Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue283/744/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)....‘‘మామూలుగా చనిపోలేదు. ఎవరో ఆవిడ్ని కత్తితో పొడిచి చంపేసారు.’’మళ్లీ ఎస్సై అక్బర్ ఖాన్ అన్నాడు. సత్యవతమ్మ గారిని ఎవరో హత్య చేసారని చెప్పే సరికి వాళ్లంతా భయంతో ఒకడుగు వెనక్కి వేసి మౌనంగా నిలబడి పోయారు.
    ‘‘నేను సత్యవతమ్మ గారి పోర్షన్ చూడొచ్చా?’’అడిగాడు ఎస్సై  అక్బర్ ఖాన్..

‘‘సార్! మీరు ఎస్సై అంటున్నారు. కానీ, మాకు నమ్మకం కలగాలి కదా! మీరు చూస్తే సివిల్ డ్రస్ లో ఉన్నారు. ఒక వేళ...మీరు...?!’’ అర్థోక్తిగా అన్నాడు యువకుడు.

‘‘యస్! నాకు తెలుసుసు. అందుకే నేను వస్తున్నప్పుడే ప్రకాష్ నగర్ పోలీస్టేషన్ కి ఇన్ ఫాం చేసి వచ్చాను. కాసేపట్లో వాళ్ళు వస్తారు.’’ అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్..

అంతలోనే సైరన్ చేసుకుంటూ పోలీస్ జీపు వచ్చి అక్కడ ఆగింది. అందులో నుండి ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ ఆగారు.

ఎస్సై  అక్బర్ ఖాన్ పోలీసు జీపు దిగి వచ్చిన ఎస్సైకి షేక్ హాన్డ్ ఇచ్చి తన ఐడి కార్డు చూపించాడు. అతను కూడా ఎస్సై  అక్బర్ ఖాన్ ని గుర్తించి చిన్నగా నవ్వాడు.

‘‘మీరు నేరుగా స్టేషన్ కి వచ్చెయ్యాల్సింది కదా సార్! మనం కలిసే వచ్చే వాళ్లం.’’ అన్నాడు రాజమండ్రి ఎస్సై.

‘‘వర్క్ టెన్షన్ బాస్!’’ అంటూ సత్యవతమ్మ నివాసమున్న పోర్షన్ దగ్గరకు నడిచాడు ఎస్సై  అక్బర్ ఖాన్..

పోలీస్ జీపు ఆ భవనం ముందు ఆగీ ఆగగానే పైన రెండు మూడు అంతస్థుల్లోనూ నివసిస్తున్న వాళ్లంతా గుంపులుగా వచ్చి చేరుకున్నారు. ఏదో సర్కస్ చూస్తున్నట్టు చూస్తూ నిలబడ్డారు. మనిషో మాట మాట్లాడుతున్నారు. కొత్తగా వచ్చిన వాళ్లందరికి  ఎస్సై  అక్బర్ ఖాన్ తో మాట్లాడిన వాళ్ళు జరిగిన సంభాషణ అంతా విడమర్చి చెప్తున్నారు.

సత్యవతమ్మ గార్ని ఎవరో హత్య చేసారన్న వార్త అందరికీ చేరి పోయింది. హతురాలు సత్యవతమ్మ నివాసమున్న పోర్షన్ దగ్గరికి వెళ్లగానే ఆగి వెనక్కి తిరిగి చూసాడు. రాజమండ్రి ఎస్సై వచ్చి అక్బర్ ఖాన్ పక్కనే నిలబడ్డాడు. సత్యవతమ్మ ఉండే పోర్షన్ కి తాళం వేసి వుంది.

‘‘తాళం విరగ్గొట్టాలేమో సార్?!’’ ఎవరో అద్దెకుండే వాళ్లల్లో ఒకతను అన్నాడు. జేబులో ఉన్న తాళం చెవి తీసి రాజమండ్రి ఎస్సై చేతికిచ్చాడు ఎస్సై  అక్బర్ ఖాన్. గుంపులుగా నిలబడ్డ వాళ్ళంతా ఆశ్చర్యంగా చూసారు.

పోలీసులు తలుపు తెరిచి లోపలకు వెళ్ళే సరికి ఆ భవనంలో అద్దెకుండే అతను ఒకరు పోన్ పట్టుకుని పరుగున రాజమండ్రి ఎస్సై దగ్గరకు వచ్చాడు.

