Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రతాప వెంకట సుబ్బారాయుడు

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue287/753/telugu-serials/katyayani/katyayani/

(గత సంచిక తరువాయి)... కమలాకర్ సోఫాలో పడుకుండి పోయి ఉన్నాడు. గాలి సరిగా ఆడనట్టుంది గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నాడు.

ఇహ ఆలస్యం చేయ కూడదనుకుని, పక్కింటి ఆవిడకి విషయం చెప్పి, ఆవిణ్ని కమలాకర్ ను చూస్తూ ఉండమని చెప్పి, పరుగు లాంటి నడకతో తమ అపార్ట్ మెంట్ కు కొంచెం పక్కగా ఉండే మెడికల్ షాపుకు వెళ్లి ‘దగ్గర్లో మంచిగా చూసే పెద్ద హాస్పిటల్ ఎక్కడుందని’ అడిగింది.
అతను విషయం అర్థం చేసుకుని దగ్గర్లో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చెప్పి, వాళ్లది ఫ్రీ ఆంబులెన్స్ సర్వీసు కూడా ఉందని నెంబరిచ్చాడు. ఆమె వెంటనే ఫోన్ చేసింది. ఆమె హడావుడిగా ఇంటికి చేరుకునే సరికి కూడా కమలాకర్ ఇంకా సన్నగా రొప్పుతున్నాడు. భయంతో తండ్రికి కాల్ చేసి జరిగింది చెప్పింది ఏడుస్తూ. ఆయన తనొస్తున్నానని భయ పడొద్దని చెప్పాడు.

అంబులెన్స్ వచ్చింది. వాళ్లు అతన్ని స్ట్రెచ్చర్ లో ఎక్కించి అంబులెన్స్ లోకి చేర్చారు. తాము వచ్చే వరకూ తన అత్త గారిని కనిబెట్టుకుని ఉండమని ఆ పక్కింటావిడ రాధమ్మకి చెప్పి ఆంబులెన్స్ ఎక్కింది.

ఆంబులెన్స్ లోంచి దింపి కమలాకర్ ను ఐ సి యూలోకి తీసుకు పోయారు. బయట వేసిన బెంచి మీద కూర్చుని గుండె లోపల్నుంచి ఎగదన్నుతున్న బాధను దిగమింగుకుంటూ, పమిట చెంగుతో కళ్లు తుడుచుకో సాగింది కాత్యాయని. అప్పుడే హడావుడిగా వచ్చారు అచ్యుత రామయ్య గారు, యశోదమ్మలు. వస్తునే శోక దేవతలా ఉన్న కూతుర్ని చూసి మ్రాన్పడి పోయారు.

"ఏవైంది తల్లీ"అడిగారు అచ్యుత రామయ్య గారు. కమలాకర్ కు ఆఫీసులో మెట్లెక్కితే ఆయాసం రావడం మొదలు, తమ లొకాల్టీ లో ఉన్న డాక్టరు దగ్గరకి వెళ్లి చూపించుకుని మందులు తీసుకుని వాడడం, ఆఫీసులో అతను నీరస పడి పోవడం, ఇంటికొచ్చాక అతనికి గాలాడక పోవడం అన్నీ వెక్కుతూ పూసగుచ్చింది.

"అల్లుడు గారికి ఏం ఫర్వా లేదమ్మా, మేమొచ్చేశాంగా ధైర్యంగా ఉండు" అని కూతురికి ధైర్యం చెప్పి ‘డాక్టర్ బైటకి ఎప్పుడొస్తాడా’ అని ఆత్రంగా ఎదురు చూడ సాగాడు అచ్యుత రామయ్య.

మరి కొద్ది సేపట్లో రాజా రావు గారు ఆయన భార్య కూడా పరామర్శకి వచ్చారు. డాక్టర్ బయటకి వచ్చి ‘కన్సల్టేషన్, అడ్మిషన్ ఛార్జెస్, రికమెండెడ్ టెస్ట్ లకూ రిసెప్షన్లో డబ్బు కట్టి, వస్తూ వస్తూ రాసిన మెడిసిన్స్ అక్కడే ఉన్న మెడికల్ స్టోర్ లోంచి తెస్తే ట్రీట్ మెంట్ స్టార్ట్ చెయ్యొచ్చు’ అని చెప్పి వెళ్ల బోయాడు, "డాక్టర్ మా అల్లుడికి.."అచ్యుత రామయ్య గారు మాట పూర్తి చేయకుండానే "ఇప్పుడే కదా వచ్చింది. టెస్ట్ రిపోర్ట్ లు రావాలి, అప్పటి దాకా అబ్జర్వేషన్ లో  ఉంచాలి. అదయ్యాకే ఏవైనా చెప్పగలం. మీరు తొందరగా వెళ్లి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని,. మెడిసిన్స్  పట్టుకుని వస్తే  ట్రీట్ మెంట్ తొందరగా స్టార్ట్ చెయ్యొచ్చు. పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్.."అంటూ వెళ్లి పోయాడు.

