Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue288/755/telugu-serials/katyayani/katyayani/

 

(గత సంచిక తరువాయి)... "ఇప్పుడే డాక్టరు గారు బయటకొచ్చి నాతో మాట్లాడారు. అబ్బాయికి ఏం ఫర్వాలేదట. నువ్వు వర్రీ అవుతుంటావని చెబుతున్నాను. రాజారావంకుల్ పది నిముషాల క్రితం ఇంటికి వెళ్లాడు. నాతో పాటూ ఉంటాననే అన్నాడు. నేనే వద్దన్నాను. ఆయన రేపు ఆఫీసుకి వెళ్లాలి కదా! నాకిక్కడ బానే ఉంది. నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో. మీ అత్తగార్నీ, అమ్మనీ జాగ్రత్తగా చూసుకో. ఆవిడకీ అబ్బాయి విషయం చెప్పి బాధ పడొద్దని చెప్పు. సరేనా" అన్నారు అచ్యుత రామయ్య గారు.

ఆ మాటలు విన్నాక ఆమె మనసు కొంత కుదుట పడింది.

భోజనాలు చేస్తున్నప్పుడు అమ్మకు, అత్తమ్మకూ కూడా విషయం చెప్పింది. వాళ్ల మనసులూ తేటపడ్డాయి.

***

అసలు హాస్పిటల్లో ఉండడమంటే పేషెంట్ తో పాటు అతనితో ఉండే వాళ్లకూ ఓ భీతి గొలిపే అనుభవం. బాధలతో నరక యాతన అనుభవిస్తూ వచ్చేవాళ్లు, మూల్గులు, ముక్కులు, ఏడుపులు, పెడబొబ్బలు వీటన్నింటి మధ్యా ఆనందంగా డిస్చార్జ్ అయి వెళుతున్న వాళ్లు, ‘తమకీ అలాంటి రోజు వస్తుందా?’ అనుకునేవాళ్లు. హాస్పిటల్లో బెడ్ కో బాధ ఉంటుంది. ఒక్కో రూమ్ కూ ఒక్కో హృదయ విదారక చరిత్ర. వాళ్లందరినీ చూస్తుంటే మానవ జన్మ ఎందుకు ఎత్తామా? అనిపిస్తుంది.

పై వాటికి తోడు పేషెంట్ ఐ సీ యూలో ఉంటే బయట ఉండే వాళ్లకు అదింకా భయానకం. సిస్టర్లు, డాక్టర్లూ ఐ సి యూ డోర్స్ తీసుకుని ఎవరి కోసమొస్తున్నా బయట ఉన్నవాళ్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒక వేళ అలా నర్స్ లు బయటకు వచ్చి లోపలున్న పేషెంట్ కు మందులు తేవడానికో, బిల్లు కట్టమని చెప్పడానికో లేక ‘ఫలానా పేషెంట్ కు సంబంధించిన వాళ్లు వచ్చి కలవాలని’ అరచి చెబితే, ‘తమకే వార్త చెబుతారో’ అని గుండె డబల్ స్పీడ్ తో కొట్టుకుంటుంది.

మూడ్రోజులు ఐ సీ యూలో పూర్తయ్యాక కాత్యాయన్నీ, అచ్యుత రామయ్య గారినీ డాక్టర్ తన క్యాబిన్ కు పిలిపించుకుని ‘అతని కండీషన్ సెవెర్లీ కాంప్లికేటేడ్, ఆపరేషన్ చెయ్యాలి. దానికి లక్షల్లో ఖర్చవుతుంది. మీరు ‘ఊ’ అంటే స్టార్ట్ చేసేద్దాం"అన్నాడు.

ఆ మాటలు విని ఎదురుగా కూర్చున్న ఇద్దరి గుండేలూ జారి పోయాయి.

"అంటే సుమారుగా ఎంత అవుతుంది డాక్టర్?" కాత్యాయని నోటి నుంచి మాటలు పేలవంగా వెలువడ్డాయి.

డాక్టర్ పేపరు మీద ఎస్టిమేషన్ వేసి ఎక్స్ ప్లెయిన్ చేశాడు.

అది చూశాక ఇద్దరి కళ్లలో నీళ్లు తిరిగాయి.

"డాక్టర్ గారూ..అంత డబ్బు.."కాత్యాయని బాధతో మాటలు తడబడుతూండగా అంది.

"తెలుసమ్మా..కానీ ఏం చేయలేం. బయట నుంచి ఎక్స్ పర్ట్ కార్డీయాక్ టీం ను తెప్పించాలి. మన హాస్పిటల్ ఎక్స్ పెన్సెస్ లో అంటే చాలా వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేయవచ్చు. కానీ బయట వాళ్లతో అంటే కష్టం" కళ్ల జోడు లోంచి సూటిగా చూస్తూ అన్నాడు.

"పోనీ డబ్బులు అరెంజ్ అయ్యే వరకూ మెడిసిన్స్ ఇస్తూ.." అంది బాధగా..

"కొంత వరకూ ప్రొలాంగ్ చెయ్యొచ్చు బట్ పేషేంట్ లైఫ్ నో గ్యారంటీ, డెసిషన్ హాస్ టు బి టేకెన్ యాస్ సూన్ యాస్ పాజిబుల్ "అని లేచాడు ఇహ తనకు వేరే పనుందన్నట్టుగా..

అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ లు, మనీ రిజర్వ్స్ చూశారు కాత్యాయనీ, అచ్యుత రామయ్య గారు. లక్షన్నర ఉంది. ఆఫీసులో అతను ఇంకా పర్మనెంట్ కాలేదు. సంస్థ నుంచి ఏమీ రావు.

అచ్యుత రామయ్య గారు తను పోస్టాఫీసు లో ఫిక్స్ డ్ చేసింది డ్రా చేసి ఆపరేషన్ చేయిస్తానన్నాడు. కానీ కాత్యాయని "నాన్నా.. మీరూ పెద్దవాళ్లవుతున్నారు. ఇన్నాళ్లూ కష్ట పడి పోగేసిందంతా మా కోసం ఖర్చు పెడితే రేపు అమ్మకు కానీ మీక్కానీ ఏమైనా వస్తే ఎవరు చూసుకుంటారు? కొద్దిగా టైం తీసుకుని ఆలోచిద్దాం. భగవంతుడు ఏదైనా దారి చూపిస్తాడేమో" అంది బాధగా.

ఆపరేషన్ తర్వాత చేయించుకుంటామని కాత్యాయని చెప్పిం తర్వాత రెండు రోజులు జనరల్ వార్డ్ లో ఉంచి కమలాకర్ ను పదిహేను రోజుల కో మారు చూపించాలని అడ్వైజ్ చేస్తూ, మెడిసిన్స్ ఎలా వాడాలో, ఏ టెస్ట్ లు చేయించాలో చెప్పి డిస్ చార్జ్ చేశారు.

యాభై ఐదు వేలయింది. అంతా అచ్యుత రామయ్య గారే ఖర్చు పెట్టారు. అప్పటికి ఆయన దగ్గరా అంత డబ్బు లేదు. రాజా రావు గారు పది వేలు సర్దు బాటు చేశాడు.

అందరికీ మనసంతా వికలం అయి పోయింది.

కమలాకర్ పేలవంగా నవ్వుతూ అందరితో మాట్లాడుతున్నాడు కానీ తన ఆరోగ్య సమస్య అందరినీ కృంగ దీస్తోందని అర్థమవుతోంది. ఏం చెయ్యడానికీ పాలు పోని పరిస్థితి.

మానసికంగా వీక్ అయిపోయాడు. ఇంటి కొచ్చాక కూడా నాలుగడుగు లేస్తే అతనికి దమ్మొస్తోంది. వెంటనే మంచం మీద పడుకుండి పోతున్నాడు.

అతన్ని చూస్తుంటే కాత్యాయని కడుపు తరుక్కు పోతోంది.

ఇలా అయితే జరుగుబాటు ఎలా? ఆపరేషన్ ఎలా? అందరూ పరామర్శించి పోతున్నారు. వీలైనంత తొందరగా ఆపరేషన్ చేయించమని హెచ్చరికతో కూడిన అభ్యర్థన ముందు పెడుతున్నారు. కానీ ఎవరూ సొల్యూషన్ చెప్పడం లేదు. పోనీ తను ఉద్యోగం చేసి ఇంటిని చూసుకుందామంటే, చదివింది పది వరకే! తనకి ఉద్యోగమెవరిస్తారు? ఏం చేయాలి? ఏం చేయాలి?? ఆలోచనలు ఆమె మనసును గిర గిరా తిప్పేస్తున్నాయి.

జీవితంలో మొట్టమొదటి సారి ఆమెకి మాడునొప్పి వచ్చింది.

(అంతా సవ్యంగా సాగిపోతుందనుకున్న కాత్యాయని జీవితంలో కమలాకర్ కి ఈ మాయదారి రోగమేంటి? పరిష్కారమేమిటి?? అసలు కథ ఇప్పుడే మొదలైందా??? ఇవన్నీ తెలియాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా ఆగాల్సిందే)       
 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్