‘సార్! సత్యవతమ్మ గారి పెద్దబ్బాయి అమెరికా నుండి ఫోన్ చేసారు.’’ అంటూ సెల్ ఫోన్ రాజమండ్రి ఎస్సై చేతికి ఇవ్వ బోయాడు. ఆయన ఆ ఫోన్ తీసుకుని ఎస్సై  అక్బర్ ఖాన్ చేతికిచ్చాడు.

‘‘చెప్పండి సార్! మీరెవరూ?’’ కావాలనే సీరియస్ గా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘నేను సత్యవసతమ్మ గారి అబ్బాయిని సార్. మా అమ్మగారు చనిపోయారని విన్నాను.’’ అటు నుండి అతను అన్నాడు.

‘‘మీరు విన్నది నిజమే.’’ నిర్లిప్తంగా అన్నాడు ఎస్సై  అక్బర్ ఖాన్. అప్పుడే ఎవరో పోలీసు వచ్చిన విషయం సత్యవతమ్మ కొడుకుకు చేరవేసారు.

‘‘అమ్మ లేకుండా ఆమె పోర్షన్ సోదా చేస్తున్నారు దేనికండి?’’ అడిగాడు అతను.

‘‘చని పోయింది సత్యవతమ్మ గారేనా అన్నది నిజమో అబద్ధమో నిర్ధారణ కాలేదింకా. మాకు దొరికిన ఆధారాల ప్రకారం అడ్రస్ పట్టుకుని వచ్చాను. ఆమె ఫొటో కూడా చూస్తే చనిపోయింది సత్యవతమ్మ గారే అని కేసు ఫైల్ చేసి ఎంక్వయిరీ స్టార్ట్ చేసాం. ఆమెని మర్డర్ చెయ్యాల్సిన అవసరం ఎవరికుందో ఆరా తియ్యాలి కదా! నీకో విషయం తెలుసా  శవం దగ్గర దొరికిన తాళం చెవితోనే ఇంటి తాళం తెరిచాం’’ కొంచెం కటువుగా అన్నాడు ఎస్సై  అక్బర్ ఖాన్. ఒంటరిగా తల్లిని ఆమె మానాన ఆమెని వదిలేసి అమెరికా చెక్కేసిన దొంగనా కొడుకుల్ని కాల్చి పారెయ్యాలన్నంత కసితో రగిలి పోతూ అన్నాడు ఎస్సై  అక్బర్ ఖాన్.

‘‘అయ్యో! మా అమ్మ హత్యకు గురయ్యారా?...నో సార్! నేనూ, తమ్ముడూ ఈ రోజే బయల్దేరి ఇండియా వస్తాము. అంటూ ఏడుస్తూ ఫోన్ కట్ చేసాడు అతను అవతల నుండి. ఫోన్ ఎవరిదో ఆయన కేసి కోరగా చూస్తూ సెల్ అతని చేతిలో విసిరినట్టు పెట్టాడు ఎస్సై  అక్బర్ ఖాన్.  తలుపు తెరవ గానే పెద్ద హాలు దాన్ని ఆనుకుని వరుసగా మూడు బెడ్రూమ్ లు, డైనింగ్ హాల్, కిచెన్, చూడ చక్కగా వుంది ఇల్లు. ఏడాది నుండి ఇల్లు తెరిచి లేక పోవుట వలన ఇల్లంతా దుమ్ము ధూళి పట్టేసి వుంది.

హాల్లో గోడకి సత్యవతమ్య ఆమె భర్త సన్యాసి రావు కలిసి తీయించుకున్న నిలువెత్తు ఫొటో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

మరో ప్రక్క ఫేమిలీ గ్రూప్ ఫోటో. తల్లి తండ్రులతో ఇద్దరు కొడుకులు చెరో ప్రక్క నిలబడి ఉన్నారు. మధ్యలో అందమైన అమ్మాయి నవ్వుతూ నిలబడి వుంది.

హాల్లో ఫొటోలు , అలంకరణ అంతా గమనిస్తూ తిరిగిన ఎస్సై  అక్బర్ ఖాన్. ఫేమిలీ ఫొటో చూస్తూనే అదిరి పడ్డాడు.  తల్లి తండ్రులతో, అన్నదమ్ములతో ఉన్న అమ్మాయి అచ్చు గుద్దినట్టు ఉదయం పర్సులో దొరికిన ‘ఆమె’ ఫొటో లానే ఉంది. సందేహం లేదు ఆమెదే ఈ ఫొటో అన్నంత స్పష్టంగా వుంది. కాకపోతే ఈ ఫొటోలో అలంకరణ పాత తరాన్ని గుర్తు చేస్తోంది.

