Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> ఐ.ఏ.ఎస్

I.A.S

దెబ్బతిన్న బెబ్బులి, తోక తొక్కిన త్రాచు ఇలాంటి ఉపమానాలకు సరి పోని విధంగా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నాడు సురేంద్ర ప్రసాద్. పాతిక సంవత్సరాల తన రాజకీయ ప్రస్థానంలో ఏనాడూ తగలని ఎదురు దెబ్బ ఈనాడు తగిలింది. అదీ పాతిక సంవత్సరాల ఆడ ఐ.ఏ.ఎస్ చేతిలో. ఆఫ్ ట్రాల్ ఒక ప్రభుత్వ ఉద్యోగి తను చెప్పిన చోట చెప్పినట్టు సంతకం చెయ్యకుండా అడ్డం తిరుగుతుందా. నా దొంగ వ్యాపారాలన్నీ బయట పెడతానంటుందా. ఎంత ధైర్యం? ఏమనుకుంటుంది నా గురించి తను.

చేతకాని వాడనుకుంటుందా. అంతు తేల్చాలి. తన పలుకుబడి ఉపయోగించి ఉద్యోగంలో నుంచి తీసేయించాలంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. వచ్చిన సంవత్సరం లోపే ప్రజలకు అంతగా చేరువయింది. పోనీ వదిలేద్దామంటే అదేమన్నా చిన్న చితకా ఆదాయము వచ్చే ప్రాజెక్ట్ కాదు, కోట్లు కుమ్మరిస్తుంది. ఆ ఫైల్ మీద సంతకం పెట్టమంటే ససేమిరా అంది. పైగా ఎన్ని నీతులు చెప్పింది. ఆ రోజు జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది సురేంద్రప్రసాద్ కు.

**********

"సార్ కలెక్టర్ గారు వచ్చారు మిమ్మల్ని కలవడానికి" అంటూ లోపలికి వచ్చాడు సాంబయ్య. పిలిపించగానే వచ్చిందే అని తనలోనే నవ్వుకుంటూ "రమ్మను" అంటూ గదిలోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు సురేంద్రప్రసాద్.

"నమస్తే సర్" అంటూ లోపలికి వచ్చింది కలెక్టర్ ప్రణయిని.

"రండి కలెక్టర్ గారూ. ఫర్వాలేదు. పిలిపించగానే వచ్చారే" వ్యంగ్యంగా అన్నాడు.

"ఎలాంటి వారైనా మా ప్రాంతానికి మీరు ప్రజా నాయకులు కదా. మీ గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత" అంటూ ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది.

ఒక్క క్షణం ఆమెను తదేకంగా చూశాడు. వయసు 30 సంవత్సరాల లోపే ఉంటుంది. చూపుల్లో తీక్షణత ఆమె నిజాయితీకి అద్దం పడుతోంది. మాటలో పదును ఆమె ఎవరికీ తలవంచే రకం కాదని ఇది వరకే అర్థం చేసుకున్నాడు. ఎంతటి వారైనా పొగిడితేనో, నేరుగా మాట్లాడితేనో కొంత మెత్తబడతారని తెలిసిన సురేంద్ర రాజీకి ఆమెను ఇంటికి ఆహ్వానించాడు.

"థాంక్యూ. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్."

"నో థాంక్స్. ఇంతకూ మీరు పిలిపించిన పని" మధ్య లోనే అతని మాట త్రుంచి విషయానికి రమ్మంది ప్రణయిని.

"చూడమ్మా అతి పిన్న వయసు లోనే గర్వించదగ్గ స్థితికి చేరుకున్నావు. చాలా సంతోషం. కాకపోతే ఇది కత్తి మీద సాము లాంటి ఉద్యోగం. మరీ ముక్కు సూటిగా పోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వుంటుంది. ప్రజలంతా మొదట వాళ్ళకు అనుకూలంగా వుంటే నీరాజనం పడతారు. కానీ నీ నిజాయితీ వలన ఎవరికైనా నష్టం జరిగితే వారు నీ నిజాయితీని పక్కన బెట్టి మీరేదో పక్క దోవ పట్టినట్టు వాళ్ళ స్వార్థం కొద్ది వాళ్ళు మాట్లాడతారు. అందుకని ప్రజల మీద మమకారం మాని లోకం పోకడ తెలుసుకుని ఎవరిదో ఒకరి అండ చూసుకుని తెలివిగా మసలు కుంటే మీకు ఉభయతారకంగా వుంటుంది. ఏమంటారు?" నీతి బోధ చేశాడు సురేంద్రప్రసాద్.

"సర్. నేనిక్కడికి ప్రవచనాలు వినడానికి రాలేదు. నన్ను ఇందు కోసమే పిలిచి వుంటే సారీ. నాకు వినే తీరిక, ఓపిక రెండూ లేవు. నేను చేయవలసిన పనులు చాలా వున్నాయి." అని లేవ బోయింది.

