Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue272/721/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

(గత సంచిక తరువాయి).... గాయత్రి జరిగిందంతా చెప్పి మోకాళ్ళ మీద తల ఆనించి వెక్కి, వెక్కి ఏడవసాగింది. శరణ్య నిర్ఘాంతపోయి వింటున్నదల్లా ఒక్కసారి ఆగ్రహావేశాలతో రగిలిపోతూ గట్టిగా అరిచింది “రాస్కెల్ ... ఎంత నీచుడు.. పైకి పెద్ద మనిషిలా కనిపించి వంటరి ఆడపిల్ల మీద ఇంత  దౌర్జన్యం చేస్తాడా.. వాడిని వెంటనే సస్పెండ్ చేస్తాను ..”

తేజ ఆమెని శాంత పరుస్తూ అన్నాడు.. “ఆవేశపడకు శరణ్యా! రేపు ఉదయం ముందు ఎం ఆర్ వో గారికి జరిగింది చెప్పు.. ఆ తరవాత అతడిని ఆయన దగ్గరకే  పిలిపించి, గాయత్రి చేత విషయం చెప్పించి అతన్నే నిజమేనా అని అడుగు.. తప్పకుండా ఒప్పుకుంటాడు. అప్పుడు నువ్వు అండర్ సి,సి.ఏ రూల్స్ ఏ ఏక్షన్ తీసుకోవాలో తీసుకో”

అనిరుద్ కి గాయత్రిని చూస్తుంటే గుండె తరుక్కుపోయింది.

పాపం చిన్న తప్పుకి ఎంత పెద్ద శిక్షలు అనుభవిస్తోందో ఈ అమ్మాయి.. ఇంకా పసితనం వీడని అమాయకత్వం.. లోకజ్ఞానం లేని బేలతనం ... లౌక్యం తెలియని అయోమయం.. ఆదుకునే దిక్కులేని నిస్సహాయత.. అందంగా, ముగ్ధలా ఉన్న గాయత్రి వైపు చూస్తూ అనుకున్నాడు.

“ తేజ చెప్పింది కరెక్ట్ శరణ్యా! ఆయన అనుభవజ్ఞుడు... నీ పై అధికారి. ఆయన ఎదురుగానే ఈ సమస్య పరిష్కరించు. నువ్వు ఇంకా కొత్త కాబట్టి పైగా ఆడదానివని చిన్న చూపు ఉంటుంది వెదవలకి.  నువ్వు ఏం చేసినా వాళ్ళ మీద కక్షతో చేస్తున్నావని, గాయత్రి చేత నువ్వే అబద్ధం చెప్పిస్తున్నావని కూడా అంటారు.. ఇవన్నీ గవర్నమెంట్ సర్వీస్ లో చాలా తరచుగా ఆడవాళ్ళు  ఎదుర్కునే సమస్యలు, సవాళ్లు.. సో బి కేర్ఫుల్ ... అండ్ బి అలర్ట్ “ అన్నాడు అనిరుద్. 

వాళ్ళు చెప్పింది సబబే అనిపించింది శరణ్యకి . గాయత్రిని ఓదారుస్తూ “బాధపడకు గాయత్రి.. ఈ సారి నిన్ను ఎవరింట్లో ఉంచను. ఏదన్నా రేస్క్యు హోమ్ కి పంపిస్తాను .. అందాకా నా దగ్గరే ఉండు .. లేచి వెళ్లి స్నానం చేసి బాబుకి కూడా స్నానం చేయించు. భోజనం చేసి విశ్రాంతి తీసుకో .. ఏం చేయాలో, ఎలా చేయాలో రేపు నిర్ణయిద్దాం” అంది.

గాయత్రి కళ్ళు తుడుచుకుంటూ లేచి బాబుని తీసుకుని బాత్రూం లోకి వెళ్లి పోయింది.

తేజ ఆలోచిస్తూ అన్నాడు. “ ఈ అమ్మాయికి నా ఆఫీస్ లో ఆఫీస్ అసిస్టెంట్ గా పెట్టుకుంటాను.. రికార్డ్స్ జాగ్రత్త చేయడం, ఆఫీస్ నీటుగా ఉంచడం, ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుని ఆన్సర్ చేయడం చేయగలదు కదా.”

“ చేస్తుంది... ఇంటర్ వరకూ చదువుకుందిగా” అంది శరణ్య.

