Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> దారిపక్క దేవాలయం

daaripakka devalayam

దాదాపు పదిహేనేళ్ల నాటి సంగతి...

విజయ నగరం నుంచి తిరుగు ప్రయాణం. రాత్రి పదకొండు కావస్తోంది. సుమో ముందుకు దూసుకెళుతోంది. డ్రైవర్ వెంకట్ చూపులు రోడ్డు మీదే కేంద్రీకృతమై ఉన్నాయి.

''బాబూ, నువ్వు ముందు సీటులో కూచున్నావు కాబట్టి, రాత్రంతా మెలకువగా ఉండాల్సిన బాధ్యత నీదే. నువ్వు నిద్ర పోయావంటే డ్రైవరుకి కూడా నిద్రొస్తుంది. జాగ్రత్త'' వెనక సీటులో కూర్చున్న బావగారు హెచ్చరిక జారీ చేశారు.

''నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాక తప్పుతుందా? మీరు మాత్రం హ్యాపీగా గుర్రు పెట్టండి'' అన్నాను నవ్వుతూ. వారం రోజుల క్రితం తొమ్మిది మందిమి హైదరాబాదు నుంచి బయల్దేరి, విజయనగరంలో ఉంటున్న తమ్ముడి దగ్గరకు వెళ్లాం. అక్క, బావ, వాళ్ల పిల్లలిద్దరు, అమ్మ, అమ్మమ్మ, తాతయ్య, నేను, మా ఆవిడ ప్లస్ మా పాప!

నేనప్పుడు సూర్యాపేటలో ఓ దినపత్రికలో సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నాను. నైట్ డ్యూటీలు. చాలా కాలంగా వారాంతపు సెలవులు కూడా తీసుకోకపోవడంతో, పని మీద విరక్తి మొదలైంది. ఆ మొనాటనీ నుంచి బయట పడక పోతే అంతకంతకూ అసంతృప్తి పెరిగే ప్రమాదం కనిపించింది.

సరిగ్గా అదే సమయంలో బావగారు ఫోన్ చేశారు. ఆయన హైదరాబాదులో బ్యాంకు ఉద్యోగి.

''నేను ఎల్టీఏ ఉపయోగించుకోవాలి. ఒక వారం ఎటైనా వెళ్లొద్దామా?'' అడిగారు.

''మహదానందంగా. నేను కూడా ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్నా''.

అయిదు నిమిషాల చర్చ అనంతరం... ఎక్కడికో వెళ్లే బదులు, విజయ నగరంలో ఉంటున్న తమ్ముడి దగ్గరకే వెళ్తే బెటర్ అనుకున్నాం. పైగా వాళ్ల పాప పుట్టిన రోజు వేడుక కూడా కలిసొస్తుందని తీర్మానించాం.

హైదరాబాదు లోనే ఓ సుమో మాట్లాడుకుని, వాళ్లంతా వచ్చేశారు. సూర్యాపేటలో నేను, మా ఆవిడ, పాప జత కలిశాం. విజయవాడలో బంధువుల్ని పలకరించి, భోంచేసి, మళ్లీ బయల్దేరాం. రాత్రికి అన్నవరంలో బస చేసి, తెల్లవారు జామున దర్శనం చేసుకుని, సాయంత్రానికి విజయనగరం చేరుకున్నాం.

మరుసటి రోజు పొద్దున్నే బయల్దేరి, వైజాగ్ వెళ్లాం. సుమో డ్రైవర్ని రోడ్డు గుండా రమ్మని చెప్పి, మేమంతా రైలులో అరకు బయల్దేరాం. ఉదయం ఏడు గంటలకు బయల్దేరిన రైలు నగరం దాటి, పల్లెలు దాటి, కొండ కోనల్లోకి ప్రవేశించింది. ఒక కొండ మీంచి మరో కొండకు చేరుకుంటూ, అంతకంతకూ పైకి ప్రయాణిస్తూంటే... దారి పొడుగూతా కొండల మీద పచ్చని చెట్లు, రంగు రంగుల పూలు కనువిందు చేస్తున్నాయి. కొండ కొమ్ములతో ముచ్చట్లు చెబుతున్నట్లున్న మేఘాలు క్రమంగా మాకు దగ్గరవుతున్న అనుభూతి! రైలు సొరంగాల్లోంచి ప్రయాణించేటప్పుడైతే... బోగీలన్నీ జనం హర్షాతిరేకాలతో మార్మోగి పోయాయి.

