Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vamsha vruksham telugu story by prathapa venkata subbarayudu

ఈ సంచికలో >> కథలు >> గారాబం

garabam telugu story by vijaya prasad

జనార్ధన్ జీపు ఆపించాడు. అతను ఒక పెద్ద ఇంజనీరు - బడాబడా కాంట్రాక్టులు చేస్తూ ఉంటాడు. రాజకీయాల్లో - ప్రభుత్వంలో అతనికున్న పలుకుబడి యింతా అంతా కాదు.

హైద్రాబాద్ లో పనిపడి జీపులో వచ్చాడు - సపరివారంగా. సాధారణంగా అతని పనులు పూర్తయ్యే సరికి ఏ రాత్రో అవుతుంది. కాని ఈసారి సాయంత్రానికే అయిపొయింది పని.

"జగ్గూ! అమ్మాయిని చూసిపోదామా! హిమబిందును చూసి చాలా కాలమైంది." చెప్పాడు జనార్ధన్.

డ్రైవర్ జగ్గు జీపును రోడ్డు పక్కకు ఆపాడు. "మళ్ళీ మనం ఊరు చేరుకునే సరికి తెల్లారుతుంది." జగ్గు చెప్పాడు అయిష్టం కనపడనివ్వకుండా.

"అర్జెంటు పనులేం లేవులే - మనవాళ్ళను ఇక్కడ హోటల్లో ఉంచుదాం - భోంచేస్తూ ఉంటారు. మనం పోయి వద్దాం - " ఆదేశించాడు.

ఆ జీపులోంచి ఓ ఆరుమంది దిగి పక్కన ఉన్న హోటల్ వైపు నడిచారు.

జీపు కదిలింది.

అతని ఆలోచనలు హిమబిందు చుట్టూ ముసురుకున్నాయి. జనార్ధన్ ను అందరూ ధనార్జన్ అంటారు. అతనికున్న ఏకైక సంతానం హిమబిందు.  ఇద్దరు మొగబిడ్డలు - ఒక ఆడబిడ్డ పుట్టి చనిపోయారు పెరిగి పెద్దదయింది. ఆమె ఒకతే! అందుకే అతని పంచప్రాణాలు హిమబిందు.

బిందు పుట్టినప్పటి నుండి అతనికి బాగా కల్సి వచ్చింది. చిన్న చితక పన్లు చేసేవాడు కాస్త క్రమంగా పెరిగి క్లాస్ వన్ కాంట్రాక్టరుగా ఎదిగాడు.

మార్కాపురంలో పెద్ద బిల్డింగు కట్టాడు. చూసినవాళ్ళు దాన్ని ఇంద్రభవనం అన్నారు.

భార్య అరుంధతి అనుకూలవతి. ఎక్కువగా ఆలోచించదు - గృహిణిగా తన పనులు తను నిర్వర్తించుకొని మొగుడ్ని సుఖపెడుతుంది. ఆమె పెద్దగా చదువుకోలేదు. ఆమెకు ఏదిగులూ లేదు. పిల్లభవిష్యత్తు గురించి కాని, తన గురించి కాని పిసిరంత భయం కూడా లేదు. పెద్దగా కోరికలు లేవు.

అయితే, నగలు - నట్రా అడక్కుండానే ఆయన కొనిస్తాడు. కాకపోతే ఎప్పుడన్నా రహస్యంగా కొన్ని వస్తువులు తనవాళ్ళకు అందచేస్తుంది - ఆమెకు పెళ్లి కావాల్సిన చెల్లెళ్లున్నారు. పుట్టింటి వ్యాపారం గల్లంతయి తనవారి పరిస్థితులు తారుమారయ్యాయి. అందుకని కూసింత సానుభూతి చూపుతుంది.

హిమబిందు గారాబంగా పెరిగింది. ఆడింది ఆట - పాడింది పాట! కొండ మీద కోతి అయినా క్షణాల్లో తెప్పించేవాడు జనార్ధన్. అట్లాగని చదువులో వెనుక పడలేదు ఫస్టున
వచ్చింది.

