గత సంచికలోని కాత్యాయని సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి...
http://www.gotelugu.com/issue291/760/telugu-serials/katyayani/katyayani/
(గత సంచిక తరువాయి)... ఆ అరుపు వినగానే ఒక్క అంగలో మనోహర్ అక్కడికి చేరుకుని "మీరు కంగారు పడకండి" అని కమలాకర్ ను లేపి తన భుజం ఆసరాతో పక్కనే ఉన్న బస్ షెల్టర్ లో ఉన్న సిమెంట్ బెంచి మీద ఆమెని కూర్చోబెట్టి, కమలాకర్ ను ఆమెకి ఆన్చి కూర్చోబెట్టి "మీరు బెంబేలు పడొద్దు, ఏం కాదు" అని తమ చుట్టూ గుమి గూడబోయిన వాళ్లని "ఇక్కడేముంది వెళ్లండి..వెళ్లండి" అంటూ సెల్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు.
క్షణాల్లో ఆ సిటీలోనే ఖరీదైన హాస్పిటల్ కి సంబంధించిన అంబులెన్స్ వచ్చి వాళ్ల ముందు ఆగి, స్ట్రెచ్చర్ మీద కమలాకర్ ను పడుకోబెట్టి లోపలికి తీసుకెళ్లారు. అదేం పట్టించుకునే స్థితిలో లేదు కాత్యాయని. భర్త పరిస్థితికి ఆమె మనసు తీవ్రంగా రోదిస్తోంది, కళ్లు అవిశ్రాంతంగా కన్నీళ్ళని వర్షిస్తున్నాయి. ఆమెతో పాటు మనోహర్ కూడా అంబులెన్స్ ఎక్కాడు. అలాంటి పరిస్థితిలోనూ అప్పుడప్పుడూ పూల చెండులా తగుల్తున్న ఆమె అందాలు అతనిలోని మగతనానికి ఆజ్యం పోస్తున్నాయి.
అంబులెన్స్ లోపల ఒక డాక్టర్ ఉండి కమలాకర్ కు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్ మెంట్ మొదలు పెట్టేశాడు. ‘చాలా కాలం నుంచి ఆహారం సరిగా లేనందుకు పొద్దున్నే ఎండలో చాలాసేపు నుంచోబెట్టినందుకు అన్ కాన్షియస్ అయ్యాడని’ మనోహర్ తో ఇంగ్లీష్ లో చెప్పాడు.
ఆ తర్వాత హాస్పిటల్లోకి దూసుకు పోయిన అంబులెన్స్ లోంచి మనోహర్ ను యుద్ధ ప్రాతిపదిక మీద ఐ సీ యూకి చేర్చారు. కొద్ది సేపటి తర్వాత బయటకొచ్చిన డాక్టర్ తో మాట్లాడిన మనోహర్ కాత్యాయని దగ్గరకొచ్చి "మీ ఆయనకు ఇంకేం ఫర్వాలేదు..జస్ట్ సన్ స్ట్రోక్ తగిలిందంతే.."అన్నాడు ఆమెని ఊరడిస్తూ.
ఖరీదైన వాతావరణంతో స్వర్గలోకం లోని ఆసుపత్రిలా కనిపిస్తూంటే, డాక్టర్లను, నర్స్ లను చూస్తూ అతని మాటలతో ఈ లోకంలోకి అప్పుడొచ్చింది కాత్యాయని. అంతే కాదు గబుక్కున లేచి "సారీ అండీ, మీకు శ్రమ ఇచ్చాను. ఉన్నట్టుండి ఆయన హఠాత్తుగా పడిపోతేనూ..ఏం చెయ్యాలో తోచక.."మళ్లీ చిన్నగా వెక్కుతూ ఏడవ సాగింది.
"ఏం ఫర్వాలేదని చెప్పా కదండీ..మనిషిని మనిషి ఆదుకోకపోతే మనకూ, జంతువులకూ తేడా ఏంటండీ" అన్నాడు అనునయంగా.
"ఇంత పెద్ద హాస్పిటల్ ను మేము భరించలేమండీ" అండి.
"భరించమని నేను చెప్పానాండి! మాకో ఛారిటబుల్ ట్రస్ట్ ఉంది. ఈ హాస్పిటల్ ఎం డీ దాన్లో మెంబర్. నెలకో పదిమందికి ఉచితంగా ట్రీట్ చేస్తాడు. మీరు చాలా లక్కీ అండి. సరిగ్గా మీ ఆయన పడిపోయే టైం కి నేనక్కడ ఉన్నాను" అన్నాడు.
"భగవంతుడున్నాడండి. ఎక్కడో కాదు మీరే" అంది రెండు చేతులూ జోడిస్తూ.
"ఉండండి మీరు మరీనూ, కొంపదీసి ఎవరన్నా విన్నారా ఏంటి? అసలే మనవాళ్లు ‘ఎవరు దొరుకుతారా, దేవుణ్ని చేసేయడానికి’ అని ఎదురు చూస్తుంటారు. పూలు, పళ్లు, కొబ్బరికాయలతో పూజారిని తీసుకుని పూజకు సిద్ధమైపోతారు" అన్నాడు చిరు భయాన్ని నాటకీయంగా ప్రదర్శిస్తూ.