చిన్న పిలల్లమై పోయి, కేరింతలు కొట్టాం. గేటులో నిలబడి కిందికి చూస్తే కనువిందు చేసే లోయలు, కళ్లు తిరిగే అందాలు... అడుగడుగునా రకృతి సౌందర్యాన్ని మనసులోకి పిండుకుంటూ...

బొర్రా గుహలు, మ్యూజియాలు, కాఫీ తోటలు... అన్నీ చూసి, రాత్రికి మళ్లీ విజయనగరం.మరో రెండు రోజులు స్థానికంగా అవీ ఇవీ చూసి, మరుసటి రోజంతా తమ్ముడి ఇంట్లోనే ముచ్చట్లలో మునిగి పోయాం. రాత్రికి ప్రయాణం కాబట్టి, డ్రైవర్ ని పగలంతా నిద్ర పొమ్మని చెప్పాం.  రాత్రి ఎనిమిది గంటలకు భోజనాలు కానిచ్చి, తిరుగు ప్రయాణమయ్యాం.

''ఆహా, ఎంత రిలీఫ్ గా ఉంది. మరో అయిదారు నెలలు కొత్త ఉత్తేజంతో పని చేయొచ్చు'' అన్నాను సుమో వైజాగ్ దాటి, విజయవాడ రహదారిపై పరుగులు తీస్తుండగా.

''అందుకే అప్పుడప్పుడూ అలా వెళ్తుండాలి'' అన్నారు బావగారు.

రాత్రి గడిచేకొద్దీ ఒక్కొక్కరే నిద్రలోకి జారుకున్నారు. నేను మాత్రం డ్రైవరుతో అడపాదడపా పిచ్చాపాటీ మాట్లాడుతున్నానే గానీ, రెండు దాటాక కళ్లు మూసుకు పోతున్నాయి. కాసేపు నిద్ర పోతూ, మరి కాసేపు మెలకువగా ఉంటూ... ప్రయాణం సాగుతోంది,

తెల్లవారు జామున అయిదున్నర. హనుమాన్ జంక్షన్ దాటి రెండు కిలోమీటర్లు ప్రయాణించాం. నేను నిద్రలోంచి మెలకువ లోకి వస్తుండగా... ఎదురుగా అల్లంత దూరంలో ఆగివున్న ఆర్టీసీ బస్సు... మా వాహనం స్పీడు తగ్గలేదు... నేను పెద్దగా అరవడం... డ్రైవరు సడన్గా బ్రేక్ వేయడం... తక్కువ స్పీడుతో వెళ్లి బస్సును ఢీకొనడం... క్షణాల్లో జరిగి పోయాయి. నిద్ర పోతున్న వాళ్లు తుళ్లి పడి లేచారు. సుమో ముందు భాగం బాగా దెబ్బతింది. అక్క, అమ్మల మోకాళ్లు ముందు సీట్లకు కొట్టుకోవడం వల్ల తగిలిన చిన్న చిన్న దెబ్బలు మినహా, అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు.

బస్సు డ్రైవరు దిగొచ్చి, బస్సు వెనక భాగాన్ని పరిశీలించి, మా డ్రైవరు దగ్గరకొచ్చి ''ఏరా, నిద్రపోయి నడుపుతున్నావా? రెండు వేలు తియ్'' అన్నాడు.

మా డ్రైవరు కంగారు పడి పోయి, కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. నేను, బావ గారు బస్సు డ్రైవరుతో మాట్లాడి, పదిహేను వందలిచ్చి, సరిపెట్టాం. బస్సు వెళ్లి పోయింది.

మా కుటుంబ సభ్యులంతా దిగి, రోడ్డు మీద నిలబడ్డారు. సుమో ఇంజిన్ పని చేయక పోవడంతో, స్టార్ట్ కాలేదు. రక రకాల ప్రయత్నాల అనంతరం, ''మీరంతా ఇక్కడే ఎక్కడో చోట కూర్చోండి. నేను, డ్రైవరు బస్సులో జంక్షన్ కు వెళ్లి, మెకానిక్ ను తీసుకొస్తాం'' అని చెప్పాను.  నిజానికి అక్కడ కూర్చోడానిక్కూడా అవకాశం లేదు. రోడ్డు మీంచి కాస్త దూరంలో మాత్రం కొబ్బరి తోట కనిపిస్తోంది. అందరి లోనూ ఆనందం ఆవిరైంది. మొహాల్లో తీవ్ర నిరుత్సాహం ఆవరించింది.

