Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
I.A.S

ఈ సంచికలో >> కథలు >> ఇంట్లో రామాయణం

intlo ramayanam

“రేయ్ రాజు మనసేం బాలేదురా.. సాయంత్రం కలుద్దాం. ఏడింటికల్లా ఊర్వశి బార్ కు వచ్చెయ్..” ఫోన్లో మాట్లాడుతూ చెప్పాడు శంకరం.
“అలాగే రా. ఏం కంగారుపడకు.. నాకూ పెద్ద పనేమీ లేదు సాయంత్రం. నేనే ఫోన్ చేద్దామనుకున్నాను.” జవాబిచ్చాడు రాజు. ఫోను పెట్టేసి కాసేపు ఆలోచించాడు శంకరం గురించి. కాస్త బాధగా అనిపించింది. ఏ విషయం మీద శంకరం మాట్లాడబోతున్నాడో చిన్ననాటి స్నేహితుడైన రాజుకు తేలిగ్గా అర్ధమైంది. ఇదేమీ మొదటిసారి కాదు శంకరం ఇలా మాట్లాడటం. సతమతమవుతున్నాడు పాపం గత కొన్నిరోజులుగా ఎటూ తేల్చుకోలేక. తను మటుకు ఏం చేయగలడు మాట సాయం తప్ప? ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చి, ఆఫీసు పనిలో మునిగిపోయాడు రాజు.
శంకరం ఓ మధ్య తరగతి ఉద్యోగి. ఆర్ధిక ఇబ్బందులు ఏ మాత్రం అలవాటు చేసుకోలేకపోతున్నాడు.

బ్యాంకు లోను ఇ.ఎం.ఐ, ఇతర బాకీలు కట్టాక మిగిలే జీతం ఇంటి ఖర్చులకు కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు అర్జెంటుగా వివేక్ కాలేజీ ఫీజు కట్టాలి. యాభై వేలు. తెలిసిన వాళ్ళని, భార్య వైపు బంధువులను కానీ అడుగుదామంటే, వారి పరిస్థితి తన కంటే ఘోరం. మళ్ళీ భారీ వడ్డీతో నడ్డి విరిచే బయటి అప్పే దిక్కు. ఏం చదువు చెబుతారో ఇంత డబ్బు తీసుకొని కసిగా, దిగిలుగా అనుకున్నాడు. అయితే ప్రస్తుతం శంకరం మనసు పాడుచేసిన కారణం ఇది కాదు. ఆ రోజు ఉదయం జరిగిన సంఘటన. సాయంత్రం రాజును కలిసినప్పుడు చెబుదామనుకున్నాడు.
ఆఫీసు అయిందనిపించి ఆరింటికల్లా ఇంటికి చేరుకున్నాడు శంకరం. భార్య లత కాఫీ చేసి ఇచ్చింది. వేడి కాఫీ తాగాక అప్పటి దాకా ఉన్న తలనొప్పి కాస్త తగ్గినట్టనిపించింది.

“వివేక్ ఎక్కడ?” అడిగాడు.

“మామయ్య గారితో కేరంబోర్డు ఆడుతున్నాడు. అరగంటైంది వెళ్ళి”

ఒక్కడే సంతానం వివేక్. బాగా చదువుతాడు, బుద్ధిమంతుడు. మంచి మార్కులతో టెన్త్ పాసై ఇంటర్మీడియట్లో కామర్స్ గ్రూప్ తీసుకున్నాడు సిఏ చేద్దామని.

“నాన్నతో మాట్లాడి వస్తాను” చెప్పి తండ్రి ఉండే వాటా వైపుకు వెళ్ళాడు శంకరం.

