గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.... http://www.gotelugu.com/issue288/754/telugu-serials/anveshana/anveshana/
(గత సంచిక తరువాయి)... పూజారి చెప్పింది వింటూనే తల తిరిగి పోతోంది. కళ్ళ ముందు తిరుగుతున్న ‘ఆమె’ చని పోవడమేమిటి?! అంటే...మూడేళ్ల క్రితమేనట. ని....జ....మా...?! అంతు చిక్కని ప్రశ్నలతో అర్థం కాని జవాబులతో త వేడెక్కి పోతోంది ఎస్సై అక్బర్ ఖాన్ కి.
‘‘సార్ ! పూజారి గారు చెప్పింది నిజమో....కాదో.... తెలియాలంటే ఆయన చెప్పిన హాస్పిటల్ కి వెళ్ళి చూస్తే పోలా?’’ అక్కడే తలుపు ప్రక్కనే నిలబడి పూజారి చెప్పిందంతా రికార్డు చేసుకున్న రైటర్ అన్నాడు.
‘‘ఎస్!....’’ అంటూనే ఉలిక్కి పడి చక చకా కంప్యూటర్ ఆన్ చేసి నెట్ కనెక్ట్ చేసాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘అవును కదా సార్! బ్యాంకు నుండి మెయిల్ వస్తుంది కదా!’’ ఆతృతగా కంప్యూటర్ దగ్గరకు వచ్చాడు రైటర్.
ఇంతలో ఓ కానిస్టేబుల్ ఎస్సై అక్బర్ ఖాన్ గది దగ్గరకు పరిగెట్టుకు వచ్చాడు. ‘సార్! అన్నవరం పోలీస్ స్టేషన్ నుండి ఫోన్. లైన్ లో ఉన్నారు.’’ అన్నాడు కానిస్టేబుల్.
కానిస్టేబుల్ చెప్పింది వింటూనే ఛటుక్కున జేబులు తడుముకున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్. సెల్ ఫోన్ ఛార్జింగ్ అయి పోయింది. అందుకేనా అన్నవరం పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ లేండ్ లైన్‌కి వచ్చిందనుకుంటూ గబాలున లేచి సి.ఐ. గారి గది దగ్గరకు వెళ్లాడు.
సి.ఐ.గారు లేరు. బహుశా పెందుర్తి పోలీస్ స్టేషన్‌కో, హార్బర్ స్టేషన్‌కో వెళ్లుంటారు. సౌత్ జోన్‌లో ఉన్న పోలీస్ స్టేషన్‌లో మూడు పోలీస్ స్టేషన్ ల కు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గారే అధికారి. రోజూ ఈ మూడు పోలీస్ స్టేషన్లను పర్యవేక్షిస్తూ ఉండాలి. ఆలోచిస్తూనే ఫోన్ తీసాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘సార్! మీ అనుమానం కరెక్టే! మీరు పంపించిన పోస్టు మార్టమ్ జెరాక్స్ లో నమోదైన కత్తి కొలత తో హంతకుడైన హతుడి దగ్గర దొరికిన కత్తి సైజుతో సరి పోయాయి. రిపోర్ట్ మీకు మెయిల్ చేస్తాను. ఒకే సార్ ఉంటా’’ అన్నాడు అన్నవరం ఎస్సై.
‘‘ఎస్సై గారూ! ఆ హతుడి బాడీ రిసీవ్ చేసుకోడానికి ఎవరైనా వచ్చారా?’’ కుతూహలంగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్. హంతకుడి కోసం మానమర్యాదలున్న వాళ్లెవరూ రారు! పాపం! ఒక వేళ భార్యాపిల్లలుంటే వస్తారేమో! వస్తే?! ఈ హంతకుడు ఎవరి కనుసన్నల్లో ఉన్నాడో తెలుసుకోవచ్చు. ఆ కోణంలో కూడా ఈ హత్య వెనుక జరుగుతున్న కుట్ర కనిపెట్టొచ్చు.’’ ఫోన్ రిసీవర్ చెవి దగ్గర పెట్టుకునే ఆలోచిస్తూ అన్నాడు.
‘‘ఇంత వరకూ ఎవరూ రాలేదు సార్. ఇక ఎవరూ రారనే అనుకుంటాను.’’ అట్నుండి అన్నవరం ఎస్సై అన్నాడు.
