Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sweet home

ఈ సంచికలో >> కథలు >> మాణిక్యరావు- మిరియాల చారు.

manikyaravu miriyala charu

 అర్ధ రాత్రి దడదడా తలుపు మీద విపరీతమైన శబ్దం. మంచి నిద్ర లో ఉన్న బామ్మ కే ముందు మెలకువ వచ్చేసింది. లేచి వెళ్ళి లైటేసి తలుపు తెరిచింది. గడగడా వణుకుతూ నాలుగు దుప్పట్లు కప్పుకుని ఉన్న ఒక వ్యక్తినీ , మరో ఇద్దర్నీ చూసింది."ఎందుకు ?ఏమైంది? ఏం కావాలీ?"అంటూ పలకరించింది.

"మరేం లేదు బామ్మ గారూ ! మా వాడు పొద్దు పోయాక పట్నం నుంచీ వచ్చాడు. విపరీతమైన చలి, జలుబు తో వణుకుతున్నాడు. కాస్తంత మిరియల చారు చేయించి ఇవ్వరూ! మీకు పుణ్యముంటుంది, మీ కాళ్ళు కడిగి తల మీద చల్లుకుంటాం. "అంటూ బ్రతిమాలుతున్న వారిని చూసి , "రండి లోపలికి ,కూర్చోండి, మా వాడిని  లేపుతాను." అంటూ లోపలి కెళ్ళి మంచి నిద్రలో ఉన్న మాణిక్యాన్ని తట్టి లేపింది .

" ఒరే మాణిక్యం ! లేలే .ఒక మంచి పని చేయాలి "అంటూ. మాణిక్యానికి నిద్రపాడు చేసిన బామ్మ మీద చాలా కోపం వచ్చేసింది. ఐనా ఆపుకుని "ఏమైందే ఇంత అర్ధ రాత్రిలో "అంటూ లేచాడు.

"నాయనా! పరోపకారానికి సమయా సమయాలుండ కూడదు.ఒకరికి మనం మేలు చేస్తే భగవంతుడు మనకు మేలుచేస్తాడు.రారా లేలే ,మంచం దిగు." అంటూ వాడ్ని బలవంతాన లాక్కెళ్ళి ,నూతి దగ్గర చన్నీళ్ళ స్నానం చేయించి , టవల్ కట్టించి ,దేవుని వద్ద దీపం పెట్టించి, వంట గది లోకి లాక్కెళ్ళి తలుపేసి, "త్వరగా మిరియాల చారు కాచు."అంటూ ఆర్డ రేసింది.

హాల్లో కూర్చున్న వారి దగ్గర కొచ్చి "ఉండండమ్మా కొద్ది సేపట్లో మా మనవడు  చారు కాస్తాడు.మా వాడిది మహా గొప్ప హస్త వాచి.."అంటూ మనవడి గూర్చీ చెప్ప సాగింది. ఎంతెంతమందికి, ఏ ఏ సమయాల్లో మిరియల చారుతో జలుబు, జ్వరం నయం చేశాడో ఎంతెంతె సేవ చేశాడో అలుపెరక్కుండా చెప్ప సాగింది.

వళ్ళు మండుతున్నా బామ్మ మాట వేద వాఃక్కు కావటాన మాణిక్యం పది నిముషాల్లో  మిరియాల చారు కాచి, దేవుని ముందు ఉంచి హారతిచ్చి, నివేదన చేసి తెచ్చి హాల్లో బామ్మకిచ్చాడు. బామ్మ ఆ జ్వరమబ్బాయికి మిరియాల చారు ఇచ్చి "బాబూ! ఈ చారు త్రాగి వెళ్ళి హాయి గా పడుకో, నీ జలుబు , జ్వరం చేత్తో తీసేసినట్లు పోతాయి" అంటూ చారు త్రాగించి పంపింది.

జ్వరమబ్బాయి చారు త్రాగాక , వారు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుని బామ్మ పాదాలకు నమస్కరించి వెళ్ళారు.

బామ్మ తలుపేసి రాగానే "ఏమే బామ్మా! ఏదో నీ మాట వింటున్నాను కదాని నన్ను నిద్ర కూడా పోనివ్వవా! ఇదేం అరాచకమే!" అంటూ తాడెత్తున ఎగిరాడు.

