Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

kaatyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue277/732/telugu-serials/katyayani/kaatyayani/

(గత సంచిక తరువాయి).. చెక్కగేటు తీసి బయటకెళ్లాడు.

ఆగిన కారులోంచి ఆరడుగుల పొడుగుతో, సుమారు నలభై అయిదేళ్ల వయసు, చామన ఛాయతో ఉన్నవ్యక్తి ముందుగా కారు దిగి అచ్యుత రామయ్యను నవ్వుతూ చూశాడు. ఆయన తర్వాత ఒంటి నిండా నగలతో, ఆకు పచ్చ రంగు పట్టు చీరలో, కొద్దిగా పసిమి ఛాయతో భారీ పర్సనాల్టీ గల ఒకావిడ, మాంచి కలరుతో, ఆరడుగుల పొడవు, ముఖాన నప్పే కళ్ల జోడుతో కళగా ఉన్న ఒక యువకుడూ దిగారు. వీళ్లు దిగుతుండగానే వీళ్ల కారు వెనకాల మరో కారు ఆగి, అందు లోంచి చూడ ముచ్చటగా ఉన్న జంట దిగింది. వాళ్లనూ, వాళ్ల స్థాయినీ చూశాక ‘తను వాళ్లకి సరి తూగ గలడా? అయ్య వారు మంచి సంబంధం ఉందన్నారు గాని మరీ ఇంత గొప్ప సంబంధం అని చెప్ప లేదు’ అచ్యుత రామయ్య గారి మనసులో తీవ్ర స్థాయిలో ఆలోచనలు సుళ్లు తిరిగాయి.

’రండి, రండి’ అని లోపలికి సాదరంగా ఆహ్వానించి ” యశోదా, పెళ్లి వారు వచ్చేశారు’ అని లోపలికి తీసుకెళ్లి కుర్చీల్లో కూర్చో బెట్టి, ఫ్యాన్ వేసి ‘తమ ఇంటిని చూడం గానే వాళ్లలో ఏవన్నా అయిష్టతా భావం కలిగి, అది వాళ్ల ముఖంలో ప్రతిఫలిస్తుందేమో’నన్న భయంతో అందరి ముఖాల్లోకీ ఆందోళనగా చూశాడు. తననుకున్నట్టుగా కాకుండా వాళ్ల ముఖాలు నిర్మలంగా ఉన్నాయి. ‘హమ్మయ్య’ అనుకున్నాడు. వాళ్లకి కాళ్లు కడుక్కోడానికి నీళ్లు ఇచ్చి, వాళ్లు కాళ్లు కడుక్కున్నాక లోపలికి తీసుకెళ్లి కుర్చీల్లో కూర్చోబెట్టాడు. యశోదమ్మ వాళ్లకు మంచి నీళ్లు తెచ్చిచ్చింది.

"ఇక్కడికి రావడంలో ఇబ్బందేం కలగలేదుగా" అడిగాడు అచ్యుత రామయ్య గారు.

"లేదండి, నా స్నేహితుడు ఈ కాలనీ లోనే ఉంటాడు, వాళ్లింటికి ఎన్నో సార్లు వచ్చాను. అన్నట్టు నా పేరు శ్రీకర్ రావు, ఈమె నా భార్య ప్రణతి. మా అబ్బాయి యశో భూషన్, వాడు నా తమ్ముడు శ్రీధర్, ఆమె అతని భార్య తులసి" అని కుటుంబ సభ్యుల్ని పరిచయం చేశాడు.
అచ్యుత రామయ్యగారు కూడా తన భార్యని పరిచయం చేస్తుండగా, కాఫీ కప్పులూ, పక్కనే సుగరు ఉన్న చిన్న స్టీలు డబ్బా ఉంచిన ట్రే తెచ్చి టీపాయ్ మీద పెట్టింది. "మీకు సుగరు ఎలా కావాలో చెబితే, అలా వేసి, కలిపిస్తుంది మా అమ్మాయి కాత్యాయని, సుగర్లు కదండీ, కాఫీలో సుగరు కలిపిచ్చే స్వేచ్ఛ ఉండడం లేదు" అన్నాడు నవ్వుతూ.

"అవునవును. మీరన్నది నిజమే! దేవుడి దయవల్ల మాకింత వరకూ సుగరు, బీపీ, థైరాయిడ్ వంటి సమస్యలు లేవు" అని నవ్వాడాయన. కాత్యాయని అందరి కప్పుల్లో రెండు చెంచాల సుగరు వేసి అందిస్తుంటే. " నువ్వూ కూర్చోమ్మా, చక్కగా అందరం మాట్లాడుకుందాం" ప్రణతి నవ్వుతూ లేచి కాత్యాయని చేయి పట్టుకుని తన పక్కన ఉన్న కుర్చీలో కూర్చోబెడుతూ అంది.

కాత్యాయని సిగ్గుల మొగ్గవుతూ ఆవిడ పక్కన కూర్చుంది.

"అయ్య వారు గుడిలో పనులు ముగించుకుని కొద్ది సేపట్లో ఇక్కడికీ వస్తానన్నారు. ఆయనే మీ గురించి చెబుతూ మంచి సంప్రదాయక కుటుంబమనీ, అమ్మాయి సాక్షాత్తు సీతమ్మ వారేనని చెప్పారు. నిజానికి ఇలాంటి సంబంధం కోసమే చాలా కాలంగా చూస్తున్నాం. దేవుడు తన పూజారిని ఇలాంటి మంచి సంబంధం విషయమై మా దగ్గరకు పంపించినట్టు అనిపించింది.