‘‘థేంక్యూ బ్రదర్! ఏదన్నా అనుమానించ దగ్గ విషయం ఉంటే ఇలాగే కాల్ చెయ్యండి. ప్లీజ్!’’ మర్యాద పూర్వకంగా ధన్యవాదాలు తెలిపాడు ఎస్సై అక్బర్ ఖాన్.
ఇంతలో రైటర్ అతృతగా వచ్చాడు ఎస్సై అక్బర్ ఖాన్ దగ్గరికి గుస గుస గా ఏదో చెప్పాడు రైటర్.
రైటర్ చెప్పింది వింటూనే ఆశ్చర్య పోయాడు ఎస్సై అక్బర్ ఖాన్. ఇద్దరూ అక్కడ నుండి వెనక్కి వచ్చి ఎస్సై అక్బర్ ఖాన్ గదిలో ఉన్న
కంప్యూటర్ దగ్గరకు వచ్చారు.
అప్పటికే కంప్యూటర్ లో నుండి ప్రింటర్‌కి కనెక్టయిన మెయిన్ మేటర్ ప్రింటవుట్ వస్తోంది నెమ్మదిగా.
‘‘మెయిల్ చూసిన వెంటనే షాకయ్యాను సార్? మీ దగ్గరకొస్తూనే ప్రింట్ ఇచ్చాను. అదిగో ప్రింట్ వస్తోంది.’’ అంటూ ప్రింటర్ దగ్గర నిలబడ్డాడు రైటర్.
అసహనంగా వెళ్లి తన రివాల్వింగ్ చైర్ లో నిస్సహాయంగా దబేలున కూర్చున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్. రైటర్ చెప్పింది విన్నప్పుడే ఉత్సాహమంతా నీరు గారిపోయింది. రెండు కేసుల ముడి ఒక్కొక్కటిగా విడి పోతుందనుకున్నప్పుడు ‘ఆమె’ ఎప్పుడో చని పోయిందని పూజారి చెప్తే నమ్మ బుద్ధి కాలేదు. హాస్పటల్ కు వెళ్లి అనుమానం నివృత్తి చేసుకోవచ్చులే అనుకున్నాడు.
కానీ, ఏ.టి.ఎమ్ కార్డు అకౌంట్ వివరాలు చూసిన రైటర్ చెప్పింది వినే సరికి మరింత నిరుత్సాహం ఆవరించేసింది.
ఎన్ని ప్రింటవుట్లు తీసినా నిజం మారి పోదు కదా! అకౌంట్‌లో ఏ వివరాలు ఉంటే అవే కదా వచ్చేది అనుకుంటూ సీటుకు జారగిలబడి కళ్ళు మూసుకున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘సార్! ఇదిగో సార్! ఏటిఎమ్ కార్డు తాలూకా వివరాలు’’ అన్నాడు రైటర్.
‘‘అది చూసినా ఏం ప్రయోజనం. మనం అనుకున్నదొకటి? జరిగిందొకటి?!’’ ఆలోచిస్తూనే కళ్లు తెరవకుండా అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘సార్! పూజారి చెప్పింది నిజమేనేమో కదా సార్! ఈ అకౌంట్ వివరాలు ఫొటో చూస్తే అదే నిజమనిపిస్తోంది కదా!’’ అనుమానంగా అన్నాడు రైటర్.
రైటర్ మాట వింటూనే టక్కున అలర్ట్ అయ్యాడు ఎస్సై అక్బర్ ఖాన్. ‘ఎస్. రైటర్ చెప్పినట్టు పూజారి చెప్పింది నిజమైతే...?! చని పోయిన ఆమె లాగే ఈమె ఎలా వుంది?! ఆమె ఈమె ఒక్కరు కాదే? ఒక్కరే అయితే....?! కొంప దీసి ఆమె ఆత్మ ఈమెలా సంచరిస్తోందా?!’
అమ్మో! ఈ మధ్య చాలా సినిమాల్లో చూస్తున్నాడు. ఆత్మలు మామూలు మనుషుల్లాగే...ఇళ్లల్లోనూ...వీధుల్లోను...తెగ తిరుగుతుంటాయి అలాంటి ఆత్మనే ఈమె కూడా.’’
దేవుడికి దెయ్యానికి పడదంటారు? దేవుడి గుడికే వచ్చింది ఈ ఆత్మ. బహుశా గత జన్మలో ఈ ఆత్మ దేవుడికి ఇష్టురాలైన భక్తురాలేమో కదా!