అంత బాధలోనూ ఆమెకి నవ్వొచ్చింది. పెదవులు విడీ విడకుండా నవ్వింది.
’ఈ నవ్వును సెల్ తో కాప్చర్ చేసుకునే అవకాశం ఉంటే ఎంత బావుండేది. ఇంటి ఎంట్రన్స్ కు ఎదురుగా ఉండే డ్రాయింగ్ రూమ్ లో లైఫ్ సైజ్ కటౌట్ గా గోడకి పెడితే బ్యూటిఫుల్ సీనరీలన్నీ దాని ముందు బలాదూరే!’ ఆ నవ్వుకు తాదాత్మ్యం చెందుతూ మనసులో అనుకున్నాడు.
కొద్దిగా పక్కకెళ్లి అక్కడున్న మేల్ అసిస్టేంట్ కు డబ్బులిచ్చి ఇడ్లీ, కాఫీ తెప్పించి ఆమె ముందు పెట్టాడు.
"అయ్యో, ఇంట్లోంచి తినే బయల్దేరానండి.." అంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ.
"మీకు తెలుసో లేదో, మనం మధ్యాహ్నంలోకి ప్రవేశిస్తున్నాం. లోపల మీ ఆయనకు టెస్ట్ లు జరుగుతున్నాయి. డాక్టర్ వచ్చి రిపోర్ట్స్ చెక్ చేసి విషయం చెబుతాడు. ఆయనెప్పుడొస్తాడో చెప్పలేం. అప్పటి దాకా మీరేం తినకుండా ఉండి స్పృహ తప్పితే మిమ్మల్ని కూడా ఇదే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. దానికి మాత్రం బోలెడు కర్చవుతుంది. ఎందుకంటే ఒక ఫ్యామ్లీలో ఒక్కరికే ఫ్రీ ! మీరు తింటూ ఉండండి. నేను కిందకెళ్లి కాస్త తినేసి వస్తాను" అని ఆమె ముందున్న ఇడ్లీ ప్యాకెట్ విప్పబోతుంటే "అయ్యయ్యో నేను తింటాన్లేండి"అంది అతన్ని వారిస్తూ.
అతను నవ్వుతూ వాళ్ల ముందున్న లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి, లిఫ్ట్ వచ్చి మెత్తగా తలుపులు తెరుచుకున్నాక లోపలికెళ్లి డోర్స్ క్లోజ్ చేశాడు.
ఆమె సుకుమారంగా ఇడ్లీ చిన్న చిన్న ముక్కలుగా తుంపి తింటూ కలలా జరిగిందంతా నెమరేసుకోసాగింది. తర్వాత హఠాత్తుగా తండ్రి గుర్తొచ్చి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది.
ఆయన ఆగమేఘాల మీద ఆ హాస్పిటల్ కి వచ్చాడు. ఆకాశాన్నంటేలా, అనేక హంగులతో ధగ ధగలాడుతున్న ఆ హాస్పిటల్ ను చూస్తూనే ఆశ్చర్య పోయాడు. తన కూతురు చెప్పిన హాస్పిటల్ అదేనా? కాదా? అని కొద్ది సేపు ఆలోచనలతో మెదడును వేడెక్కి, తర్వాత కూతురుకు ఫోన్ చేసి నిజమేనని నిర్దారణ చేసుకుని లిఫ్ట్ ఎక్కి పైకెళ్లి కూతుర్ని చేరాడు.
మనోహర్ తనకు చెప్పిందంతా, తండ్రికి చెప్పింది.
"నువ్వదృష్టవంతురాలివని నాకు తెలుసమ్మా. భగవంతుడు అందరికీ సమస్యలిస్తాడు, నీకు పరిష్కారమూ చూపిస్తాడు"అన్నాడు కూతురు తల ఆప్యాయంగా నిమురుతూ.
"అన్నట్టు మీ అత్తగారు.."అడిగాడాయన.
"ఇలాంటి పరిస్థితి ఎదురవ్వొచ్చని ఊహించే, పక్కింటి రాధమ్మగారికి ‘మా అత్తగారిని కనిపెట్టుకుని ఉండమని చెప్పి’ ఆయన్ని తీసుకుని హాస్పిటల్ కి బయలుదేరా. ఆవిడ చాలా మంచిది అత్తమ్మను జాగ్రత్తగా చూసుకుంటుంది." తండ్రితో చెప్పింది.
ఆయన ముఖంలో సంతృప్తి.
అప్పుడే లిఫ్ట్ తలుపులు తెరుచుకుని మనోహర్ బయటకొచ్చాడు.
అతన్ని చూడంగానే "నాన్నా..ఈయనే దేవుళ్లా వచ్చి నన్ను ఆదుకున్నాడు" అంది సంతోషంగా.
*****
దేవుడిలా వచ్చి ఆదుకున్నాడా? అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడా? తెలియాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా ఎదురు చూడాల్సిందే....... |