శంకరం ఉండే తాతల కాలం నాటి ఇల్లు రెండు పోర్షన్లుగా కట్టబడి ఉంది మధ్యలో ఓ కనెక్టింగ్ తలుపుతో. ఓ బెడ్ రూమ్, కిచెను, హాలు ఉన్నాయి చెరో పక్క.  ప్రతీ పోర్షనుకు వేరు వేరుగా బయటకు దారుంది. ఓ వైపు తండ్రి మాధవరావు ఉంటాడు. డెబ్భై ఐదు దాటినా ఆరోగ్యం చక్కగా చూసుకుంటున్నాడు. వివేక్ లాగే, శంకరం కూడా ఒక్కడే కొడుకు మాధవరావుకు. శంకరం తల్లి చనిపోయి రెండేళ్ళయింది.
మనవడితో ఎక్కువ సమయం గడుపుతుంటాడు మాధవరావు ఇంట్లో ఉన్నంతసేపూ. వివేక్ కూడా తాతయ్యతో చనువుగా ఉంటాడు. చదువుకోవటానికి కూడా అక్కడికే వెళుతుంటాడు టీవీ చప్పుడు లేకుండా ప్రశాంతంగా ఉంటుందని.

టీవీ చూడటానికీ, భోజనానికీ కొడుకు ఉండే వాటాలోకి వస్తూంటాడు మాధవరావు. లతక్కూడా మమయ్యగారంటే ఎంతో అభిమానం, గౌరవం.

“తాతయ్య నువ్వు మళ్ళీ ఓడిపోయావు..” చిరునవ్వుతో చెప్పాడు వివేక్ కేరంబోర్డు కాయిన్స్ సర్ది డబ్బాలో వేస్తూ.

“సర్లేరా.. నీతో గెలవటం చాలా కష్టం.. వెళ్ళి పుస్తకాలు తెచ్చుకొని చదువుకో. వచ్చేవారం పరీక్షలన్నావుగా” చెప్పాడు మాధవరావు.

“రేయ్ వివేక్. ఏం పరీక్షలురా ఇప్పడు?” అప్పుడే అక్కడకు వచ్చిన శంకరం అడిగాడు కుర్చీలో కూర్చుంటూ.

“క్వార్టర్లీ ఎగ్జామ్స్ నాన్న. ఈసారి సంస్కృతం పరీక్షలో తొంభై ఐదు మార్కులు దాటినవారికి మా టీచరు మంచి గిఫ్ట్ ఏదో ఇస్తానన్నారు..”
“బాగా చదువైతే. నాక్కూడా సంస్కృతంలో బాగా మార్కులు వచ్చేవి చిన్నప్పుడు.. ఓసారైతే తొంభై ఎనిమిది వచ్చినయ్..” గర్వంగా చెప్పాడు శంకరం గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ.

తండ్రితో కాసేపు ఆఫీసు విషయాలు, బంధువుల గురించీ మాట్లాడాడు శంకరం. ఆ తరువాత అసలు సబ్జెక్టులోకి వచ్చాడు వివేక్ అక్కడ లేని టైం చూసుకొని.

“నాన్న, నేను చెప్పినదాని గురించి ఏదైనా ఆలోచించావా? నీకు నిజంగా ఇది ఓకేనా? నాకేమీ అర్ధంకావట్లేదు..నువ్వు వొద్దు అంటే వొద్దు. ఈ వయసులో నిన్ను ఇబ్బంది పెట్టే ఆలోచన నాకు లేదసలు” మొహమాటపడుతూ చెప్పాడు శంకరం.

“ఆలోచించటానికి ఏం లేదురా. నీకు కరెక్ట్ అనిపించింది చేద్దాం. నాకూ మీ అమ్మ పోయిన తరువాత చాలా ఒంటరిగా అనిపిస్తుంది.. ఎక్కడికైనా వెళ్ళి మన:శాంతిగా ఉండాలనుంది”

“సర్లే నాన్న. ఒకటి రెండు చోట్ల కనుక్కొని అప్పుడు డిసైడ్ చేద్దాంలే..” చెప్పి అక్కడనుంచి వచ్చేసాడు శంకరం.

“ఎక్కడికండి ఇప్పుడు?” బయటకు వెళుతున్న భర్తను అడిగింది లత.

“రాజు వస్తానన్నాడు కలవటానికి.. రాత్రి కొంచెం లేటుగా వస్తాను..”

