Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
kaatyayani

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue277/731/telugu-serials/anveshana/anveshana/

 

(గత సంచిక తరువాయి)....అర్థరాత్రి పూట వార్డు దగ్గరకు వచ్చిన సివిల్‌ డ్రస్‌ లో ఉన్న పోలీసుల్ని చూసి ఎవరో అనుకుంది నర్సు.

‘‘ఎవరు కావాలండీ? ఇంత రాత్రి వేళ మీరు ఇలా వార్డు ల్లోకి రాకూడదు.’’ అంది నర్సు.

‘‘ఓకే మేడమ్‌. మేము మా తాలూకా పేషెంటు అడ్రస్‌ దొరక్క రాత్రి నుండి ఇటు అటు తిరుగుతున్నాము. సారీ.’’ అన్నాడొక పోలీసు. తాము ఇక్కడే ఉన్న ‘రాము’ మీద నిఘా కోసం వచ్చామని చెప్పలేదు. చెప్ప కూడదు కూడా.

‘‘ఓకే. తెల్లారి రండి. ఉదయం 7 గంటలకి విజిటింగ్‌ అవర్‌లో వెదుక్కుంటే మంచిది. ఇది నిషిద్ధ సమయం. పేషెంటు దగ్గర ఉండే వ్యక్తిని తప్ప వేరే ఎవరినీ రానివ్వ కూడదు. ప్లీజ్‌.’’ వాళ్ళని వెళ్లి పొమ్మన్నట్టు అంది నర్సు.

బల్ల మీద రాము ప్రశాంతంగా పడుకోవడం చూసి వెను దిరిగారు ఇద్దరు సివిల్‌ పోలీసులు. వాళ్ళు అలా తిరిగి వెళ్ల గానే గబ గబా వెళ్లి రాముని లేపాడు వార్డు బోయ్‌. ఉలిక్కి పడి లేచాడు రాము.

‘‘ఏందన్నా! ఇంత అర్థ రాత్రి...ఏం చెప్పాలన్నా?’’ కళ్ళు నులుముకుంటూ అన్నాడు రాము.

‘‘మీ ఫ్రెండ్‌కి తెలివి వచ్చింది. రా! రామూ...రామూ... అని నిన్నే కలవరిస్తున్నాడు. సిస్టర్‌ చెప్పింది. రా!’’ అంటూ రాము చెయ్యి పట్టుకుని ఎమర్జెన్సీ వార్డు లోపకు లాక్కు పోయాడు వార్డు బోయ్‌.

సోముకి తెలివి వచ్చిందనే సరికి ఆనందంతో ఉప్పొంగి పోయాడు రాము. వార్డులో పేషెంట్లంతా గాఢ నిద్రలో ఉన్నారు. రాము చెయ్యి పట్టుకుని నెమ్మదిగా సోము పడుకున్న మంచం దగ్గరకు తీసుకు వెళ్లాడు వార్డు బోయ్‌.

కళ్ళు విప్పార్చి చుట్టూ చూస్తున్నాడు సోము. తకి పెద్ద కట్టు కట్టి ఉంది. తలంతా కనిపించకుండా కట్టు కట్టి కనిపించే సరికి రాము భయంతో గజ గజా వణికి పోయాడు.

మంచం  దగ్గరికి  వెళ్లి  సోము చెయ్యి పట్టుకుని వలవల ఏడ్చేసాడు రాము. దు:ఖాన్ని గొంతులో అదిమి పట్టినా కళ్ళు మాత్రం జలజలా కన్నీరు కార్చే సరికి వార్డు బోయ్‌ కూడా రాముని చూసి కరిగి పోయాడు.

‘‘రామూ! ఏడవకు! మీ మిత్రుడికి ఏమీ కాదు. తెలివి వచ్చేసింది కదా! ఇంకో వారంలో నీ దగ్గరకొచ్చేస్తాడు.’’ రాము భుజం మీద చెయ్యేసి ఓదార్చాడు వార్డు బోయ్‌.

చెయ్యి పట్టుకుని కన్నీరు కార్చే సరికి ఆ కన్నీళ్ళు సోము చేతి మీద పడ్డాయి. ఆ కన్నీటి తడి స్పర్శకి ఎటో చూస్తున్న సోము కళ్ళు తిప్పి రాము కేసి చూసాడు. మిత్రుడ్ని చూడ గానే ఆనందంతో కళ్ళింత చేసి చూసాడు సోము.

