Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue289/757/telugu-serials/katyayani/katyayani/

 

(గత సంచిక తరువాయి)... జీవితం ఉన్నట్టుండి నిస్సారంగా తయారైంది కాత్యాయనికి. ఒక వైపు భర్త, మరో వైపు కళ్లు లేక కొడుకు పరిస్థితికి మనసు లోనే మధనన పడుతున్న అత్తగారు.

కమలాకర్ ఏవీ చేయలేని తన పరిస్థితికి కుమిలి పోతూ, ’కాత్యాయనీ నీకు అన్యాయం జరిగి పోయింది. నన్ను క్షమించు. ఈ వ్యాధి నాకే రావాలా?’ అని అంటుంటాడు.

’సమస్య వచ్చినప్పుడే మనో ధైర్యం తెచ్చుకుని గట్టిగా ఎదుర్కోవాలి’ అని భర్త డిప్రెషన్ లోకి పోతాడని సాంత్వన వచనాలు చెబుతుంది. భర్తకు అనునయ వాక్యాలు చెబుతోంది కానీ కాత్యాయనిని వాస్తవం పెద్ద పర్వతంలా భయపెడుతోంది. అన్ని దారులూ మూసుకు పోతే అల్లల్లాడే పరిస్థితి తనది.

బ్యాంకులో ఉన్న డబ్బు తీసి పొదుపుగా, జాగ్రత్తగా ఖర్చు చేస్తూ కాలం గడుపుతోంది. అతని మందులకు, టెస్ట్ లకూ ఎక్కువ ఖర్చవుతోంది. ఇలా అయితే ఆపరేషన్ మాట దేవుడెరుగు ముందు ముందు జీవించడం కూడా దుర్భరమయి పోతుంది. నిర్వికారంగా తన పని తను చేసుకు పోయే కాలానికి ఒకరి కష్టాలు, సుఖాలతో పని లేదు. అది అలా సాగి పోతూనే ఉంటుంది.

***

కాత్యాయని కమలాకర్ కంట్లో పడ్డాక, వెంబడించి, రాజారావుతో మాట్లాడించి ఎలా తన సొంతం చేసుకున్నాడో, అలాగే కాత్యాయని అందాన్ని చూసి ఫిదా అయి పోయాడు మనోహర్ ! కాకపోతే ఆమె పెళ్లయ్యాక. అదీ కాకతాళీయంగా.

కాత్యాయని, కమలాకర్ లు శ్రీ గాయత్రీ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ తీసుకుని అద్దెకు దిగాక, ఒకసారి ఆమె రిలయన్స్ మాల్ లో సామాన్లు కొనుక్కెళుతుంటే చూశాడు మనోహర్. అప్సరసలు ఆకాశంలో, స్వర్గంలో ఉంటారని అతను విని ఉన్నాడు. అలాంటిది తన ముందు నుంచి నడిచి వెళ్లడం చూసి షాక్ అయి పోయాడు.

మనోహర్ ఆరడుగుల పొడవుతో, దబ్బపండు ఛాయతో, కోల ముఖం, నుదుటిపై పడే కర్లీ హెయిర్ తో, షార్ప్ చూపులు ప్రసరించే కళ్లతో, క్లీన్ షేవ్, సన్నటి మీస కట్టుతో, చక్కటి డ్రెస్ సెన్స్ తో అమ్మాయిలు చూడగానే కలల రాకుమారుడిగా హృదయాల్లో నిలిచి పోవడం ఖాయం.
అతను ఓ ఎమ్ ఎన్ సీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా మంచి పొజిషన్ లో ఉన్నాడు. కాత్యాయనీ వాళ్లుండే అపార్ట్ మెంట్ కి కొద్ది దూరంలో ఉండే పోష్ బ్లూ మూన్ రెసిడెన్సీలోని ఫ్లాట్ లో ఉంటున్నాడు. చిన్నప్పుడు అతని కుటుంబం జీవిక కోసం చాలా కష్ట పడింది. తండ్రి ఒక బట్టల షాపులో గుమాస్తాగా చేసేవాడు. ముగ్గురాడపిల్లల తర్వాత ఒక్కగానొక్క మగ నలుసుగా పుట్టాడు. ఇంట్లో అందరూ గారాబంగా చూడ్డంతో, ఏది కోరుకుంటే అది వచ్చే దాకా పంతం పట్టేవాడు. అష్ట కష్టాలు పడి అతని కోర్కెలు తీర్చే వాళ్లు తోడ బుట్టిన వాళ్లు, తల్లి దండ్రులు.

మనోహర్ పెరుగుతూంటే అతని కోరికలు కూడా పెరగ సాగాయి. ఒక రోజు సైకిల్ కొనివ్వమంటాడు, మరో రోజు పిల్లలు తొక్కే కారు కావాలంటాడు. అతని కంట్లో నీరు చూడలేని తండ్రి తల తాకట్టు పెట్టైనా కొనిచ్చే వాడు. మరింత పెద్దవుతూంటే అతనికి ఊహ తెలిశాక, తండ్రి పరిస్థితి అవగాహన లోకి వచ్చింది. ఆడ పిల్లల్ని చదివించే స్థోమత లేదు కనక తను అశక్తుణ్నని చేతులెత్తేశాడు. మనోహర్ మగ పిల్లాడు కాబట్టి చదివిస్తున్నాడా తండ్రి.

కోరికలు తీరడం మాటటుంచి కనీస అవసరాలు కూడా తీరక పోవడం వల్ల సమాజం మీద, తన కుటుంబం మీదా చాలా చిరాకు వచ్చింది అతనికి. తను ఆ ఊబి లోంచి బైటకు రావాలంటే, బాగా చదువుకోవాలని, చదువు తోటే అన్ని సుఖాలూ పాదాక్రాంతమవుతాయని చిన్న వయసులోనే మనసులో బీజం నాటుకున్నాడు.

అప్పట్నుంచి అతని ఆశ, ఆశయం, శ్వాస చదువే అయ్యాయి. చదువు పూర్తయి మంచి ఉద్యోగమూ సంపాదించాడు.

ముగ్గురమ్మాయిల పెళ్లిళ్లు చేశాక తన బాధ్యత తీరిందనుకున్నాడో ఏమో అతని తండ్రి మరణించాడు. ఆయనతో కలిసి ఏడడుగులు నడిచిందన్న విశ్వాసంతో అతని తల్లీ వారం తిరక్కుండా మరణించింది.

మనోహర్ కు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ప్రాజెక్ట్ బోనస్ లు..ఇలా జీవిత పరమపద సోపాన పఠంలో నిచ్చెనలు ఎదురొచ్చి మరీ అతన్ని పైకి చేర్చాయి. పుష్కలంగా డబ్బు, ఫ్రీక్వెంట్ గా విదేశాలు చుట్టబెట్టే అవకాశం. ఒక మగాడికి అనుభవించడానికి, అనుభూతించడానికీ, ఇంకేం కావాలి!

ఏ దేశానికి వెళ్లినా అతని కోసం అక్కడి లగ్జరియస్ హోటల్లో అందమైన అమ్మాయిలతో రూం బుక్ చేసి ఉంటూంది. కాస్ట్ లీ మందు తాగుతూ, నాన్ వెజ్ నంజుకుంటూ, సువాసన మయంగా ఉన్న గదిలో, రాత్రి అందమైన మెత్తటి పరుపుతో ఉన్న మంచం మీద అద్భుతమైన కొలతలతో, వాత్సాయన కామ సూత్రాలను ఆపోశన పట్టిన, మెరిసే గోధుమ రంగుతో, బంగారు రంగు జుత్తుతో, రంభా ఊర్వశీ మేనక లాంటీ అప్సరసల మిళితంలా అగుపించే అమ్మాయిలతో రాత్రంతా సుఖించడమంటే మనోహర్ కు పిచ్చ సరదా!

అలాంటిది ఇప్పుడు మనోహర్ మనసు లోకి చొచ్చుకు పోయిన కాత్యాయని, అతనికి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తోంది. ఆమె ఒంపు సొంపుల అవయవాల సంపద ఒక ఎత్తు, ఇన్నాళ్లూ తృప్తి పొందాడనుకున్న ఆనందం మరో ఎత్తుగా అనిపించ సాగింది. అంతెందుకు? డబ్బిచ్చి పొందిన తన ఇన్నాళ్ల సుఖం శూన్యం అన్న భావానికి వచ్చేశాడు.

ఆమెని పొంద లేని జీ..వి..తం..వృధా అనిపించ సాగింది. అప్పటి రావణాసురుడు, కీచకుడు అనుభవించిన పరిస్థితి లాంటిదే అతని అప్పటి మనోస్థితి. పరిస్థితి.

***

అతను-ఆమె.....ఒకరికొకరు అనుకుంటున్న సమయంలో కమలాకర్ కి ఈ వ్యాధి ఏమిటి? అంతలోనే ఈ మనోహర్ ఎవరు? మధ్యలో ఎందుకొచ్చాడు?? అసలుకథ ఇప్పుడే ప్రారంభం........వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా ఎదురుచూడాల్సిందే.......

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్