“ఎక్కువగా తాక్కండి..ఓంట్లో బాగుండట్లేదు మీకసలే ఈ మధ్య.. ఈ రాజుకు కూడా తాగటం తప్ప రెండో పనిలేదు..” కాస్త చిరాకుగా చెప్పింది లత.

“సర్లే.. నోర్మూసుకొని తలుపు సరిగ్గా వేసుకో..” అంతే చిరాగ్గా జవాబిచ్చాడు శంకరం బయటకు వెళ్తూ.

తన ఆర్ధిక పరిస్థితి కాస్త మెరుగవ్వాలంటే, తండ్రిని ఏదైనా వృద్ధాశ్రమంలో చేరుద్దామన్న ఆలోచన కొత్తగా వచ్చింది శంకరానికి అలా చేసిన ఎవరినో చూసాక. తండ్రి ఉంటున్న పోర్షను అద్దెకు ఇస్తే కనీసం పాతికవేలు వస్తాయి నెలకి. ఆర్ధిక ఇబ్బందులు చాలా మటుకు తొలగిపోతాయి. తండ్రికి కూడా రోజంతా కాలక్షేపానికి తన ఈడు వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇదే విషయం మీద గత కొన్ని రోజులుగా మదనపడుతున్నాడు. ఓ పక్క తన పరిస్థితి బాగుపడాలంటే ఇది తప్ప వేరే దారిలేదనిపిస్తుంది. ఇంకో పక్క, తండ్రిని అలా ఏ దిక్కూలేనివాడిలా ఆశ్రమంలో చేర్చాలంటే మనస్సు పూర్తిగా ఒప్పుకోవటంలేదు. పోనీ తండ్రిని కూడా తను ఉండే వాటాలో ఉండమని, పక్క వాటా అద్దెకు ఇద్దామంటే, ఇల్లేమో చాలా చిన్నది. ఇరుకైపోయి, ఉన్న కొద్ది మనఃశాంతి కూడా లేకుండా పోతుంది. ఆయనకూ ఇబ్బందే.
తనకొచ్చిన ఆలోచన మొదట లతకి చెప్పాడు. నిర్ఘాంతపోయింది. తండ్రి అంటే లతకు ఎంతో అభిమానం. సొంత తండ్రిలా చూసుకుంటుంది. “ఇది చాలా తప్పండి. మీకు ఎన్ని ఇబ్బందులన్నా ఉండొచ్చు. కన్నతండ్రిని ఇలా అనాధలా ఎక్కడో చేర్చడం కరెక్ట్ కాదు..చుట్టాలు మన గురించి ఏమనుకుంటారు? మమయ్యగారు ఎంత బాధపడతారు? ఈ ఆలోచన కట్టిపెట్టండి” చెప్పింది ఏ మాత్రం ఆలోచించకుండా.

“అవన్నీ నాకు తెలుసులే. ఇలాంటి టీవీ సీరియల్ నీతులు చెప్పడం చాలా తేలిక. ప్రతీ చిన్న ఖర్చుకి అప్పు చేయటం తప్ప వేరే దారి లేకుండా పోయింది. నాన్నకు కూడా ఏం తోస్తుంది ఇక్కడ? అక్కడైతే తన వయస్సు వాళ్ళు ఉంటారు హాయిగా కబుర్లు చెప్పుకోడానికి. పైగా ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు మనల్ని చూడటానికి రావొచ్చు.. ఇక చుట్టాలంటావా, వాళ్ళ గురించి ఎంత తక్కువ అనుకుంటే అంత మంచింది. పనికిమాలిన వాళ్ళు అంతా. అవసరానికి కాస్త డబ్బు సాయం చేయమంటే ఒక్క వెధవా ముందుకు రాడు. వాళ్ళతో మనకేంటి? నాన్న సంగతి నాకు బాగా తెలుసు. అలాగే నేను పడే ఇబ్బందులు కూడా ఆయనకు తెలుసు. ఏమీ అనుకోర్లే. వివేక్ దగ్గర అప్పుడే ఏం మాట్లాడకు..” కాస్త చిరాకుగా జవాబిచ్చాడు.