ఇంకా చెప్పాలంటే ఇంటర్ లో మంచి మార్కులు తెచ్చుకుంది - ఎమ్ సెట్ లో ర్యాంక్ తెచ్చుకుని బి.టెక్ లో చేరింది హైద్రాబాద్ లో! కాలేజీ బ్యూటీ - అందానికి నిర్వచనం హిమబిందు.

జనార్ధన్ బిందును అమెరికా పంపాలని - అమెరికా అల్లుడుకు యిచ్చి పెండ్లి చేయాలని కలలు కంటున్నాడు. ప్రస్తుతం మూడవ సంవత్సరం చదువుతున్నది. ఇంకో సంవత్సరం ఓపిక పడితే - పెళ్ళి చెయ్యచ్చు - అమెరికా పంపచ్చు.

హైద్రాబాద్ లో చేరిన కొత్తల్లో చాలా హోమ్ సిక్ అయింది బిందు. బుజ్జగించి నచ్చచెప్పాల్సి వచ్చేది - బలవంతాన పంపించాల్సి వచ్చేది. రెండవ సంవత్సరానికి కొంత తగ్గినట్లుంది - అంత బెంగ పెట్టుకోవడం లేదు. సెలవులు యిచ్చినా చదువుకోవాలని అక్కడే ఉంటున్నది. ఇంటికి రాకుండా, ఈ మధ్యకాలంలో.

ప్రస్తుతానికి - జనార్ధన్ బిందును చూసి మూడు నెలలు దాటింది. కాని అడిగినప్పుడల్లా డబ్బు మటుకు లోటు రాకుండా పంపుతూనే ఉన్నాడు. "ఎందుకు - దేనికి" అని అడగడం అతనికిష్టం ఉండదు. సంపాదన ఎవరికోసం? ఉన్న ఒక్క కూతరు కోసం! ఈ పొద్దు కాకపోయినా - రేపైనా అనుభవించాల్సింది ఆమే కదా! ఆస్తి ఆమెదే అయినప్పుడు డబ్బు అడిగినప్పుడు ఎంక్వయిరీలు ఎందుకు. కాకపోతే గారాబం వలన - తన హోదాకు తగ్గట్టు నీళ్ళల్లా ఖర్చు పెడుతూ ఉండచ్చు. అయితే ఏం - తరగని ఆస్తి తనది.

పెట్టనీయండి - ఎంతకాలం? ఇంకో సంవత్సరం! ఆ తర్వాత అల్లుడు వస్తాడు - ఆంక్షలు విధిస్తాడు - ఈలోగా తను డబ్బును కంట్రోల్ చేసి తన చిన్న గుండెను ఎందుకు గాయం
చేయాలి!

ఎలాగూ తనకు ఉంది - వస్తున్నది కాబట్టి - ఎన్ని వేలైనా ఆలోచించకుండా పంపుతాడు. అరుంధతి అడ్డు చెప్పినా తను వినడు. అయినా ఆమెకు అన్ని తెలివితేటలు లేవు.

తనలాంటి తండ్రి మరొకడు ఉండకూడదు ఈ లోకంలో. ఆలోచనల్లో జీపు హాస్టల్ ముందు ఆగడం గమనించలేదు. డ్రైవర్ లోపలికి పోయి వచ్చాడు హిమబిందు కోసం.

"అమ్మాయి గారు లేరటండి - ఫ్రెండ్సుతో కల్సి ఎక్కడికో పోయిందట." చెప్పాడు జగ్గు. జనార్ధన్ ప్రాణం ఉసూరుమంది. ఫోన్ చేశాడు బిందుకు. స్విచ్ ఆఫ్ చేసింది. ఈ మధ్య తరచుగా స్విచ్ ఆఫ్ అవుతున్నది. లైన్లు బావున్నట్లు లేవు. లేకపోతే బ్యాటరీలో ఛార్జి అయిపోయిందేమో!

లాస్టువీక్ కావును పదివేలు పంపాడు పిక్నిక్ పోవాలంటే.

"ఎప్పుడొస్తుందో చెప్పారా?" అడిగాడు.