అచ్యుత రామయ్య గారు రిసెప్షన్ కి వెళ్లడానికి వేగంగా మెట్లు దిగ సాగాడు. ఆయన్ని ఫాలో అయ్యారు రాజా రావు గారు.
కింద రిసెప్షన్ లో ఈగలు ముసిరినట్టు ముసిరి ఉన్నారు పేషెంట్ల తాలూకు వాళ్లు. అచ్యుత రామయ్య గారు వాళ్ల మీదుగా ఎగబడి రిసెప్షన్ లోని లేడీ తో "మేడమ్ తొందరగా బిల్లింగ్ చేయండి..అర్జెంట్.."అన్నాడు.

"సార్, ఇక్కడున్న అందరికీ అర్జెంటే, కొద్దిగా ఓపిక పట్టండి"అంది మాటల్లో విసుగూ, ముఖంలో సౌమ్యత చూపిస్తూ. చేసేదేం లేక లైనులా ఉంటే అక్కడ నిల బడి పోయాడు. పక్కనే ఉన్న రాజా రావు గారు "డబ్బు కావాలంటే మొహమాట పడకుండా అడుగు, నేను కార్డ్ తెచ్చాను" అన్నాడు.

"అవసరమైతే అడుగుతాను, నా దగ్గరా కార్డ్ ఉంది"అన్నాడు నీరసంగా.

"అలా డల్ గా ఉండకు, అన్నీ సవ్యంగా జరుగుతాయి"అన్నాడు.

కొద్ది సేపటి తర్వాత కార్డ్ తో బిల్ పే చేశాడు. మొత్తం పది వేలయింది. ‘అన్ని చోట్లా బేరాలాడి రూపాయి, రూపాయి దాచుకుంటాం..చివరికి ఇలా.. ’అచ్యుత రామయ్య గారి మనసు కలుక్కుమంది.

తర్వాత మందులు తీసుకున్నారు, అక్కడో రెండు వేలయింది. వేగంగా ఐ సీ యు వైపు వెళ్లారు. అప్పుడే తలుపులు తీసుకుని బయటకొచ్చిన నర్స్ ఆయనిచ్చిన టెస్ట్ బిల్ రిసిప్ట్స్, మందులు తీసుకుని లోపలికి వెళ్లి పోయింది.

అందరూ బయట కూర్చున్నారు.

"నాన్నగారూ, అమ్మని కొన్నాళ్ల పాటు మా ఇంట్లో ఉంచండి. పాపం మా అత్త గారిని చూసుకునే దిక్కు లేదు" అంది.

"అలాగే నమ్మా, ఆడపిల్లవు..  నువ్వూ అలసి పోయుంటావు.. అమ్మతో పాటూ ఇంటికెళ్లి ఫ్రెష్ అవ్వు. ఇక్కడ నేనుండి చూసుకుంటాను. మళ్లీ రేప్పొద్దున్న నువ్వొద్దువు గాని" అన్నాడు ఆప్యాయంగా.

"కానీ..నాన్నా..నాకు వెళ్ల బుద్ధి.."అని మాట్లాడుతుండగానే "అవునమ్మా.. నాన్న గారు చెప్పింది సబబు"నువ్వూ వెళ్లు. మీ నాన్నకి నేను తోడుంటాలే"అన్నారు రాజారావు గారు.

కాత్యాయని తల్లిని తీసుకుని, రాజారావు గారి భార్యకి చెప్పి ఆటోలో ఇంటికెళ్లింది.

రాత్రి తొమ్మిదికి కాత్యాయని సెల్ మోగింది.

(ఎక్కణ్ణుంచి ఆ ఫోన్ కాల్? ఏం వినాల్సొస్తుంది?? ఏం జరగబోతోంది? కాత్యాయని పండంటి కాపురంలో ఏ విషాద ఘంటికలు మోగించబోతున్నాయి?? తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే.....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్