Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
daaripakka devalayam

ఈ సంచికలో >> కథలు >> మోజు పెనుగులాట

mojupenugulata

పనికి రాకపోయేసరికి సుజాతకై వాకబు మొదలు పెట్టిన కాంతమ్మకు, సుజాత చంపబడిందని తెలియగా నిజంగా బాధ పడుతోంది.     ఆవిడే కాదు సుజాతను ఎరిగిన వారందరు కూడా.

అట్టి సుజాతకై క్లుప్తంగా - సుజాత ఒంటరిగా ఉంటుంది.

అలాగని ఆమెకు తల్లిదండ్రులు, తోడ పుట్టిన వారు ఎవరూ లేరని చెప్పలేం. ఎంచేతంటే ఆమెకు వారంతా ఉన్నారు. ఐనా వారిని సుజాతకై అడిగితే, వారు  ముందున్న ఊరులో ఉన్నప్పుడైతే ఏదో ఊరు వెళ్లినప్పుడు అక్కడ ఏదో జబ్బుతో చచ్చిపోయిందని అన్నారు, ఆ ఊరు మారి మరో ఊరు వచ్చి ఉంటుండగా సుజాత ఊసు కూడా వారెవరూ ఆడడం లేదు.

ఇక సుజాతను కదిపితే నాకు ఎవరూ లేరు అనేస్తోంది. నిజానికి ఆమె ప్లస్ టు చదువుతుండగా ఒక రామారావుతో లేచి పోయింది. అతను కొన్నాళ్లు బాగానే ఉన్నా, ఇద్దరి వద్దా ఉన్న డబ్బులు ఖర్చు కాగానే, ఆమెకు చెప్పా పెట్టక ఎటో పోయాడు.

సుజాత ఎటూ పాలుపోక ఊరు మారింది. అంతే. పిమ్మట బ్రతుకుకై మూడు ఇళ్లల్లో పనికి వెళ్తోంది. అలా వచ్చిన మొత్తం లోంచి కొంత హెచ్చించి సామాన్య సదుపాయాలు ఉన్న ఇంటి లాంటి ఈ గదిలో ఉంటుంది చాన్నాళ్లుగా. తన నెల ఖర్చులుకు పోగా మిగిలిన తన సంపాదనను ఏ నెల కా నెలా పేద పిల్లల సంరక్షణకై వినియోగించేస్తోంది.

"ఇప్పుడు సంపాదన ఉంటుంది. అది రేపు లేకపోయినా, నీ ఒళ్లు పనులకు ఒప్పుకోకపోయినా అప్పుడు నీ గతి ఏమిటే. మిగిలినది దాచుకో" అన్న వారితో ఏమీ అనక, ఏదోలా నవ్వేసి ఊరుకుండిపోయేది సుజాత.

ఇంతటి సుజాత ఎలా చంపబడింది. ఎందుకు చంపబడింది.

"ఇంతకీ సుజాత చంపబడిందా, చచ్చిందా" అని ఎవరో లేవనెత్తారు.

"చాల్లెండి సుజాత ఎందుకు చస్తుంది. తను గుండ్రాయి లాంటిది" అని ఎందరో అన్నారు.

"ఎవరికీ ఆమె శత్రువు కాదు" అని చాలా మంది అంటే,

"ఎవరికీ ఆమె విరోధీ కాదాయే" అని అంతా అన్నారు.

అంతా అస్తవ్యస్తంగా అనుకుంటున్నా, సవ్యంగానే చేయవలసినవి చేపట్టారు.  ఆ తోవన అందిన సమాచారంతో పోలీసులు వచ్చారు. సమాచార సేకరణ మొదలెట్టారు.    "మాకూ ఎవరి మీదా అనుమానాలు లేవు"

"ఆమె చాలా మంచిగానే తిరుగుతుండేది"

"ఆమె నిప్పులాంటిది"

"ఆమె తన వాళ్లు ఎవరో తెలియదనే అనేది"

"ఆమె ఒంటరిగానే ఉంటుంది"

"మంచిగా మెసులుతుండడంతో మేము పనుల్లో పెట్టుకున్నాం"ఇలా సాగిపోతోంది ఆ విచారణ తీరు. ఆ పోలీసాఫీసర్ ఏమీ తేల్చుకోలేక పోతున్నారు. ఆ గది లాంటి ఇంటిని మళ్లీ క్షుణంగా పరిశీలించారు. సుజాత బాడీనీ మరలా పరిశీలించారు. ఆమె మూతికి వెడల్పాటి గమ్ టేపు అంటించి ఉంది. ఆమె మెడ చుట్టూ బలమైన కోత ఉంది. ఆమె గిలగలాడినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. చాలా గంటల క్రితమే ఈ సంఘటన జరిగినట్టు పోల్చుకోవచ్చు. విచారణ తిరిగి మొదలైంది.

"తొలుత నేను చూశాను. గదికి తాళం లేక పోతేను నేనే గది తలుపును తోసి చూశాను" చెప్పింది ఒకరు.

"ఆమె బయటకు వెళ్లి నప్పుడే గదికి తాళం పెడుతోంది. లోన ఉండగా లోపలి గడియ కూడా పెట్టదు ఎప్పుడు." చెప్పింది మరొకరు.

"నిన్న రాత్రి మేము మాట్లాడుకున్నాం" చెప్పారు కొందరు.

"రాత్రి ఎప్పటిలాగే సరదాగానే ఉంది" చెప్పారు ఇంకొకరు.

"మాకు ఏ విధమైన అలికిడి కాలేదు" అన్నారు ఇరుగు పొరుగు వారు.