లేదు అని తల ఊపాడు జగ్గు.

విసుగ్గా జీపు దిగి లోపలికి వచ్చాడు.

వార్డెన్ రామేశ్వరి ఉంది కునుకు పాట్లు పడుతూ

"మేడం... మా పాప బిందు ఎక్కడికి వెళ్లిందో చెప్పగలరా!" అడిగాడు.

"ఓ! జనార్ధన్ గారా! కూర్చోండి. పై రూములో ఎవరైనా ఉంటే పిలిపిస్తాను." అని చెప్పి అటెండరును పంపింది.

ఓ రెండు నిమిషాల్లో పంజాబీ డ్రస్సు అమ్మాయి కిందకు దిగి వచ్చింది బెరుగ్గా చూసింది అతని వంక.

"నమస్తే అంకుల్!"

"నళిని కదూ!"

"అవును అంకుల్ - బిందు ఇందాకే ఏదో పార్టీ ఉందని వెళ్ళింది?"

"ఎవరితో?" కోపంగా అడిగాడు.

"నీతూతో అనుకుంటాను." తలొంచుకుని చెప్పింది.

"ఎప్పుడు రావచ్చు?"

"లేటు కావచ్చు...!"

"అంటే!"

"పది - పదకొండు - పన్నెండు - సిటీ గదా - కష్టం చెప్పడం."

"రామేశ్వరి గారు! ఆడపిల్లలను ఇంత నైట్ వరకు తిరగడానికి అనుమతిస్తున్నారా? మీ రూల్సు ఎలా ఒప్పుకుంటున్నాయి?"

"సారీ సార్! ఇంపార్టెంట్ మ్యారేజీ అని చెప్పి వెళ్ళింది." నసిగింది రామేశ్వరి.

"ఆల్ రైట్! వచ్చి వెళ్ళానని చెప్పండి. ఇంటికి ఫోన్ చేయమనండి. ఇలాంటివి అలౌ చేయద్దు. మరీ ముఖ్యమైన ఫంక్షన్ అయితే నాకు ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోండి. ఇదుగోండి నా కార్డు." జనార్ధన్ కోపాన్ని అణచుకున్నాడు.

వికలిత హృదయంతో బయలు దేరాడు.

అయినా తను ముందు ఫోన్ చేసి వస్తున్నట్లు తెలపాల్సింది. అప్పుడు ఎక్కడికి కదలకుండా ఉండిపోయేది.

జీపు ఇంటి ముఖం పట్టింది.

ఆ రాత్రి ఒంటిగంటకు తన రూముకు చేరుకుంది హిమబిందు. నళిని చదువుకుంటూ ఆమెకోసం ఎదురుచూస్తున్నది.

"బిందూ - ఎందుకింత ఆలశ్యం అయింది?" నళిని అడిగింది.

"నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు?" మత్తుగా కసిరింది.

"మీ నాన్నగారు వచ్చి వెళ్లారు తెల్సా?"

"ఐసీ! డాడీ... ముందు చెప్పచ్చుగా..."

"ఆయన కేం తెల్సు నువ్వు యిలా రాత్రుళ్ళు తిరుగుతూ ఉంటావని."

"షటప్! మైండ్ యువర్ బిజినెస్!" మంచం మీద పడుకుంటూ అరిచింది.

"ష్! ఇది అర్దరాత్రి! అందరూ లేస్తారు." నళిని మూగకళ్ళతో వారించింది. కాని హిమబిందుకు ఆధ్యాస లేదు.

"రాజు - డార్లింగ్... మళ్లీ రేపు కలుద్దాం - స్వర్గం - స్వర్గం ఉందో లేదో తెలీదు కాని - నీ దగ్గర మటుకు స్వర్గం ఉంది" దిండును వాటేసుకుంటూ గొణిగింది బిందు.

"ఏయ్! బిందూ - ఏమైంది నీకు." నళిని దగ్గరకొచ్చి ఆమెను తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నించింది.

గుప్పున వాసన తగిలింది.

తల తిరిగేటంత వాసన.