బామ్మ  "నాయనా! మనవెంట వచ్చేవి మన భోగ భాగ్యాలు కావు, మనం చేసిన పుణ్య కర్మలే, మన భవిష్యత్తుకూ, మరు జన్మకూ పెన్నిధులు. నీ మేలు కోరే నాయనా! ఇవన్నీ నీచేత చేయించేది. నేను కాస్తే రాని రుచి ,ఫలితమూ నీ చేతులతో కాచిన మిరియాల చారుకు వస్తున్నా యి. నాయనా! నీకు ఆ పుణ్యా త్ముడు ఉపదేశించిన, ఆ మృత్యంజయ స్తోత్రం-  ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారు క మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృ తాత్ - అంటూ భక్తితో జపిస్తూ , చారు కాయడం వల్ల ."

"బామ్మా! ఈ మత్రానికీ చారుకూ సంబంధ మేంటే! నా ప్రాణం తీసి మంత్రం జపి స్తూ చారు కాయమని హుకుం జారీ చేసావు.  "

" నాయనా!ఈ మంత్రానికి ద్రష్ట  ఋషి వసిష్ఠుడు. గొప్ప ఋషి .చనిపోతామనే భయం తో ఉన్న వారు ఈ మంత్రాన్ని పారాయణ చేస్తే ఆ భయానికి దూరం అవుతారు. దీర్ఘరోగం తో బాధపడేవారు ఈ మృత్యుం జయ స్తోత్రాన్ని నిత్య పారా యణ  చేస్తే శివుడు ఆ రోగం బారి నుంచి వారిని, తీగనుంచి దోసకాయను దూరం చేసినట్లు, దూరంచేస్తాడు. తొడిమ నుండి దోసపండును ఎలా వేరుచేస్తున్నావో అలాగే మృత్యు వు నుంచి నన్ను వేరుచేయిస్వామీ!. అమృత సమానమైన మోక్షము నుండి నేను దూరం కాకుండా కాపాడు."అనేదీని భావం. నీవుమంత్రం  స్మరిస్తూ  చారుకాయడం వల్ల ఇంత శక్తి వస్తున్నది నాయనా! మీఅమ్మ  నాన్న లు అకాల మృత్యువు వాత పడటంతో నీకు చిన్నతనం లోనే ఈ మంత్రాన్ని ఒక మహాను భావుని చేత ఉపదేశింప జేసి రోజూ జపింప జేశాను ,నాకు నీవు తప్ప మరెవరున్నారు నాయనా!!"అంటూ కళ్ళు తుడుచుకుంటున్నబామ్మను చూసి, "బామ్మా! క్షమించు. నిద్ర పా డైందనే బాధతో ఏదో అన్నాను. ఇహనుంచీ నీవు ఎప్పుడు ,ఎవరికి మిరియాల చారు కాయమన్నా కాద నను .సరా!."అంటూ బ్రతి మాలాడు.బామ్మ నవ్వేసింది.

ఆ మిరియాల చారు ‘ రిసిపీ ’బామ్మకు,మాణిక్యానికీ తప్ప ఎవ్వరికీ తెలీదు. చెప్ప రుకూడా. అలా మాణిక్యం మిరియాల చారు కాయడంలో  ప్రావీణ్యం సంపాదిం చాడు. 

---

ముందుగా మామాణిక్యం గురిచీ కొద్దిగా చెప్పుకోవాలి    .అసలు మా మాణిక్యం ఉన్నాడే మహర్జాతకుడు. వాడి అమ్మా నాన్నా వాడి మూడో ఏట కృష్ణా పుష్క రా లకువెళ్ళి పడవ బోల్తాపడి స్వర్గాని కెళ్ళారు . వాడి బామ్మే అమ్మా నాన్నాఐ  వాడ్ని పెంచింది. బామ్మ కాస్త చాదస్తురాలై నా చాలా తెలివైనదీ, వాడంటే ప్రాణం ఇచ్చే దీనీ. ఇరుగుపొరుగన్నా బామ్మకు చాలా ఇష్టం. ఎవరికి ఏ బాధ కల్గినా చూడ లేదు. అడక్కుండా నే సాయం చేయను నడుం కడుతుంటుంది, వంగిపోయినా.

'పరోపకారపుణ్యాయ పాపాయ పరపీడనం 'అన్న వ్యాససూక్తిని అక్షరాలా పాటిం చేది బామ్మ.ఆమెకు మనవడుమాణిక్యం అంటే ప్రాణమైతే ,మడీ తడి అంటే మరో ప్రాణం . ఐతే ఎవ్వరినీ ఇబ్బంది పెట్టేది కాదు. మాణిక్యాన్ని ఎంతో గారా బంగా పెంచుకున్నా , క్రమశిక్షణా హద్దుల్లో ఉంచేది.