‘ఆ ఫొటో దగ్గరే అంతు చిక్కని ఆశ్చర్యంతో నిలబడ్డ ఎస్సై  అక్బర్ ఖాన్ వెనక్కి తిరిగి అక్కడ గుమి గూడిన వాళ్ల కేసి చూసి అడిగాడు.

‘‘ఈ ఫొటోలో ఉన్నది ఎవరో చెప్ప గలరా?’’ అడిగాడు ఎస్సై  అక్బర్ ఖాన్.

‘‘అదేంటి సార్! ఆవిడ సత్యవతమ్మ గారు. ఆయన ఆమె భర్త సన్యాసిరావు గారు. వాళ్ళు ఇద్ద్దరూ అబ్బాయిలు. ఆ పిల్ల వాళ్ళ ఒక్కగా నొక్క కూతురు.....’’ అన్నాడొక పెద్దాయన.

‘‘ఆమె ఎక్కడుంటుందో మీకు తెలుసా?’’ కుతూహలంగా అడిగాడు ఎస్సై  అక్బర్ ఖాన్.

‘‘ఏమో  సార్!  మాకెవరికీ  ఆ  అమ్మాయి  ఎప్పుడూ  కనిపించ లేదు.  అబ్బాయిలు ఇద్దరూ ఏడాదికోసారి వచ్చి వెళ్తుంటారు. ఆ అమ్మాయిని ఎప్పుడూ మేము చూడలేదు.’’ చెప్పారందరూ.

ఎస్సై  అక్బర్ ఖాన్ కి మతి పోయింది,

జేబులో సెల్ తీసి చక చకా కావలసిన ఫొటోలు తీసుకున్నాడు. సత్యవతమ్మ దంపతుల ఫొటో, ఫేమిలీ ఫొటోతో పాటు ఇల్లు కూడా ఫొటో తీసాడు. రోడ్డు మీదకు వచ్చాక బిల్డింగ్ మొత్తం ఫొటో తీసుకున్నాడు. ముసలమ్మ పేరు సత్యవతమ్మ అన్నది వాస్తవం. ఆమె రాసిన విల్లు ప్రకారం ఊరు, ఇల్లు, పిల్ల అన్నీ నిజాలే! కానీ, ఒకే ఒక్క ప్రశ్న మాత్రం అతన్ని అతలాకుతలం చేసేస్తోంది.ఎస్సై  అక్బర్ ఖాన్ తను వచ్చిన విషయమంతా రాజమండ్రి ఎస్సైకి వివరించాడు. సత్యవతమ్మని చంపింది ఎవరో కనుక్కో వలసిన బాధ్యత తనపై వుందని ఆ పరిశోధన లోనే రాజమండ్రి వచ్చానని చెప్పాడు ఎస్సై  అక్బర్ ఖాన్.

బిల్డింగ్ లో అద్దెకున్న వారిలో నలుగురైదుగురి దగ్గర సత్యవతమ్మ గురించి వారు చెప్పిన నిజాలు స్టేట్మెన్ట్లుగా రికార్డు చేసుకున్నాడు.   రాజమండ్రిలో పని ముగించుకుని వైజాగ్ బయలు దేరాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘ఆమె సత్యవతమ్మ గారి కూతురేనా?! ఎందుకు ఊర్లు పట్టుకు తిరుగుతోంది. సింహాచలంలో కొండ మీద హతురాలు సత్యవతమ్మతో ఉన్నది, యాచక కుర్రాళ్ళు రాము, సోములతో  డబ్బు డ్రా చేయించింది ఒక్కరే. ఆమెనే చంప బోయిన హంతకులు ముసలమ్మ సత్యవతమ్మని చంపేసారు. ఆమెని రేప్ చేయ బోయిన వారిని కత్తితో ఎటాక్ చేసి తప్పించుకుంది. ఆమె దగ్గర బ్యాగులు దొంగిలించిన దొంగల మీద కూడా అటాక్ చేసి పారి పోయింది. ఎందుకు?! ఇంతకీ ఆమె ఎవరు?

ఆమెని రక్షించే సమయానికి పోలీసులకు దొరక్కుండా ఎందుకు పారి పోయింది. తల్లని తెలిసే యాచకురాలైన సత్యవతమ్మకి రొట్టె కొని ఇచ్చిందా?! ఆమెకి అంత ఖరీదైన గన్ ఎలా వచ్చింది. 9 ఎం. ఎం. ఫిస్టల్ విదేశాల్లో తప్ప ఇండియాలో దొరకని అత్యంత ఖరీదైన లోడెడ్ పిస్టల్. అది ఆత్మ రక్షణ కోసమే తెచ్చుకుందా! లేక హంతకురాలా?!