''ఛత్, చివర్లో ఇలా జరిగిందేం రా'' అన్నాడు బావ అసహనంగా.

నేను మాత్రం నిరుత్సాహ పడలేదు. ఓ సారి నా చిన్నప్పుడు మా కోటిరెడ్డి అన్నయ్య నన్ను తన సైకిల్ మీద మంగళగిరి తీసుకెళ్లాడు. వెళ్లిన పని తొందరగా అయిపోవడంతో, ఏదైనా సినిమాకెళ్దామన్నాడు. నా ఆనందానికి అవధుల్లేవు. అప్పట్లో సినిమాకెళ్లే ఛాన్స్ రావడమంటే జాక్పాట్ తో సమానం. సంతోషంగా వెనక ఎక్కి కూచున్నానో, లేదో సైకిల్కు కుడి పక్క పెడల్ ఊడి పోయింది. నాలుగు షాపుల్లో చూపించాం. పని కాలేదు. అవతల సినిమా టైమవుతోంది. అప్పటికి పదిసార్లు నేను ''ప్చ్.. ప్చ్...'' అన్నాను. అన్నయ్య తిట్టాడు.

''ఒక్కటే గుర్తు పెట్టుకో. ఇక్కడ కాకపోతే ఇంకోచోట పనవుతుంది. మనం ఏ దశ లోనూ నిరుత్సాహ పడకూడదు. ప్రయత్నం లేకుండా ఎప్పుడూ విజయం నీ దగ్గరకు రాదు'' అన్నాడు. ఆ తర్వాత వెళ్లిన షాపులో మెకానిక్ ఇట్టే దాన్ని బాగు చేశాడు. అప్పట్నుంచీ అన్నయ్య మాటలు నాకు అమృత గుళికలయ్యాయి.

''అదృష్టం మన పక్కనుండ బట్టే పెద్ద ప్రమాదం తప్పింది. అందుకు సంతోషించాలి'' అన్నాను.

నేను, డ్రైవరు బస్సెక్కి హనుమాన్ జంక్షన్ చేరుకున్నాం. ముందుగా ఓ ఎస్టీడీ బూత్ కు వెళ్లి, వాళ్ల ఓనరుకు ఫోన్ చేశాం (అప్పటికింకా సెల్ ఫోన్స్ రాలేదు). ఆయన ఫోన్ లోనే ఎడాపెడా తిట్లు మొదలెట్టినట్లున్నాడు, డ్రైవరు ఏడుస్తున్నాడు. అతని దగ్గర్నుంచి ఫోనందుకుని, నేను సర్ది చెప్పాను.

ఉదయం తొమ్మిది దాటుతోంది. ఓ మెకానిక్ షాపుకి వెళ్లాం. అదింకా తెరవ లేదు. బోర్డు మీద రాసిన ఫోన్ నెంబరు నోట్ చేసుకుని, మళ్లీ ఎస్టీడీ బూత్ కు వెళ్లి, ఫోన్ చేసి, త్వరగా రమ్మని అభ్యర్థించాను. అర గంటలో వస్తానన్నాడతను. టీ స్టాల్ వైపు నడిచి, వేడి వేడి గా ఇద్దరం టీ తాగాం.

అక్కడ మా వాళ్లెలా ఉన్నారో! అమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు పెద్ద వాళ్లు. కనీసం కూర్చోడానికైనా సదుపాయం దొరికిందో లేదో! ఆలోచన్లు వెంటాడుతున్నాయి.

మెకానిక్ వచ్చాక, అతని కారు తీసుకుని, సుమో ఉన్న ప్రదేశానికి చేరుకున్నాం. చిత్రంగా అక్కడ మా వాళ్లు ఎవ్వరూ కనిపించ లేదు. సుమోను ఆసాంతం పరిశీలించాక, ''దీన్ని షెడ్డుకు తీసుకెళ్దాం సార్. రన్నింగ్ కు అవసరమైన మరమ్మతులు చేస్తాను'' అన్నాడు మెకానిక్.  ''ఆ మాత్రం చాలు బాబూ'' అన్నాను.