‘‘నీకేమి కాదురా....తగ్గి పోతుంది! మళ్లీ మనం జల్సాగా తిరుగుతాం. సరేనా?’’ సోముని ఓదార్చాడు రాము. రాము మాటలు విని చిన్నగా పెదవు విచ్చీ విచ్చకుండా నవ్వాడు సోము. నెమ్మదిగా చెయ్యెత్తి రాము చెయ్యిని పట్టుకుని ఆప్యాయంగా నొక్కాడు.

‘‘ఒరేయ్‌ రాము! అమ్మ గారెలా ఉన్నారు?’’ నెమ్మదిగా అడిగాడు సోము.సోము అడిగిన ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు రాముకి. మౌనంగా ఉండి పోయాడు.

‘‘అమ్మ గారా! నీకోసం ఇక్కడికొచ్చారు సోము. నిన్ను చూడ్డానికి వచ్చారు.’’ టక్కున చెప్పాడు వార్డు బోయ్‌.

‘‘అమ్మ గారు వచ్చారా! నన్ను చూడ్డానికి వచ్చారా! అమ్మ గారికి ఏం కాలేదు కదా! ఆ ఎదవలు ఏమీ చెయ్య లేదు కదా!’’ నెమ్మదిగా ఒక్కో మాట ఒత్తి పలుకుతూ అన్నాడు సోము.

‘‘మీ అమ్మ గారా? నిక్షేపంలా ఉన్నారు. ఏదైనా అయితే ఇక్కడకు రాలేరు కదా!’’ చెప్పాడు వార్డు బోయ్‌.  వార్డు బోయ్‌ అమ్మ గారి గురించి మంచిగా చెప్తుంటే రాముకి పట్ట లేనంత ఆనందం కలిగింది. సోమును సంతోష పెట్టడానికి చెప్తున్నాడేమో అనుకున్నాడు రాము.

‘‘సోము! నువ్వు విశ్రాంతి తీసుకో. ఉదయం తీరిగ్గా రాముతో కబుర్లాడుకుందువు గాని’’ అంటూ రాముని తీసుకుని ఎమర్జెన్సీ వార్డు లోనే ఓ మూలకు లాక్కు పోయాడు వార్డు బోయ్‌.

‘‘అన్నా! నువ్వు సోముకి చెప్పిందంతా నిజమేనా?’’ కుతూహలంగా అడిగాడు రాము.

‘‘నిజం కాక పోతే, మీ అమ్మ గారి గురించి నాకెలా తెలుస్తుంది. సోముని చూడ్డానికి వచ్చింది. అప్పుడే నీ దగ్గర డబ్బుందని అది నిన్నే తీసుకోమని చెప్పింది. సోముకి, నీకు ఖర్చులకి ఉంచుకోమని చెప్పింది ఆవిడే. నీ దగ్గర ఏ.టి.ఎమ్‌. కార్డు తీసుకుని నా దగ్గర ఉంచి ఫోన్‌ చెయ్యమన్నది కూడా మీ అమ్మ గారే. కావాలంటే చూడు మీ అమ్మ గారి ఫోన్‌ నెంబర్‌ కూడా నాకు ఇచ్చారు.’’ రాముకి విషయమంతా చెప్పాడు వార్డు బోయ్‌.

రాము గాని బయటకు వెళ్తే పోలీసు ఏదో మూల నుండి కనిపెడతారని వార్డు బోయ్‌ భయం. అందుకే రాము దగ్గర నుండి ఏ.టి.ఎమ్‌ కార్డు వార్డు లోనే తీసుకోవాలని విషయమంతా విడమర్చి చెప్పేసాడు.

‘‘నిజమా అన్నా! అయితే ఉండు. ఏ.టి.ఎమ్‌ నీకిచ్చేస్తా.’’ అంటూనే తాను తొడుక్కున్న షర్టు విప్పేసాడు.

‘‘ఏ.టి.ఎమ్‌ కార్డు ఇస్తానని షర్టు విప్పేస్తావేమిట్రా రాము?’’ అయోమయంగా అన్నాడు వార్డు బోయ్‌.

