గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి..... http://www.gotelugu.com/issue279/735/telugu-serials/anveshana/anveshana/
(గత సంచిక తరువాయి).... ఏ.సి.పి. కి మతి పోయింది. ఆవిడ ఎవరు? ఈ హత్యకి ఆమెకి ఏమిటి సంబంధం? ఈ హత్యలు ఆవిడే చేసిందా? ఎందుకు? ఎలా చంపింది?! హత్యాయుధం కూడా లేదు.
ఎస్సై అదిరి పడ్డాడు. ‘రగ్గు’ల్లో కూడా ఇంత రహస్యం ఉందా? అందర్నీ రగ్గులతో ముసుగేసి వీళ్లను చంపేసి పారిపోయిందా? అదే జరిగుంటుంది.
ఇంతలో అంబులెన్స్ రావడంతో శవాల్ని పోస్టుమార్టమ్ కోసం కేజిహెచ్‌కి పంపించేసారు. క్లూస్ టీమ్ తమ పని ముగించుకుని వెళ్ళి పోయారు.
ఎస్సైని మరో ఇద్దరు కానిస్టేబుల్స్‌ని పరిసర ప్రాంతాల్లో ‘ఆవిడ’ ఎక్కడన్నా దొరుకుతుందేమో వెతకమని ఆర్డర్ వేసి ఏ.సి.పి. కూడా అక్కడ నుండి వెళ్లి పోయాడు.
ఆ యాచకుల్లో చలాకీగా, ఆరోగ్యంగా ఉన్న యాచకుడ్ని తీసుకుని కానిస్టేబుల్స్ ఇద్దరూ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఆమె ఎవరో యాచకురాలు అయి ఉండదు. మరి? ఎవరు? ఆలోచిస్తూనే ఎస్సై జీపులో కూర్చున్నాడు.
‘ఈ కేసు ఏదో తలకు మించిన భారములాగుంది.’ అనుకుంటూ తల పట్టుకున్నాడు టూటౌన్ ఎస్సై.
********
గోపాల పట్నం పోలీస్ స్టేషన్.
ఉదయం ఏడున్నరకే స్టేషన్ కు చేరుకున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్. రాత్రి రౌండ్స్‌కి వెళ్లాడు. రౌండ్స్‌లో ఉండగానే టూ టౌన్ ఏరియాలో ఇద్దరు యాచకుల్ని ఎవరో మర్డర్ చేసారని తెలిసింది.
రౌండ్స్ నుండి నేరుగా ఇంటికెళ్లి ఫ్రెష్ అయి వెంటనే స్టేషన్‌కి చేరుకున్నాడు. ఏ క్షణంలోనయినా కమీషనర్ నుండి కబురు రావచ్చు. కొండ మీద జరిగిన మర్డర్ ఇన్వెస్టిగేషన్ విషయమై ఆరా అడగొచ్చు.’’ ఆలోచిస్తూ సీట్లో కూర్చున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.
ఇంతలో రైటర్ గది బయట నిలబడి సెల్యూట్ చేసి వినయంగా నమస్కరించాడు.
‘‘చెప్పండి! ఏమైనా విశేషాలున్నాయా?’’ రైటర్‌ని చూస్తూ అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘రాత్రి తీసుకు వచ్చిన దొంగలు ముగ్గురూ సెల్ లోనే ఉన్నారు సార్. కేస్ కట్టేయమంటారా?’’ కేజిహెచ్‌లో జాయిన్ చేసిన కుర్రాడికి తెలివి వచ్చిందో, లేదో కనుక్కున్నారా? వాంగ్మూం ఇవ్వగలడో లేదో? వీళ్ళమీద దొంగతనం కేసు పెట్టాలంటే ... ఏమి దొంగిలించారని కేసు పెడతాం? అటెంప్ట్ టూ మర్డర్ కేసు పెట్టాలన్నా ఆ కుర్రాడికి తెలివి వచ్చి వీళ్ళే తనను చంపబోయారని స్టేట్‌మెంటు ఇవ్యాలి కదా?’’ ఆలోచిస్తూ అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘సార్! వీళ్ళు గజదొంగలు సార్! కొండ మీద దేవుడి దర్శనానికి వచ్చిన భక్తులు పెట్టిన కేసులు చాలా పెండింగ్ లో ఉన్నాయి. రెండు రోజుల క్రితమే దర్శనాల క్యూలైన్లో ఒకామెది మెళ్ళో నల్ల పూస దండ పోయిందని ఫిర్యాదు అందింది. అలా చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇంత వరకూ మనకు కొండ మీద జరిగిన చిల్లర దొంగతనాల విషయమై ఎవరూ పట్టుబడలేదు.’’ చెప్పాడు రైటర్.
‘‘రైట్! ముందు ఆ యాంగిల్లో వీళ్లని ఇంటరాగేట్ చేసారా?’’ హుషారుగా అన్నాడు అక్బర్ ఖాన్.
‘‘రాత్రంతా అదే పని సార్! మన సెంట్రీకి చెప్పి వెళ్లాను. కొండ మీద జరిగిన చాలా చిల్లర దొంగతనాలకి వాళ్లే కారణమని అంగీకరించారు.’’ చెప్పాడు రైటర్.
‘‘ఇంకేం?! ముందా ‘ప్రాపర్టీ’ అంతా రికవరీ చెయ్యండి. వీళ్లని తీసుకు వెళ్లి ఎవరెవరికి అమ్మారో...లేదా ఎక్కడెక్కడ దాచారో...కనుక్కుని ఆ వస్తువులన్నీ రికవరీ చేసుకోండి! ఆ తర్వాత ఎఫ్.ఐ.ఆర్ రాద్దాం.’’ చెప్పాడు అక్బర్ ఖాన్.
‘‘ఎస్సార్!....హాస్పిటల్ కి ఫోన్ చెయ్యమంటారా సార్?!’’ అడిగాడు రైటర్.
‘‘కనుక్కోండి. ఆ కుర్రాడికి తెలివొస్తే చాలా విషయాలు తెలుస్తాయి. వాంగ్మూలం తీసుకోవడానికి వెళ్లాలి కదా!’’ అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘ఎస్సార్!’’ అంటూ రైటర్ అక్కడ నుండి వెళ్లి పోయాడు.
టేబుల్ మీద ఉన్న పేపర్లన్నీ తిరగేస్తూ కూర్చున్నాడు. నిన్న కొండ మీద జరిగిన ‘ముసలమ్మ’ మర్డర్ వార్త ప్రముఖంగా రాసాయి అన్ని పత్రికలు. మనిషోరకంగా తమకు తోచిన విధంగా ఊహాగానాలు రాసారు.
ముసలమ్మ ‘మర్డర్’ అంతు చిక్కకుండా ఉంది ఆస్తి కోసం ఆ ముసలమ్మ కొడుకులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారనటానికి కూడా ఆధారం లేదు. ముసలమ్మని ఆఖరి సారి కలిసింది...ఆ ముసలమ్మతో గడిపింది ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి! ఆమె ఎవరో తెలిస్తే మర్డర్ మిస్టరీ వీడి పోతుంది.
ఆమె ఎవరో ఇప్పటికింకా కనుక్కోలేక పోయారు. ‘ఆమెని’ వెదికి పట్టుకోడానికి వెళ్లిన కానిస్టేబుల్ బాగానే ఉన్న , ఆమెని రేప్ చేయబోయిన యువకులిద్దరూ గాయాల పాలై హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టులాడుతున్నారు.
ఆమెకి సహకరిస్తున్న యాచక కుర్రాళ్ళు... ఒకడు హాస్పిటల్‌లో ఉన్నాడు. మరొకడు...? ఆలోచిస్తూనే ఉలిక్కి పడ్డాడు అక్బర్ ఖాన్.
ఆ రెండో కుర్రాడితో వెళ్ళిన కానిస్టేబుల్స్ ఇద్దరూ ఏం చేస్తున్నారు, నిన్ననగా వెళ్లారు! ఆ కుర్రాడి దగ్గరున్న డబ్బు కోసం...ఏటిఎమ్ కార్డు కోసం ‘ఆమె’ ఎవరో తప్పక వస్తుంది. ఆ కుర్రాడ్ని కలుస్తుందనుకున్నారు కదా! మరి?! ఆ విషయం గుర్తు రాగానే ఛటక్కున లేచాడు ఎస్సై. చేతులు రెండూ జేబులో పెట్టుకుని రైటర్ గది దగ్గరకు వచ్చాడు. ఎస్సై అక్బర్ ఖాన్‌ని చూస్తూనే అదిరి పడి సీట్లో నుండి లేచాడు రైటర్. చిల్లర దొంగలు ఇద్దర్నీ తీసుకుని ఎంక్వయిరీకి బయలుదేరుతున్నాడు.