‘‘సార్! అలా మౌనంగా ఎటో చూస్తూ ఉండి పోయారేంటి సార్!....ఇదిగో అకౌంట్ ప్రింటౌట్.’’ అంటూ ఎస్సై అక్బర్ ఖాన్ ముందు నిలబడి కొంచెం గట్టిగానే అన్నాడు రైటర్.
రైటర్ గొంతు విని ఇహానికి వచ్చాడు ఎస్సై అక్బర్ ఖాన్.
తన ఆలోచనలేంటి ఇంత తెలివి తక్కువగా పరిగెడుతున్నాయి! ఈ రోజుల్లో ఆత్మలేమిటి? అంతా ఫూలిష్ నెస్. సినిమా వాళ్ళు ప్రేక్షకుల నాడి...వేడి కనిపెట్టి కనికట్టు చేస్తున్నారు. అవసరమైతే ఆత్మలకి దేవుడికి స్నేహం వుందని కూడా పిచ్చి పిచ్చి కథలు సృష్టించెయ్య గలరు. ఆమె చని పోవడమేమిటి?! ఆత్మగా రావడమేంటి?! ఇదంతా నమ్మ శక్యం కాని విషయాలు. ఇవి అబద్ధాలని ప్రూవ్ చెయ్యాలి. చేస్తాను.
మనసు లోనే స్థిరంగా అనుకుంటూ టేబుల్ మీద ఉన్న ప్రింటవుట్‌లో వచ్చిన అకౌంట్ కాపీ తీసి క్షుణ్ణంగా అక్షరం అక్షరం కూడబలుక్కుని చదువుకున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.
బ్యాంకు వాళ్ళు పంపించిన ఏటిఎమ్ వివరాలు చదువుతున్న ఎస్సై అక్బర్ ఖాన్ మొహంలో వస్తున్న మార్పులు గమనిస్తూ నిలబడ్డాడు రైటర్.
‘‘రైటర్ గారూ! మనం వెంటనే ఈ అకౌంట్ లో ఉన్న అడ్రస్‌కి వెళ్దాం. ఈ ఏటిఎమ్ ఎవరికైనా ఇచ్చారా? లేదా ఎక్కడన్నా పోగొట్టుకున్నారా! ఆరా తీద్దాం. ఎవరికైనా ఇచ్చుంటే....అది ఎవరికిచ్చారో తెలిసి పోతుంది కదా! పోగొట్టుకుంటే....వెంటనే ఏటిఎమ్ కార్డు ఆపరేషన్ ఆపేసుండాలి. లేదు....అంటే ... ఇక్కడే ఏదో మర్మం దాగి ఉంది. ఈ అడ్రస్‌కి వెళ్తే గాని నిజానిజాలు బయట పడవు.’’ అకౌంట్ కాపీ తీసి మడత పెట్టి జేబులో పెట్టుకుంటూ దిగ్గున సీట్లో నుండి లేచాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘సార్! ఇప్పటికిప్పుడు...ఎలా సార్?’’ అయోమయంగా అన్నాడు రైటర్.
‘‘సి ఐ గారి తో మాట్లాడదాం. చెన్నై కి వెళ్ళాని చెప్పి వీయితే ఫ్లైట్‌లో వెళదాం.’’ ఏదో ఆలోచిస్తూ అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘మీ ఇష్టం సార్! ఈ లోగా ‘హాస్పిటల్ కి’ వెళ్లి మన అనుమానం నివృత్తి చేసుకుంటే సరి పోతుంది కదా’’ అన్నాడు రైటర్.
‘‘ఎస్ ! అనుమానమే కాదు. చాలా నిజాలు అక్కడికి వెళ్తే తెలిసే అవకాశం కూడా ఉంది.’’
‘‘ఎస్ సార్! యలమంచిలి హాస్పిటల్ మధుర వాడలో ఊరి చివర ఉంది. పూజారి గారినే అడిగి వివరాలు తీసుకున్నాను.’’ చెప్పాడు రైటర్.
‘‘ఓకే. పద! దారిలో ఎక్కడన్నా లంచ్ చేద్దాం.’’ అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘ఎస్ సార్!’’ అంటూ సెల్యూట్ చేసాడు రైటర్.