లత భర్త వైపు ఓసారి కోపంగా (జాలిగా?) చూసి అక్కడనుంచి వెళ్ళిపోయింది.తండ్రికి తన ఆలోచన చెప్పటానికి సంకోచించాడు శంకరం. ఇబ్బందిపడుతూ మొత్తానికి చెప్పాడు. అయతే తను ఊహించినట్టుగానే, చాలా పాజిటివ్ గా స్పందించాడు మాధవరావు.
“నాకేం పర్లేదురా. నా గురించి పెద్దగా ఆలోచించవాకు. వివేక్కి ఈ విషయం తెలీయనీకు. నేనే అప్పుడప్పుడూ వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తుంటాను..”
“ఇంకా పూర్తిగా డిసైడ్ అవలేదు నాన్న. చూద్దాంలే..” టాపిక్ ముగిస్తూ అన్నాడు శంకరం. తండ్రి ఒప్పుకోవటం పెద్దగా సంతోషాన్ని ఇవ్వలేదు.
ఆ రోజు నుంచీ శంకరానికి ఇదే సమస్య. చూస్తూ చూస్తూ తండ్రిని వృద్ధాశ్రమానికి పంపాలంటే ఏదోలా ఉంది. స్నేహితుడు రాజును సలహా అడిగాడు. రాజుకు స్నేహితుడి పరిస్థితి బాగా తెలుసు. “బాగా ఆలోచించరా. తొందరపడి నిర్ణయం తీసుకోవాకు..” అన్నాడు ఇంకేం చెప్పాలో తెలీక.
ఇదంతా జరిగి రెండు వారాలైంది. ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు శంకరం.

ఊర్వశి బార్లో స్నేహితులిద్దరూ ఓ మూల కాస్త ప్రైవసీ చూసుకొని కూర్చున్నారు. ఎప్పడూ తాగే బీరు, స్నాక్స్ ఇద్దరికీ ఆర్డర్ ఇచ్చాక ఆ రోజు ఉదయం జరిగిన సంఘటన గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు శంకరం. 

“ఇవాళ ఉదయం ఆఫీసుకు వెళ్ళే ముందు నాన్నను కలుద్దామని వెళ్ళాన్రా. నాన్న గదిలో తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుతున్నాడు. నేను రావటం గమనించలేదు. చీవాట్లు పెడుతున్నాడు స్నేహితుడ్ని.. మాటల మధ్యలో నా పేరు రావటంతో అక్కడే ఉండి వింటున్నాను..నాన్న మాట్లాడుతుంది వృద్ధాశ్రమం గురించే..”

“..వాడికి ఎంతో ఇబ్బందిగా ఉండి వేరే దారిలేక ఈ నిర్ణయం తీసుకున్నాడు.. అలా వాడ్ని తక్కువ చేసి మాట్లాడకు.. నేనంటే ఎంతో ఇష్టం
వాడికి..” చెబుతున్నాడు నాన్న ఫోన్లో కాస్త గట్టిగానే.

“నాన్న ఫోనులో మాట్లాడింది విని అక్కడ ఉండలేక నాన్నను కలవకుండా వచ్చేసానురా. నా గురించి ఎవరో తప్పుగా మాట్లాడటం కూడా భరించలేకపోయాడు నాన్న. నేను చేస్తుంది ఎందుకో తప్పనిపిస్తుంది...ఏమంటావు?” అడిగాడు రాజుని. వెయిటర్ వచ్చి బీరు, ఉడకబెట్టిన పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు టేబుల్ మీద సర్ది వెళ్ళాడు. తాగటం మొదలుపెట్టారు ఇద్దరూ.

“తప్పు అంటే తప్పేరా.. మీ నాన్న సంగతి నాకు బాగా తెలుసు. మనసులో ఎంత బాధ ఉన్నా బయటకు ఏ మాత్రం తెలీనివ్వరు..”
“అలా అని ఈ ఆలోచన పక్కన పెట్టాలంటే, డబ్బు సమస్య నుంచి ఎలా బయట పడాలో దిక్కులేదు..నెల నెలా వడ్డీలు కట్టాలంటే చావొస్తుంది” చెప్పాడు శంకరం.