"తొందర పడకండి ఏదో వయసులో పెద్దను కదా నాలుగు మంచి మాటలు చెబితే బాగుంటుందనుకున్నాను. వద్దన్నారు. ఓకే. అసలు విషయానికి వస్తాను. ఊరి చివర వున్న వంద ఎకరాల పోరంబోకు పొలాన్ని కొత్త ఫ్యాక్టరీ కట్టే వారి పేరుకు బదలాయించి తహసిల్దారు ఫైలు పంపితే కుదరదని వెనుకకు పంపారట. కారణం తెలుసుకోవచ్చా" మాట తీరు మారింది సురేంద్రలో.

"అక్కడ చాలా సంవత్సరాల నుంచి కూటికి కూడ సరిగా జరగని పేద వారు చిన్న చిన్న గుడిసెలు గుడ్డల తోటో, రేకుల తోటో, తాటాకుల తోటో వేసుకుని నివాసముంటున్నారు. అదీ గాక దాని ప్రక్కనే కాలువ పారుతుంది. అది వాళ్ళకు ఎంతో ఆధారంగా వుంది. కావాలంటే దాన్ని అక్కడి వారికే ప్రభుత్వం ఇచ్చినట్టు ఉచితంగా పట్టాలివ్వమంటే ఫైలు పంపమనండి. సంతకం చేసి పంపుతాను" నిక్కచ్చిగా చెప్పింది ప్రణయిని.

ఏ మాత్రం బెదరకుండా ఆమె మాట్లాడిన తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది అతనికి. కొంపదీసి వెనుక రాజకీయ బలమేమన్నా వుందా అనిపించింది.

"చూడండి కలెక్టర్ గారు. అక్కడ నీటి వసతి వుంది గనుకే వాళ్ళు ఆ ప్రదేశం కావాలని అడుగుతున్నారు. మనం ఇవ్వక తప్పదు లేకుంటే వాళ్ళు వెళ్ళి పోతామంటున్నారు. కర్మాగారం పెడితే చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆలోచించండి అది కూడ ఊరికి మేలే కదా" ఒక బాణం వేశాడు.

"అయితే ఊరికి దక్షిణం వైపు 125 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఇస్తామని చెప్పండి. అక్కడ కావలసినన్ని బోర్లు వేసుకుని కర్మాగారం కట్టి ఉద్యోగాలు కల్పించమనండి. అంతే గాని నేనుగా మీరు చెప్పిన భూమిని ఎవరికీ కట్టబెట్టను. ఇదే విషయం కోసమైతే వెళ్ళొస్తాను" లేచింది.
"ఏం చూసుకుని మీకీ అహంకారం. ఏదైనా పొలిటికల్ సపోర్ట్ ఉందా, ఉన్నా సరే మీరా ఫైల్ మీద సంతకం చేయక పోతే విషయం చాలా దూరం వెళ్తుంది కలెక్టర్ గారు. ఆలోచించండి" చివ్వున లేచి గర్జించాడు.

"నేను ఐ.ఏ.ఎస్  ఆఫీసర్ ని, మీ కంటే ఎక్కువ బాధ్యత వున్న దాన్ని. ఇవాళ వచ్చి రేపు పోయే వారు మీరు. సుమారు ముఫ్ఫై సంవత్సరాలు ప్రజాసేవ చేయవలసిన ప్రభుత్వోద్యుగులం మేము. మాకు మీకంటే ప్రజలే ముఖ్యం. మీ స్వార్ధానికి వాళ్ళ జీవితాలను బలి చేయలేను. నాకున్న బలం నా నీతి, నిజాయితీ, ఆత్మవిశ్వాసం. మీరేం చేసుకుంటారో మీ ఇష్టం" అని మరో మాట కోసం చూడకుండా వెళ్తున్న ప్రణయినిని బిత్తరపోయి చూస్తుండి పోయాడు సురేంద్రప్రసాద్.

*******

ఆనందపు అంచులలో విహరిస్తున్నాడు సురేంద్రప్రసాద్. కొత్తగా వస్తున్న కలెక్టర్ పెద్దవాడు, అనుభవమున్న వాడు. ఏవో ఒక ఇబ్బందులు లేకుండా వుండవు. ఏవో నాలుగు రాళ్ళు పారేస్తే కుక్క పిల్లలా తోక ఊపుకుంటూ తిరుగుతూ చెప్పిన పనల్లా చేస్తాడు. ఇక అడ్డు లేదు లక్షలు పారేసి కోట్లు కొల్ల గొట్టొచ్చు.

ఆ ఆడ ఐ.ఏ.ఎస్. ను పంపడానికి ఎంత మేర దిగజారాడో అతనికే తెలుసు. సాధించాడు పీడ విరగడయిందని మనసు తేలిక పడ్డాడు.
" సర్. మీ కోసం కొత్త కలెక్టర్ గారొచ్చారు. పంపమంటారా" వచ్చి చెప్పాడు సాంబయ్య.

"పంపు" అన్నాడు.

"నమస్తే సర్" అంటూ లోపలికి వచ్చాడు సుమారు యాభై సంవత్సరాల వ్యక్తి. మనిషి చాలా హుందాగా ఉన్నాడు. నవ్వు ముఖం. ఏదో అందం వుంది అతనిలో.