‘‘రైటర్ గారు మీరు ఎంక్వయిరీకి బయలుదేరుతున్నారా? నిన్న ఆ కుర్రాడితో వెళ్ళిన మన కానిస్టేబుల్స్ నుండి ఏమన్నా విషయం తెలిసిందా?’’ అడిగాడు అక్బర్ ఖాన్.
‘‘లేద్సార్! వాళ్లని రిలీవ్ చెయ్యడానికి కొత్త వాళ్లని ఇద్దర్ని పంపించాను. వాళ్లింకా కే.జి.హెచ్‌లో ఆ కుర్రాడితోనే ఉన్నట్టున్నారు.’’ చెప్పాడు రైటర్.
‘‘ఎలా చెప్తున్నారు?’’ అడిగాడు ఎస్సై.
‘‘వాళ్ల మూమెంట్స్ అన్నీ రిపోర్ట్స్ ఇమ్మన్నాం కదా సార్! రాత్రి వాళ్ళు వెళ్లినప్పుడు చెప్పిన ప్రకారం.ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నట్టున్నారు. అందుకే సార్! కొత్త వాళ్లిద్దర్ని కె.జి.హెచ్‌కే వెళ్లమన్నాను.’’ చెప్పాడు రైటర్.
‘‘ఓకే. మీ పని కానివ్వండి’’ అంటూనే వెనక్కి తిరిగి తన సీట్లోకి వచ్చి కూర్చున్నాడు అక్బర్ ఖాన్.
ఇంతలో పోలీస్ కమీషనర్ ఆఫీసు నుండి కాల్ వచ్చిందంటూ సెంట్రీ పరిగెట్టుకు వచ్చాడు అక్బర్ ఖాన్ గదిలోకి.
కమీషనర్ ఆఫీసు నుండి ఫోన్ అనే సరికి ఉలిక్కి పడ్డాడు అక్బర్ ఖాన్. స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గారి గదిలో ఉంటుంది లేండ్ లైన్. ఫోన్ దగ్గరకు గాబరాగా పరిగెట్టుకు వెళ్లాడు అక్బర్ ఖాన్.
అట్నుండి కమీషనర్ పర్సనల్ అసిస్టెంట్ ఫోన్ లో ఉన్నాడు. కమీషనర్‌గారు వెంటనే కమీషనరేట్‌కి వచ్చి కలవమన్నారని ఆర్డర్. అంటూ ఫోన్ కట్ చేసాడు. అంత అర్జెంట్‌గా రమ్మన్నారంటే ఏదో తంటా తన్నుకొచ్చిందనుకున్నాడు మనసులోనే.
అంతే! ఆ వెంటనే బుల్లెట్ ఎక్కి ఆగ మేఘాల మీద కమీషనరేట్‌కి బయలుదేరాడు అక్బర్ ఖాన్.
గోపాల పట్నం స్టేషన్ నుండి ఎన్.ఏ.డి. జంక్షన్‌కి చేరుకోవడానికి పావు గంట పట్టింది. మూడు కిలో మీటర్ల దూరం కూడా ఉండదు. అక్బర్ ఖాన్‌కి చిరాకనిపించింది. ఎంత అర్జెంటుగా వెళ్దామన్నా ట్రాఫిక్ అంత ఎక్కువగా ఉంది.
అసలే ఉదయం పూట కావడం...స్కూల్స్ కు, కాలేజీలకు వెళ్ళే విద్యార్థులతోనూ, ఆఫీసుకెళ్ళే వాళ్లతోనూ రోడ్డంతా రద్దీగా ఉంది. ఎన్.ఏ.డి నుండి కమీషనరేట్‌కి పదిహేను కిలోమీటర్లు. హైవే రోడ్డు కావడంతో పది నిముషాల్లో చేరుకున్నాడు అక్బర్ ఖాన్. రాత్రి జరిగిన ముసలమ్మ మర్డర్ గురించి ఏమడుగుతారో అని భయపడుతూనే కమీషనరేట్‌కి చేరుకున్నాడు.
అప్పటికే స్టేషన్ సి.ఐ. సత్యారావుగారు కూడా అక్కడే ఉన్నారు. సి.ఐ. గారి ప్రక్కనే టూటౌన్ ఎస్సై, సి.ఐ లు కూడా వరుసగా హాల్లో కూర్చున్నారు.