సుమోను ఓ మోకుతో కారుకు కట్టేలోగా, నేను ఆ పరిసర ప్రాంతాలన్నీ వెదికాను. ఎక్కడా మా వాళ్లు కనిపించ లేదు. డ్రైవరు సుమోలో కూర్చున్నాడు. నేను మెకానిక్ తో పాటు కారెక్కాను. షెడ్డుకు చేరుకున్నాక, బాగా సొట్టబోయిన సుమో ముందు భాగాన్ని సరి చేయడం మొదలు పెట్టాడు. డ్రైవరు, నేను హోటల్ కు వెళ్లి, ఇడ్లీ తినివచ్చాం. రెండు మూడు గంటలు పడుతుందని మెకానిక్ చెప్పడంతో, మా డ్రైవరు

''మీరెళ్లండి సార్. నేను చేయించుకుని వస్తాను. మీ వాళ్లు కంగారు పడుతుంటారు'' అన్నాడు.

నేను బస్సెక్కి, ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకునే సరికి, రోడ్డు వారగా బావగారు నిలబడి ఉన్నాడు. నాకు ప్రాణం లేచి వచ్చింది. ''వీళ్లంతా ఎక్కడ?'' ఆత్రంగా అడిగాను.

''రా, చూపిస్తా''నంటూ కొబ్బరి చెట్లున్న వైపు తీసుకెళ్లాడు. తోట లోంచి ఉన్న దారి గుండా వెళ్తే, ఓ ఇల్లు కనిపించింది. అక్కడ చెట్ల కింద మూడు మంచాల మీద వీళ్లంతా సేద తీరుతున్నారు. మధ్యాహ్నం కావస్తోంది.

''మెకానిక్ దొరికాడా? బాగవుతుందా? ఎంతసేపు పడుతుంది?'' నన్ను ప్రశ్నలతో ముంచెత్తారు.

''రెండు గంటల్లో బండి రెడీ అవుతుంది'' కంగారు లేకుండా చెప్పాను.

''సరే, అదుగో ఆ బాదం చెట్టు కింద పంపుంది. వెళ్లి, కాళ్లు చేతులు కడుక్కొచ్చుకో'' అంది అమ్మ. చల్లటి నీళ్లతో మొహం కడుక్కుని, వచ్చి, అమ్మ పక్కనే కూర్చున్నాను.

ఓ మహిళ గ్లాసుతో మంచి నీళ్లు తెచ్చింది. నేను తాగుతుండగా ''మా పెద్దబ్బాయి'' అని చెప్పింది అమ్మ. ఆమెకు నమస్కారం చేశాను. అమ్మ చెప్పిన వివరాల ప్రకారం...

వాళ్లలా గంట సేపు రోడ్డు పక్కనే నిలబడ్డారు. అమ్మమ్మ, తాతయ్య ఇక నిలబడ లేక నేల మీదే కూర్చున్నారు. తోట వైపు నుంచి ఓ పదేళ్ల కుర్రాడు వచ్చి ''మా అమ్మోళ్లు మిమ్మిల్ని లోపలికి రమ్మంటన్నారు'' అని చెప్పాడు.

అందరూ రోడ్డు దిగి, మట్టి బాటలోంచి తోట వైపు నడిచారు. దారికిరువైపులా ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లు, అక్కడి నుంచి లోపలికి విస్తరించిన పండ్ల తోటలు, అక్కడక్కడా పూల మొక్కలతో ఆ ప్రదేశమంతా పచ్చదనం తాండవిస్తోంది. ఆ బాటలో ఓ వంద మీటర్ల దూరం వెళ్లాక పాత కాలపు పెంకుటిల్లు. ఆ తోటలకు వాచ్మన్ గా పని చేస్తున్న నాగరాజు, ఆయన భార్య అనసూయ అక్కడే కాపురముంటున్నారు.