“అవునూ వివేక్ గాడికి ఏం చెబుతావ్? వాడికి అసలే మీ నాన్నంటే యమ ఇష్టం..”

“అవున్రా.. వాడికి ఏం చెప్పాలో తెలీదు..లత కూడా నన్నో విలన్లా చూస్తుంది బయటకు ఏమీ అనకపోయినా.. అసలు ఈ డబ్బును ఎవడు కనిపెట్టాడో కానీ ఉతికి ఆరెయ్యాలి కనిపిస్తే.. మనలాంటి మిడిల్ క్లాసు వాళ్ళకి తండ్రిని దగ్గరుంచుకోవటం కూడా ఓ పెద్ద విషయమైపోయింది.. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టంరా.. ఏం చేయాలో అర్ధం కావటంలేదు.. ఆయన ఒప్పుకోకపోయినా బావుండేది.. ఆలోచన అక్కడితో ముగిసిపోయేది.. ”

ఏమీ మాట్లాడలేదు రాజు. మాట్లాడటానికి ఏమీ లేదు. సమస్య చిన్నది కాదు. తండ్రి ముఖ్యమా, ఆర్ధిక సమస్యలనుంచి బయటపడటం ముఖ్యమా అన్నది తేల్చుకోవాల్సింది శంకరమే.

“రేయ్ రాజు.. వివేక్ గాడు పెద్దయ్యాక నన్ను కూడా ఇలాగే ఓల్డ్ ఏజ్ హోముకు పంపుతాడంటావా?” నవ్వుతూ అడిగాడు శంకరం. బయటకు నవ్వుతున్నాడు కానీ మనసులో చెప్పలేనంత బాధ. తాగిన మత్తు కొద్ది కొద్దిగా ఎక్కడంతో మనసులో ఉన్నవన్నీ బయటకు వస్తున్నాయి.

“వివేక్ మంచివాడు రా.. అలా ఎందుకు చేస్తాడు..” జవాబిచ్చాక నాలిక్కరుచుకున్నాడు రాజు తను చెప్పింది ఇంకో రకంగా ధ్వనించడంతో. లక్కీగా రాజు అన్నది సరిగ్గా వినలేదు శంకరం.

“ఏంట్రా ఏమన్నావ్? సరిగ్గా చెప్పు..”

జవాబివ్వలేదు రాజు తను అన్నది శంకరం వినలేదని మనసులో “హమ్మయ్య..” అనుకుంటూ.

కాసేపు బార్లో స్నేహితుడితో గడిపి, మనసులో ఉన్న బరువు తాత్కాలికంగా దించుకొని పదింటికల్లా ఇంటికి చేరుకున్నాడు శంకరం. భోంచేసి త్వరగా పడుకున్నాడు.

మరుసటి రోజు ఆఫీసులో బయటకు వెళ్ళటానికి పర్మిషన్ తీసుకొని దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమాలకు వెళ్ళి చూసొచ్చాడు. పెద్ద గొప్పగా ఏమీ లేవు. అక్కడ ఉన్న ముసలి వాళ్ళను చూస్తే బాధగా అనిపించింది. అంతా కలిసి ఓ మూలనున్న పోర్టబుల్ టీవీలో ఏదో సినిమా చూస్తున్నారు. ఎప్పుడు ఈ లోకం వదిలి వెళ్ళిపోదామా అని వారంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నట్టు అనిపించింది. తండ్రిని అక్కడ ఊహించుకోటానికి కూడా ధైర్యం చాలలేదు. కాస్త దూరంలో ఇంకో మంచి ఆశ్రమం ఉందని ఎవరో చెప్పారు. ఈసారి ఆదివారం అక్కడకు వెళ్ళి చూడాలనుకున్నాడు.

“నాన్నా, తాతయ్య ఏదో ఊరు వెళ్ళాలట పని మీద.. ఇప్పుడప్పుడే రారట.. తాతయ్య చెప్పారు.. నిజమేనా?” వివేక్ అడిగాడు తండ్రిని ఆఫీసు నుంచి ఇంటికి రాగానే.

