నేను ఓ ప్రభుత్వపు ఆఫీసులో జూనియర్ అసిస్టెన్టుగా వుద్యోగం చేస్తున్నాను. ఆఫీసులో నాకు కొలీగ్ మరియూ క్లోజ్ ఫ్రెండు జవహర్. వాడు కాస్త మూడీ టైప్. ఇద్దరం ఒకే సెక్షన్ లో వుండడం ద్వారా మాది 'రారా...పోరా' సాన్నిహిత్యం.'టీ'కి వెళ్ళాలంటే ఇద్దరం ఒకేసారి వెళతాం. డైనింగ్ హాల్లో లంచ్ కూడా ఒకే చోట తీసుకుంటాం. మా ఇద్దరికి లంచ్ క్యారియర్లు ఇళ్ళ నుంచే వస్తాయి. మా ఇంటి నుంచి వచ్చే కూరలేవైనా సరే ముందు వాడికి పెడతాను. ఎందుకంటే నా శ్రీమతి చేసే ఏ కూరలైనా చాలా రుచికరంగా వుంటాయి.
నాకు నా శ్రీమతి మీద అమితమైన ప్రేమ. మా అన్యోన్యమైన దాంపత్యంలో సుఖ సంతోషాలు మాత్రమే వుంటాయి తప్ప మనస్పర్థలకు, బాధలకు చోటే వుండదు. నిజం చెప్పాలంటే ఒకవేళ నా శ్రీమతిలో ఏవైనా చిన్నచిన్న తప్పులు దొర్లితే వాటిని ఆమెకు సున్నితంగా చెప్పుకొని సరిదిద్దుకునేలా చేసుకొంటాను. ఆమె కూడా నన్ను అర్థం చేసుకొని నాకు అనుగుణంగా నడుచుకొంటుంది. మొత్తంలో మా భార్యభర్తల బంధం వడిదుడుకులు లేకుండా చక్కగా సాగిపోయే నావ.
ఇక నా శ్రీమతి పంపుతున్న రుచికరమైన కూరలను జవహర్ తింటున్నాడు కనుక వాడు ఆమెను గూర్చి పొగుడుతూ కామెంటు చేస్తాడేమోనని ప్రతి రోజు ఎదురు చూస్తూ వుంటాను. కాని ఏ నాడూ ఆ కోణంలో స్పందించ లేదు వాడు. నేనైతే వాడి శ్రీమతి చేసే వంటకాలను ఎంచక్కా పొగిడేస్తుంటాను. మరి వాడికి వాడి శ్రీమతిని పొగడ్డం ఇష్టం వుండదేమో వింటూ మౌనంగా వుండి పోతాడు.అందుకే ఒక రోజు డైనింగ్ హాల్లో భోంచేస్తున్నప్పుడు వుండబట్టలేక "ఏరా! చెల్లెమ్మ చేసి పంపుతున్న వంటకాలను గూర్చి గొప్పగా ప్రశంసిస్తుంటానే నా ప్రశంసలను ఏ రోజైనా ఆమెకు చేరవేశావా?" అని అడిగాను.
అందుకు వాడు "వంటను మెచ్చుకోవటం ఓ అభిప్రాయమని....దాన్ని నేను ఆవిడకు చేరవేయాలా!? బోంచేయిరా!" అన్నాడు విసుక్కొంటూ.
"ఏమిట్రా అలా విసుక్కొంటున్నావ్? నీ సహధర్మచారిణ్ణి పొగడ్డం తప్పంటావా? ప్రశ్నించాను నేను.
"నా దృష్టిలో అలానే అనిపిస్తుంది. ఆడదానికి ఎంత వరకు విలువనివ్వాలో అంత వరకే ఇవ్వాలి. నా భార్యతో నేను 'నువ్వు గొప్పదానవు' అని ఏనాడూ అనలేదు సరి కదా నిత్యం ఆమె చేస్తున్న పనుల్లో తప్పులను ఎత్తి చూపుతూ భయపెడుతూ నా చెప్పు చేతల్లో వుంచుకొని వొణికించేస్తుంటాను. అదే నా స్వభావం తెలిసిందా" శాడిస్టులా."అంటే నీ దృష్ఠిలో ఆడది మగాడికి బానిసనా?!అంటే నీ భయంతో చెల్లెమ్మ నీకు అనుకూలంగా తాళం వేస్తూ అణిగి మణిగి వుంటుందన్నమాట! వెరి బ్యాడ్!" అన్నాను.
"నో!నా దృష్ఠిలో ఆడదాన్ని అలా కట్టడిలో వుంచకపోతే ఓ రోజు ఎదురు తిరిగినా ఆశ్చర్యం లేదు!" అన్నాడు.
