Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
katyayani

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue291/761/telugu-serials/anveshana/anveshana/

 

(గత సంచిక తరువాయి)... ‘‘మీరే వెళ్ళండి! నేను బయట ఉంటాను. లోకల్‌ పోలీస్‌ కదా నేను మీతో రావడం నేరం. మీరే వెళ్లండి.’’ అంటూ తెలివిగా తప్పించుకున్నాడు రామ్‌.

‘‘ఓకే రామ్‌ గారూ! మీరిక్కడే ఉండండి. నేను జస్ట్‌ చిన్న ఎంక్వయిరీ తెలుసుకుని వచ్చేస్తాను.’’ చెప్పాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

అతన్ని అక్కడే వదిలి అడ్రస్‌లో ఉన్న ఇంటి ముందుకెళ్ళాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. ఇల్లు కాదది. పెద్ద బంగ్లా. దాదాపు ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన విశాలమైన భవనం. గేటే ఆకాశమంత ఎత్తులో ఉన్నట్లనిపించింది. గేటు ప్రక్కనే టెలిఫోన్‌ బూత్‌లా ఉన్న కట్టడంలో నుండి గూర్ఖా వచ్చి అడ్డుగా నిలబడ్డాడు..        

‘‘కౌన్‌ హై! " గూర్ఖా అడ్డుగా నిబడి ఎస్సై అక్బర్‌ ఖాన్‌ని నిలదీసాడు.

మౌనంగా జేబులో ఉన్న తన ఐడి కార్డు తీసి చూపించాడు. పోలీస్‌ ఐడి కార్డు చూస్తూనే వినయంగా నమస్కరించి గేటు తీసాడు గూర్ఖా.

‘లోపల సార్‌ సాబ్‌ పిలవందే పోలీసు ఇంటికి రారు. సివిల్‌ డ్రస్‌లో ఉన్న పోలీసు సొంత పని మీద ఏ చందాకో వస్తారని తెలుసు కదా!’ మనసులోనే అనుకున్నాడు గూర్ఖా.

గేటు దాటి లోపలకు అడుగు పెడుతూనే ఆశ్చర్య పోయాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. రాజ మహల్‌ లా ఉంది భవనం. పోర్టికో చూస్తూనే కళ్ళు తిరిగి పోయేలా ఉంది. ఇంటి ముందు పూల తోటలా అందంగా అటూ ఇటూ రకరకా మొక్కలు...మధ్యలో ఫౌంటెన్‌. పెద్ద క్రికెట్‌ గ్రౌండులా ఉంది. అక్కడక్కడ తోట మాలీలు పిచ్చి మొక్కలు ఏరుతూ కనిపించారు.

భవనం ముందు అటూ ఇటూ విశాలమైన పెద్ద పెద్ద సిమ్మెంట్‌ రోడ్లు. ఓ ప్రక్క వరుసగా ఆగి ఉన్న కార్లు. లోపలకు నెమ్మదిగా నడుస్తూనే చుట్టూ పరికించి చూసాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

కార్లన్నీ చాలా ఖరీదైన ఆడి రేంజ్‌ రోవర్‌ కార్లే. ఒక్కోటి కోటి దాటి ఉంటాయనుకున్నాడు మనసులోనే. ఆ భవనం లోని ప్రతి దిక్కు చూస్తున్న ఎస్సై అక్బర్‌ఖాన్‌ అడుగడుగునా ఎంతో ఖరీదైన వస్తువులతో అలంకరించి ఉన్న కళాఖండాలను చూస్తూ ఆశ్చర్య పోయాడు.

‘ఇలాంటి వాళ్ల ఏ టి ఎమ్‌ కార్డు పోతే...పట్టించుకునేంత తీరిక....పోయిందన్న బాధ ఎందుకుంటుంది? కానీ, ఏ.టి.ఎమ్‌ తో పాటు పిన్‌ నెంబర్‌ ఎలా లీకవుతుంది? ఎలా? అందుకే ఆ విషయం తెలుసుకోవడానికే ఇంత దూరం వచ్చాడు. ‘ఆమె’కి ఈ ఇంటికి ఉన్న బంధం....బాంధవ్యం....తెలుసుకుంటే ‘ఆమె’ ఆచూకీ సులువుగా తెలిసి పోతుంది.