“అవున్రా..నిజమే.. తరువాత మాట్లాడదాం.. వెళ్ళి చదువుకో.. తలనొప్పిగా ఉంది. టివీ ఆపేసి వెళ్ళు..” జవాబిచ్చాడు శంకరం వివేక్ మరింకేం ప్రశ్నలడక్కుండా. అక్కడే ఉన్న లత వైపు చూడాలంటే చాలా గిల్టీగా అనిపించింది.

వివేక్ పుస్తకాలు తీసుకొని తాతయ్య దగ్గరకు వెళ్ళాడు. వాడికి తాతయ్య లేకపోతే ఎలా అన్న దిగులు మొదలైంది.

శంకరానికి ఏమీ తోచట్లేదు. తండ్రికి వివేక్ అంటే ప్రాణం. వారిద్దరినీ వేరు చేయటం ఎంత వరకూ కరెక్టు? మంచి సలహా ఏదైనా ఇస్తాడంటే ఆ రాజుగాడేమో తనేది చెబితే అదే అంటున్నాడు వెధవ. మనసు బాలేక ఇంట్లోంచి బయటకు వెళ్ళి దగ్గరలో ఉన్న పార్కులో  కాసేపు కూర్చొని  వచ్చాడు.   

ఇంటికి తిరిగివచ్చేసరికి ఎనిమిదైంది. వివేక్ తాతయ్య ఉండే పోర్షన్లో కూర్చొని చదువుకుంటున్నాడు. లత ఏదో పనిలో ఉంది వంటింట్లో.
బట్టలు మార్చుకొని టీవి ముందు కూర్చున్నాడు శంకరం. అన్నీ చెత్త ప్రోగ్రాంలే. చెప్పినవే మళ్ళీ మళ్ళీ చెప్పే న్యూస్ చానల్స్.  ప్రతీ అడుక్కుతినే వార్తా బ్రేకింగ్ న్యూసే. చిరాగ్గా టీవి కట్టేసాడు.

ఏం చేద్దాం తండ్రి విషయంలో? ఇదే ఆలోచన..

ఇల్లంతా నిశబ్దంగా ఉంది. ఎందుకో తెలీదు కానీ ఏదో జరగబోతున్నట్టుగా అనిపించింది శంకరానికి. కాస్త అలజడిగా ఉంది. రెండిళ్ళ మధ్యలో తలుపు తెరిచి ఉండడంతో వివేక్ గట్టిగా బట్టీ పట్టి చదువుతుంది స్పష్టంగా వినిపిస్తుంది..

“...నాహం తథాను శోచామి జీవితక్షయమాత్మనః...”

“...నాహం తథాను శోచామి జీవితక్షయమాత్మనః...” సంస్కృత శ్లోకం చదువుతున్నాడు వివేక్..

ఎక్కడో ఏదో గుర్తుకువచ్చినట్టైంది శంకరానికి.. మబ్బులు విడిపోతున్నట్టుగా... తీక్షణమైన సూర్యకిరణాలు గుచ్చుకొని, దారికప్పేసి బాధిస్తున్న పొగమంచు లాంటి నెగెటివ్ ఆలోచనలు ఎక్కడివక్కడ చెల్లాచెదరైనట్టుగా.. సమస్యలు దూదిపింజెల్లా తేలిపోయినట్టుగా...

“...నాహం తథాను శోచామి జీవితక్షయమాత్మనః...”

శ్లోకంలోని రెండవ లైను తను పూర్తి చేసాడు శంకరం అప్రయత్నంగా.

“....మాతరం పితరం చోభావనుశోచామి మద్వధే..”

వాల్మీకీ రామాయణం అయోధ్యకాండలోనిది ఈ శ్లోకం. చిన్నప్పుడు సంస్కృతం మాస్టారు బట్టీ పట్టించి చదివించింది. ఇన్నేళ్ళైనా గుర్తుంది.

