Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి... http://www.gotelugu.com/issue279/736/telugu-serials/katyayani/katyayani/

(గత సంచిక తరువాయి).....’తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తన తండ్రి తనను కాలు కింద పెట్టనివ్వలేదు. తనకున్న పరిథిలో తననెప్పుడూ సంతోష పెట్టాలనే చూశాడు. పురిట్లోనే ఆడపిల్ల గొంతునొక్కాలని, పెరుగుతున్న కొద్దీ బరువుగా భావిస్తూండే తండ్రులు, ఆడపిల్ల ఒక్కతే పుడితే, ‘చ ఛ వారసుడు లేడు’ అని చిరాకు చూపించే తండ్రులు, మగ పిల్లాడి కోసం ప్రయత్నిస్తూ, ఆడపిల్లలు పుడుతుంటే వాళ్ల మీద తీవ్రమైన అసహనం వ్యక్తం చేసే తండ్రులు, కొడుకు, కూతురూ ఉంటే కొడుకును అందలం ఎక్కిస్తూ, కూతురును మాటలతో, చేతలతో అదఃపాతాళానికి తొక్కేసే తండ్రులూ ఉన్న ఈ దేశంలో తను ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకుందో కాని భగవంతుడు తండ్రిగా లభించాడు’ కాత్యాయని మనసులోఅనుకుంటూ ఆయన కాళ్ల మీద పడి పోయింది. రెప్పల చెలియలి కట్టలు దాటిన కన్నీళ్లు ఆ తండ్రి పాదాలు కడిగే ప్రయత్నం చేశాయి.

"ఏంటమ్మా ఇది లే" అని కూతుర్ని గబుక్కున లేపి "ఏమ్మా, వెతుక్కుంటూ ఇంటికి వచ్చిన అమెరికా సంబంధాన్ని కాలదన్నానని ఈ తండ్రి మీదేవన్నా కోపమొచ్చిందా?" అన్నాడు ఆమె చుబుకం ఎత్తి ఆప్యాయంగా ఆమె కళ్లలోకి చూస్తూ.

"లేదు నాన్నా, మగ పెళ్లి వారు కట్నం వద్దన్నారని, పెళ్లి ఆడంబరంగా చెయ్యనవసరం లేదన్నారని, నన్ను గుండెల మీద కుంపటిగా భావించి, ఇంట్లోంచి తరిమేసే తండ్రి మీరు కానందుకు నేను గర్వ పడాలి. పైగా నేను అంత దూరాన ఉంటే మీరిక్కడ ఎలా ఉన్నారోనన్న బెంగ నా మనసునూ పీకుతుంటుంది. మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా నాకు సంతోషాన్నిచ్చేదే" అంది.

"కుటుంబమంటే సభ్యుల ఇటుకలతో పటిష్టంగా నిలబడే కట్టడం. ఏ ఒక్క సభ్యుడు బలహీనంగా ఉన్నా భవనం కుప్ప కూలి పోతుంది. నా బంగారు తల్లివి. నాకు చేతనైనంతలో మంచి సంబంధం తెచ్చి, అంగరంగ వైభవంగా కాకపోయినా తాహతుకు తగ్గట్టు పెళ్లి చేస్తాను తల్లీ" అన్నాడు గద్గద స్వరంతో.

‘ఈయన మంచి భర్త, అంతకు మించి మంచి తండ్రి’ భర్త వంక చూసి మనసులో మెచ్చుకోలుగా అనుకుంటూ యశోదమ్మ చీర కొంగుతో కళ్లు తుడుచుకుంది.

మధ్యాహ్నం భోజనాలయ్యాక ఆ ఇంట్లోని అందరూ టీ వీ లో ఏదో సినిమా వస్తుంటే చూస్తున్నారు.

"నాన్నా, ఒక సారి పక్క వీధిలో ఉండే నా స్నేహితురాలు నీరజ ఇంటికి వెళ్లాను. అప్పుడు వాళ్లు టీ వీలో వచ్చే ఒడిదుడుకులు అనే కార్యక్రమం చూస్తున్నారు. అందులో గొడవలు పడి విడి పోయిన భార్యాభర్తల్ని కలపడానికి ఓ సినీ తార, సైకాలజిస్ట్, లాయర్ ప్రయత్నిస్తున్నారు. నిజంగా ఎంత గొప్ప ప్రోగ్రాం నాన్నా! చితికి పోయిన కొన్ని జీవితాలన్నా నిలబడతాయి కదూ" అంది.

ఆయన ఒక మారు కూతురు వంక ప్రశాంతంగా చూసి. ’చూడమ్మా, సంసారం గుట్టు, రోగం రట్టు అన్నారు. చిన్న చిన్న సమస్యలు, గొడవలూ వచ్చినా, నాలుగు గోడల మధ్యా సర్దుకు పోవాలి. ఎవరి సంసారం వాళ్లు గుట్టుగా చూసుకోవాలి. దాన్ని నలుగురుతో చెప్పుకోవడం అంత సరైంది కాదు. అలాంటిది టీ వీల ద్వారా కొన్ని లక్షల మంది ముందు తమ సంసారాన్ని పరచుకోవడం సబబని నాకనిపించడం లేదు. గొడవల్ని చక్క దిద్దడానికి అటూ, ఇటూ- సంబంధించిన పెద్దలుంటారు, ఊరి పెద్దలూ ఉంటారు. కాదంటే లాయర్ల సహకారమూ తీసుకోవచ్చు కాని టి ఆర్ పీ రేటింగుల కోసం ఎగబడుతూ, చెప్ప కూడనివి చెబుతూ, చూపించ కూడనివి చూపించే టీ వీల వల్ల సమాజానికి చాలా చేటు కలుగుతోంది. అందులో ఇదొకటి. చూసే వాళ్ల సబ్ కాన్షియస్ మైండ్ మీదా భయంకరమైన ప్రభావం చూపిస్తూ మనసులను కలుషితం చేస్తున్నాయి. ఇంట్లోనూ, బయటా మనిషిని మనిషి నమ్మ లేని స్థితికి తీసుకెళుతున్నాయి. మనం చూడు చక్కని పాటల ప్రోగ్రామ్స్ చూస్తాం. వారమంతా శ్రమించిన మనసుకు ఎంత ఆహ్లాదం కలుగుతుంది. అలాగే ఇదిగో ఇలా మంచి సినిమాలు చూస్తాం. విలువలకు పట్టం కట్టిన అలాంటి చిత్రరాజాలు చూస్తే మనో, వ్యక్తిత్వ వికాసాలు కలుగుతాయి. మనం ఏం చేసినా, ఏం చూసినా మనను అభివృద్ధి పథంలో నడిపించేదిగా ఉండాలి, అంతే కాని అదఃపాతాళానికి తొక్కేసేది కాకూడదు" అన్నాడు. అర్థమైందన్నట్టుగా తల ఊపి నవ్వింది కాత్యాయని.

టీ వీ లో సినిమా మొదలైంది.

అందరూ లీనమై చూస్తూంటే తలుపు కొట్టిన చప్పుడైంది. టైము చూశారు. సాయంత్రం అయిదు.

అచ్యుత రామయ్య గారు లేచి ‘ఈ సమయంలో ఎవరై ఉంటారు’ అని మనసులో అనుకుంటూ తలుపు వైపు నడిచాడు. తలుపు తీశాడు.

***

వచ్చినది ఎవరై ఉంటారు? ఏం వార్త తెచ్చారు?? అది ఈ కుటుంబంలో ఎలాంటి మార్పులకు దారి తీయబోతోంది తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే.......

 

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్