ఆలోచిస్తూ పోర్టికోలో అడుగు పెట్టాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘ఏర్‌నింకా విరుమ్‌పుమ్‌’’ ఎదురొచ్చి ఎంతో మృదువుగా తమిళంలో అడిగిందో అమ్మాయి. పోర్టికో లోనే ఓ మూలనున్న గదిలో నుండి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి అడ్డగించి మరీ అడిగింది ఆ అమ్మాయి.

ఆ అమ్మాయిని తేరిపారా చూస్తూ క్షణం తనని తనే మైమరచి పోయి గుడ్లప్పగించి చూస్తూ ఉండి పోయాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. ఆ అమ్మాయి ఏమందో అర్థం కాలేదు. ఏం చెప్పాలో తెలియక అయోమయంగా చూస్తూ ఉండి పోయాడు.

‘‘అయ్యా....!’’ మళ్లీ పిలిచింది ఆ అమ్మాయి.

ఆమెకి కూడా మౌనంగా జేబులో వున్న తన ఐడి కార్డు తీసి చూపించాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....

http://www.gotelugu.com/issue291/761/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)... ‘‘పోలీస్‌వెలాయ్‌ వెంటల్‌ నిన్‌కల్‌ కర్రుఎన్నా?’’ నమ్రతగా అడిగింది ఆ అమ్మాయి.

‘ఎలా చెప్పాలో? ఏం చెప్పాలో అర్థం కాక మనసులోనే చర్చించుకుంటూ టక్కున ఇంగ్టీషులో చెప్పాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘మేడమ్‌ గార్ని కవాలి.’’ అన్నాడు ఇంగ్లీషులో.

‘‘మీరు తెలుగు వారా?!’’ చిన్నగా నవ్వుతూ అంది ఆ అమ్మాయి.

‘‘ఎస్‌ ! మీకెలా తెలుసు?’’ ఆశ్చర్యంగా అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘ఇంగ్లీషులో....అందులో తెలుగు ఉచ్ఛారణ స్పష్టంగా తెలుస్తోంది కదా సార్‌?’’ అంది ఆ అమ్మాయి స్వచ్ఛమైన తెలుగులో.

‘‘మీరూ తెలుగు వారా?’’ ఆనందంగా అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

ఆ  అమ్మాయితో  మాట్లాడుతుంటే  ఎందుకో ఆహ్లాదంగా అన్పిస్తోంది. అంత అందమైన అమ్మాయిలు ఎదురుగా

ఉంటే సర్వం మర్చి పోతారు ఎంత ఋషి పుంగవులైనా!’’ అనుకున్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘యజమానులు తెలుగు వారు అయినప్పుడు తెలుగొచ్చిన వారినేగా నియమించుకుంటారు. మాదీ హైదరాబాదే సార్‌.’’ నవ్వుతూ అంది ఆ అమ్మాయి.

‘‘గ్లాడ్‌ టూ మీట్‌ యూ.’’ అంటూ కావాలనే షేక్‌హేండ్‌ కోసం చెయ్యి ముందుకు చాచాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘నమస్తే సార్‌! మీరు ఎవరిని కలవాలని వచ్చారు?’’ ఎస్సై అక్బర్‌ ఖాన్‌ షేక్‌ హేండ్‌కు ప్రతిగా రెండు చేతులూ జోడించి నమస్కారం పెడుతూ అంది ఆ అమ్మాయి.

సంప్రదాయ బద్ధమైన చీర కట్టులో కనిపించిన హుందా తనం ఆమె వ్యక్తిత్వంలో కూడా తళుక్కున మెరిసింది. ఆమె ప్రవర్తనకి, చిన్నబుచ్చుకోలేదు సరికదా మరింత ఆనంద భరితుడయ్యాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.  రిసెప్షనిస్టుగా చేసే అమ్మాయిు అన్ని విలువలను వదిలేసి వెకిలిగా నవ్వుతూ అతిధులను ఆహ్వానిస్తారనే చెడు అభిప్రాయాన్ని పటాపంచలు చేసిన ‘ఆమె’ మీద మరింత గౌరవం పెరిగింది ఎస్సై అక్బర్‌ ఖాన్‌కి.