***********
మధురవాడ
యలమంచిలి గ్రూప్ కార్పొరేట్ హాస్పటల్. నేరుగా వెళ్ళి హాస్పటల్ ఆవరణలో బుల్లెట్ ఆపాడు ఎస్సై అక్బర్ ఖాన్. పార్కింగ్‌లో బుల్లెట్ పార్క్ చేసి హాస్పటల్ మెయిన్ గేట్ దగ్గరకు వెళ్ళారు ఇద్దరూ. హాస్పటల్ చూస్తూనే ఆశ్చర్య పోయాడు ఎస్సై అక్బర్ ఖాన్. చాలా విశాలంగా ఉంది. అయిదంతస్థుల భవనాలు. నాలుగు మూలలా చతురస్రాకారంలో ఉన్నాయి. మధ్యలో విశాలమైన పార్క్. పార్క్ మధ్యలో పెద్ద ఫౌంటెన్.
గుడి పూజారి చెప్పిన దాని ప్రకారం పెద్ద డాక్టర్ గదిలో ఫొటో ఉందన్నాడు. ఈ హాస్పిటల్ పెద్ద డాక్టర్ అంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్ అయి ఉంటాడు. లేదా ఛైర్మన్ కూడా కావచ్చు.
ఆలోచిస్తూనే ఇద్దరూ లోపలకు అడుగు పెట్టారు. ఎదురుగా రిసెప్షన్ కౌంటర్. కంప్యూటర్లు ముందర పెట్టుకుని నలుగురైదుగురు అమ్మాయిలు చాలా బిజీగా ఉన్నారు. వారి ముందు పది మంది వరకూ ఆడా మగా నిలబడి ఉన్నారు. వాళ్ళంతాతా రోగులో...రోగుల్ని చూడ్డానికి వచ్చిన విజిటర్సో అనుకుంటూ రిసెప్షన్ దగ్గరకు వెళ్లారు ఇద్దరూ.
యూనిఫాంలో వచ్చిన పోలీసుల్ని చూస్తూనే రిసెప్షన్‌లో ఉన్న అమ్మాయిలందరూ ఒక్క సారే లేచి నిలబడ్డారు.
‘‘సార్ ! ఏదన్నా ఏక్సిడెంట్ కేసా సార్?’’ అందో అమ్మాయి.
‘‘లేదమ్మా! మీ హాస్పటల్ ఛైర్మన్ గారిని కలవాలి.’’ టక్కున అన్నాడు రైటర్. ఎస్సై అక్బర్ ఖాన్ అప్పటికే రిసెప్షన్ కౌంటర్ వెనక గోడకు తగిలించి ఉన్న పెద్ద పొటో కేసి చూస్తూ బొమ్మలా నిలబడి పోయాడు.
‘‘సార్! గ్రూప్ ఛైర్మన్ సార్ చెన్నైలో ఉంటారు. ఈ హాస్పటల్‌కి అడ్మినిస్ట్రేటివ్ జనరల్ మేనేజర్ గారుంటారు సార్. ఆయనే ఇక్కడ హాస్పిటల్ నిర్వహణ అంతా చూస్తారు.’’ టక టకా చెప్పింది ఆ అమ్మాయి.
ఎస్సై అక్బర్‌ఖాన్ ఏం మాట్లాడకుండా బొమ్మలా నిలబడి పోయే సరికి ఆశ్చర్యంగా చూసాడు రైటర్. ఎస్సై అక్బర్ ఖాన్ దృష్టి ఎటు వైపు ఉందబ్బా అనుకుంటూ తల తిప్పి గోడ కేసి చూసి అదిరి పడ్డాడు రైటర్.
గుడి పూజారి చెప్పినట్టు గోడకు తగిలించి ఉందామె ఫొటో. చాలా పెద్ద ఫొటో. చిద్విలాసంగా నవ్వుతూ సినిమా హీరోయిన్‌లా ఫోజు పెట్టి ఉందా ఫొటో. ఆమె ఒక్కర్తే లేదు. ప్రక్కన ఆమె భర్తై ఉంటుంది. ఇద్దరూ అందంగానే ఉన్నారు.
ఇద్దరూ ఉన్న ఆ ఫొటోకి పెద్ద పూలదండ తగిలించి మరీ ఉంది.
(వీడిపోతాయనుకున్న చిక్కుముడులు ఒక్కొక్కటే మరింత బిగుసుకుంటున్నాయా...తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా వేచిచూడాల్సిందే) |