‘‘ఉండన్నా! నీకు ఏ.టి.ఎమ్‌ కార్డు కదా అవసరం. ఇస్తానుండు.’’ అంటూనే షర్టు కార్‌ వెనుక వున్న స్డోర్‌ మడతల్లో చిన్న చిరుగుల ద్వారా లోపలకు తోసేసిన ఏ.టి.ఎమ్‌ కార్డు నెమ్మదిగా బయటకు లాగి ఇచ్చాడు రాము.

‘‘అమ్మనా కొడకా! మాయ మాంత్రికుడి లాగ ఎంత తెలివిగా దాచావ్‌రా! బ్రహ్మ దేవుడు కూడా కని పెట్ట లేడు.’’ నవ్వుతూ రాము భుజం తడుతూ అన్నాడు వార్డు బోయ్‌.

‘‘అన్నా! నీకేం తెలుసన్నా! ఏ.టి.ఎమ్‌లో డబ్బు తీసిన వెంటనే ఆ పోలీసు నా కొడుకు నా దగ్గర ఈ ఎ.టి.ఎమ్‌ కార్డు డబ్బు లాగేసుకుని పోలీస్‌ స్టేషన్‌ లో పడేసారు. ఆ ఎస్సై గారు దేవుడన్నా! నన్ను పన్నెత్తు మాట అనకుండా మర్యాదగా డబ్బు, ఈ కార్డు నా చేతికిచ్చి పంపించేసారు.’’ చెప్పాడు రాము.

‘‘పులి బోనులో నుండి క్షేమంగా రావడం గొప్పేరా రాము!’’ అన్నాడు వార్డు బోయ్‌.

‘‘అంతేనా! దార్లో ఎన్ని తిప్పలు పడ్డానో నీకేం తెలుసన్నా!’’ చిన్నగా నవ్వుతూ హీరోలా ఫోజిస్తూ అన్నాడు రాము.

‘‘తిప్పలా! పోలీసులే కదరా నిన్ను దగ్గరుండి ఇక్కడకు తీసుకు వచ్చింది.’’ ఆశ్చర్యంగా అన్నాడు వార్డు బోయ్‌.

‘‘వాళ్ళే అన్నా...వాళ్ళే! ఈ ఏ.టి.ఎమ్‌ కార్డులో ఎంత డబ్బుందో అంతా దోచేద్దామని నన్ను పిన్‌ నెంబర్‌ చెప్పమని ఎంత వేధించారో తెలుసా?!’’ అన్నాడు రాము.

‘‘మరి, నువ్వేం చేసావ్‌?’’ కుతూహలంగా అడిగాడు వార్డు బోయ్‌.

‘‘చెప్పేసాను....పిన్‌ నెంబర్‌ చెప్పేసాను.’’ పక పకా నవ్వుతూ అన్నాడు రాము.

‘‘అదేంట్రా! మళ్లీ ఈ నవ్వేంటి?’’ ఆశ్చర్యపోయాడు వార్డుబోయ్‌.

‘‘పిచ్చి నెంబర్‌...మర్చి పోయినట్టు నటించి...గుర్తు చేసుకున్నట్టు ఫోజు కొట్టి....నోటికొచ్చింది చెప్పేసాను....నా కొడుకులు కాంప్లెక్స్‌ దగ్గరున్న ఏ.టి.ఎమ్‌ సెంటర్లన్నీ తిరిగి తిరిగి బుర్రలు బాదుకున్నారు.’’ చెప్పాడు రాము.

‘‘తప్పు చేస్తే చంపేస్తారే! నిన్నెలా వదిలేసార్రా!’’ ఆశ్చర్యంగా అడిగాడు వార్డు బోయ్‌.

‘‘4664, 6464, 6446, 6644, 4466 ఇలా పిచ్చి పిచ్చిగా గుర్తు చేసుకుంటూ చివరికి ఆ  గుర్తొచ్చింది అంటూ నాలుగు నాలుగులని చెప్పానన్నా. ఆళ్ళకి మతులు చెడి తిరిగొచ్చి గెడ్డం పట్టుకుని బ్రతిమలాడారన్నా!’’ అన్నాడు రాము.

‘‘అయితే కరెక్ట్‌ నెంబర్‌ చెప్పేసావా?’’ గాభరాగా అన్నాడు వార్డు బోయ్‌

‘‘అసలు ఆ నెంబరు నాకు గుర్తుంటే కదన్నా! డబ్బు తీసినప్పుడు గుర్తుంది. బయట కొచ్చే సరికి పోలీసు చుట్టు ముట్టి జీపు ఎక్కించేసారు. అంతే! నా బుర్ర బ్లాంకయి పోయింది. ఆ పిన్‌ నెంబర్‌ నాకే తెలీదు.’’ పక పకా నవ్వుతూ అన్నాడు రాము.

‘‘అయ్యో! ఎంత పని చేసావురా!’’ విచారంగా అన్నాడు వార్డు బోయ్‌.

‘‘ఏంటన్నోయ్‌! నువ్వ్వూ ఏ.టి.ఎమ్‌లో డబ్బు తీసేద్దామనే అనుకుంటున్నావా కొంపదీసి.’’ ఆశ్చర్యంగా అడిగాడు రాము.

‘‘అమ్మో! అంత పని చేస్తానా?! ఏదో మనసొప్పక అలా అన్నాను.’’ అన్నాడు వార్డు బోయ్‌.

‘‘ఎందుకన్నా మనకి. పరాయి సొమ్ము పాముతో సమానమంటారు చూడు. ఉత్తి పుణ్యానికే ఎన్ని తిప్పలు పడ్డామో! ఆ డబ్బు తీసుండక పోతే మా సోమూ, నేనూ ఎప్పటిలా హాయిగా ఆడుకుంటూ ఉండే వాళ్లం కదా!’’ బాధగా అన్నాడు రాము.

‘‘నిజమేరా!’’ అన్నాడు వార్డు బోయ్‌. ‘ ఈ పిల్లలకున్నంత ఇంగిత జ్ఞానం కూడా తనకి లేదు. ఎంత సేపూ ‘డబ్బు’ గుంజాలనే ఆలోచిస్తాడు’ మనసులో అనుకున్నాడు వార్డు బోయ్‌.

‘‘అదిగో అప్పుడే అన్నా! ఈ కార్డు బయటుంటే ప్రతీ వోడూ తప్పు గానే ఆలోచిస్తాడని పోలీసులు కార్డు నా చేతికివ్వగానే బాత్‌ రూమ్‌ కని వెళ్ళి ఈ ‘షోల్డర్‌’ మడతల్లో దాచేసాను.’’ చెప్పాడు రాము.

‘‘మీరిద్దరూ ఆణి ముత్యాల్లా ఉన్నార్రా! భగవంతుడు మీ ఇద్దర్నీ చల్లగా చూడాలి.’’ అంటూ రాముని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు వార్డు బోయ్‌.

*************

కాంప్లెక్స్‌లో అటూ ఇటూ తిరిగి కాలక్షేపం చేసారు ఆగంతకులు ఇద్దరూ. అప్పటికే చాలా సేపయింది. వాళ్లిద్దరూ కాంప్లెక్స్ లోకి వచ్చి.    కాంప్లెక్స్‌ నుండి నేరుగా కేంటీన్‌ దగ్గరకు వచ్చారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ వరండాలో అంతా నిశ్శబ్దంగా ఉంది. వరండాలో పడుకున్న యాచకులంతా గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు. గురకలు వినిపిస్తున్నాయి.

కేంటీన్‌ బంద్‌ చేసినట్టున్నారు. కేంటీన్‌ ముందు లైట్లన్నీ ఆర్పేసారు. టీ కౌంటర్‌ కూడా బంద్‌ అయి పోయింది. ఆగంతకులు ఇద్దరూ షాపు ముందు నిలబడ్డారు. వరండాలో ఉన్న అందరూ రగ్గులు కప్పుకుని హాయిగా నిద్ర పోతున్నారు.

ఎదురుగా పిల్లర్‌ ప్రక్కన ఉండాల్సిన ‘ఆమె’ ఉందో లేదో అనుకుంటూ ఇద్దరూ ఒక్క సారే అటు కేసి చూసారు. వరండాలో అక్కడక్కడా వెలుగుతున్న లైట్ల వెలుగులో గుంపుగా ఎవరో పడుకున్నట్టు కనిపిస్తోంది.

ఇద్దరూ దగ్గరగా వెళ్ళారు. అడుగుల శబ్దం కాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లారు.

(ఆ కప్పుల చాటున పడుకున్న గుంపు ఎవరిది? నిజంగా వారు నిద్రపోతున్నారా? మాటువేసి ఉన్నారా? అదను చూసి దాడి చెయ్యబోతున్నారా??? ఏం జరగబోతొండి?? తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్