“కాకపోతే అకామడేషన్ ఎలా ..”

శరణ్య తేజ వైపు అభినందనగా చూస్తూ అంది  “నిజంగానా ... నువ్వలా పెట్టుకుంటే నేను ఆమెకి ఇక్కడే దగ్గరలో ఒక రూమ్ చూస్తాను.. మనం ఎలాగా ఉంటాం కాబట్టి కాస్త ధైర్యంగా ఉంటుంది.”

“ అదే బెటర్ ... రేస్క్యు హొమెస్ కూడా పెద్ద సేఫ్ కాదు శరణ్యా” అన్నాడు అనిరుద్.

శరణ్య ఆలోచిస్తూ ఉండిపోయింది.. ఆ రాత్రి గాయత్రిని, బాబుని తన పక్కన పడుకోబెట్టుకుంది శరణ్య. 

మరునాడు పదిన్నరకల్లా ఎం ఆర్ వో ఆఫీస్ కి వెళ్లి మీటింగ్ అటెండ్ అయింది శరణ్య. మీటింగ్ అయేసరికి లంచ్ టైం అయింది. లంచ్ తరవాత సనతకుమార్ ఛాంబర్ కి వెళ్ళింది శరణ్య.

“ రండి, రండి లంచ్ అయిందా” చిరునవ్వుతో అడిగాడు.

“ అయింది.. మీరు?” అడిగింది.

“ ఎస్ ఐ హాడ్ మై లంచ్ .. మన మీటింగ్స్ ఈ వీకెండ్ కి అయిపోతాయి. మీరు నెక్స్ట్ వీక్ మీ ఆఫీస్ కి వెళ్ళచ్చు. చాలా వర్క్ పెండింగ్ ఉండి ఉంటుంది కదా” అన్నాడు.

శరణ్య కళ్ళు వాల్చుకుని టేబుల్ మీద ఉన్న పేపర్స్ సర్దుతూ అంది “నిన్న ఈవినింగ్ వెళ్ళాను సర్..”

“ఓ అవునా ఎనీ థింగ్ ఇంపార్టెంట్ ?”

కొద్ది క్షణాలు మౌనంగా ఉండి  అతని వైపు చూసింది.. ఆమె మొహంలో కనిపిస్తున్న భావాలు చూస్తూ ఏదో జరిగినట్టుంది అనుకున్నాడు సనతకుమార్. ఆమె చెప్పేది వినడం కోసం సిధ్ధంగా ఉన్నట్టు చూసాడు.

“సర్ మీకు తెలుసుకదా గాయత్రి అనే అమ్మాయికి మనం అంగన్ వాడి లో కార్యకర్తగా ఉద్యోగం ఇచ్చాము..”

“అవును.. ఆ విషయంలో మన మీద ఏదో రూమర్స్ స్ప్రెడ్ చేసారు ..”

“ఎస్.. ఈసారి జరిగింది అది కాదు ...” అంటూ సుశీల దగ్గరనుంచి తనకు ఫోన్ వచ్చిన దగ్గరనుంచి జరిగింది అంతా చెప్పి అంది “అతని మీద చర్యలు తీసుకోడానికి నా దగ్గర ఉన్న సాక్ష్యం గాయత్రి.. ఆమె బాధితురాలు కాబట్టి నమ్మాలి. ఒకవేళ ఆమె ఏదన్న అబద్ధం చెప్తుంది అని అతను దబాయించినా ఆ రోజు అతను నాకు చెప్పిన దాన్నిబట్టి ఆఫీసులో లేట్ అవర్స్ ఉన్నాడని. కానీ అటెండ్ న్స్ రిజిస్టర్ ప్రకారం, అకౌంటెంట్ చెప్పిన ప్రకారం అతను ఆఫీస్ కే వెళ్ళలేదు. సో అతను నేరం చేసే అవకాశం ఉంది అని నమ్మాలి కదా.”

“కచ్చితంగా..” అప్పటికే కోపంతో ఎర్రగా అయిన మొహంతో తీవ్రంగా అన్నాడు.

“వెంటనే అతనికి మేమో ఇష్యూ చేసి, ఎక్స్ ప్లనేషన్  కాల్ ఫర్ చేయండి..ఎంత దారుణం!”