"కూర్చోండి " అని కుర్చీ చూపించాడు సురేంద్ర.

"పెండింగ్ ఫైల్స్ ఉండడం వలన వెంటనే మిమ్మల్ని కలవడం కుదరలేదు" సంజాయిషీ ఇచ్చుకున్నాడు కలెక్టర్.

"భలే వారే మనలో మనకిలాంటివి వద్దు. మనం మనం ఒకటి. ఒకరికొకరం సహాయ పడుతుండాలి. ఇచ్చి పుచ్చుకోవాలి. ఏమంటారు"
చిరునవ్వు నవ్వాడు కలెక్టర్.

"అన్ని ఫైల్స్ చూశారా" మరల అడిగాడు సురేంద్ర.

"చూశాను. ఇంతకు ముందు కలెక్టర్ గారు చాలా సిన్సియర్ లా ఉన్నారు. పబ్లిక్ లోను, స్టాఫ్ లోను మంచి పేరున్నట్టుంది. ఆమెను మీరే బలవంతంగా బదిలీ చేయించారని పుకారు. మరి నిజమెంతో మరి" అతని మాటలు సూటిగా వున్నాయి.

"నిజమే. తనకు నాకు పోరంబోకు పొలం విషయంలో తేడా వచ్చింది. నా సత్తా చూపించాను. పనికి మాలిన పోస్ట్ ఇప్పించాను" సురేంద్ర కళ్ళల్లో కసి కనిపించింది.

"ఆమె చేసిన దానిలో తప్పేముంది. అందులో న్యాయం ఉంది. నేనే కాదు అంతా అదే అంటున్నారు. మీ చెప్పు చేతల్లో ఉండక పోతే ఎవరికైనా ఇలాంటి గతేనని మీ తొత్తులతో చెప్పారట" కలెక్టర్ గొంతులో కాఠిన్యం.

ఉలిక్కిపడ్డాడు సురేంద్ర.

"త్వరగానే అర్ధం చేసుకున్నారు. మరి కర్తవ్యం బోధపడింది కదా. పని త్వరగా ముగించండి. మీ కమీషన్ పది శాతం" బిస్కట్ వేశాడు
"కుదరదు"

"కమీషనా"

"కాదు. ఫైల్ మీద సంతకం పెట్టడం"

చివ్వున తలెత్తి చూశాడు సురేంద్ర. కలెక్టర్ ముఖం లో సీరియస్.

"చూడండి. ఇచ్చింది చాలదనుకుంటే పెంచుకుందాం. అంతేగాని..."

"చూడండి మీ దృష్టిలో కలెక్టరంటే మీ బంట్రోతు కాదు. ప్రజల కోసం ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికారి. ఏ రోజు ఉంటారో, ఊడతారో తెలియని బ్రతుకులు మీవి. మీరు మమ్మల్ని శాసిస్తారా. దేశాన్ని దోచుకోను మీరంతా ఒక త్రాటిపై నడిస్తే, ఆ దేశాన్ని రక్షంచడం కోసం మేమంతా ఒక త్రాటి పైకి వచ్చాం. ఇంత కాలం వాన పాములకు భయపడ్డ త్రాచు పాములం మేము. పడగ విప్పాం. ఎంత మందిని ఎంత కాలం ఎన్ని చోట్లకు మారుస్తారో చూస్తాం. ఐ.ఏ.ఎస్ , ఐ.పి.ఎస్  లంటే మీ చెంచాగాళ్ళు కాదు. మైండ్ ఇట్." ఆవేశంతో గర్జించాడు కలెక్టర్.
"ఏంది కలెక్టరో నోరు లేస్తోంది" వ్యంగ్యంగా నవ్వుతున్నాడు సురేంద్రప్రసాద్.

"సారీ సర్. అతను కలెక్టర్ కాదు. సి.ఐ.డి. ఆఫీసర్. బదిలీ విషయం తెలియగానే మా అసోసియేషన్ వాళ్ళకు అనుమానమొచ్చింది. తీరా ఆరా తీస్తే చాలా విషయాలు బయటపడ్డాయి. రహస్యంగా విచారణ జరిపిస్తే మీరు చేసిన అనేక అవినీతి పనులు బయటపడ్డాయి. ప్రభుత్వోద్యోగులు నిజాయితీగా పని చేస్తే మీ ఆటలు సాగవని తెలుసుకోండి. మీ మీద విచారణ కొనసాగుతుంది. మీలాంటి వారందరినీ ఏరి పారేసేంత వరకు మా ఉద్యమం ఆగదు. ఐ.ఏ.ఎస్  లే కాదు ప్రతి ఉద్యోగి ప్రజాసేవకుడే గాని, నాయకుడి సేవకుడు కాదని తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుంది" అంటూ లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి నోరు వెళ్ళబెట్టాడు సురేంద్రప్రసాద్.

ఆమె ప్రణయిని. 

మరిన్ని కథలు
intlo ramayanam