ్.

‘‘అవును.....అమ్మగారొచ్చారు....ఆమె చెప్పిందంతా నిజమేనా?! నిజమే కదరా!’’ రాము భుజాలు పట్టుకుని అడిగాడు వార్డు బోయ్.

‘‘ని...ని....నిజమే అన్నా! నా దగ్గర....నా దగ్గర అంత డబ్బు భద్రం గానే ఉంది.’’ ఆనందంగా అన్నాడు రాము.

‘‘ఓరి నా భడవా! నన్నే బురిడీ కొట్టించావు కదరా! క్షణంలో మీ అమ్మ గారే నన్ను ఎదవని చేసారేమోనని భ్రమ పడేలా చేసావు కదరా!’’ రాముని ఆనందంతో కౌగిలించుకుంటూ అన్నాడు వార్డు బోయ్.

(రామూ-సోమూకి, ఆమెకీ వారధిగా మిగిలిన ఒకే ఒక్కడు వార్డ్ బోయ్.....' ఆమె ' నమ్మిన వార్డ్ బాయ్ వాళ్ళను కలపడానికి సహకరిస్తాడా? పోలీసులకు సమాచారం చేరవేస్తాడా? ఈ సస్పెన్స్ వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా........)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
premiste emavutundi?