Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి... http://www.gotelugu.com/issue280/738/telugu-serials/katyayani/katyayani/

(గత సంచిక తరువాయి).... ఎదురుగా రాజా రావు గారు, అచ్యుత రామయ్యగారి కొలీగ్!
"రండి,రండి" లోపలికి ఆహ్వానించాడు.

లోపలికొచ్చి కూర్చున్నాక "టీ వీ చూస్తున్నట్టున్నారు, డిస్టర్బ్ చేశానా" అన్నాడు సంకోచాన్ని వ్యక్తం చేస్తూ. వాళ్లు మాట్లాడుతుండగానే యశోదమ్మ టీ వీ కట్టేసింది. ఆ ఇంట్లో అంతే ఎవరైనా వస్తే టీ వీ కట్టేసి, వచ్చిన వాళ్లకి ప్రాధాన్యత ఇస్తారు.

"ముందు అతిథులే ప్రధానం. టీ వీ చూడ్డం ముఖ్యం కాదండి" అని "యశోదా రాజా రావు గారొచ్చారు, కాస్త టీ పెట్టు" అని పూర్తి చేశాడు.

"ఎందుకండీ అవండీ, నేను ఈ కాలనీలో ఉండే వాడినే కదా!" మొహమాట పడ్దాడు.

"ఇది ఎలాగూ మేము తాగే టైమే"నవ్వాడు అచ్యుతరామయ్యగారు.

ఆఫీసు విషయాలు మాట్లాడుకుంటుండగా యశోదమ్మ రెండు కప్పుల టీ, ప్లేట్లో బిస్కట్లు సర్ది వాళ్లిద్దరి మధ్యన ఉన్న టీపాయ్ పై పెట్టి వెళ్లబోయింది.

"నువ్వూ కూర్చో చెల్లెమ్మా, ఒక విషయం మాట్లాడాలి" అన్నాడు.

ఆవిడ భర్త వంక, రాజా రావు గారి వంకా ఆశ్చర్యంగా చూస్తూ కొద్ది దూరంలో ఉన్న స్టూల్ మీద కూర్చుంది.

"అచ్యుత రామయ్య గారూ, మాది మూడు వాటాల ఇల్లని తెలుసుగా. మేమున్న వాటాని ఒదిలేస్తే రెండింటినీ అద్దెకిచ్చానన్న విషయం కూడా మీకు తెలుసు. ఒక దాంట్లో భర్త వదిలేసిన ఒక టీచర్ చాలా కాలంగా గుంభనంగా ఉంటోంది. రెండో వాటాలో కమలాకర్ అనే కుర్రాడు, వాళ్లమ్మతో ఉంటున్నాడు. వాళ్లు మా ఇంట్లో కొచ్చి మూడేళ్లవుతోంది. అంతకు ముందు వీళ్లు కూకట్ పల్లిలో ఉండే వారు, కమలాకర్ చదువైపోయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా వాళ్ల నాన్న హార్టెటాక్ వచ్చి పోయారు. వాళ్ల నాన్న పోవడాన్ని జీర్ణించుకోలేని వాళ్లమ్మ జీవితం పట్ల నిరాసక్తంగా మారి పోయింది. ఒక రోజు ఏదో పని మీద బైట కెళ్లి వస్తుంటే ఆవిణ్ని ఆటో గుద్దేసింది, దాంతో తలకు దెబ్బ తగిలి రెండు కళ్లూ పోయాయి. అప్పటి నుంచి మౌనాన్ని ఆశ్రయించింది. తన పనులు తను చేసుకుంటుంది. అవసరమైతే పొడి పొడిగా రెండు మాటలు మాట్లాడుతుంది. అంతే. ఇహ ఆ ఏరియాలో ఉండడం ఇష్టం లేక, పాత జ్ఞాపకాలను వదిలించుకోవాలని మన ఏరియాకొచ్చి మా ఇంట్లో అద్దెకు దిగారు.

ఇదంతా మీకు నేను ఎందుకు చెబుతున్నానని మీరనుకుంటున్నారని నాకు తెలుసు. వస్తున్నా, అసలు విషయానికి వస్తున్నా" అని కొద్దిగా ఆగి టీ కప్పు చేతిలోకి తీసుకుని రెండు గుక్కల్లో టీ తాగేసాడు.