''మేమిక్కడకు రాగానే భార్యాభర్తలిద్దరూ ఎంతో పరిచయమున్న వాళ్లలా పలకరించారు. ఇంట్లోకి తీసుకెళ్లారు. తాగడానికి మంచినీళ్లిచ్చారు. అందరం బ్రష్ చేసుకుని, మంచాల మీద కూర్చోబోతుండగా ఆమె వేడివేడి ఇడ్లీలు తీసుకొచ్చింది. అప్పటికప్పుడు ఇంత మందికి ఆ మహాతల్లి ఇడ్లీలు ఎలా వేసిందో నాకర్థం కాలేదు. కమ్మని కాఫీ పెట్టిచ్చింది. తిని కాస్తంత విశ్రాంతిగా నడుం వాల్చాం. ఇంతలో నువ్వొచ్చావు'' అమ్మ వివరించింది.

నాగరాజు వచ్చి ''ఆయ్, నేనీ తోటలో వాచ్మేన్ గా ఉంటానండీ. మీ వోళ్లు రోడ్డు వార నిలబడి ఉండటం మా యావిడ చూసిందంట. ఏదో జరిగిందని ఊహించాం. ఇక్కడ ఎప్పుడెప్పుడూ ఇట్టా జరుగుతూనే ఉంటాయి. ఇబ్బంది పడేవోళ్లకి మాకు తోచిన సాయం మేం చేస్తుంటాం'' అన్నాడు.

''చాలా సంతోషం నాగరాజు. పిల్లలేం చదువుతున్నారు?''

''బాబు ఆరో తరగతి, పాప నాలుగు'' చెప్పాడు.

''పిల్లల్ని బాగా చదివించు. ఏమైనా సాయం కావాలంటే నేనున్నా'' ఏదో ధైర్యం చెబుదామని ప్రయత్నించాను.

''అట్టాగే. బోజనాలు సిద్ధం. అందరూ రండి బాబూ'' లోపలికి పిలిచాడు.

ఆ గదిలో అందరం రెండు వరసలుగా కూర్చున్నాం. అక్క సాయంతో ఆమె వంట పూర్తి చేసింది. ఆకలి నకనకలాడుతోంది. ఆకు కూర పప్పు, టమాటా చారు అంతకుముందెప్పుడూ నాకంత రుచిగా అనిపించలేదు. గడ్డ పెరుగుతో తినడం పూర్తయ్యే సరికి పొట్ట బిర్రెక్కింది. పదార్థాలతోనో లేక ప్రేమతోనో గానీ అందరికీ కడుపులు నిండి పోయాయి. వాహనం పని ఎంత వరకూ వచ్చిందో కనుక్కొందామని ఫోన్ చేయడానికి రోడ్డు మీదికి వచ్చే సరికి, అప్పటికే డ్రైవరు సుమోతో రెడీగా ఉన్నాడు. నేను సుమో ఎక్కి, తోటలోకి తీసుకెళ్లాను.

మరీ మరీ కృతజ్ఞతలు చెప్పి అందరం నాగరాజు, అనసూయల దగ్గర సెలవు తీసుకున్నాం. అమ్మ రెండు అయిదొందల నోట్లు తీసి, అనసూయ చేతుల్లో పెట్టబోయింది. ఆమె వద్దంటే వద్దంది. అమ్మ కళ్లనీళ్లు పెట్టుకుంటూ ''చూడమ్మా, మీరు ఏ జన్మలోనో మాకు రుణపడినట్టున్నారు, ఇలా తీర్చుకున్నారు. ఎంత అయిన వాళ్లయినా ఇంత ఆప్యాయంగా చూడరు. ఆపదలో ఆదుకున్నారు. కాదనొద్దు, పిల్లలకు బట్టలు తీసుకోండి, మా గుర్తుగా'' అంటూ బలవంతంగా ఆమె గుప్పిట్లో పెట్టింది.

నాగరాజు దగ్గరగా వచ్చి ''వద్దమ్మా, డబ్బులు తీసుకుంటే మేం చేసిన దానికి అర్థం లేనట్టే'' అంటూ అనసూయ చేతుల్లోని నోట్లు తీసి, అమ్మ చేతిలో ఉంచి, దండం పెట్టాడు.

అమ్మ ఇంకేం మాట్లాడ లేక, కళ్లనీళ్లు తుడుచుకుంటూ, వాళ్లిద్దరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ, సుమో వైపు నడిచింది.

(నా ఫోన్ నంబరిచ్చినా, ఇప్పటివరకూ ఎలాంటి సాయమూ కోరకుండా, నన్ను 'మోసం' చేసిన నాగరాజుకు కృతజ్ఞతలతో)

మరిన్ని కథలు
mojupenugulata