శరణ్యకి అతనలా రెస్పాండ్ అవడంతో కొండంత ధైర్యం వచ్చింది. మరికొంత సేపు ఆ విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి, సి,సి.ఏ రూల్స్ గురించి అన్ని వివరాలు మాట్లాడి, తను వెంటనే తీసుకోవలసిన చర్య గురించి వివరంగా తెలుసుకుని బయటకి వచ్చి సూపరింటెండెంట్ కి ఫోన్ చేసి మేమో రెడీ చేయమని చెప్పింది.

ఇంటికి వెళ్లి తేజకి, అనిరుద్ కి జరిగింది అంతా వివరంగా చెప్పి “రేపు నేను నందిగామ వెళ్ళాలి” అంది.

“గుడ్ మంచి పని చేసావు” అన్నారిద్దరూ.

సరిగ్గా మూడు రోజుల్లో గాయత్రి పట్ల రమణ చేసిన తప్పు ఒప్పుకునేలా చేసి, అతని చేత రాతపూర్వకంగా  క్షమార్పణ చెప్పించి ఇంకెప్పుడైనా అలాంటి కంప్లయింట్ వింటే సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చింది శరణ్య.

రమణ దాదాపు ఆమె కాళ్ళ మీద పడి  క్షమార్పణ అడిగాడు. ఏదో బలహీన క్షణంలో తప్పు చేసాను ఈ ఒక్కసారి వదిలేయండి.. ఇంకెప్పుడూ చేయను పెద్దవాడిని అని వేడుకోడంతో హెచ్చరికతో వదిలేసింది.. అది కూడా సనతకుమార్ సూచనతో.

గాయత్రికి తేజ తన ఆఫీస్ లో ఉద్యోగం ఇచ్చాడు.

శరణ్య ఒకళ్ళిద్దరు తన అసిస్టెంట్స్ కి చిన్న పోర్షన్ ఉంటే చెప్పమని చెప్పింది.

ఇప్పుడు కొంచెం మీటింగ్స్, పని ఒత్తిడి తగ్గి రోజు నందిగామ వెళ్తోంది శరణ్య. కానీ వెళ్లేముందు విజయవాడ ఆఫీస్ కి వెళ్లి అక్కడ తను చూసుకోవలసిన పనులు చూసుకుని వెళ్తుంది.

అనిరుద్, తేజ కలిసి ఒక డాక్యుమెంటరీ ప్లాన్  చేసుకున్నారు..దానికి చేస్తున్న గ్రౌండ్ వర్క్ లో గాయత్రి ని కూడా ఇన్వొల్వె చేసి ఆమెకి నేర్పసాగారు.

గాయత్రి హ్యాండ్ రైటింగ్ నీటుగా ఉండడం చూసి తను రఫ్ గా తయారు చేసుకున్న స్క్రిప్ట్ ఆమె చేత ఫెయిర్ చేయించసాగాడు తేజ.
ఇప్పుడు గాయత్రి మునుపటి కన్నా ఫ్రెష్ గా , నిశ్చింతగా ఉంటోంది. మంచి తిండి, నీడ పట్టున ఉండడం వల్ల కళ్ళ కింద వలయాలు పోయి ఒకనాటి గాయత్రి అందం మళ్ళి కనిపిస్తోంది ఆమెలో.

బాబు కూడా ఇంట్లో అందరికి మంచి కాలక్షేపం అయిపోయాడు.

అయితే అటు తేజకి, ఇటు శరణ్యకి కూడా అనిరుద్, గాయత్రిల రాకతో ప్రైవసీ పోయింది. రాత్రి పూట అనిరుద్ ఆఫీస్ లో పడుకుంటున్నాడు.. గాయత్రి మాత్రం శరణ్య ఇంట్లో ఒక బెడ్ రూమ్ లో ఉంటోంది. ఆఫీస్ లో ఒక బెడ్ రూమ్ లో బెడ్ వేసి విశ్రాంతి గదిగా మార్చాడు తేజ. అది అనిరుద్ కి పనికి వస్తోంది.

విజయవాడ నగర చరిత్ర డాక్యుమెంటరీ .. మెటీరియల్ కలెక్ట్ చేయడం, దానికోసం తిరగడం ఇద్దరూ బిజీ అవడంతో గాయత్రే ఆఫీస్ చూసుకుంటోంది.

ఇంతకీ గాయత్రి జీవితం ఒడ్డుకు చేరినట్టేనా.. తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం  వరకు ఆగాల్సిందే..

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్