“శ్రీరాముడి తండ్రైన దశరధుడు యువకుడిగా ఉన్నప్పుడు రాత్రి వేళ అడవికి వేటకు వెళ్ళి, సరోవరం దగ్గర ఓ ఏనుగు నీళ్ళు తాగుతుందని భ్రమపడి నీటికోసం అక్కడకు వచ్చిన ఓ ముని కుమారుడ్ని బాణంతో కొట్టాడు. దెబ్బతిన్న ముని కుమారుడి పేరు శ్రవణుడు. అంధులైన తన ముసలి తల్లిదండ్రులు తీర్ధయాత్రలు చేయాలని కోరగా, రవాణా ఖర్చులు భరించే ఆర్ధిక శక్తి లేని శ్రవణుడు, తల్లిదండ్రుల కోరిక తీర్చాలనే పట్టుదలతో వారిద్దరినీ ఓ కావడిలో కూర్చోబెట్టి, ఆ కావడిని తన భుజాలతో మోస్తూ కాలినడకన తీర్ధయాత్రలకు తీసుకువెళ్ళాడు. వారి దాహాన్ని తీర్చడానికి నీటికోసం సరోవరానికి వచ్చి దశరధుడి చేతిలో చనిపోయాడు. తల్లిదండ్రుల పట్ల పిల్లలకుండాల్సిన శ్రద్ధాభక్తులు ఈ కధ ద్వారా మనకు తెలుస్తాయి. దశరధుడు కొట్టిన బాణం గుచ్చుకొని బాధపడుతూ శ్రవణుడు దశరధుడితో అన్న మాటలు ఇవి..
నాహం తథాను శోచామి జీవితక్షయమాత్మనః

మాతరం పితరం చోభావనుశోచామి మద్వధే..   
దీనికర్థం.. నేను చనిపోతున్నందుకు నాకు విచారము లేదు. నా తల్లిదండ్రుల గురించే నాకు బాధ..” చిన్నప్పుడు సంస్కృతం మాస్టారు ఆకట్టుకునేలా చెప్పిన పాఠం గుర్తుకు వచ్చింది.

ఆలోచనలో మునిగిపోయాడు శంకరం. మనకున్న పురాణాలు ఎంత గొప్పవి. ఎలాంటి కష్టాలు ఎదురైనా నీతిని, ధర్మాన్ని వదలకూడదని ఎన్ని రకాలుగా వాటిలో చెప్పబడింది. శ్రవణుడు తల్లిదండ్రుల పోషణ తప్ప వేరే పని లేదనుకొని చివరిదాకా వారిని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. చనిపోయేటప్పుడు కూడా వారి గురించే దిగులుపడ్డాడు. బళ్ళో మనకు పాఠాలు నేర్పేదెందుకు? నిజజీవితంలో ఆచరించడానికి కదూ. పైగా తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్నానని గర్వం ఒకటి. మరి ఇప్పుడు తను చేస్తున్నదేంటి? కాస్త ఇబ్బందులెదురవగానే బాధ్యతలు మరచి తండ్రిని అనాధలా ఆశ్రమంలో ఉంచటానికి సిద్ధపడ్డాడు. ఎంత క్రూరమైన ఆలోచన ఇది. తండ్రితో తను గడిపిన మధుర క్షణాలు గుర్తుకు వచ్చి కళ్ళు తడి అయినయ్. ఎంత చక్కగా చూసుకున్నాడు నాన్న తనని చిన్నప్పడు. తననే కాదు, నాన్న తండ్రిని అంటే తాతయ్యను కూడా ఎంత శ్రద్ధగా చూసుకున్నాడు బతికినన్నాళ్ళూ. అలాంటి గొప్ప మనిషికి కొడుకుగా పుట్టి ఎంత నీచంగా ఆలోచించాడు తను? ఆర్ధిక సమస్యలనుంచి బయటపడటమా లేక తండ్రి సంతోషమా అంటే ముమ్మాటికీ తండ్రి సంతోషమే తనకు ముఖ్యం. తల్లిదండ్రుల బాగోగులు ఏ మాత్రం పట్టించుకోకుండా గాలికి వదిలేసే దుర్మార్గపు కొడుకుల జాబితాలో తను చేరే ప్రశ్నే లేదు.  గత రెండు వారాలుగా తనను బాధిస్తున్న సమస్యకు ఎంత సులువుగా పరిష్కారం దొరికింది.