ఆలోచిస్తూ బస్సులో సీటుకు జారగిల బడ్డాడు ఎస్సై  అక్బర్ ఖాన్. హతురాలు ముసలమ్మ అయిన సత్యవతమ్మ కేసులు చాలా వరకూ తేలి పోయినట్టే. సత్యవతమ్మని చంపిన హంతకులు ఎవరన్నది తెలిస్తే పట్టుకో వచ్చు. కానీ, ఎవరో....ఎందుకు చంపారో... అర్థం కావటం లేదు. దొంగలిద్దరూ చెప్పిన దాని ప్రకారం సత్యవతమ్మ కూతురిలా ఉన్న ఆమెని చంపబోయి ఈ ముసలమ్మని చంపేసారన్నది నిజమైతే? వాళ్ళెవరు? ఆమెని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఆమె ఎందుకలా పిచ్చిదాని లా... ఎవరూ లేని అనాథలా... యాచకుల మధ్యే సంచరిస్తోంది. ఆమెని ఆమె రూపాన్ని చూస్తే గొప్పింటి పిల్ల లానే వుంది. అలాగే డబ్బు కూడా పుష్కలంగా ఉన్న ధనవంతురాలే అయి ఉంటుంది.

‘ఆమె’ని పట్టుకో గలిగితే రెండు కేసులు ఒక కొలిక్కి వస్తాయి. ‘ఆమె’ ఏ.టి.ఎమ్. కార్డు జిరాక్స్ చేయించాడు. ఆ కార్డు మీద ఉన్న నెంబర్ ల ద్వారా బ్యాంకు కు వెళ్లి ‘ఆమె’ అకౌంట్ తో పాటు పూర్తి చిరునామా లాగెయ్యొచ్చు! అందుకే ఆ పని ఓ కానిస్టేబుల్ కి అప్పగించాడు. బ్యాంకు మేనేజర్ కి పై అధికారులతో లేఖ కూడా రాయించి ఇచ్చి పంపించాడు.

ఆ వివరాలు తను వైజాగ్ చేరే సరికి రెడీగా ఉంటాయి. ఈ లోగా దొంగ దగ్గర దొరికిన పర్సులో ఉన్న ఫొటోలు కాపీలు తీయించి నగరమంతా గాలించడానికి ఏర్పాట్లు చేసాడు.

ఆమె విశాఖ నగరంలో ఎక్కడున్నా తప్పకుండా దొరికి పోతుంది. కాంప్లెక్స్ లో జరిగిన హత్య పరిశోధన కూడా కమీషనర్ తనకే అప్పగించారంటే... ఆయనకి నా మీద ఉన్న విశ్వాసాన్ని వమ్ము చేయ కూడదు. ఎస్! ఎలాగైనా ‘ఆమె’ ఎవరో రూడీ చేసుకోవాలి.’ ఆలోచిస్తూ సీటుకు జారగిలబడి కళ్ళు మూసుకున్నాడు ఎస్సై  అక్బర్ ఖాన్.

అప్పటికే చీకటి చిక్కగా అలుముకుంటోంది. రాజమండ్రిలో బస్సు ఎక్కే సరికే ఆరు కావస్తోంది. బస్సులో ప్రయాణీకులు కూడా కిక్కిరిసి లేరు. రాజమండ్రిలో ఎక్కిన కొందరు రాజా నగరం, జగ్గం పేట ప్రాంతాల్లో దిగి పోయారు. ఎర్రవరం చేరే సరికి సగం ఖాళీ అయి పోయింది బస్సు.  ఎర్రవరంలో బస్సు ఆగీ ఆగగానే అరటి పళ్ళు, శనగ పప్పుకు వగైరా  అమ్మే  వర్తకుల కేకలకి ఉలిక్కి పడి కళ్లు తెరిచాడు ఎస్సై అక్బర్ ఖాన్.

బస్సంతా ఖాళీగా కనిపించింది, ఎర్ర వరంలో ఒకరిద్దరు ఎక్కారు. తన ప్రక్క సీటు ఖాళీగా ఉండడంతో రిలాక్స్ గా కూర్చున్నాడు ఎస్సై  అక్బర్ ఖాన్. వెంటనే నిద్ర మత్తు లోకి జారుకున్నాడు.

(అంతా తేలిపోయినట్టే అనిపించి....అంతలోనే కొత్త త్విస్టుకి తెరలేచిన అన్వేషణ ఇంకేం మలుపులు తిరగబోతొంది......సస్పెన్స్ వీడాలంటే వచ్చే శుక్రవారం దాకా ఆగాల్సిందే....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
katyayani