వాడికి కాస్త ఒళ్ళెచ్చబడితే తాను మండుటెండలో మాడిపోయినంత బాధ ప డేది. వాడికి  ఐదో ఏడు రాగానే బళ్ళో వేసింది.ఆరోజు బడి బడంతా పిల్లలం ద రికి బొరుగులూ, సెనగలూ ,బెల్లం బస్తాడు పంచింది.వాడి క్లాస్ పిల్ల లందరికీ కొత్తపలకా బలపాలు ఇప్పించింది. పంతుళ్ళందరి కీ పంచెలచాపులు ఇప్పించి ఆశీర్వచనాలు చేయించింది.ఊరంతా వింతగా చెప్పుకున్నారు.వాడేదో యం.ఏ  పాసైనట్లు రార్ధాతం చేసిందని. వాడంటే బామ్మకంత ప్రీతి.

ఒక మారు వాడు బడినుంచీ వస్తుండగా ఉన్నట్లుండి జడివాన పడింది. బామ్మ  గొడుగెత్తుకుని పరుగుతీసేలోగానే వాడు తడిశాడు. రాత్రికంతా ఒళ్ళెచ్చ బడి తుమ్ములూ ముక్కుకారటాలూనూ. బామ్మ రాత్రంతా నిద్రపోకుండా  వాడికి ఉప చారాలూ చేస్తూనే ఉంది, గృహ వైద్యంలో ఆరితేరినబామ్మ. మరునాడు బళ్ళో కి పంపకుండా ఆవిరి పట్టించి , తులసి కషాయం, మిరియాలచారూ తాపించి మొత్తానికి   జలుబు తగ్గించేసింది. అదో ఆరోజునుంచే మా వాడికి మిరియల చారంటే తగని ఇష్టం పట్టుకుంది. 

వాడికి పదేళ్ల వయస్సప్పుడు  ఒకమారు బామ్మకు జ్వరం వస్తే వాడే మిరియాల చారు కాచి పత్యం పెట్టాడు. దాంతో బామ్మ మురిసిపోయి మిరియాలచారు ఎప్పు డైనా నీవే కాయరా నాయనా!మృత్యుం జయ మంత్రం జపిస్తూ కాయటాన దీని కింత రుచీ, పవరూ వచ్చాయిరా !" అంటూ మురిసిపోయింది బామ్మ. దాంతో వాడు మిరియాల చారు దిట్టయ్యాడు.  అలా అలా వాడి చదువుతో పాటుగా వాడి మిరియాల చారు ఖ్యాతి కూడా దినదినప్రవర్ధమానం కాసాగింది. 

చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా వాడి మిరియాల చారుకోసం క్యూ కట్టసాగా రు. పిడుక్కు ,బియ్యానికి ఒకటే మంత్రం ' అన్నట్లు ఏజబ్బు చేసినా ,కడుపు నొప్పైనా, జలుబైనా, జ్వరమైనా, అజీర్తి ఐనా ,దగ్గైనా అన్నింటికీ బాలింతల నుంచీ చూలింతలవరకూ, పసిపిల్లల నుంచీ ముసలి వారివరకూ అందరికీ ఉచిత మిరియాలచారే మందై పోయింది.

దాన్ లోవేసే మిరియాలు వగైరాల పాళ్ళు దానికంత రుచీ ,సువాసనా,రోగనిరోధక శక్తీ ఇస్తున్నయో లేక వాని మంత్ర జప ప్రభావం అలా శక్తి నిస్తున్నదో దేవునికే తెలియాలి. 

ముందు’ నవటాకు’ [సేరులో 8వ వంతు.పాతకాలం నాటి కొలత ప్రమా ణం] చారు కాచుకుని ఇద్దరూ త్రాగే వారు ,అదికాస్తా ఇప్పుడు మూడు మానికల దబర నిండా కాచినా చారు క్యూపెరిగిపోతున్నది . ఉదయా న్నే క్యూ కట్టేస్తున్నారు. మాణిక్యం చదువు  అటకెక్కుతున్నాది.
మాణిక్యం  కాలేజికెళ్లాక ఎలా తెలిసిందో  ఏమో  కానీ మిరియాల మాణిక్యం అని పిలవసాగారు. అమ్మాయిలు సైతం మిరియాల మాణిక్యం అని పిలిచేవారు. మాణిక్యం కూర్చునే బెంచీమీద మిరియాలు పోసేవారు. బోర్డుమీద మిరియాల బొమ్మవేసేవారు. ఎవరైనా తుమ్మినా ,దగ్గినా 'హాఛ్ మిరియం 'అనేవారు.