"అయ్యో టీ చల్లబడి పోయిందా, మళ్లీ పెట్టుకురానా" గబుక్కున లేస్తూ అంది యశోదమ్మ.

"ఉండు చెల్లెమ్మా, ఇలా తాగాలనే ఇంత సేపుంచాను. తాగకుండా వెళితే మీరు నొచ్చుకుంటారని, ఇలా తాగాను" అని "ఆఁ, ఏం చెబుతున్నాను? కమలాకర్ వాళ్లు మా ఇంట్లో అద్దెకి దిగారని కదూ. వాళ్లు మా ఇంట్లో దిగిన వేళా విశేషం ఏంటో గానీ అబ్బాయికి ప్రైవేటు లిమిటేడ్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. అతనెప్పుడొస్తాడో, ఎప్పుడెల్తాడో ఎవరికీ తెలీదు. మంఛి కుర్రాడు. బాగుంటాడు. మనసు మంచిది. ఎప్పుడైనా నేను పలకరిస్తే చక్కగా మాట్లాడతాడు.అలాంటి అతను మీ అమ్మాయిని వేణు గోపాల స్వామి గుడిలో రెండు మూడు సార్లు చూశాడట. వొంచిన తల ఎత్తకుండా భగవంతుణ్ని మాత్రమే చూసే మీ అమ్మాయి ఒద్దికైన గుణం తనకి నచ్చిందట. రేపు తనకి ఎవరితోనైనా పెళ్లయితే తను లేనప్పుడు తన తల్లిని ఎలా చూసుకుంటుందో అని బెంగగా ఉండేదట. మీ అమ్మాయిని చూశాక, ఎందుకో వాళ్లమ్మను గురించిన బెంగ పోయిందట. తను ఆమెని వెనకగా వెంబడించి మీ కూతురని తెలుసుకున్నాట్ట. కాని ఎలా అప్రోచ్ అవాలో ఆలోచిస్తుంటే, మీరూ నేను ఒక సారి కలిసి మాట్లాడుకుంటూ రావడం చూశాట్ట. తన గురించి మీతో చెప్పమని నన్ను రిక్వెస్ట్ చేశాడు. మీరూ మీ అమ్మాయికి మంచి సంబంధాలు చూస్తున్నారని తెలుసు గనక, అతని ప్రస్తావన మీముందు పెడుతున్నాను. అతని గురించి నేను రెండే రెండు మాటల్లో చెబుతాను. నాకు కొడుకులు కాకుండా, కూతురు ఉంటే అతనికే ఇచ్చి చేసే వాడిని. మీరూ ఆలోచించుకోండి" అన్నాడు చెప్పడం అయిపోయిందన్నట్టుగా గట్టిగా శ్వాస వదులుతూ.

అచ్యుత రామయ్య గారు భర్య వంక చూశాడు. అదే సమయంలో ఆవిడ కూడా ఆయన వంక చూసింది. వాళ్లిద్దరి మధ్యా ఏ భావ మార్పిడి జరిగిందో కానీ, అచ్యుత రామయ్య గారు రాజా రావు గారి వంక సూటిగా చూశాడు.

రాజా రావు గారు కూడా ఆత్రంగా ఆయన వంక చూస్తున్నాడు. ‘తన మీద ఎంతైనా గౌరవముండొచ్చు. కానీ తను చెప్పిన దానికి ’ఊహూ ‘అంటే రేపటి నుంచి ఆయన కనిపిస్తే మనసును తెలియని సంకోచం చుట్టుముడుతుంది. అదే పెళ్లి చూపులయ్యాక ఇరువురిలో ఎవరికి నచ్చకపోయినా ఫర్వాలేదు, అది వేరే విషయం అవుతుంది’ రాజా రావు గారి మనసును ఆలోచనలు ఈగల్లా ముసురుకుంటున్నాయి.

"రాజా రావు గారు మీతో ఒక విషయం చెప్పాలి" అని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు.

‘ఆయన ఏమంటాడా’ అని రాజారావుగారు, అచ్యుతరామయ్య భార్య యశోదమ్మ చెవులు రిక్కించారు.

***

ఆయన చెప్పబోయే విషయం ఏమిటి? అది కథను ఏ మలుపు తిప్పబోతోంది? ఈ సస్పెన్స్ వీడాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే.......

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్