"అక్కా చాలా చాలా మంచిది" ఇలా మధ్య మధ్య సుజాతచే సాకబడుతూన్న పిల్లలు అంటూనే ఉన్నారు. వారు ఏకదాటిగా ఏడుస్తూనే ఉన్నారు.

అచ్చట అంతా గందరగోళంగా ఉన్నా, గంభీరంగానూ ఉంది.

పోలీస్ వారి వైపు నుండి జరగవలసినవన్నీ జరిగిపోతున్నాయి.

ఒక పోలీసు ఆ గదిని పరిశీలించి, "ఫోన్ ఏదీ లేదు సార్" అన్నారు.

"తనకు ఫోన్ లేదండీ" చెప్పారు ఒకరు. మరో పోలీసు, "గాయంకు కారణమైనదేదీ కనిపించడం లేదు సార్" అని చెప్పారు. ఆ పోలీసాఫీసర్ తేరుకోలేక పోతున్నారు. అన్ని తీరులూ పూర్తయ్యాయి.

"బాడీని పోస్ట్ మార్టంకు తరలించండి" చెప్పారు ఆ పోలీసాఫీసర్.

అందరూ ఆందోళన పడుతున్నారు. చాలా మంది ఏడుస్తున్నారు. సదరు సుజాత బాడీని కదులుస్తున్నప్పుడు ఆమె కింద ఒక కత్తి కనిపించింది. ఆ బాడీని పక్కన పెట్టించారు.ఆ కత్తిని పరిశీలనగా చూస్తున్నారు. ఆ కత్తి నిండా రక్తం. దాని పిడికీ రక్తమే. ఇంతకు ముందు తమ కుక్కలు ఆ సుజాత బాడీ చుట్టూనే తిరిగి తిరిగి ఆగిపోయే తీరును అవగాహన చేసుకోవడానికి ఆ పోలీసాఫీసర్ ఆలోచినల్లో పడ్డారు.

అంతా వింతగా ఉంది. అందరికీ చోద్యంగా ఉంది.

సుజాత రెండు అరచేతుల్ని గమ్మున చూశారు ఆ పోలీసాఫీసర్.వాటిన రక్తం మరకలు మరకలుగా ఉంది. "పెనుగులాటలో అంటిన రక్తంలా ఉంది సార్"

"ప్రతిఘటన సమయంలో ఈ కత్తి ఈమె కింద పడిపోయి ఉండొచ్చు సార్"

"ఇది ఆత్మహత్యలా కనిపించడం లేదు సార్"

"ఈమె కింద పడిపోయిన ఈ కత్తిని హంతకుడు తొందరలో మరిచిపోయినట్టు ఉంది సార్" తన సిబ్బంది చెప్పింది విని వారికి కొన్ని పనులు పురమాయిస్తున్నారు ఆ పోలీసాఫీసర్.వారు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ పోలీసాఫీసర్ సుజాత బాడీనే తదేకంగా చూస్తున్నారు ఈ మారు. ఒక్క మారుగా, "ఆధారం దొరికింది" అన్నారు ఆయన. అంతా ఆ పోలీసాఫీసర్ వంక తలలు తిప్పారు. ఆ సుజాత బాడీ వైపు ఒంగి, ఆమె కుడి చెవి పక్క జుత్తు లోనించి ఏదో సేకరిస్తున్నారు ఆయన.అంతా దానికై తపన పడుతున్నారు. ఆయన దానిని భద్ర పరిచి, అక్కడి మిగతా పనులను త్వరితంగా కానివ్వాలని, బాడీని పోస్ట్ మార్టమ్ కు పంపమని తన వారికి చెప్పి, తను అక్కడ నుండి ఎటో బయలుదేరుతూ వెళ్లిపోయారు.

అంతా అయన చర్యను చూశారు. తలోలా మాటలు మొదలుపెట్టారు.ఆ మర్నాడు -

విలేకర్లు సమక్షంలో ఒకతన్ని చూపుతూ, "ఇతడు శివ. ఒక జులాయి. నాచే ఒక మారు చీవాట్లు తిన్నాడు. పక్క పట్నంలో ఉంటున్నాడు. సదరు సుజాతకై రాత్రి ఆమె గదికి వచ్చాడు. ఆమె తిరగబడింది. వీడు ఆమె నోటికి టేపు అంటించేశాడు. ఆమెను లొంగ తీసుకోబోయాడు.  పెనుగులాట జరిగింది. వీడు కసితో ఆమె గొంతు కోసేశాడు." అని చెప్పి -

ఒక కవర్ లోంచి ఒక వస్తువును తీసి చూపుతూ, "ఇది వీడి చిటికెన వేలు ఉంగరం. దీని మీద శివ అని ఉంటుంది. నాకు ఇది గతంలో తెలుసు. ఈ ఆధారంతోనే వీడిని పట్టుకున్నాను. ప్రశ్నించాను. వీడు తప్పించుకోలేక పోయాడు. జరిగిందంతా చెప్పేడు.మా ఇన్వెస్ట్ గేషన్ లో తెలిసిన మరో ఖచ్చితమైన సమాచారం. వీడు నిజానికి శివ కాదు. వీడి అసలు పేరు రామారావు. వీడు సదరు సుజాతను మోసగించిన వాడు. ప్రేమ అని భ్రమ పెట్టి మభ్యంతో ఆమెను వంచించాడు. ఆమెను వదిలిపోయినా ఆమెపై మోజు పోక ఇంతగా బరితెగించాడు. అనుభవిస్తాడు. దానికై ఇక మా వైపు నుండి తదుపరి చర్యలు కొనసాగిస్తాం." అని ముగించారు ఆ పోలీసాఫీసర్.

మరిన్ని కథలు