"అరే! జలుబు చేసిన నా ముక్కులకే యింత కంపుకొడుతున్నదంటే... నువ్వు - నువ్వు - త్రాగావా?" నళిని ఆశర్యపోతూ అడిగింది.

"ఏం త్రాగకూడదా? వై నాట్!" బిందు ప్రశ్న.

"ఛీ! ఛీ! ఎంత దిగజారిపోయావు?" నళిని ఆవేదన.

"ఏంటి దిగజారడం? అనుభవించడం చేతకాదు అనుభవించేవాళ్ళను చూస్తే ఏడ్పు! ఛీ!"

"అరే బిందూ! కేవలం మందేనా - అది కూడానా!!"

"ఆ! అదే - మందు - అదే పొందు - రాజు మై స్వీట్ బాయ్!" కైపుగా కలవరించింది. నళిని అప్పుడు చూసింది ఆమె దుస్తుల వంక - శరీరం వంక... చాలా చాలా జరిగిపోయినట్లు అర్ధం చేసుకుంది.

"ఓ! రూప అందుకేనా నీ రూం ఖాళీ చేసి వెళ్ళిపోయింది - నాకు తెలియక చేరాను." బాధగా అంది.

"షటప్! నిన్ను నేనేం చేశాను? రేప్ చేశానా? బలవంతాన తాగించానా! ఒసే నళిని! గుర్తొచ్చింది - నా హ్యాండ్ బ్యాగ్ అందించవే!" గోముగా అడిగింది ఆమె భుజం పట్టుకుని.

అప్రయత్నంగా నళిని ఆమె బ్యాగ్ అందించింది.

హిమబిందు అలవోకగా లోపల్నించి ఓ సిరంజీ తీసి ఏదో మందు ఎక్కించి చకచకా తన నరంలోకి ఎక్కించుకుంది.

అంతే మెలికలు తిరగసాగింది.

చిత్ర విచిత్రంగా దెయ్యం పట్టినట్లు ప్రవర్తించసాగింది.

నళిని బిత్తరపోయి చూస్తూ ఉండిపోయింది.

డ్రగ్స్! వినడమే కాని చూడలేదు.

"ఒసే నళినీ! నీకూ కావాలంటే - ఫ్రీగా యిస్తా తీసుకో..." బలవంతం చేయబోయింది.

"నో! నో! అంటూ బయటకు పరుగెత్తి బయట గొళ్ళెం పెట్టింది.

హిమబిందు కాసేపు గంతులేసి - నీరసంగా నేలమీదకు జారిపోయింది.

చెప్పులను తలగడగా పెట్టుకుని - మంచం క్రింద దూరి గాడంగా నిద్రపోయింది.

బయట్నించి అంతా గమనించి నళిని భయం భయంగా లోపలికొచ్చి తన మంచం మీద వాలిపోయింది ఏడుస్తూ.

తెల్లవారు ఝామున దిగిన భర్తను చూసి ఆనందంగా ఎదురొచ్చింది అరుంధతి.

"ఏమండీ! అమ్మాయి బాగుందా?"

"ఆ! చాలా బాగుంది!" ముక్తసరిగా చెప్పాడు.

"ఎప్పుడొస్తుందట!"

"ఏమో! చదువు ధ్యాసలో ఏదీ పట్టించుకోవడం లేదు..."

అంటూ అన్యమనస్కంగా లోపలికొచ్చి పడుకున్నాడు.

ఆ పడుకోవడం మధ్యాహ్నం ఫోన్ రింగవడంతో కళ్ళు తెరిచాడు బద్ధకంగా రిసీవర్ ఎత్తాడు.

"హలో డాడీ! బాగున్నావా! సారీ! నిన్న నేను లేను."

"ఏంటా తిరుగుళ్ళు - ఏం ఫంక్షన్లు?"

"మా ఫ్రెండు మ్యారేజ్! రాకపోతే పెండ్లి చేసుకోనంది."

"ఏమైనా ఆడపిల్ల అలా ఒంటరిగా తిరిగితే ఏమనుకుంటారు?"