నేను ప్రైవేటు బ్యాంకులో క్లార్క్ గా పనిచేస్తున్నాను. మా ఆవిడ హౌస్ వైఫ్, మా తమ్ముడు ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. అతని భార్యా అదే కాలేజీలో జూనియర్ లెక్చరర్ గా పని చేస్తోంది. వాడికి నేనంటే చాలా ఇష్టం. అందుకే లక్ష్మణుడిలా అన్ని విషయాల్లోనూ నన్నంటి పెట్టుకునే ఉంటాడు" అని నవ్వాడు.

"నాపేరు అచ్యుత.." చెప్ప బోతుంటే "మీ గురించి మొత్తం అయ్య వారు చెప్పేశారు. మళ్లీ పరిచయాల పర్వం ఎందుకండీ" అన్నాడు శ్రీకర్ రావు.

"ఏరా యశో, అమ్మాయి నచ్చిందా?" అడిగింది ప్రణతి వాళ్లబ్బాయిని.

అతను కాస్త మొహమాట పడ్డాడు.

"అమ్మాయీ నువ్వు కూడా మా అబ్బాయిని చూడు. మీరు ఒకరికొకరు నచ్చాకే, మిగతా మాటలు "అంది.

కాత్యాయని అత్తిపత్తయింది.

ఇలా జరుగుతుండగా అయ్య వారు వచ్చి" గుడిలో చేయ వలసిన కార్యక్రమాలన్నీ ముగించుకుని వచ్చే సరికి ఇదిగో ఇంత ఆలస్యమైంది" అన్నారు లోపలికొస్తూ.

"అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు చూసుకుంటున్నారు" అన్నారు శ్రీకర్ రావు.

"శుభం. పెళ్లి చూపులంటే అదే కదా" అంటూ పంచాంగం, ఇతర సామాగ్రి ఉన్న బ్యాగ్ పక్కనున్న టీపాయ్ పై పెడుతూ కూర్చున్నారు.

"ఇరువురి వెలిగి పోతున్న ముఖాలూ చూస్తే ఒకరంటే ఒకరికి నచ్చినట్టుగానే ఉంది. ఇహ మిగతా విషయాలు మాట్లాడుకుంటే సరి" అన్నారు అయ్య వారు.

"మా అబ్బాయి అమెరికాలో ఉంటాడని తెలుసుగా, అమ్మాయి పెద్దగా చదువుకోక పోయినా, మంచి పిల్లై ఇంటిని చూసుకుంటే చాలన్నాడు. వీళ్ల సంప్రదాయం, మంచితనం మీరు చెప్పనే చెప్పారు. మాకు పైసా కట్నం వద్దు. పెళ్లి కూడా మీ గుడి లోనే చేసేద్దాం. ఏవంటారు?" అన్నాడు శ్రీకర్ రావు.

"ఇంకేవంటారు? మంచితనం ఇలా మాటల్లో కనిపిస్తుంటే. అబ్బాయి చదువు పూర్తి చేసుకుని అలా విదేశాలకు వెళ్లగానే, కట్నకానుకల వేలంకు పెట్టే తల్లి దండ్రులున్న ఈ రోజుల్లో కట్నం వద్దనీ, నిరాడంబరంగా పెళ్లి చేస్తే చాలనే తల్లి దండ్రులుండడం గొప్ప విషయం. అందరికీ శుభాశీస్సులు" అన్నారు అయ్య వారు.

’ఇది అమెరికా సంబంధమా? అబ్బాయి అమెరికాలో ఉంటాడా? ఇవేం చెప్ప లేదే అయ్య వారు, మంచి సంబంధం అంటే, తను పెళ్లి చూపులకు ‘ఊఁ’ అన్నాడు’ అచ్యుత రామయ్య గారి మనసులో ఆలోచనలు గిర గిరా తిరుగుతున్నాయి.

"ఏవంటారు? అచ్యుత రామయ్య గారూ అభ్యంతరాలేమీ లేనట్టేగా? అయినా ఎందుకుంటాయి లేండి? భగవంతుడు అమెరికా సంబంధాన్ని. మంచి మనసున్న అత్తవారినీ వరంలా ప్రసాదిస్తుంటే. మీరందరూ ఏ జన్మలోనో స్వామికి ఏ లోటూ రాకుండా పూజ చేసి ఉంటారు. దాని ఫలితమే ఈ శుభ సందర్భం" అన్నారు అయ్యవారు.

"క్షమించాలి నాకు ఈ సంబంధం ఇష్టం లేదు" అన్నారు మ్లానమైన వదనంతో అచ్యుత రామయ్య గారు.

"వ్వాట్" షాక్ అయినట్టుగా అన్నాడు శ్రీకర్ రావు.

***

(తలుపుతట్టిన అదృష్టాన్ని కాదని వెనుదిరిగిన అచ్యుతరామయ్యగారి అంతర్మధనం దేనికో తెలియాలంటే వచ్చే శుక్రవారం ఒంటి గంట దాకా ఆగాల్సిందే......)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana