Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue283/743/telugu-serials/katyayani/katyayani/

(గత సంచిక తరువాయి)...  ఆ కాలనీ మధ్యలో కొద్దిగా ఎత్తైన గుట్ట మీద వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది. గర్భ గుడిలోని విగ్రహం చాలా పురాతనమైంది కానీ, గుడిని గత నాలుగైదేళ్లలో కల్యాణ మంటపం, విడిది గదులు, కుడివైపున గోశాల, ఎడం వైపున ఆఫీసు, ప్రసాదం కౌంటర్లతో చాలా అభివృద్ధి పరిచారు. వేణుగోపాల స్వామి విగ్రహాన్ని చూస్తున్నకొద్దీ చూడాలనిపిస్తుంది. ఆయన్ను దర్శించుకోవడం ఒక మధురానుభూతిగా అభివర్ణిస్తారు, అంతేకాకుండా మనసులో కోరుకున్న కోరికలు చాలా వరకు తీరతాయని భక్తుల సంపూర్ణ విశ్వాసం.
అచ్యుతరామయ్యగారు, కమలాకర్ వాళ్లు తమ తమ గదుల్లో సామాన్లు పెట్టుకున్నారు. గుడి అయ్యవారు తమ బంధువుల్లోఇద్దరిని పెళ్లి చేయించడానికి ఏర్పాటు చేశారు. ఒకరు అచ్యుతరామయ్య వైపు, మరొకరు కమలాకర్ వైపు వధూవరుల చేత చేయించవలసిన పూజలన్నీ యధావిధిగా చక్కగా చేయిస్తున్నారు.

వచ్చిన వాళ్ళందరికీ ఇది లేదనకుండా టిఫిన్లు, కాఫీలు, భోజనాలు ఏర్పాటు చేశారు అచ్యుతరామయ్యగారు. అందరూ రచులను ఆస్వాదిస్తూ, నెమరు వేసుకుంటూ సుష్టుగా భోజనం చేశారు.

పెళ్లంటేనే అనుభూతుల మేళవింపు. గొప్ప తంతు. సమయం పరిగెడుతూ ముహూర్తానికి దగ్గర చేసింది. వధూవరులిద్దరూ శుభముహూర్తంలో ఒకరి తలపై మరొకరు జీలకర్రాబెల్లం పెట్టుకున్నారు. ఆ తర్వాత బాజాభజంత్రీల మధ్య పచ్చని కాత్యాయని మెడపై పచ్చని తాడుతో మూడుముళ్లేశాడు కమలాకర్.

అప్పటిదాకా విడి విడిగా ఉన్నవాళ్లు ఆ క్షణం నుంచి దంపతులైనందుకు ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ ఆహూతులందరూ అక్షతల వర్షం కురిపించారు.

***

ఆ రోజు వాళ్లిద్దరి మొదటి రాత్రి.

రాజారావుగారు వాళ్లింటిమీద తన కోసం ఉంచుకున్న అటాచ్డ్ బాత్ రూం ఉన్న గదిని, చక్కగా అలంకరించి కొత్తజంట సమాగమానికి మ్యారేజ్ గిఫ్ట్ గా ఇచ్చాడు.

విశాలమైన ఆ మేడమీద చాలానే పూల కుండీలున్నాయి. వాళ్లింటి పనిమనిషి పైనున్న గది శుభ్రం చేసి, మొక్కలకు నీళ్లు పోసి, మంచం మీద పక్కబట్టలు సర్ది వెళ్లిపోతుంది. రాజా రావు గారు ఆఫీసు నుంచి వచ్చి, రాత్రి భోజనాలు అయ్యాక మేడమీదకెళ్లి పోతారు. అక్కడ ఆరుబయట పడక్కుర్చీ వేసుకుని కాసేపు మొక్కల మధ్య గడిపి, అక్కడే పడుకుని, నిత్య కృత్యాఅలు ముగించుకుని, పేపర్ చదువుకుని కిందకు వస్తాడు. ఆయనకు ప్రత్యేకంగా ఇష్టమైంది ఆ ప్రదేశం. తను పూనుకుని పెళ్లి చేశాడు గనక కొంత బాధ్యత తీసుకుని ఆ గది, ఆ ప్రత్యేకమైన రోజు కోసం వాళ్లకిచ్చాడు.

తెల్లటి పంచ, చొక్కాలో కమలాకర్ మిల మిల మెరిసి పోతూ డాబా మీద కూర్చుని ఉన్నాడు.

ఆకాశంలో ఉన్న ధగ ధగ మెరుస్తున్న పున్నమి చంద్రుడికి, తనకు పోటిగా ఆ మానవమాత్రుడెవరు? అన్న ఆలోచన వచ్చిందేమో, మబ్బులను ఎక్కడికో పంపించేశాడు. నిర్మలంగా, తేటగా ఉంది ఆకాశం.  ఇహ కింద ఏ జరుగుతుందో చూడడానికి సమాయాత్తమయ్యాడు.
చల్లటి గాలితో, కుండీల్లోని పూల గుబాళింపుతో చాలా ఆహ్లాదంగా ఉంది ప్రకృతి. కోడె వయసుతో ఉన్నా, అప్పటి దాకా సమాజపు కట్టుబాట్లకు లొంగి, తొంగోబెట్టిన కమలాకర్ లోని కాముడు ఎప్పుడెప్పుడు అతని శరీరం నుంచి కట్లు తెంచుకుని బయటకు పరిగెత్తాలా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాడు.

కాత్యాయనిని మొట్టమొదటి సారి గుడిలో చూసినప్పుడు మనసూ, శరీరం అదుపు తప్పాయి. తను ఎదుర్కొన్న పరిస్థితిలు తనలోని సున్నితమైన భావాలకు సంకెళ్లేశాయి. ప్రేమ అని వెంబడించేంత ఓపిక లేదు. పైగా ఆమె సంప్రదాయ బద్ధంగా ఉంది. ఆమెని ఇబ్బంది పెట్ట కూడదు అన్నది తన మనో నిశ్చయం. అందుకే వీలున్నప్పుడల్లా ఆ అందాన్ని, అణకువనీ చూస్తూ భువిలోని ఆ పారిజాతాన్ని ఎలా సొంతం చేసుకోవాలా అని ఎదురు చూశాడు. ఆమెని చూడడానికి అమెరికా సంబంధం వస్తే, ఇహ కాత్యాయని తనకు దక్కదన్న స్థిర నిర్ణయానికి వచ్చేశాడు. కానీ ఆ సంబంధాన్ని ఒద్దని తిప్పి కొట్టారని తెలిసి ఆనందం అర్ణవమైంది. ఇహ ఆలస్యం చేస్తే కాత్యాయని తనకు దక్కదు ఎలా? అని ఆలోచిస్తుంటే తన ఇంటి ఓనర్ రాజా రావు గారితో, అచ్యుత రామయ్య గారు రావడం కనిపించింది. మనసుకు ఎందుకో వెయ్యేనుగుల బలం వచ్చింది. పంచ కళ్యాణిలా పరిగెత్తింది. సరా సరి వెళ్లి రాజా రావు గారి పాదాల మీద వాలి పోయాడు ’అన్యథా శరణం నాస్తి’ అన్నట్టు. ఆయన కరిగి పోయి తమ పెళ్లికి నడుం బిగించాడు.  

చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూంటే, అతనిలో అల్లరి ఆలోచనలు కలగ సాగాయి..కొద్దిదూరంలో కుండీలో సంపూర్ణంగా విరిసిన తెల్ల గులాబీ, గాలికి అల్లన మెల్లన ఊగిసలాడుతూ నవ్వులు రువ్వుతున్నట్టుగా ఉంది. ‘మరి కాసేపట్లో నా కాత్యాయని వస్తోంది, అప్పటి దాకా నువ్వెంత అందగత్తెవో అన్న పొగరును అనుభవించు తర్వాత నువ్వు ముడుచుకు పోవలసి వస్తుంది’. గుత్తులుగా ఉన్న పూలతో నాజూగ్గా ఉన్న సన్నజాజి కొమ్మ గోడల మీద పాకుతూ వయ్యారాలు పోతోంది. ‘కాత్యాయని నడుం ముందు నీ తీగ దిగదుడుపే, ఇప్పుడే గోడ దూకేయ్ తర్వాత తట్టుకోలేవ్’. మంద్రంగా వీస్తున్న గాలితో ‘తను ఒచ్చాకా ఇలాగే సువాసనా భరితంగా వీయాలి సుమా, అది నీకే గొప్పతనాన్ని చేకూర్చుతుంది’ ఇలా భావ ప్రవాహంలో ఉన్న అతనికి డాబా తలుపు తీసిన చప్పుడైంది. ఆలోచనల్నుంచి బయట పడి అటు వైపుగా చూశాడు. లోపలికి వచ్చిన కాత్యాయనిని అలా రెప్ప వేయకుండా చూస్తూండి పోయాడు.

ఆమె తల వంచుకుని అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది, వెనకాల తలుపులు మూత పడ్డాయి. ఇద్దరి తలపుల మూతలు తెరవ బడ్దాయి.తెల్లని చీరలో మెరిసి పోతూ, అవసరమైన నగలతో, అలంకరణతో అద్భుత సౌందర్య రాశిలా కనబడుతోంది.

తను తేరుకుని మునివేళ్లతో ఆమె చేయందున్నాడు. మొట్ట మొదటి సారి తండ్రి కాకుండా పరాయి మగాడు ముట్టుకున్నందుకు కలిగే ప్రకంపన ఆ చేతుల ద్వారా అనుభవమైంది. ఆమెని నెమ్మదిగా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. అతనికి తెలుసు..

***

అంతా సవ్యంగా సాగుతోంది...అన్నీ సంతోషాలే కనిపిస్తున్నాయి......ఎక్కడో ఓ యూటర్న్ ఉండనే ఉందని అనిపిస్తోంది కదూ.....ఆ యూ టర్న్ ఎక్కడొస్తోందో తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా ఆగాల్సిందే.......

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్