"అబ్బే! అదేం లేదు... డాడీ! డాడీ! నాకు - నాకు - డబ్బు కావాలి!" గోముగా అడిగింది.

"ఎంత?" అప్రయత్నంగా అడిగాడు.

"ఓ పాతిక!" తాపీగా చెప్పింది.

చిర్రున కోపం వచ్చింది జనార్ధన్ కు - అయినా నిగ్రహించుకున్నాడు. దీనికి తల్లి దండ్రులు కేవలం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు గుర్తుకొస్తున్నారు. కల్పవృక్షంలా కనిపిస్తున్నారు.

"వారం క్రిందటేగా పది పంపించింది."

"సారీ! మీకు భారమైతే అడగను." చిన్న బుచ్చుకుంది హిమబిందు.

"అది కాదురా! ఆడపిల్లవి - నీకు ఖర్చు ఏముంటుంది?"

"అందుకే ఖర్చు ఉంటుంది - చెప్పాలా?"

"అబ్బే - చెప్పమని నేను అడగను - కాని అంత పెద్ద మొత్తం - ఎందుకో అర్ధం కావడం లేదు."

"మా ఫ్రెండు సిస్టరుకు ఆపరేషన్ చేయాలి - వాళ్ళు బీదవాళ్ళు - సాయం చేద్దామని."

"గుడ్! గుడ్! అలాగే కానీ..."

అవతల ఫోన్ కట్ అయిపొయింది. అరుంధతి ఎప్పుడొచ్చిందో - కళ్ళు ఒత్తుకుంటున్నది.

"అమ్మాయి - నా గురించి ఒక్కమాట కూడా అడగలేదా?"

"లేదు - లైన్ కట్ అయినట్లుంది." అబద్ధం చెప్పాడు."

హిమబిందు ప్రవర్తన తన కర్ధం కావడం లేదు.

ఓ పదిహేను రోజుల తర్వాత రాత్రి పూట ఆగకుండా ఫోన్ మోగితే జనార్ధన్ కోపంగా అందుకున్నాడు.

"హలో! జనార్ధన్ గారా!"

"యస్ - స్పీకింగ్! ఎవరు ఇంత రాత్రి వేళ అటు?"

"హలో! సిటీ పోలీసు స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం హిమబిందు మీకేమవుతుంది?"

"కూతురయ్యా - ఏంటి సంగతి!"

"వ్యభిచారం కింద అరెస్టు అయింది. ఏడుస్తూ మీ నెంబరు యిచ్చింది."

"షటప్! నా కూతురేంటి - వ్యభిఛారమేంటి - వాట్ నాన్సెన్స్!"

"సారీ! నైట్ క్లబ్ లో విచ్చలవిడిగా శృంగారం జరుపుతున్న జంటల్లో మీ హిమబిందు ఉంది." అవతల ఫోన్ కట్టయింది.

అరుంధతి గుండెలు బాదుకుంది.

జనార్ధన్ షాక్ తిన్నాడు.

ఆఘమేఘాల మీద బెయిల్ కు అరేంజ్ చేసి... జీపులో భార్య - అనుచరులతో బయలు దేరాడు. సెల్ ఫోన్ లో ఎంక్వయిరీ చేస్తూ తన మిత్రుడు లాయరు శర్మ యింటికి వెళ్ళాడు.

"ఒరే! నా కూతురేదిరా!" ఏడుస్తూ అడిగాడు.

గదిలోకి చూపించాడు.

ఏడుస్తూ భార్యాభర్తలు గదిలోకి వచ్చారు.

హిమబిందు ఏదో లోకంలో ఉంది - ఒంటి మీద బట్టలు స్థానభ్రంశమయ్యాయన్న స్పృహ లేదు. మనిషి చాలా చిక్కిపోయి ఉంది. కళ్ళల్లో కాంతి లేదు. అజంతా శిల్పం అందం కరిగిపోయింది. ఆమె గుర్తు పట్టినట్లు లేదు. గాల్లో చేతులూపుతున్నది.

"అరే శర్మా! నా కూతురుకు ఏమైందిరా!" ఏడుస్తూ అడిగాడు.

"డ్రగ్స్ కు బానిస అయిందిరా!" విచారంగా చెప్పాడు శర్మ.

"అంతేనా!" బాధగా అడిగాడు.

"అంతే అంటే - అబ్బాయిలకు బాగా అలవాటు పడింది."

"ఛీ!" చీదరంగా మొహం పెట్టాడు వినలేక.

"అంతేకాదు - డైలీ మందు, పొందు, క్లబ్బులు కావాలి!"

శర్మ చెప్పాడు - చావు కబురు చెప్పినట్లు నిదానంగా చెప్పాడు.

చెవులు మూసుకున్నాడు జనార్ధన్.

"ఏమండీ! మనమ్మాయి శీలం పోగొట్టుకుంది." ఏడుస్తూ చెప్పింది అరుంధతి - పరుగెత్తుకుంటూ వచ్చి.

"నాకు తలవంపులు తెచ్చింది. పోలీసు కేసు ఏమైంది!"

"ఎలాగో కష్టపడి - మినిష్టర్లతో చెప్పించి మాఫీ చేయించాను. కానీ ఇంకోసారి యిలా కనిపిస్తే కేసు బుక్ చేస్తామన్నారు." శర్మ జరిగింది వివరించుకుంటూ పోయాడు.

జనార్ధన్ - అరుంధతి లుంగలు చుట్టుకుపోయారు.

ఆ తర్వాత - బిందును స్పెషలిస్టులకు చూపించారు. చదువు మానిపించి యింటికి తెచ్చారు. బయటకు పోకుండా జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు.

కాని ఓ పగలు హిమబిందు తోటమాలితో కారు షెడ్డులో సుఖం పంచుకుంటూ ఉంటే జనార్ధన్ కళ్ళ పడిపోయింది.

"బిందూ! నీ ప్రాణం తీస్తాను." రౌద్రంగా అరిచాడు. తోటమాలిని పారిపోయాడు వెనక్కి తిరిగి చూడకుండా. జుత్తు పట్టుకుని బరబర పైకి లాక్కొచ్చాడు బిందును.

"ఏంటీ గారాబంగా పెంచానని నా పరువు తీస్తున్నావు?"

"నేనేం తప్పు చేశాను డాడీ!" ఏడుస్తూ అడిగింది.

"ఛీ! చివరికి తోటమాలితో సంబంధం పెట్టుకునే స్థితికి దిగజారిపోయావా!"

"ఏం వాడు మొగాడు కాడా! ఆడదానికి సుఖం అందివ్వలేడా తోట పని చేసినంత మాత్రాన." బిందు అడిగింది. చెంప చెళ్ళుమనిపించాడు జనార్ధన్ తట్టుకోలేక.

అరుంధతి పరుగెత్తుకుంటూ వచ్చింది - బిందు అరుపులకు.

"ఏంటండీ దాన్ని గొడ్డును బాదినట్లు బాదుతున్నారు."

"ఇది గొడ్డు కూడా కాదే - పశువు - కామపిశాచి."

"ఒసే! ఒసే! ఏం చేశావే!" అరుంధతి ఆరా తీసింది.

"ఏం లేదు - తోటరాముడు నా దాహం తీరుస్తూ ఉంటే డాడీకి జెలసీ పుట్టింది." హిమబిందు చెప్పింది.

"నీళ్ళు త్రాగడం కూడా తప్పాండి!" అరుంధతి అమాయకంగా అడిగింది. ఆమెకు కూతరు మీద ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు.

"ఛీ! నీ పెంపకం యిలా ఏడ్చింది. ఏ మొగాడు కనిపిస్తే వాడితో పడుకునేట్లుంది నీ కూతరు..." చెప్పాడు ఆవేశంగా. జనార్ధన్ మొహం బీపీతో ఉబికి పోతున్నది.

అరుంధతి ఫెడీల్ మని హిమబిందును కొట్టింది.

"స్టాపిట్! నేనేం తప్పు చేశాను. నేనడిగింది నాకిస్తున్నారా లేదా! ఆకలేస్తే అన్నం పెడుతున్నారా లేదా... మరి ఆ ఆకలి వేస్తే - మీరు నా బాధ గమనిస్తున్నారా!" ఇంకా ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడింది.

అరుంధతి చెవులు మూసుకుంది.

"ఒకే! నీకు అర్జెంటుగా పెండ్లి చేస్తాను - ఇంకెవరి వంక కన్నెత్తి చూడకు." కోపంగా అరిచాడు జనార్ధన్.

"సారీ! నాకు ఒక్కడితో సరిపోదు - ఐవాంట్ చేంజ్! వెరైటీ ఉండాలి! అలా అభ్యంతరం పెట్టని మొగుడుంటే చూడు..." అంటూ లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంది.

నిస్సహాయంగా తలగోడకు కొట్టుకున్నాడు జనార్ధన్.

"ఏవండీ - అదేదో ఇంజెక్షన్ తీసుకుంటున్నది." అరుంధతి చెప్పింది కిటికీలోంచి చూసి.

"ఛీ!" నీ పెంపకం దాన్ని పిచ్చి దాన్ని చేసింది." అరిచాడు.

"నాది కాదండి! మీది మీ హైటెక్ పెంపకం! మీరు అడిగినప్పుడల్లా డబ్బులు పంపించేవాళ్లు చూడండి - అది దాని బతుకు నాశనం చేసింది. అతి ప్రేమకొద్దీ - ఊరికే సంపాదిస్తున్నా కదాని - అక్రమ సంపాదన దాని మొహాన పడేశారుగా - ఆ పాపం దాన్ని కాటేసింది. దాని జీవితం నాశనం అయింది." అరుంధతి ఏడుస్తూ దెప్పి పొడిచింది.

"యస్. నా డబ్బు నా కుటుంబాన్ని నాశనం చేసింది." జనార్ధన్ తలొంచుకున్నాడు.

"దాన్ని హైటెక్కుగా - అందలం ఎక్కించి పెంచారు. కాలు కింద పెడితే కందిపోతుందనుకున్నారు - అడక్కుండానే అన్ని సౌకర్యాలు చేకూర్చారు. అడగకుండా డబ్బులు దాని మొహాన గుమ్మరించారు - అలా పంపవద్దండి అంటే - నా కూతురు గురించి నాకు బాగా తెల్సు అని నా నోరు మూయించేవాళ్లు - ఇప్పుడు సంఘానికి ఏం సమాధానం చెబుతారు?" వల వల ఏడ్చింది అరుంధతి.

"సారీ అరుంధతీ! మనది హైటెక్కు బ్రతుకు అనుకున్నా కాని - ఇలా దాని బతుకు సర్వనాశనం అవుతుందనుకోలేదు. తప్పంతా నాదే! పిల్లలను కనడం తప్పు కాదు - వాళ్ళను ప్రేమతో పెంచడం తప్పు కాదు  - కాని నాలా అడిగినప్పుడల్లా విచ్చలవిడిగా డబ్బులు యివ్వడం తప్పు. అధిక ఆహారం కొవ్వు పట్టించి మనిషిని మృత్యు ముఖంలో చేర్చినట్లు... అధిక సంపాదన మనిషిని బాగు చేయాల్సింది పోయి - అధః పాతాళంలోకి పంపుతుంది. నా అక్రమ సంపాదనకు ప్రతిఫలంగా దేవుడు నాకీ కడుపు చిచ్చు పెట్టాడు." జనార్ధన్ ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయాడు బీపీ ఎక్కువై.

"అయ్యో! అయ్యో!" అంటూ గుండెలు బాదుకుంటున్నది అరుంధతి.

హిమబిందు బయటకొచ్చి వాళ్ళిద్దర్ని చూసి నవ్వుతూ డ్యాన్సు చేస్తున్నది.

టేబులు మీద కూర్చున్న "లాఫింగు బుద్ధ" నవ్వుతూ చూస్తున్నాడు - ఆ నవ్వులో ఎవరికర్మకు ఎవరు బాధ్యులు అన్న ప్రశ్న ఉంది.

మరిన్ని కథలు