అమ్మాయిలైతే "ఏంటే మిరియాల ధర ఇలా పెరిగిపోయిందీ! మార్కెట్లో దొర కడమేలేదు."అని మాణిక్యం వినేట్లుగా అనేవారు. అన్నిటికీ చిరునవ్వే మాణి క్యం నుంచీ వారికి సమాధానంగా వచ్చేది. ఎవరెంత ఏడ్పించాలని చూసినా బేఖాతర్ చేసే వాడు.  మాణిక్యం మాత్రం అదేమీ పట్టించుకోకుండా తన మానా న తాను ఉండసాగాడు.    ఏదేమైనా కాలేజ్ లో కూడా మాణిక్యం మిరియాల చారు రుచి, మహిమా తెలిసి లెక్చరర్స్ సైతం మిరియాల చారు కోసం ఇంటికి రాసాగారు. కడుపునొప్పి , జలుబూ,అజీర్తీ చేత్తో తీసేసినట్లు పోవటాన వారికీ మంచి గురి కుదిరింది.    

కాలేజ్ కెళ్ళనే కుదరడం లేదు. ఒక రోజున పదకొండు గంటలవరకూ చారుకాచి పడుకున్నాడు మాణిక్యం. ఆకాలేజ్ లోనే చదివే ఒక ధనవంతుడైన నారాయణ   గారి ఏకైన సంతానమైన కుమార్తె ‘కుముదిని’  కి కడుపునొప్పి వచ్చింది. ఆయన కు ఆధునిక వైద్యం పట్ల నమ్మకం లేనందున గృహవైద్యం చేయించాడు  . ఏ మందు వేసినా  తగ్గ లేదు. దాంతో ఎవరో మాణిక్యం మిరియాల చారు గురించీ ఆయనకు  చెప్పారు ,అంతే రాత్రి పదకొండుగంటలకు కూతుర్ని తీసుకుని కార్లో మాణిక్యం ఊరికి వచ్చాడు. తలుపు తీసి వారిని చూసిన బామ్మ విషయం తెలుసుకుని మాణిక్యాన్ని లేపింది.

మాణిక్యం  మళ్ళా ఫ్రష్ గా మిరియాల చారు కాచి ఇచ్చాడు, ఒక్క అర్ధ గంటలో కడుపునొప్పి పోవటాన ఆ ధనవంతుడైన నారాయణ ,మహా ఆశ్చర్యపడి  మాణి క్యం హస్తవాచిని బిజినెస్ కోసం వాడుకుంటే ఎలా ఉంటుందో  అని ఆలోచించా డు. మరునాడు  తనకుమార్తెతో మాట్లాడాడు.

పచ్చగా అరడుగుల విగ్రహం, ఉంగరాలజుట్టు,శాంత స్వభావం , పరోపకార గుణం  కావటాన అతడికుమార్తె ఇష్టపడింది. మాణిక్యాన్ని అల్లుడిగా చేసు కోను నిర్ణయించుకున్నాడు. దాంతో మాణిక్యం జాతకమే  మారిపోయింది.

మాణిక్యాన్ని , అల్లుడ్ని చేసుకుని హోటల్ మేనేజ్ మెంట్ కోర్స్ చేయించాడు. పెద్ద హోటల్ పెట్టించాడు .చూస్తుండగానే ' మిరి యాల చారు స్పెషల్ వెజ్ హోటెల్ ‘గా కీర్తిపతాకాలు ఎగరేసింది. అనతికాలం లోనే ' మిరియాల మహల్ ' పేరుతో  పెద్ద మూడంతస్తుల భవనం వెలిసింది. బామ్మ ఆనం,దానికి హద్దేలే కుండా పోయింది.

"చూశావట్రా మాణిక్యం! నీవు చేసిన మానవసేవ ఎంత గొప్ప ఫలితా న్ని చ్చిందో! అందుకేరా పెద్దలు  చేసిన మంచి ఊరికే పోదని చెప్పారు. దానికి తోడు ‘మహామృత్యుంజయ’ మంత్ర జప ప్రభావం నిన్ను ఇంత వాడ్ని చేసిం దిరా!" అంటూ మురిసిపోయింది.    మనవడితోపాటు మహానగరంలో హాయిగా జీవిస్తూ 'త్ర్యంబకం యజా మహే సుగంధిం పుష్టి వర్ధనం  --' అని మంత్ర జపం చేసుకుంటూ గడిపేయసాగింది.     

మరిన్ని కథలు