డబ్బు సమస్య లేనిది ఎవరికి. ఈ మాత్రం కూడా తను మేనేజ్ చేయలేకపొతే ఎలా. ఇంకో నాలుగైదేళ్ళలో వివేక్ గాడి సిఏ పూర్తవుతుంది. ఆ తరువాత తను కాలుమీద కాలేసుకొని దర్జాగా కూర్చోవచ్చు.. ఇంత మాత్రం దానికి ఎంత మూర్ఖంగా ఆలోచించాడు తను. ఎంత బాధ పెట్టాడు తండ్రిని.. వివేక్ సంస్కృత పరీక్ష తనకు బుద్ధి, సంస్కారం నేర్పింది.

వెంటనే వెళ్ళి తనను క్షమించమని తండ్రిని వేడుకోవాలి. అసలు తప్పంతా ఆయనది. మొదటిసారి తనకీ వెధవ ఆలోచన వచ్చినప్పుడే గట్టిగా చీవాట్లు పెట్టుంటే సరిపోయేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇలా అలోచించి తండ్రి దగ్గరకు దాదాపుగా పరిగెత్తుతూ వెళ్ళాడు శంకరం.

కళ్ళు మూసుకొని ఎప్పుడూ కూర్చునే పడక్కుర్చీలో ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు మాధవరావు. కాళ్ళమీద పడ్డాడు శంకరం పశ్చాత్తాపంతో.

“నన్ను క్షమించు నాన్నా. నేను చేసింది మామూలు తప్పు కాదు. నువ్వు ఎక్కడికీ వెళ్ళనక్కర్లేదు. దర్జాగా నువ్వు ఎప్పటికీ మా  దగ్గరే ఉండాలి.  నువ్వు లేకుండా మా జీవితాన్ని ఊహించుకోలేము....” అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఒక్క క్షణం ఆగాడు శంకరం. తండ్రి కాళ్ళు చల్లగా తగిలినయ్. ఏదో అనుమానం పెనుభూతమైంది. గుండె వేగంగా కొట్టుకుంది కంగారుగా. తండ్రి భుజం పట్టుకొని కుదిపి చూసాడు. ఏ చలనం లేదు. ముక్కు దగ్గర చూపుడు వేలుంచి చూసాడు. శ్వాస లేదు. చనిపోయాడు మాధవరావు. ఒక్క క్షణం నివ్వెరపోయాడు శంకరం. ఇది నిజమేనా అసలు? “నాన్నా లే నాన్న..” గట్టిగా కుదుపుతూ తండ్రిని లేపడానికి ప్రయత్నించాడు. భోరున ఏడవటం మొదలుపెట్టాడు. భూమి బద్దలైనట్టుగా, లోకం తల్లకిందులైనట్టుగా ఏడుస్తున్నాడు. తండ్రి రెండు చేతులూ తీసుకొని తన చెంపలు ఎడాపెడా వాయించుకుంటున్నాడు తను చేసిన దుర్మార్గపు ఆలోచనకు తనను దండించమంటూ.

ప్రేమగా కని, అల్లారుముద్దుగా పెంచిన ఒక్కగానొక్క కొడుకు, బాధ్యతలు విస్మరించి తనను వదిలించుకోవటానికి ఇబ్బంది పడుతున్నాడని అర్ధమై, ఆ ఇబ్బంది తొలగించి కొడుకును సంతోషపెట్టడానికి తనను త్వరగా తీసుకువెళ్ళిపొమ్మని దేవుడ్ని ప్రార్థించాడో ఏమో కానీ, మౌనంగా, శాశ్వతంగా సెలవు తీసుకొని ఈ లోకం వదిలి వెళ్ళిపోయాడు మాధవరావు ఎంతో మంది తల్లిదండ్రులని విస్మరించే పిల్లలకు పాఠం నేర్పుతూ.

మరిన్ని కథలు