ఈ సారి షాక్కు గురైయ్యాను నేను. అసలు వీడు ఏ కాలంలో వున్నాడు. ట్వంటీ ఫస్టు సెంచురీలో ఇలాంటి వాడొకడా? నాకంతా అర్థమై పోయింది. ఆడవాళ్ళను వీడు బానిసనుకొని ఓ పురుగును చూసినట్టు చూస్తున్నాడు. కాకపోతే తనలో సగమై సుఖ దుఃఖాలను, కష్ట నష్టాలను తనతో సమానంగా పంచుకునే చెల్లమ్మను అలా అంటాడా? పోనీ... తనతో సమానంగా చూసుకో లేక పోయినా ఆమెకు కాస్త స్వేచ్చను కల్పించొచ్చుగా! ఇక నా మనస్సు ఒప్పుకో లేదు. వాడిలో మార్పు రావటానికి కొన్ని విషయాలను వివరించాలనుకున్నాను. "చూడ్రా జవహర్! ఆడది మగాడికి బానిస కాదు! మామూలుగా మన సంసారాల్లో వడిదుడుకులతో పాటు చిన్న చిన్న తప్పులు దొర్లడం సహజం. వాటికి బార్యభర్తలిద్దరూ బాధ్యులౌతారే కాని మినహాయింపంటూ ఇద్దరిలో ఏ ఒక్కరికి వుండదు". అన్నాను అర్థం చేసుకొంటాడన్న భావంతో.
"నో... నేనొప్పుకోను.నా ఇంట జరిగే ప్రతి పొరపాటుకు ఆమే బాధ్యత వహించి క్షమాపణ కోరాలి. తెలిసిందా?"
"అది తప్పురా!నేనలా చేయను.నువ్వూ ఆలోచించు. నీ భార్యను నువ్వు దేవతని పొగడొద్దు కాని ఆమెకు సముచిత స్థానం కల్పించి నీతో సమానంగా చూసుకోవాలన్నదే నా అభిప్రాయం. మీరిద్దరూ తప్పులు చేస్తారు. వాటిని సరిదిద్దుకొని మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలంతే!. నా మటుకు నేను క్రితంలో నా భార్యలో బోలెడు తప్పులను చూసే వాడిని. వాటన్నిటిని ఎత్తి చూపుంటే తను భయంతో కాపురం చేయటం మాని వాళ్ళింటికి వెళ్ళి పోయేది. పోవడమే కాదు అదే విడాకులకు సైతం దారి తీసేది! భగవంతుని దయవల్ల సమస్యలను అందాకా తెచ్చుకో లేదు మేము. అన్నిటిని 'రాజీ'అన్న పాయింటుతో ఎంచక్కా సర్దుకు పోయాము. నిజం రా! నేను నా భార్యలో తప్పులను ఎత్తి చూపటం కన్నా మంచిని మాత్రమే హైలైట్ చేస్తూ వచ్చాను. అలా చేయడం ద్వారా ఆమె లోని పాజిటీవ్ థింగ్స్ కే ప్రాధాన్యత పెరిగి నెగటీవ్ థింగ్సు క్రమేపి మరుగున పడి మా సంసారం చక్కగా సాగుతోంది. మేమిప్పుడు హాప్పీగా వుంటున్నాం. నువ్వూ నాలా మారిపోయి చెల్లెమ్మ తప్పులను పక్కన పెట్టి ఓ స్నేహితునిలా ఆమె లోని మంచిని మాత్రం చూడు. అప్పుడు ఆమెకు నీ పట్ల వున్న భయం కాస్త పోయి భర్తన్న గౌరవం పెరుగుతుంది. ఆప్యాయత అనురాగాలతో పెనవేసుకోంటోంది" అని ఆపి వాడి ముఖంలోకి చూశాను. రెండు నిముషాల పాటు ఆలోచనల్లో పడ్డ వాడు వాటి నుంచి తేరుకోని "అర్థమైందిరా! అంటే నేనూ నా మూడీ మెదడును పక్కన పెట్టి ఆమెతో మనసు విప్పి ప్రేమతో పాసిటీవ్ థింగ్సునే మాట్లాడాలంటావ్. సంసారంలో ఎలాంటి సమస్యలొచ్చినా ఇద్దరం బాధ్యులమై పరిష్కరించుకోవాలంటావ్ ! అలాగేరా! ఇవాల్టి నుంచే నువ్వంటున్న మార్పు కోసం నాంది పలుకుతాను. ఓకే!"అన్నాడు ఓ నిర్ణయానికొచ్చినట్టు.
"భేష్ !నిజంగా నువ్వలా మారగలిగితే నీ ఇల్లు 'స్వీట్ హోమే మరి!"అన్నాను నవ్వుతూ. వాడూ నవ్వాడు
|