అందరికీ గౌరవ పూర్వకంగా సెల్యూట్ చేసాడు.
అదే సమయంలో ‘కమీషనర్’ గారి గది ముందు సెక్యూరిటీగా ఉన్న సెంట్రీల్లో ఒకతను వాళ్ల దగ్గరకు వచ్చాడు.
‘‘సార్! మిమ్మల్ని కమీషనర్ గారు లోపలకు పిలవమన్నారు.’’ వినమ్రంగా చెప్పాడు సెంట్రీ.
సెంట్రీ మాటలు వింటూనే గోపాల పట్నం స్టేషన్ సి.ఐ. సత్యారావు ఒక్కడే సీట్లో నుండి లేచాడు.
‘‘సార్! మీ నలుగుర్నీ పిలవమన్నారు.’’ చెప్పాడు సెంట్రీ. నలుగురూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఎస్సై అక్బర్ ఖాన్‌కి మనసు కుదుట పడింది. నలుగుర్నీ ఒకే సారి కలవమన్నారంటే వేరే విషయం అనుకుంటూ గుండె దిటవు పర్చుకున్నాడు.
సి.ఐ. సెంట్రీలు ఇద్దరూ ముందు నడుస్తూంటే ఎస్సై లు ఇద్దరూ వాళ్లని అనుసరించారు. కమీషనర్ గారు తన ముందున్న కంప్యూటర్‌లో ఏదో చూస్తూ కూర్చున్నారు. ఆయన ప్రక్కనే పి.ఏ. రైటింగ్ పేడ్ పట్టుకుని నిలబడి ఉన్నాడు.
నలుగురూ మౌనంగా కమీషనర్ ముందు వినయంగా నిలబడ్డారు. ఆయన తల ఎత్తి చూస్తే సెల్యూట్ట్ చెయ్యాలన్న ఆలోచనలో నలుగురూ అలర్ట్ గా నిలబడ్డారు.
‘‘కూర్చోండి!’’ తల ఎత్తకుండానే అన్నారు కమీషనర్.
‘‘ఎస్సార్!’’ అంటూ నలుగురూ ఒకే సారి సెల్యూట్ చేసి నెమ్మదిగా ఒద్దికగా వెళ్ళి కమీషనర్ ఎదరుగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. విశాలమైన హాలు, నాలుగు మూలలా స్టీరియో బాక్స్‌లున్నాయి. ఓ మూల బుల్లి తెర గోడకు తగిలించి ఉంది. కాన్ఫరెన్స్ హాలులాగా, అవసరమైతే మినీ థియేటర్ లాగా కూడా ఉపయోగ పడేలా ఉందా హాలు. నలుగురూ అతృతగా చూస్తూ కూర్చున్నారు. కమీషనర్ ఎందుకు ఇంత అర్జెంటుగా పిలిపించారో నలుగురికీ అర్థం కాలేదు.
‘‘మీకు ఇప్పటికైనా అర్థమైందా? నేను ఎందుకు మీ నలుగుర్నీ ఇక్కడకు పిలిపించానో?’’ కంప్యూటర్‌లో నుండి దృష్టి వారి మీదకు మళ్లిస్తూ అన్నారు పోలీసు కమీషనర్. నలుగురూ ఒక్కసారే అదిరి పడ్డారు. కమీషనర్ చెప్పిందేమిటో వాళ్లకు అర్థం కాలేదు. నలుగురూ బేల మొహం వేసుకుని వినయంగా ‘సార్!’ అంటూ టక్కున లేచి నిలబడ్డారు.
‘‘కూర్చోండి. కూర్చోండి...! మీకింకా అర్థం కాలేదా?! ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఇద్దరు యాచకుల్ని ఎవరో హత్య చేసారు. అవునా?!’’ అడిగాడు కమీషనర్.
‘‘ఎస్సార్! ఇప్పుడు అక్కడ నుండే వస్తున్నాను సార్!’’ చెప్పాడు టూటౌన్ ఎస్సై.
‘‘మీ స్టేషన్ పరిథిలో కొండ మీద కూడా ఇలాగే ఓ యాచకురాలిని హత్య చేసారు కదా!’’ అక్బర్ ఖాన్ కేసి చూస్తూ అడిగాడు కమీషనర్. కమీషనర్ చెప్పబోతున్న విషయమేమిటి?? అది కథని ఏ మలుపులు తిప్పబోతుంది? తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే..... |