జేబులో భద్రంగా దాచిన అడ్రస్‌ కాగితం ఆమెకి తీసి చూపించాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘ఎర్రబెల్లి శోభాదేవి మేడమ్‌ గారిని కలవాలా సార్‌! ఒక్క క్షణం అక్కడ నా గదిలో ఉన్న సోఫాలో కూర్చోండి.’’ అంటూనే ఇంటర్‌కమ్‌లో ఎవరితోనో మాట్లాడింది ఆ అమ్మాయి.

ఆ అమ్మాయి గదిలో నాలుగు మూలలా ఫైల్స్‌. ఆఫీసు గది లా ఉంది. అక్కడ నుండి పోర్టికో లోకి చూసాడు. గార్డెన్‌లో నలుగురైదుగురు పని వాళ్ళు మొక్కలకి నీళ్ళు పోస్తూ, పిచ్చి మొక్కలు పీకుతూ బొరుగు పెద్ద పెద్ద పట్టకారులా ఉన్న కత్తులు పట్టుకుని అటూ ఇటూ తిరుగుతున్నారు.

అంతలోనే ఆ అమ్మాయి ఎస్సై అక్బర్‌ ఖాన్‌ దగ్గర కొచ్చింది.

‘‘ఛైర్మన్‌ గారు వస్తున్నారు సార్‌! ఆయన ఆఫీసుకు వెళ్లి పోయాక మనం మాట్లాడదాం. అంత వరకూ ఇక్కడే కూర్చోండి.’’ అంటూ గాబరాగా పోర్టికో లోకి వెళ్ళింది ఆ అమ్మాయి.

అదే సమయంలో

సింహద్వారం తెరుచుకుంది. హిందీ సీరియల్లో చూసినట్టు దాదాపు ఇరవై అడుగు ఎత్తుంది సింహద్వారం.

నలభై ఏళ్ళు కూడా నిండా నిండని వ్యక్తి హుందాగా లోపల నుండి వచ్చాడు. ఆయన వెనుక అంతే వయసున్న వ్యక్తి ఫైల్స్‌ పట్టుకుని వినయంగా అతన్ని అనుసరించి వస్తున్నాడు.

వాళ్లిద్దరికీ ముందు నల్లల దుస్తులు ధరించిన వస్తాదుల్లా ఉన్న సెక్యూరిటీ గార్డులు ఆరుగురు అటూ ఇటూ నిలబడి ఛైర్మన్‌ని, అతని పి.ఏని. కారు వరకూ తీసుకు వెళ్లారు.

పడవ లాంటి కారు. తెల్లని యూనిఫాంలో నెత్తిన టోపీ పెట్టుకున్న డ్రైవర్‌ డోరు తెరిచి వినయంగా నిలబడ్డాడు.

ఛైర్మన్‌ వెనుక సీట్లో కూర్చోగానే ఫైల్స్‌ పట్టుకుని పి.ఏ. గబుక్కున ముందు సీట్లో కూర్చుని డోర్‌ వేసాడు.

సెక్యూరిటీ గార్డు ఆరుగురూ పరుగున వెళ్లి వెనుక వారి కోసమే సిద్ధంగా ఉన్న స్కార్ఫియో ఎక్కి కూర్చున్నారు.

కారు వెళ్ళే వరకూ వినయంగా ఓ మూలన చేతులు కట్టుకుని నిలబడింది ఆ అమ్మాయి.

గదిలో నుండే అంతా గమనించాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. అతన్ని....అతని హుందాని....వెంట వున్న మందీ మార్బలాన్ని చూసి ఆశ్చర్య పోయాడు. ‘ఇంత బిల్డప్ అవసరమా?’ అనుకున్నాడు మనసులోనే.

‘‘సారీ సార్‌! మీకు ఇబ్బంది కలగ లేదు కదా?!’’ నవ్వుతూ వచ్చి పలకరించింది ఆ అమ్మాయి.

‘‘మీ సమక్షంలో ఎంత సేపైనా...ఎన్ని గంటలైనా ఇట్టే గడిచి పోతుంది.’’ ఓరగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. ఎదుటి వారి నుండి సహాయ సహకారాలు అందుకోవాలంటే ఇదే మంచి ఎత్తుగడ అనుకున్నాడు.

అక్బర్ ఖాన్ ఆశించి వచ్చిన స్మాచారం ఆ ఇంట్లో లభిస్తుందా? అనుకోని కొత్త సంఘటనలు ఎదురవుతాయా...??? తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా ఎదురు చూడాల్సిందే......

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్